బైబిలు వచనాల వివరణ
యోహాను 1:1—“ఆదియందు వాక్యముండెను”
“మొదట్లో వాక్యం ఉన్నాడు, ఆ వాక్యం దేవునితో ఉన్నాడు, ఆ వాక్యం ఒక దేవుడు.”—యోహాను 1:1, కొత్త లోక అనువాదం.
“ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.”—యోహాను 1:1, పరిశుద్ధ గ్రంథము.
యోహాను 1:1 అర్థమేంటి?
యేసుక్రీస్తు మనిషిగా భూమ్మీదికి రాకముందు ఆయన జీవితం గురించిన కొన్ని వివరాలను ఈ లేఖనం తెలియజేస్తుంది. (యోహాను 1:14-17) 14వ వచనంలో “వాక్యం” (లేదా “లోగోస్,” గ్రీకులో హో లోగోస్) అనే మాటను బిరుదుగా ఉపయోగించారు. “వాక్యం” అనే బిరుదు, దేవుని ఆజ్ఞలు-నిర్దేశాలు ఇతరులకు తెలియజేయడంలో యేసు పాత్ర గురించి చెప్తుందని తెలుస్తోంది. యేసు భూమ్మీద పరిచర్య చేసినప్పుడు, పరలోకానికి వెళ్లిన తర్వాత కూడా దేవుని సందేశాలు తెలియజేశాడు.—యోహాను 7:16; ప్రకటన 1:1.
“మొదట్లో” అనే మాట, దేవుడు తన సృష్టికార్యాలు మొదలుపెడుతూ వాక్యాన్ని సృష్టించిన సమయాన్ని సూచిస్తుంది. ఆ తర్వాత, వాక్యాన్ని ఉపయోగించి దేవుడు మిగతా వాటన్నిటినీ సృష్టించాడు. (యోహాను 1:2, 3) యేసు “మొత్తం సృష్టిలో మొట్టమొదట పుట్టినవాడు” అని, “మిగతా వాటన్నిటినీ … దేవుడు ఆయన్ని ఉపయోగించుకునే సృష్టించాడు” అని బైబిలు చెప్తుంది. —కొలొస్సయులు 1:15, 16.
“ఆ వాక్యం ఒక దేవుడు” అనే మాట, యేసు భూమ్మీదికి రాకముందు ఆయనకు దైవిక లేదా దేవునిలాంటి స్వభావం ఉండేదని చెప్తుంది. ఆయన్ని అలా వర్ణించడం సరైనదే. ఎందుకంటే ఆయన దేవుని ప్రతినిధిగా ఉన్నాడు, అలాగే మిగతావాటన్నిటినీ చేయడంలో దేవుడు ఉపయోగించుకున్న మొట్టమొదటి కుమారుడిగా ఆయన స్థానం ప్రత్యేకమైనది.
యోహాను 1:1 సందర్భం
బైబిల్లోని యోహాను పుస్తకం భూమ్మీద యేసు జీవితం, పరిచర్య గురించి చెప్తుంది. 1వ అధ్యాయంలోని మొదటి కొన్ని వచనాలు, భూమ్మీదికి రాకముందు యేసు జీవితం గురించి, దేవునితో ఆయనకున్న ప్రత్యేక అనుబంధం గురించి, దేవుడు మనుషులతో వ్యవహరిస్తున్నప్పుడు యేసుకు ఉన్న ముఖ్యమైన పాత్ర గురించి చెప్తున్నాయి. (యోహాను 1:1-18) ఆ వివరాలు, యేసు భూమ్మీద పరిచర్య చేస్తున్నప్పుడు చెప్పిన-చేసిన వాటిని అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తాయి.—యోహాను 3:16; 6:38; 12:49, 50; 14:28; 17:5.
యోహాను 1:1 గురించి అపోహలు
అపోహ: యోహాను 1:1 చివరి మాటను, “వాక్యమే దేవుడు” అని అనువదించాలి.
