యువత అడిగే ప్రశ్నలు
నన్ను ఎవరైనా లైంగికంగా వేధిస్తుంటే నేనేం చేయాలి?
లైంగికంగా వేధించడం అంటే ఏమిటి?
లైంగికంగా వేధించడం అంటే లైంగిక విషయాల్లో మనకు ఇష్టం లేని విధంగా ప్రవర్తించడం. ముట్టుకోవడం లేక సరసంగా మాట్లాడడం కూడా లైంగిక వేధింపులే. అయితే కొన్నిసార్లు ఏడిపించడం, సరసాలాడడం, లైంగికంగా వేధించడం లాంటి వాటిని సరిగ్గా కనిపెట్టలేము.
కనిపెట్టడం మీకు తెలుసా? మేము ఇచ్చిన లైంగిక వేధింపులు క్విజ్ చేసి తెలుసుకోండి.
విచారకరంగా లైంగిక వేధింపులు స్కూలు అయిపోయాక ఆగిపోవు. కానీ మీరు ఇప్పుడే లైంగిక వేధింపుల్ని ఎదిరించే ధైర్యాన్ని, సామర్థ్యాన్ని పెంచుకుంటే, రేపు మీరు పని చేసే చోట అలాంటి వాటిని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉంటారు. అంతేకాదు వేధించే వాళ్ల నుండి ఇతరులను కూడా కాపాడగలుగుతారు.
నన్ను లైంగికంగా వేధిస్తుంటే నేనేం చేయాలి?
అసలు లైంగిక వేధింపులు అంటే ఏమిటో, అలాంటివి ఎదురైనప్పుడు ఏం చేయాలో తెలిస్తేనే వాటిని సమర్థవంతంగా ఎదుర్కోగలరు. మూడు పరిస్థితుల్లో మీరు ఏం చేయవచ్చో గమనించండి.
సందర్భం:
“నేను పని చేసే చోట నా కంటే చాలా పెద్ద వయసున్న మగవాళ్లు నేను అందంగా ఉన్నానని, వాళ్లకి 30 ఏళ్లు తక్కువుంటే బాగుండేదని చెప్పేవాళ్లు. అందులో ఒకతను నాకు దగ్గరగా వచ్చి నా జుట్టును వాసన చూడడానికి ప్రయత్నించాడు కూడా!”—తబిత, 20 ఏళ్లు.
తబిత ఇలా అనుకొని ఉంటే: ‘నేను అతన్ని పట్టించుకోకుండా కాస్త ఓర్చుకుంటే బహుశా అతనలా చేయడం మానేయవచ్చు.’
అలా చేయడం ఎందుకు మంచిది కాదు: లైంగిక వేధింపులను సహిస్తూ ఉంటే ఆ వేధింపులు కొనసాగుతూనే ఉంటాయి, ఇంకా ఎక్కువ అవుతాయి.
ఇలా చేసి చూడండి: అలాంటి చెడ్డ మాటల్ని, ప్రవర్తనను మీరు సహించరని మిమ్మల్ని వేధించే వాళ్లతో మర్యాదగా, కానీ స్పష్టంగా చెప్పండి. 22 ఏళ్ల టారిన్ ఇలా అంటుంది, “ఎవరైనా నన్ను అసభ్యకరంగా ముట్టుకుంటుంటే, వెనక్కి తిరిగి ఇంకెప్పుడూ నన్ను ముట్టుకోకండి అని ఖచ్చితంగా చెప్తాను. అది అతను మళ్లీ అలా ప్రవర్తించకుండా చేస్తుంది.” కానీ ఒకవేవ ఆ వ్యక్తి మారకుండా అలాగే చేస్తుంటే, మీరు మాత్రం మెత్తబడకండి. దృఢంగా ఎదిరిస్తూనే ఉండండి. మన నైతిక విలువలను కాపాడుకునే విషయంలో బైబిలు ఇలా సలహా ఇస్తుంది, “సంపూర్ణాత్మ నిశ్చయతగలవారునై నిలుకడగా ఉండవలెను.”—కొలొస్సయులు 4:12.
