యువత అడిగే ప్రశ్నలు
సెక్స్‌టింగ్ గురించి నేనేమి తెలుసుకోవాలి?
సెక్స్‌టింగ్ అంటే ఏమిటి?
సెల్‌ఫోన్ ద్వారా సెక్స్‌కి సంబంధించిన మెసేజ్‌లు, ఫోటోలు, బొమ్మలు లేదా వీడియోలు పంపించుకోవడాన్నే “సెక్స్‌టింగ్” అంటారు. ఒకతను ఇలా అంటున్నాడు, “ఈ రోజుల్లో ఇదంతా మామూలు అయిపోయింది. మీరు మెసేజ్‌లు పంపిస్తారు, లేదా మీకు మెసేజ్‌లు వస్తాయి. ఇలా కోరికలు రేకెత్తించే ఫోటోలను సులువుగా పంపిస్తుంటారు.”
ప్రజలు దాన్ని ఎందుకు చేస్తారు? ఒక సీనియర్ లాయర్, ది న్యూయార్క్ టైమ్స్‌లో ఇలా రాశారు, చాలామంది టీనేజర్లు ఏమంటారంటే “మీకు ఇష్టమైన వాళ్ల నగ్న చిత్రం మీ ఫోన్లో ఉంటే మీరు సెక్స్‌లో పాల్గొంటున్నారని అందరికీ తెలుస్తుంది.” అదో రకంగా గొప్ప అనుకుంటారు. ఒక టీనేజీ అమ్మాయి సెక్స్‌టింగ్ గురించి ఇలా అంటుంది, “అది ప్రమాదం లేని సెక్స్. దీనివల్ల మీరు ప్రెగ్నెంట్ అవ్వరు. సెక్స్ వల్ల వచ్చే రోగాలు రాకుండా ఉంటాయి.”
టీనేజీ పిల్లలు సెక్స్‌టింగ్ చేయడానికి గల ఇతర కారణాలు:
వాళ్లు సంబంధం కలిగి ఉండాలనుకునే వాళ్లతో సరసాలాడడం కోసం.
ఒకరు వాళ్లకు అలాంటి ఫోటోను పంపించారు కాబట్టి వాళ్లు కూడా అలాగే పంపిస్తే బాగుంటుందని.
సెక్స్‌టింగ్ వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురౌతాయి?
ఫోన్ ద్వారా మీరు ఒక ఫోటోను పంపించారంటే ఇక అది మీది కానట్టే. అంటే దాన్ని ఎవరు ఎలా వాడతారు, అది మీ పేరును ఎలా పాడుచేస్తుంది అనే విషయాల మీద ఇక మీకు కంట్రోల్ ఉండదు. ప్యూ రిసర్చ్ సెంటర్‌కు సంబంధించిన ఒక సీనియర్ రిసర్చ్ స్పెషలిస్ట్, ఇంకా రచయితగా పనిచేస్తున్న అమాండా లెన్‌హార్ట్ సెక్స్‌టింగ్ గురించి ఇలా అంటున్నారు, “ఇంతకుముందెన్నడూ లేనంత తేలిగ్గా ఇప్పుడు ఇతరులు మనం చేసే చిన్నచిన్న పొరపాట్లతోపాటు ఘోరమైన తప్పుల్ని కూడా చూడగలరు”.
కొన్నిసార్లు
నగ్నంగా ఉన్న ఫోటోను అందుకున్న వాళ్లు తన స్నేహితులను సంతోషపెట్టడం కోసం దాన్ని ఒకేసారి చాలామందికి పంపిస్తారు.
హఠాత్తుగా సంబంధాలు తెంచేసుకున్న కొంతమంది బాయ్‌ఫ్రెండ్స్ పగతీర్చుకోవడానికి ఆ నగ్నంగా ఉన్న ఫోటోలను ఇతరులకు పంపిస్తారు.
మీకు తెలుసా? చాలా సందర్భాల్లో నగ్నంగా ఉన్న ఫోటోలను మెసేజ్‌ల్లో పంపించుకోవడం, చిన్నపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించడం, లేదా చిన్నపిల్లల అశ్లీల చిత్రాలను పంచిపెట్టడంతో సమానంగా చూస్తారు. సెక్స్‌టింగ్ చేసిన కొంతమంది 18 ఏళ్లలోపు పిల్లల్ని సెక్స్ పరంగా నేరం చేసినవాళ్లుగా పరిగణించారు.