వాస్తవం: చాలామంది బైబిలు అనువాదకులు ఆ వచనాన్ని అలాగే అనువదించారు. అయితే ఇతర అనువాదకులు ఆ వచనాన్ని వేరేలా అనువదించాలని అంటారు. యోహాను 1:1లో “దేవుడు” (గ్రీకులో, థియోస్) అనే మాట రెండుసార్లు వస్తుంది. మూలభాష వ్యాకరణం ప్రకారం, ఆ రెండు చోట్లలో ఆ పదం వేర్వేరు అర్థాలను ఇస్తుంది. మొదటిసారి ఉపయోగించినప్పుడు, ఆ పదం ముందు నిర్దిష్టతను సూచించే పదం (definite article) ఉంది, కానీ రెండోసారి ఉపయోగించినప్పుడు అది లేదు. రెండో థియోస్ ముందు అలా లేకపోవడం, గమనించాల్సిన విషయమని చాలామంది పండితులు అంటారు. ఉదాహరణకు, ద ట్రాన్స్‌లేటర్స్ న్యూ టెస్టమెంట్ దాని గురించి ఇలా చెప్తుంది: “దానివల్ల, రెండో థియోస్ (దేవుడు) విశేషణంలా అవుతుంది, మొత్తం కలిపి చదివితే ‘వాక్యం దైవత్వం ఉన్నవాడు’ a అని అర్థం వస్తుంది.” మిగతా పండితులు, b బైబిలు అనువాదకులు కూడా అదే విషయాన్ని చెప్తారు.
అపోహ: వాక్యమూ సర్వశక్తిగల దేవుడూ ఒక్కరే అని ఆ వచనం బోధిస్తోంది.
వాస్తవం: “ఆ వాక్యం దేవునితో ఉన్నాడు” అనే మాట చదివినప్పుడు, ఆ వచనంలో ఇద్దరు వేర్వేరు వ్యక్తులు ఉన్నారని తెలుస్తుంది. వాక్యం “దేవునితో” ఉండడం, అదే సమయంలో సర్వశక్తిగల దేవుడై ఉండడం సాధ్యం కాదు. సందర్భం కూడా వాక్యం సర్వశక్తిగల దేవుడు కాదని చూపిస్తుంది. యోహాను 1:18 ఇలా చెప్తుంది: “ఏ మనిషీ ఎప్పుడూ దేవుణ్ణి చూడలేదు.” కానీ వాక్యాన్ని, అంటే యేసును ప్రజలు చూశారు, ఎందుకంటే యోహాను 1:14 “ఆ వాక్యం శరీరంతో పుట్టి, మన మధ్య జీవించాడు. మనం ఆయన మహిమను చూశాం” అని చెప్తుంది.
అపోహ: వాక్యం ఎప్పుడూ ఉన్నాడు.
వాస్తవం: ఈ వచనంలోని “మొదట్లో” అనే మాట, దేవుని ఆరంభాన్ని సూచించే అవకాశం లేదు. ఎందుకంటే, దేవునికి ఆరంభం లేదు. యెహోవా c దేవుడు “శాశ్వతకాలం నుండి శాశ్వతకాలం వరకు” ఉన్నాడు. (కీర్తన 90:1, 2, అధస్సూచి) అయితే, వాక్యానికి అంటే యేసుక్రీస్తుకు ఒక ఆరంభం ఉంది. ఆయన “దేవుని మొట్టమొదటి సృష్టి.”—ప్రకటన 3:14.
అపోహ: వాక్యాన్ని “ఒక దేవుడు” అనడం, ఎక్కువమంది దేవుళ్లను ఆరాధించే సిద్ధాంతాన్ని బోధిస్తోంది.
