బైబిలు వచనాల వివరణ
2 తిమోతి 1:7—“దేవుడు మనకు ... పిరికితనముగల ఆత్మ నియ్యలేదు”
“దేవుడు ఇచ్చే పవిత్రశక్తి మనలో పిరికితనాన్ని కాదుగానీ శక్తిని, ప్రేమను, మంచి వివేచనను పుట్టిస్తుంది.”—2 తిమోతి 1:7, కొత్త లోక అనువాదం.
“దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు.”—2 తిమోతి 1:7, పరిశుద్ధ గ్రంథము.
2 తిమోతి 1:7 అర్థమేంటి?
సరైన దాన్ని ధైర్యంగా చేయడానికి దేవుడు ఒక వ్యక్తికి సహాయం చేయగలడు. మనలో ఎవ్వరూ పిరికితనానికి లొంగిపోకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక వ్యక్తికి అలాంటి భయం ఉంటే అతను దేవున్ని సంతోషపెట్టే పనులు చేయడానికి వెనకాడతాడు.
పిరికితనాన్ని లేదా భయాన్ని పోగొట్టుకోవడానికి దేవుడు ఇచ్చే మూడు లక్షణాల గురించి ఆ వచనం మాట్లాడుతుంది.
“శక్తి.” ప్రమాదకరమైన శత్రువులూ పరిస్థితులూ ఎదురైనా, క్రైస్తవులు ధైర్యంగా దేవున్ని సేవించగలిగారు. వాళ్లు భయంతో ముడుచుకుపోయి వెనకడుగు వేయలేదు. (2 కొరింథీయులు 11:23-27) ఇది ఎలా సాధ్యమైంది? కారణం పౌలు చెప్పిన ఈ మాటల్లో ఉంది: “నాకు శక్తిని ఇచ్చే దేవుని ద్వారా నేను ఏదైనా చేయగలను.” (ఫిలిప్పీయులు 4:13) ఎలాంటి సవాలునైనా దాటడానికి తనను ఆరాధించేవాళ్లకు దేవుడు “అసాధారణ శక్తి” ఇవ్వగలడు.—2 కొరింథీయులు 4:7.
“ప్రేమ.” ఒక క్రైస్తవుడు దేవున్ని ఎంత ఎక్కువగా ప్రేమిస్తే, అంత ధైర్యంగా సరైనదాని పక్షాన నిలబడతాడు. అలాగే అతనికి తోటివాళ్ల మీద కూడా ప్రేమ ఉన్నప్పుడు, వ్యతిరేకత లేదా ప్రమాదాలు ఎదురైనా తన అవసరాల కన్నా తోటివాళ్ల అవసరాలను ఎక్కువగా పట్టించుకుంటాడు.—యోహాను 13:34; 15:13.
“మంచి వివేచన.” బైబిల్లో మంచి వివేచన అనే మాట, బైబిలు మీద ఆధారపడి తెలివైన నిర్ణయాలు తీసుకునే ఒక క్రైస్తవుడి సామర్థ్యాన్ని సూచిస్తుంది. మంచి వివేచన గల వ్యక్తి కష్టమైన పరిస్థితులు ఎదురైనా, స్పష్టంగా అలాగే సరిగ్గా ఆలోచిస్తాడు. అతను విషయాలను దేవుని వైపు నుండి చూస్తూ సరైన నిర్ణయాలు తీసుకుంటాడు. ఎందుకంటే ఇతరుల అభిప్రాయాల కన్నా దేవునితో తనకున్న స్నేహమే ముఖ్యమని అతనికి తెలుసు.
2 తిమోతి 1:7 సందర్భం
రెండవ తిమోతి పుస్తకం అపొస్తలుడైన పౌలు తన ప్రియ స్నేహితుడు, తోటి పనివాడు అయిన తిమోతికి రాసిన ఉత్తరం. ఈ ఉత్తరంలో పౌలు యౌవనుడైన తిమోతిని పరిచర్యలో కష్టపడి పని చేస్తూ ఉండమని ప్రేమగా ప్రోత్సహించాడు. (2 తిమోతి 1:1, 2) తిమోతి కాస్త బిడియస్థుడై ఉంటాడు, దానివల్ల అతను క్రైస్తవ సంఘంలో చేయాల్సినవన్నీ చేయడానికి బహుశా వెనకాడి ఉంటాడు. (1 తిమోతి 4:12) అయితే తిమోతి ఒక ప్రత్యేక వరాన్ని, అంటే సంఘంలో ఒక ప్రత్యేక సేవా అవకాశాన్ని పొందాడని పౌలు అతనికి గుర్తు చేశాడు. సంఘ పర్యవేక్షకునిగా తన అధికారాన్ని ఉపయోగించే విషయంలో, సువార్త ప్రకటించే విషయంలో, అలాగే విశ్వాసం కోసం కష్టాల్ని సహించే విషయంలో వెనకాడవద్దని పౌలు తిమోతిని ప్రోత్సహించాడు.—2 తిమోతి 1:6-8.
ఈ మాటలు మొదట్లో తిమోతి కోసమే రాసినా, అవి దేవున్ని సేవించాలనుకుంటున్న నేటి క్రైస్తవులందరికీ ధైర్యాన్ని ఇస్తాయి. క్రైస్తవులకు ఎలాంటి కష్టం ఎదురైనా, దేవుని సేవ ఆపకుండా ఉండడానికి కావాల్సిన సహాయం ఆయన చేస్తాడు.