బైబిలు ఏమి చెప్తుంది?
పెళ్లి చేసుకొని మీ భాగస్వామితో శరీర కోరికలు తీర్చుకోవాలని బైబిలు చెప్తుంది. (సామెతలు 5:18) అయితే పెళ్లికాని వాళ్ల మధ్య సెక్స్‌కి స్థానమే లేదని అది చెప్తుంది. కింది బైబిలు వచనాలను గమనించండి:
“మీలో జారత్వమేగాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తకూడదు, . . . బూతులైనను, పోకిరిమాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు.”—ఎఫెసీయులు 5:3, 4.
“భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపి వేయుడి.”—కొలొస్సయులు 3:5.
ఆ వచనాలు కేవలం “వ్యభిచారం” (వివాహజత కానీ వాళ్లతో శారీరక సంబంధాలు పెట్టుకోవడం) గురించే కాదు “అపవిత్రత” (అన్నిరకాల లైంగిక పనులకు ఉపయోగించిన పదం), “కామాతురత” గురించి (ఇక్కడ భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమానురాగాల గురించి కాదుగానీ, ఇతరులతో చెడుగా ప్రవర్తించడానికి నడిపించే బలమైన కోరికల గురించి) కూడా మనల్ని హెచ్చరిస్తున్నాయి.
ఇలా ప్రశ్నించుకోండి:
సెక్స్‌టింగ్ కూడా ఒకరకమైన “అపవిత్రత” ఎలా అవుతుంది?
అది “కామాతురతను” ఎలా రేకెత్తిస్తుంది?
నగ్న చిత్రాలను చూడడం లేదా వాటిని ఇతరులకు పంపించడం ఎందుకు చెడ్డది?
సెక్స్‌టింగ్‌కి దూరంగా ఉండేందుకు ఇంతకంటే బలమైన కారణాలే బైబిల్లో ఉన్నాయి.
“దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, ... కనుపరచుకొనుటకు జాగ్రత్తపడుము.”—2 తిమోతి 2:15.
“మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.”—2 పేతురు 3:11-12.
నైతికంగా మంచి ప్రవర్తన కలిగి ఉండడం వల్ల వచ్చే మంచి ఫలితాలను ఆ వచనాలు వివరిస్తున్నాయి. మీకు మెచ్చుకోదగ్గ మంచి ప్రవర్తనుంటే, మీరు చేసిన పనులకు ఎలాంటి ఫలితాలను అనుభవించాల్సి వస్తుందో అని భయపడనక్కర్లేదు.—గలతీయులు 6:7.
ఇలా ప్రశ్నించుకోండి:
నేను ఎలాంటి వ్యక్తిని?
ఇతరులకున్న మంచి పేరు గురించి నేను పట్టించుకుంటానా?
ఇతరులను బాధపెట్టే పనులు చేసి నేను సంతోషించాలి అనుకుంటున్నానా?
సెక్స్‌టింగ్ నాకున్న మంచి పేరును పాడుచేస్తుందా?
సెక్స్‌టింగ్ వల్ల నా తల్లిదండ్రులకు నా మీదున్న నమ్మకం ఎలా పోతుంది?
నిజంగా జరిగిన కథ “నా ఫ్రెండ్ ఒకమ్మాయి తనకు ఒక అబ్బాయితో ఉన్న సంబంధాన్ని రహస్యంగా ఉంచింది. ఒకసారి తను నగ్నంగా ఉన్న ఒక ఫోటోని అతనికి పంపించింది. అతను కూడా అతనిది పంపించాడు. రెండు రోజులు కూడా గడవకముందే వాళ్ల నాన్నగారు ఆ అమ్మాయి ఫోన్ చెక్ చేయాలనుకున్నారు. ఆయన వాటిని చూసి కుప్పకూలిపోయారు. ఆమెను ప్రశ్నించినప్పుడు ఆమె అన్నిటినీ ఒప్పేసుకుంది. తనలా చేసినందుకు బాధపడుతుందని నాకు తెలుసు. కానీ వాళ్ల అమ్మానాన్నలు మాత్రం చాలా బాధపడుతూ షాక్‌లో ఉండిపోయారు. తనను మళ్లీ నమ్మవచ్చో లేదో కూడా వాళ్లు తేల్చుకోలేకపోయారు.”
