దేవుని రాజ్యమంటే మీ హృదయంలో ఉండేదా?
బైబిలు ఇచ్చే జవాబు
కాదు, దేవుని రాజ్యమంటే అది క్రైస్తవుల హృదయంలో ఉండే ఒక స్థితి కాదు. a బైబిలు దాన్ని “పరలోకరాజ్యము” అని పిలుస్తోంది. కాబట్టి అది పరలోకంలో ఉండేదని చెప్పవచ్చు. (మత్తయి 4:17) దేవుని రాజ్యం, పరలోకం నుండి పరిపాలిస్తున్న నిజమైన ప్రభుత్వమని బైబిలు ఎలా చెప్తుందో పరిశీలించండి.
ఆ రాజ్యానికి పరిపాలకులు, ప్రజలు, చట్టాలు ఉన్నాయి. అలాగే దేవుని ఇష్టాన్ని పరలోకంలో, భూమ్మీద నెరవేర్చడానికి దానికి అధికారం కూడా ఉంది.—మత్తయి 6:9-10; ప్రకటన 5:9-10.
దేవుని ప్రభుత్వం లేదా రాజ్యం సకల ‘జనులను, రాష్ట్రాలను, భాషలు మాట్లాడేవాళ్లను’ పరిపాలిస్తుంది. (దానియేలు 7:13, 14) అలా పరిపాలించే అధికారం మనుషులు కాదుగానీ స్వయంగా దేవుడే ఆ రాజ్యానికి ఇస్తాడు.—కీర్తన 2:4-6; యెషయా 9:7.
తన నమ్మకమైన అపొస్తలులు పరలోక రాజ్యంలో తనతోపాటు “సింహాసనముల మీద” కూర్చొని పరిపాలిస్తారని యేసు వాళ్లతో చెప్పాడు.—లూకా 22:28-30.
ఆ రాజ్యానికి శత్రువులు కూడా ఉన్నారు, వాళ్లను అది నాశనం చేస్తుంది.—కీర్తన 2:1, 2, 8, 9; 110:1, 2; 1 కొరింథీయులు 15:25, 26.
పరలోక రాజ్యం హృదయంలో ఉండేదని అంటే అది ఒక వ్యక్తి హృదయం నుండి పరిపాలిస్తుందని బైబిలు బోధించడం లేదు. బదులుగా, “రాజ్యమునుగూర్చిన వాక్యము” లేదా “రాజ్య సువార్త” మన హృదయాల మీద ప్రభావం చూపించగలదని, అలా చూపించాలని అది చెప్తుంది.—మత్తయి 13:19; 24:14.
దేవుని రాజ్యం మీలో ఉంది అంటే ఏమిటి?
లూకా 17:21 ని కొన్ని బైబిల్లో అనువదించిన దాన్నిబట్టి కొంతమందికి ఆ రాజ్యం ఎక్కడ ఉంది అనేదానిపై చాలా సందేహాలు పుట్టుకొచ్చాయి. ఉదాహరణకు, ఈ వచనాన్ని కింగ్ జేమ్స్ వర్షన్, “దేవుని రాజ్యం మీలో ఉంది” అని అనువదించింది. అయితే దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం దాని సందర్భాన్ని పరిశీలించాలి.
యేసు పరిసయ్యులతో అంటే తనను వ్యతిరేకించి, తనను చంపాలనుకున్న వాళ్లతో చేతులు కలిపిన ఓ మతనాయకుల గుంపుతో మాట్లాడుతున్నాడు. (మత్తయి 12:14; లూకా 17:20) మరి దేవుని రాజ్యాన్ని అలాంటి వాళ్ల కఠినమైన హృదయాల్లో ఉండే స్థితి అని అనుకుంటే దానిలో అర్థం ఉంటుందా? యేసు వాళ్లతో ఇలా అన్నాడు, మీరు “లోపల వేషధారణతోను అక్రమముతోను నిండియున్నారు.”—మత్తయి 23:27-28.
లూకా 17:21లోని యేసు మాటల్ని వేరే అనువాదాలు ఇలా సరిగ్గా అనువదించాయి, “దేవుని రాజ్యం ఇక్కడ మీతో ఉంది.” (ఇటాలిక్కులు మావి; కంటెంపరరీ ఇంగ్లీషు వర్షన్) “దేవుని రాజ్యం మీ మధ్య ఉంది.” (నూతనలోక అనువాదం, అధస్సూచి) దేవుడు ఎన్నుకున్న రాజైన యేసు వాళ్ల ముందు నిలబడి ఉన్నాడు కాబట్టి ఆ భావంలో దేవుని రాజ్యం పరిసయ్యులతో లేదా వాళ్ల మధ్య ఉంది.—లూకా 1:32, 33.
a దేవుని రాజ్యం అనేది ఓ వ్యక్తిలో లేదా ఒకరి హృదయంలో ఉండేదని చాలా క్రైస్తవ శాఖలు బోధిస్తాయి. ఉదాహరణకు, అమెరికాలోని సదరన్ బాప్టిస్ట్ కన్వెన్షన్ దేవుని రాజ్యం “ఒక వ్యక్తి హృదయంలో, జీవితంలో జరిగే దేవుని పరిపాలనలో” ఓ భాగం అని ప్రకటించింది. అదేవిధంగా, పోప్ బెనడిక్ట్ XVI జీసస్ ఆఫ్ నాజరెత్ అనే తన పుస్తకంలో “వినే హృదయం ద్వారా దేవుని రాజ్యం వస్తుంది” అని రాశాడు.