మిమ్మల్ని వేధించే వ్యక్తి హాని చేస్తానని బెదిరిస్తే? అలాంటప్పుడు అక్కడే ఉండి అతన్ని ఎదిరించడానికి ప్రయత్నించకండి. వీలైనంత త్వరగా అక్కడి నుండి బయటపడి ఎవరైనా నమ్మదగిన పెద్దవాళ్ల సహాయం తీసుకోండి.
సందర్భం:
“నేను ఆరవ తరగతిలో ఉన్నప్పుడు ఇద్దరు అమ్మాయిలు నన్ను ఒక పెద్ద హాల్లోకి లాకెళ్లారు. అందులో ఒక అమ్మాయి గే. నన్ను ఆమెతో సంబంధాలు పెట్టుకోమంది. నేను ఒప్పుకోకపోయినా ఖాళీ సమయం దొరికినప్పుడల్లా వాళ్లు నన్ను వేధించేవాళ్లు. ఒకసారి వాళ్లు నన్ను గోడకేసి కొట్టారు కూడా.”—విక్టోరియా, 18 ఏళ్లు.
విక్టోరియా ఇలా అనుకొని ఉంటే: ‘దీని గురించి నేను ఎవరికైనా చెప్తే నేను చేతగాని దాన్ని అనుకుంటారేమో, బహుశా ఎవ్వరూ నన్ను నమ్మరేమో.’
అలా ఆలోచించడం ఎందుకు మంచిది కాదు: మీరు ఎవరికైనా చెప్పకపోతే మిమ్మల్ని వేధించే వ్యక్తి అలా చేస్తూనే ఉండవచ్చు. అంతేకాదు ఇతరులను కూడా వేధించడానికి ప్రయత్నించవచ్చు.—ప్రసంగి 8:11.
ఇలా చేసి చూడండి: సహాయం తీసుకోండి. తల్లిదండ్రులు, టీచర్లు మిమ్మల్ని ఎవరూ వేధించకుండా చూస్తారు. కానీ ఒకవేళ మీరు చెప్పినప్పుడు ఎవరూ మీ మాటల్ని అంతగా పట్టించుకోకపోతే? ఇలా చేసి చూడండి: మిమ్మల్ని వేధించిన ప్రతీసారి వాళ్లు ఏం చేశారో రాయండి. ఆ వ్యక్తి ఎక్కడ, ఏ రోజు, ఏ టైంలో, ఏ మాటలతో మిమ్మల్ని వేధించాడో, ఏం చేశాడో కూడా రాయండి. ఇప్పుడు వాటిలో ఒక కాపీని మీ తల్లిదండ్రులకో, టీచరుకో ఇవ్వండి. చాలామంది నోటితో చెప్పేవాటి కంటే రాసి ఇచ్చే వాటిని ఎక్కువగా నమ్ముతారు.
సందర్భం:
“రగ్బీ టీంలో ఉన్న ఒక అబ్బాయి అంటే నాకు చాలా భయం. అతను దాదాపు ఆరున్నర అడుగుల ఎత్తు, 135 కిలోల బరువు ఉంటాడు. నాతో ఎలాగైనా శారీరకంగా సంబంధాలు పెట్టుకోవాలని గట్టిగా నిర్ణయించేసుకున్నాడు. ఒక సంవత్సరమంతా దాదాపు ప్రతీరోజు నన్ను విసిగించే వాడు. ఒకరోజు క్లాసులో మేమిద్దరమే ఉన్నాము. అతను నా దగ్గరకు మీది మీదికి వస్తున్నాడు. అప్పుడు నేను ఒక జంప్ చేసి, వెంటనే అక్కడి నుండి బయటకు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాను.”—జూలియట్, 18 ఏళ్లు.
జూలియట్ ఇలా అనుకొని ఉంటే: ‘అబ్బాయిలంటే అలానే ఉంటారు.’
అది ఎందుకు మంచిది కాదు: అందరూ ఫర్వాలేదులే అనుకుంటుంటే మిమ్మల్ని వేధించే వ్యక్తి తన ప్రవర్తనను ఎప్పటికీ మార్చుకోడు.
