డిప్రెషన్‌తో బాధపడేవాళ్లకు బైబిలు సహాయం చేస్తుందా?
బైబిలు ఇచ్చే జవాబు
చేస్తుంది. ఎందుకంటే ‘కృంగిపోయిన వాళ్లకు ఓదార్పు, ప్రోత్సాహం, సేదదీర్పు, ఉత్తేజం ఇచ్చే దేవుడే,’ అలాంటివాళ్లకు అందరికంటే గొప్పగా సహాయం చేయగలడు.—2 కొరింథీయులు 7:6, ద యాంప్లిఫైడ్ బైబిల్ (ఇంగ్లీష్).
డిప్రెషన్లో ఉన్నవాళ్లకు దేవుడు ఎలా సహాయం చేస్తాడు
బలమిస్తాడు. దేవుడు మీకు ‘సేదదీర్పును, ఉత్తేజాన్ని’ ఇస్తాడు, అలాగని మీ సమస్యలన్నిటినీ తీసేయడు. కానీ, మీరు సమస్యలను తట్టుకునే శక్తి కోసం ప్రార్థించినప్పుడు, ఆయన మీ ప్రార్థనలకు జవాబివ్వడం ద్వారా బలాన్నిస్తాడు. (ఫిలిప్పీయులు 4:13) ఆయన మీ ప్రార్థనలు వినడానికి సిద్ధంగా ఉంటాడని మీరు ఖచ్ఛితంగా నమ్మవచ్చు. ఎందుకంటే “విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును” అని బైబిలు చెప్తుంది. (కీర్తన 34:18) నిజానికి, సహాయం కోసం మీరు ప్రార్థించేటప్పుడు మీ మనసులోని భావాలన్నిటినీ మాటల్లో చెప్పలేకపోయినా దేవుడు వాటిని విని అర్థం చేసుకోగలడు.—రోమీయులు 8:26, 27.
ఆదర్శంగా ఉన్నవాళ్ల ఉదాహరణలు గుర్తుచేస్తాడు. బైబిలు రాసినవాళ్లలో ఒకతను దేవునికి ఇలా ప్రార్థించాడు: “అగాధస్థలములలో [‘నిరాశ అనే అగాధం,’ NW] నుండి నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను.” దేవుడు పాప భారంతో మనల్ని కృంగిపోనివ్వడు అని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా కీర్తనకర్త ఆ కృంగుదల నుండి బయటపడగలిగాడు. అంతేకాదు ఆయన దేవునితో ఇలా అన్నాడు: “యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు? అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీయొద్ద క్షమాపణ దొరుకును.”—కీర్తన 130:1, 3, 4.
భవిష్యత్తు మీద ఆశను ఇస్తాడు. దేవుడు ప్రస్తుతం ఓదార్పును ఇవ్వడమే కాదు, డిప్రెషన్‌కు కారణమయ్యే సమస్యలన్నిటినీ శాశ్వతంగా తీసేస్తానని మాటిచ్చాడు. ఆయన అలా చేసినప్పుడు, “[కృంగుదలతో సహా] మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు.”—యెషయా 65:17.
గమనిక: డిప్రెషన్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు యెహోవాసాక్షులు దేవుని సహాయం మీద ఆధారపడుతూనే, వైద్యం కూడా చేయించుకుంటారు. (మార్కు 2:17) అయితే, ఏదైనా ఓ ప్రత్యేక వైద్య విధానాన్ని మేము సిఫారసు చేయడం లేదు; ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఎవరి నిర్ణయాలు వాళ్లే తీసుకోవాలని మేము భావిస్తున్నాం.