కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

నా విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటారు?

నా విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటారు?

 అమ్మానాన్నలు ఎందుకు జోక్యం చేసుకుంటారు?

 మీమీద పట్టింపుతోనే అలా చేస్తామని అమ్మానాన్నలు అంటారు. కానీ అది ఏకాంతానికి అడ్డుగా ఉందని మీకు అనిపిస్తుంది. ఉదాహరణకు:

  •   “మా నాన్న నా ఫోన్‌ తీసుకొని, నా పాస్‌వర్డ్‌ అడుగుతాడు. నా మెసెజ్‌లన్నీ చూస్తాడు. ఒకవేళ నేను చెప్పకపోతే నేనేదో దాస్తున్నానని అనుకుంటాడు” అని ఎరిన్‌ అనే టీనేజీ అమ్మాయి అంటోంది.

  •   డనీజ్‌ ఇప్పుడు తన 20వ పడిలో ఉంది. ఫోన్‌ బిల్లు వచ్చినప్పుడు వాళ్ల అమ్మ దాన్ని పరిశీలినగా చూస్తూ ఏమి చేసిందో గుర్తుచేసుకుంటూ డనీజ్‌ ఇలా చెప్పింది, “ఆమె ప్రతీ నెంబరును చూసేది. ఏది ఎవరి నెంబరో అడిగేది, వాళ్లతో ఏమేమి మాట్లాడానో కూడా అడిగేది.”

  •   వాళ్ల అమ్మ ఒకసారి తన పర్సనల్‌ డైరీ చదివిందని కేలా అనే టీనేజీ అమ్మాయి చెప్పింది. “దానిలో నా మనసులోని భావాలెన్నో రాసుకున్నాను. అమ్మ గురించి కూడా కొన్ని విషయాలు రాశాను. కానీ మా అమ్మ అలా చేసిన తర్వాత నుండి నేను డైరీ రాయడం ఆపేశాను” అని చెప్పింది.

 ఒక్కమాటలో: మీ బాగోగులు చూసుకోవడం మీ అమ్మానాన్నల బాధ్యత. అయితే ఆ బాధ్యతను నిర్వర్తించే క్రమంలో వాళ్లు ఎంత కఠినంగా ఉండాలో మనం చెప్పలేం. కొన్నిసార్లు వాళ్లు హద్దు మీరుతున్నట్లు అనిపిస్తుందా? కావచ్చు. అయితే, ఒక మంచివార్త ఏమిటంటే, వాళ్లు మీ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారనే భావన మీలో ఎక్కువగా కలగకుండా కృషి చేయవచ్చు.

 మీరేమి చేయవచ్చు?

 అన్ని విషయాలు చెప్పండి. “అన్ని విషయాల్లో నిజాయితీగా” ప్రవర్తించమని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తుంది. (హెబ్రీయులు 13:18) మీ అమ్మానాన్నలతో కూడా అలా ఉండడానికి కృషి చేయండి. మీరు నిజాయితీగా ఉంటూ, అన్ని విషయాలు చెప్పాలి. అలా ఎంత ఎక్కువగా చేస్తే వాళ్లు మిమ్మల్ని అంత ఎక్కువ ఏకాంతంగా ఉండనిస్తారు.

 ఆలోచించండి: నమ్మకంగా ఉండే విషయంలో మీకు ఎలాంటి పేరు ఉంది? మీ అమ్మానాన్నలు పెట్టే నియమాలను మీరు సరిగ్గా పాటించడం లేదా? మీ స్నేహితులు ఎవరో మీ అమ్మానాన్నలకు తెలుసా? అమ్మానాన్నలకు తెలియకుండా ఏమైనా చేస్తున్నారా?

  “నేను మా అమ్మానాన్నలతో రాజీపడాల్సిందే. నేను రోజూ ఏమి చేస్తున్నానో వాళ్లకు చెప్తాను. వాళ్లు దేని గురించి అడిగినా నేను చెప్తాను. దానివల్ల వాళ్లు నన్ను నమ్ముతారు, ఏకాంతంగా ఉండనిస్తారు.”​—డీల్య.

 ఓపిగ్గా ఉండండి. “మీరేమిటో రుజువు చేసుకోవడానికి మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ ఉండండి” అని బైబిలు చెప్తుంది. (2 కొరింథీయులు 13:5) నమ్మకస్థులనే పేరు సంపాదించుకోవడానికి మీకు సమయం పడుతుంది. కానీ దానివల్ల ఖచ్చితంగా ప్రయోజనాలు పొందుతారు.

 ఆలోచించండి: మీ అమ్మానాన్నలు కూడా టీనేజీ దాటి వచ్చినవాళ్లే. ప్రతీ విషయంలో వాళ్లు మిమ్మల్ని పట్టించుకోవడానికీ, దానికీ సంబంధం ఏమిటి?

 “అమ్మానాన్నలకు టీనేజీలో తాము చేసిన తప్పులు గుర్తుండి ఉంటాయి. అవే తప్పులు టీనేజీ వయసులో ఉన్న తమ పిల్లలు చేయకూడదని వాళ్లు కోరుకుంటున్నారని నాకనిపిస్తుంది.”​—డానియల్‌.

 వాళ్ల స్థానంలో ఉండి ఆలోచించండి. విషయాల్ని మీ అమ్మానాన్న స్థానంలో ఉండి చూడడానికి ప్రయత్నించండి. గుణవతియైన భార్య ‘తన ఇంటివాళ్ల నడతల్ని బాగా కనిపెడుతుంది’. మరి, మంచి తండ్రి ‘యెహోవా నిర్దేశాల ప్రకారం క్రమశిక్షణను ఇస్తూ, ఉపదేశాన్ని ఇస్తూ’ పిల్లల్ని పెంచుతాడు. (సామెతలు 31:27; ఎఫెసీయులు 6:4, అధస్సూచి) అమ్మానాన్నలు ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా మీ విషయంలో జోక్యం చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు.

 ఆలోచించండి: ఒకవేళ మీరే అమ్మానాన్నలైతే, మీకు టీనేజీ పిల్లల గురించి తెలిసిన విషయాల్ని బట్టి వాళ్ల జీవితంలో అస్సలు జోక్యం చేసుకోకుండా ఉంటారా? వాళ్లను అస్సలు ప్రశ్నలు అడగకుండా ఉంటారా?

 “మీరు టీనేజీలో ఉన్నప్పుడు, అమ్మానాన్నలు మీ ఏకాంతాన్ని పాడుచేస్తున్నారని అనిపిస్తుంది. నేను ఇప్పుడు టీనేజీ దాటి వచ్చాను. మా అమ్మానాన్నలు ప్రేమతోనే అలా ప్రవర్తించారని నేను అర్థం చేసుకున్నాను.”​—జేమ్స్‌.