వాస్తవం: “దేవుడు” లేదా “ఒక దేవుడు” అని అనువదించిన గ్రీకుపదం (థియోస్), పాత నిబంధన అని పిలిచే లేఖనాల్లో ఎల్ అలాగే ఎలోహిమ్ అనే హీబ్రూ పదాలకు సమానమైన పదం. ఈ హీబ్రూ పదాల ప్రాథమిక అర్థం “బలవంతుడు; శక్తిశాలి” అని అంటారు. వాటిని సర్వశక్తిగల దేవుణ్ణి, ఇతర దేవుళ్లను, చివరికి మనుషులను సూచించడానికి కూడా ఉపయోగించారు. (కీర్తన 82:6; యోహాను 10:34) వాక్యం ద్వారానే దేవుడు మిగతావాటన్నిటినీ సృష్టించాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని బలవంతుడు అని పిలవొచ్చు. (యోహాను 1:3) వాక్యాన్ని “ఒక దేవుడు” అని వర్ణించడం, యెషయా 9:6 లోని ప్రవచనానికి తగినట్టుగా ఉంది. ఆ ప్రవచనం, మెస్సీయ లేదా క్రీస్తు “బలవంతుడైన దేవుడు” (హీబ్రూలో, ఎల్గిబోర్) అని పిలవబడతాడని చెప్తుంది. అంతేకానీ “సర్వశక్తిగల దేవుడు” (ఎల్ షదయ్, ఆదికాండం 17:1; 35:11; నిర్గమకాండం 6:3; యెహెజ్కేలు 10:5 ల్లో ఉన్నట్టు) అని పిలవబడతాడని చెప్పట్లేదు.
బైబిలు, ఎక్కువమంది దేవుళ్లను ఆరాధించే సిద్ధాంతాన్ని బోధించట్లేదు. యేసుక్రీస్తు ఇలా చెప్పాడు: “నీ దేవుడైన యెహోవానే నువ్వు ఆరాధించాలి, ఆయనకు మాత్రమే పవిత్రసేవ చేయాలి.” (మత్తయి 4:10) బైబిలు ఇలా చెప్తుంది: “పరలోకంలో గానీ, భూమ్మీద గానీ దేవుళ్లని పిలవబడేవాళ్లు ఉన్నారు; నిజంగానే, ప్రజలు చాలామందిని ‘దేవుళ్లు,’ ‘ప్రభువులు’ అని అంటున్నారు, అయినా మనకు మాత్రం ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయనే తండ్రి; ఆయన వల్లే అన్నీ ఉనికిలోకి వచ్చాయి, మనం ఉన్నది ఆయన కోసమే. అలాగే, ఒక్కడే ప్రభువు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు; ఆయన ద్వారానే అన్నీ సృష్టించబడ్డాయి, మనం కూడా ఆయన ద్వారానే ఉనికిలోకి వచ్చాం.”—1 కొరింథీయులు 8:5, 6.
a ద ట్రాన్స్‌లేటర్స్ న్యూ టెస్టమెంట్, 451వ పేజీ.
b నిర్దిష్టతను సూచించే పదం (definite article) లేకపోవడం వల్ల, “దేవుడు” అని వచ్చిన రెండు చోట్లలో ఆ పదానికి “ఇంగ్లీష్‌లో ‘God’కి అలాగే ‘a god’కి ఉన్నంత తేడా ఉంది” అని జేసన్ డేవిడ్ బెడూన్ అనే విద్వాంసుడు అంటున్నాడు. అతను ఇంకా ఇలా అంటున్నాడు: “యోహాను 1:1 లో వాక్యం ఒకేఒక్క దేవుడు కాదుగానీ, ఒక దేవుడు లేదా దైవత్వం ఉన్నవాడు.”—ట్రూత్ ఇన్ ట్రాన్స్లేషన్: ఆక్యురసీ అండ్ బయాస్ ఇన్ ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్స్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్, 115, 122, 123 పేజీలు.
c యెహోవా అనేది దేవుని పేరు.—కీర్తన 83:18.