కంటెంట్‌కు వెళ్లు

నరకానికి ఎవరు వెళ్తారు?

నరకానికి ఎవరు వెళ్తారు?

బైబిలు ఇచ్చే జవాబు

 నరకం (లేదా బైబిల్ని రాసిన ఆదిమ భాషల్లో “షియోల్‌,” “హేడిస్‌”) అనేది కేవలం సమాధిని సూచిస్తుంది, హింసించే స్థలాన్ని కాదు. నరకానికి, అంటే సమాధికి ఎవరు వెళ్తారు? మంచివాళ్లు, చెడ్డవాళ్లు రెండు రకాలవాళ్లూ వెళ్తారు. (యోబు 14:13; కీర్తన 9:17) మనుషులను ఉంచే ఈ సాధారణ సమాధి ‘జీవులందరికీ నిర్ణయించబడిన స్థలం’ అని బైబిలు చెప్తుంది.—యోబు 30:23, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

 యేసు కూడా చనిపోయాక కొంతకాలం నరకంలో, అంటే సమాధిలో ఉన్నాడు. అయితే ‘దేవుడు ఆయన్ని నరకంలో విడిచిపెట్టలేదు, ఎందుకంటే యేసును దేవుడు పునరుత్థానం చేశాడు.’—అపొస్తలుల కార్యాలు 2:31, 32, ద బైబిల్‌ ఇన్‌ బేసిక్‌ ఇంగ్లీష్‌.

నరకం శాశ్వతంగా ఉంటుందా?

 నరకానికి వెళ్లే వాళ్లందరూ ప్రాణాలతో తిరిగొస్తారు. దేవుడు ఇచ్చిన శక్తితో యేసు వాళ్లను మళ్లీ బ్రతికిస్తాడు. (యోహాను 5:28, 29; అపొస్తలుల కార్యాలు 24:15) భవిష్యత్తులో జరిగే ఆ పునరుత్థానం గురించి ప్రకటన 20:13 ఇలా ప్రవచిస్తుంది, ‘మరణం, నరకం వాటిలో ఉన్న మృతుల్ని అప్పగించాయి.’ (కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌) ఒక్కసారి నరకం ఖాళీ అయ్యాక, ఇక అది ఉనికిలో ఉండదు. ఎందుకంటే “మరణం ఇక ఉండదు.”—ప్రకటన 21:3, 4; 20:14.

 అయితే చనిపోయిన ప్రతీ మనిషి షియోల్‌కు లేదా హేడిస్‌కు వెళ్తాడా? లేదు. కొంతమంది ఎంత చెడ్డగా ఉంటారంటే, తమ ప్రవర్తనను ఎప్పటికీ మార్చుకోరు. (హెబ్రీయులు 10:26, 27) అలాంటివాళ్లు చనిపోయాక షియోల్‌కు లేదా హేడిస్‌కు కాదుగానీ, గెహెన్నాకు వెళ్తారు. ఇంకో మాటలో చెప్పాలంటే, అలాంటివాళ్లు శాశ్వతంగా నాశనం చేయబడతారు. (మత్తయి 5:29, 30) ఉదాహరణకు, యేసు తన కాలంలో ఉన్న మతనాయకుల వేషధారణ గురించి మాట్లాడుతూ, వాళ్లు గెహెన్నాకు వెళ్తారని చెప్పాడు.—మత్తయి 23:27-33.