యువత అడిగే ప్రశ్నలు
నేనెలా పనుల్ని వాయిదా వేయకుండా ఉండవచ్చు?
ఇంట్లో పనులూ, హోమ్వర్క్లూ ఎప్పుడూ ఆలస్యంగా చేస్తున్నందుకు మీకు విసుగొచ్చిందా? ఇక ఏదేమైనా వాయిదా వేయకుండా అన్నిటినీ సకాలంలో చేయాలనుకుంటున్నారా? కింద చెప్పిన పరిస్థితుల్లో కూడా మీరు పనులను వాయిదా వేయకుండా ఉండడానికి ఈ ఆర్టికల్ మీకు సహాయం చేస్తుంది.
ఈ ఆర్టికల్ చదివాక వాయిదా వేయడం అనే క్విజ్ చేయండి.
పనులను వాయిదా వేయడం మంచిది కాదని బైబిలు చెప్తుంది. అందులో ఇలా ఉంది, “గాలిని గురుతుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు.”—ప్రసంగి 11:4.
ఈ సమస్య తలెత్తడానికి కొన్ని కారణాలను గమనించండి. అలాగే మీరెలా వాయిదా వేయకుండా ఉండవచ్చో తెలుసుకోండి.
ఆ పని చాలా కష్టం అనిపిస్తుంటే.
దానిని ఎదుర్కొందాం. కొన్ని పనులు ఎంత కష్టంగా ఉంటాయి అంటే వాటిని మొదలు పెట్టకుండా ఉంటేనే మంచిదని అనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ ఐడియాలను పాటించి చూడండి.
మొత్తం పనిని చిన్నచిన్న పనులుగా విడగొట్టండి. మెలిస్సా అనే అమ్మాయి ఇలా అంటుంది, “నేను ఆలస్యంగా చేస్తున్నానని తెలిసినప్పటికీ, నేను ఒక్కసారికి ఒక్క పనే చేస్తుంటాను.”
పనిని వెంటనే మొదలుపెట్టండి. “మీకు పని ఇచ్చిన వెంటనే దాన్ని చేయడం మొదలుపెట్టండి. మీరు చేయాల్సిన పనుల లిస్టులో దాన్ని కూడా రాసుకోండి, లేదా మీరు మర్చిపోకముందే ఆ పనిని ఎలా చేయాలనుకుంటున్నారో అవసరమైన కొన్ని విషయాలను రాసిపెట్టుకోండి.”—విర.
సహాయం తీసుకోండి. మీ అమ్మానాన్నలకు, ఇతర కుటుంబ సభ్యులకు లేదా మీ స్నేహితులకు కూడా ఇలాంటి సమస్యే ఎప్పుడో ఒకప్పుడు వచ్చి ఉంటుంది. వాళ్ల అనుభవం నుంచి మీరెందుకు ప్రయోజనం పొందకూడదు? మీకున్న ఆలోచనల్ని ఒక పద్ధతి ప్రకారం రూపొందించుకుని, చక్కగా పని చేయడానికి వాళ్లు మీకు సహాయపడవచ్చు.
టిప్ “పట్టిక వేసుకోండి. ఒక పద్ధతి ప్రకారం, వేసుకున్న పట్టికకు తగ్గట్టు పనులు చేసుకుంటే మంచిది. తప్పకుండా అన్ని పనులు టైంకి చేయగలుగుతారు.”—అబీ.
ఆ పని చేయాలని అనిపించకపోతే.
చాలాసార్లు, మీకు బాగా విసుగ్గా అనిపించే పనులు చేయాల్సి రావచ్చు. మీరు ఇప్పుడు చేయాల్సిన పని లేదా ప్రాజెక్టు కూడా అలాంటిదే అయితే మీరేమి చేయవచ్చు? ఇలా చేసి చూడండి.
ఆ పని ఎందుకు చేయాలో ఒక కారణం గురించి ఆలోచించండి. ఉదాహరణకు, ఆ పని పూర్తి చేయగానే మీకెంత గర్వంగా అనిపిస్తుందో ఒక్కసారి ఊహించండి. యామీ అనే అమ్మాయి ఇలా అంటుంది, “ఏదైన పని సమయానికి చేసినా లేక ముందుగా చేసినా అప్పుడు కలిగే ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. తర్వాత నేను ప్రశాంతంగా ఉండవచ్చు.”
టైంకి చేయలేకపోతే ఏం జరుగుతుందో ఆలోచించండి. మీరు ఆలస్యం చేసేకొద్దీ ఒత్తిడి పెరిగి ఆ పనిని బాగా చేయలేరు. బైబిలు ఇలా చెప్తుంది, ‘
మీరు ఏమి విత్తుతారో ఆ పంటనే కోస్తారు.