జీవిత సత్యం: సెక్స్‌టింగ్ ఆ మెసేజ్‌లు పంపించేవాళ్లను, వాటిని చూసేవాళ్లను కూడా దిగజారుస్తుంది. ఒక టీనేజ్ అమ్మాయిని తనతో సెక్స్‌టింగ్ చేయమని ఆమె బాయ్‌ఫ్రెండ్ బలవంతం చేశాడు. దాని గురించి ఆమె ఇలా చెప్తుంది, “దానివల్ల నా మీద నాకే అసహ్యం కలిగింది. చాలా బాధపడ్డాను.”
సెక్స్‌టింగ్ వల్ల మీతోపాటు ఇతరులకు కూడా హాని జరగడమే కాకుండా, దానివల్ల చట్టపరమైన సమస్యలు ఎదురవ్వవచ్చు. కాబట్టి బైబిలిచ్చే సలహాలను పాటించడం మీకు ఎంతో మేలు చేస్తుంది:
“యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము.”—2 తిమోతి 2:22.
“వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పి వేయుము.”—కీర్తన 119:37.
మీరు ఏమి చేస్తారు?
ఈ నిజ-జీవిత సంఘటనలో బైబిలిచ్చే సలహాను పాటించడం గురించి ఆలోచించండి. జానెట్ చెప్తున్న విషయాన్ని చదివి, ఈ కింది వాటిలో ఏది మంచిదో చూడండి.
ఒకసారి నేనొక అబ్బాయిని కలిశాను. మేము ఒకరి నంబర్లు ఒకరు తీసుకున్నాం. వారం కూడా గడవక ముందే నేను స్విమ్మింగ్ డ్రస్‌లో ఉన్న ఫోటోలు తీసి అతనికి పంపించమని నన్ను అడుగుతున్నాడు.”—జానెట్.
జానెట్ ఏం చేస్తే బావుంటుంది? మీరైతే ఏం చేస్తారు?
ఎ మీరిలా అనవచ్చు: ‘దాంట్లో తప్పేముంది! ఒకవేవ మేము బీచ్‌కి వెళ్తే అతను నన్ను ఎలాగైనా ఆ బట్టల్లో చూస్తాడు కదా!’
బి మీరిలా అనవచ్చు: ‘అతనేంటో నాకు పూర్తిగా తెలీదు కాబట్టి, మరీ అతను అడిగినట్టు కాకుండా కాస్త పొట్టిగా ఉన్న బట్టల్లో నా ఫోటోలు తీసి అతనికి పంపిస్తాను. ఇక అప్పుడు ఏం జరుగుతుందో చూస్తాను.’
సి మీరిలా అనవచ్చు: ‘ఈ అబ్బాయి దృష్టంతా చెడ్డ విషయాల మీదే ఉంది. కాబట్టి అతని మెసేజ్‌ని నేను డిలీట్ చేసేస్తాను.’
సి మంచిదని మీకు అనిపించట్లేదా? బైబిలు కూడా ఇలా చెప్తుంది, “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు.”—సామెతలు 22:3.
సెక్స్‌టింగ్ లేదా ఇతర చెడు ప్రవర్తనకు దారితీసే ఒక ముఖ్యమైన కారణం గురించి ఇది మనకు తెలియజేస్తుంది. మీరు మీ స్నేహితులను జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నారా? (సామెతలు 13:20) శారా అనే యౌవనురాలు ఇలా చెప్తోంది, “చెడు ప్రవర్తనను అస్సలు సహించని వాళ్లతో సహవసించండి.” డెలియా అనే యౌవనురాలు కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటూ ఇలా అంటుంది “మీరు స్నేహితులు అనుకునే వాళ్లు కొంతమంది, మీరు నైతిక విలువలను పాటించడానికి సహాయం చేయరు కానీ, వాటిని పాటించకుండా చేస్తారు. వాళ్లు దేవుని నియమాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటే, మీరు కూడా దేవునికి ఇష్టంలేని పనులు చేసేలా వాళ్లు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. మీరు నిజంగా అలా చేయాలనుకుంటున్నారా?”