అధ్యయనం చేయడానికి ఐడియాలు
ముఖ్యమైన విషయాల్ని నెమరు వేసుకోండి
చదివిన విషయాల్ని గుర్తు తెచ్చుకోవడం మీకు ఎప్పుడైనా కష్టంగా అనిపించిందా? మన అందరికీ అలా అవుతూ ఉంటుంది. అయితే ముఖ్యమైన విషయాల్ని నెమరు వేసుకోవడం మీకు సహాయం చేస్తుంది.
అధ్యయనం చేస్తున్నప్పుడు మధ్యమధ్యలో ఆగి, ముఖ్యాంశాలు ఏంటో ఆలోచించండి. పౌలు కూడా తన ఉత్తరాన్ని చదివే వాళ్లకు సహాయం చేస్తూ ఇలా రాశాడు: “మేము చెప్తున్నవాటి ముఖ్యాంశం ఇదే.” (హెబ్రీ. 8:1) దానివల్ల పౌలు ఏం చెప్పాలనుకుంటున్నాడో అలాగే ఆయన మాటలకి, ఆయన ఎంచుకున్న అంశానికి సంబంధం ఏంటో వినేవాళ్లు తేలిగ్గా అర్థం చేసుకోగలిగారు.
అధ్యయనం పూర్తయిన తర్వాత నేర్చుకున్న వాటిలో ముఖ్యమైన పాయింట్స్‌ని గుర్తుతెచ్చుకోవడానికి ఓ పది నిమిషాలైనా కేటాయించండి. మీకు వెంటనే గుర్తురాకపోతే సబ్‌హెడింగ్‌లను లేదా పేరాల్లో మొదటి వాక్యాలను తిరగేయండి. మీరు ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటే, దాన్ని మీ సొంత మాటల్లో వివరించడానికి ప్రయత్నించండి. ఇలా ముఖ్యమైన విషయాల్ని నెమరు వేస్తే మీకు అవి గుర్తుండిపోవడమే కాదు, వాటిని మీ జీవితంలో ఎలా పాటించాలో కూడా ఇంకా బాగా అర్థమౌతుంది.