’—గలతీయులు 6:7, గుడ్ న్యూస్ ట్రాన్స్లేషన్.మీ మనసులో పని పూర్తి చేయాల్సిన గడువును ముందుకు జరుపుకోండి. అలీసియా అనే అమ్మాయి ఇలా చెప్తుంది, “నేను పని పూర్తి చేయాల్సిన గడువు అసలు గడువు కన్నా ఒకటి రెండు రోజులు ముందే అన్నట్లుగా ఊహించుకొని అందుకు తగ్గట్టు పని చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అప్పుడు నేను ఆ పనిని బాగా చేశానో లేదో మరోసారి సరిచూసుకోవడానికి నా దగ్గర ఒకటి రెండు రోజుల సమయం ఉంటుంది.”
టిప్ “మీ మనసే మిమ్మల్ని ఉత్సాహపరచగలదు. కాబట్టి, ఏం జరిగినా మీరు ఆ పని తప్పకుండా చేస్తారు, మిమ్మల్ని ఏదీ ఆపలేదు అని మనసులో బలంగా నిర్ణయించుకోండి. నేనలా నా మనసులో నిర్ణయించుకున్నప్పుడు జరగాల్సిన పని జరిగిపోతుంది.”—ఆలెక్కిస్.
మీరు ఇప్పటికే చాలా బిజీగా ఉంటే.
నేతన్ అనే అబ్బాయి ఇలా అంటున్నాడు, “నేను వాయిదా వేసే వ్యక్తినని నన్ను అందరూ ఎక్కువగా పిలుస్తారు. కానీ అది అన్యాయం, ఎందుకంటే నేను చాలా బిజీగా ఉన్నానని వాళ్లు గుర్తించట్లేదు.” మీకు కూడా నేతన్లాగే అనిపిస్తుందా! వీటిని ప్రయత్నించండి.
ఈజీగా చేయగలిగిన వాటిని ముందు చేసేయండి. యాంబర్ అనే అమ్మాయి ఇలా చెప్తుంది, “ఒక పని 5 నిమిషాల్లోపే చేయగలిగేది అయితే దాన్ని వెంటనే చేసేయాలని నాకు ఒకరు నేర్పించారు. ఉదాహరణకు గది శుభ్రం చేసుకోవడం, బట్టలు తగిలించడం, గిన్నెలు తోమడం, ఫోన్ చేయడం లాంటివి.”
ఏవి ముందు చేయాలో ఎంచుకోండి. బైబిలు ఇలా చెప్తుంది, ‘శ్రేష్ఠమైన కార్యములను వివేచించండి.’ (ఫిలిప్పీయులు 1:10) ఈ మాటల్ని మీ రోజువారీ జీవితంలో ఎలా పాటించవచ్చు? “నేను చేయాల్సిన పనులన్నిటినీ లిస్టు రాసి పెట్టుకుంటాను. ఎప్పటిలోగా చేయాలో కూడా రాసుకుంటాను. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతీ పనిని ఎప్పుడు మొదలుపెట్టి ఎప్పుడు పూర్తి చేయాలనుకుంటున్నానో రాసి పెట్టుకుంటాను” అంటుంది అన్నా అనే అమ్మాయి.
అది చాలా కష్టంగా అనిపిస్తుందా? అలాగైతే దాని గురించి మరోసారి నిదానంగా ఆలోచించండి. మీరు పట్టిక వేసుకుంటే సమయం మీ అదుపులో ఉంటుంది, మీరు సమయం అదుపులో ఉండరు. అప్పుడు మీ ఒత్తిడి తగ్గుతుంది. కెల్లీ అనే అమ్మాయి ఇలా అంటుంది: “ప్లాన్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది, ఏ పని ముఖ్యమైందో, ఏది ముందు చేయాలో కూడా తెలుస్తుంది.”
మీ ధ్యాస మళ్లించే ఆటంకాలు లేకుండా చూసుకోండి. జెన్నిఫర్ ఇలా అంటుంది, “నా పనిని ఎప్పుడు మొదలుపెట్టాలి అనుకుంటున్నానో మా ఇంట్లో అందరికీ చెప్తాను. వాళ్లు నాకు ఏదైనా పని చెప్పాలనుకుంటే నా పని మొదలు పెట్టకముందే చెప్పమంటాను. పని మధ్యలో ఫోన్లు, మెసేజ్లు రాకుండా ఫోన్ ఆఫ్ చేసి పెడతాను.”
టిప్ “వాయిదా వేసినంత మాత్రాన చేయాల్సిన పని ఎక్కడికీ పోదు. మీరు ఎప్పటికైనా దాన్ని చేయాల్సిందే. కాబట్టి ఆ పని భారాన్ని ఎక్కువ కాలం మీ భుజాల మీద మోస్తూ ఉండడం కన్నా ఆ పని చేసేసి ఒక్కసారే ఆ భారాన్ని దించేసుకోండి. అప్పుడు మీరు హాయిగా ప్రశాంతంగా ఉండవచ్చు.”—జోర్డన్.