ఇలా చేసి చూడండి: విషయాన్ని సరదాగా తీసుకోకండి, లేదా నవ్వకండి. మీరు స్పందించే తీరు, మీ ముఖ కవళికల ద్వారా మీరు వేటిని సహిస్తారో వేటిని సహించరో అవతలి వాళ్లకు స్పష్టంగా తెలియాలి.
నేను ఏమి చేస్తాను?
నిజంగా జరిగిన కథ 1:
“నేను ఎవరితోనైనా కఠినంగా ప్రవర్తించడానికి అస్సలు ఇష్టపడను. నాతో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తున్నా అలా చేయవద్దని చెప్పేదాన్ని—కానీ గట్టిగా చెప్పలేకపోయేదాన్ని. వాళ్లతో మాట్లాడేటప్పుడు నవ్వేదాన్ని. నేను సరసాలాడుతున్నానని వాళ్లు అనుకున్నారు.”—తబిత.
మీరే తబిత అయితే మిమ్మల్ని వేధించే వాళ్లతో ఎలా ప్రవర్తించేవాళ్లు? ఎందుకు?
ఏం చేయడం వల్ల మిమ్మల్ని వేధించే వ్యక్తి మీరు వాళ్లతో సరసాలాడుతున్నారని అనుకునే ప్రమాదం ఉంది?
నిజంగా జరిగిన కథ 2:
“మా గేమ్స్ క్లాసులో కొంతమంది అబ్బాయిలు చిన్నచిన్న అసభ్యకరమైన మాటలు ద్వారా నన్ను ఏడిపించడం మొదలుపెట్టారు. కొన్ని వారాలు వాళ్ల మాటల్ని నేను పట్టించుకోలేదు. కానీ పరిస్థితి రోజురోజుకీ ఘోరం అయింది. ఆ అబ్బాయిలు నా పక్కన కూర్చొని నా మీద చేతులు వేయడం మొదలు పెట్టారు. నేను వాళ్లను తోసేశాను కానీ వాళ్లు అలా చేస్తూనే ఉన్నారు. చివరకు ఒకసారి అందులో ఒకతను ఓ అసభ్యకరమైన మెసేజ్‌ను పేపరు మీద రాసి నాకు ఇచ్చాడు. అది నేను మా టీచర్‌కు చూపించాను. ఆ అబ్బాయిని స్కూల్లో నుండి తీసేశారు. నేను ఆ పని ముందే చేసి ఉండాల్సిందని నాకు అప్పుడు అనిపించింది.”—సబీన.
సబీన ముందే టీచర్ దగ్గరకు ఎందుకు వెళ్లలేదు? అది మంచిదే అంటారా? కాదంటారా? మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు?
నిజంగా జరిగిన కథ 3:
“మా తమ్ముడు పేరు గ్రెగ్. అతన్ని ఒకసారి బాత్‌రూమ్‌లో ఒక అబ్బాయి కలిశాడు. అతను గ్రెగ్‌కు చాలా దగ్గరగా వచ్చి నన్ను ముద్దు పెట్టుకో అన్నాడు. గ్రెగ్ పెట్టుకోనన్నాడు కానీ ఆ అబ్బాయి అక్కడి నుండి వెళ్లలేదు. గ్రెగ్ అతన్ని తొయ్యాల్సి వచ్చింది.”—సూజన్.
గ్రెగ్ లైంగిక వేధింపులకు గురయ్యాడా? లేదా? మీరేమి అనుకుంటున్నారు?
కొంతమంది అబ్బాయిలు లైంగిక వేధింపులకు గురైనప్పుడు దాన్ని బయటకు చెప్పడానికి ఎందుకు వెనకాడతారు?
గ్రెగ్ ఆ సమయంలో చేసింది సరైనపనేనా? మీరైతే ఏం చేసేవాళ్లు?
ఇంకా తెలుసుకోండి: యువత అడిగే ప్రశ్నలు—మంచి సలహాలు, అనే పుస్తకంలోని 1వ సంపుటిలో, “హౌ కెన్ ఐ ప్రొటెక్ట్ మై సెల్ఫ్ ఫ్రమ్ సెక్సువల్ ప్రిడేటర్స్?” అనే 32వ అధ్యాయం చూడండి.