తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు—ఘానాలో
రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువున్న వేరే దేశంలో సేవచేయడానికి వెళ్లిన సహోదరుడుగానీ సహోదరిగానీ మీకు తెలుసా? అయితే మీరెప్పుడైనా ఈ ప్రశ్నల గురించి ఆలోచించారా: ‘వేరే దేశంలో సేవచేసేలా వాళ్లను ఏది ప్రోత్సహించింది? అలా సేవ చేసేందుకు వాళ్లు ఎలా సిద్ధపడ్డారు? నేనూ అలా చేయగలనా?’ ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలంటే, అలా సేవచేయడానికి వెళ్లిన సహోదరసహోదరీలతో మాట్లాడడమే మంచి మార్గం. మనమిప్పుడు అలాంటి కొంతమందిని పరిచయం చేసుకుందాం.
వాళ్లను ఏది ప్రోత్సహించింది?
అవసరం ఎక్కువున్న వేరే దేశంలో సేవచేయాలనే ఆలోచన మీలో ఎలా మొదలైంది? అమెరికాకు చెందిన ఏమీ అనే సహోదరి తన 30వ పడిలో ఉంది. ఆమె ఇలా చెప్తుంది, “నేను వేరే దేశంలో సేవచేయాలని కొన్ని సంవత్సరాలుగా అనుకున్నాను, కానీ అలా వెళ్లి సేవచేయడం నావల్ల కాదని అనిపించింది.” మరి ఆమె అభిప్రాయం ఎలా మారింది? “2004లో బెలీజ్ అనే దేశంలో సేవచేస్తున్న ఓ జంట, తమతోపాటు ఒక్క నెల పయినీరు సేవచేయడానికి రమ్మని నన్ను ఆహ్వానించింది. నేను వెళ్లాను, అలా సేవచేయడం నాకు చాలా నచ్చింది. ఓ సంవత్సరం తర్వాత నేను పయినీరుగా సేవచేయడానికి ఘానాకు వెళ్లాను.”
అమెరికాకు చెందిన స్టెఫానీ అనే సహోదరి ప్రస్తుతం తన 20వ పడిలో ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం ఆమె తన పరిస్థితుల్ని జాగ్రత్తగా పరిశీలించుకొని ఇలా అనుకుంది, ‘నేను ఆరోగ్యంగా ఉన్నాను, కుటుంబ బాధ్యతలు కూడా లేవు. నిజానికి నేను యెహోవా సేవలో ఇప్పుడు చేస్తున్న దానికన్నా ఇంకా ఎక్కువ చేయగలను.’ అలా నిజాయితీగా తన పరిస్థితుల్ని పరిశీలించుకోవడం వల్ల ఆమె ఇప్పుడు తన పరిచర్యను విస్తృతం చేసుకుని ఘానాలో సేవచేస్తోంది. డెన్మార్క్‌కు చెందిన ఫిలిప్, ఐడ అనే మధ్యవయసు దంపతులు అవసరం ఎక్కువున్న ప్రాంతానికి వెళ్లాలని కలలు కన్నారు. వాళ్ల కల నిజం చేసుకునే మార్గాల కోసం వెదికారు. తమకు దొరికిన అవకాశం గురించి ఫిలిప్ మాట్లాడుతూ, “‘వెళ్లండి’ అని యెహోవాయే మాతో చెప్పినట్లు అనిపించింది” అని అన్నాడు. 2008లో వాళ్లు ఘానాకు వెళ్లి
మూడు కన్నా ఎక్కువ సంవత్సరాలు అక్కడ సేవచేశారు.హాన్స్, బ్రుక్ అనే పయినీరు దంపతులు తమ 30వ పడిలో ఉన్నారు, వాళ్లు అమెరికాలో సేవచేస్తున్నారు. 2005లో కత్రీన తుఫాను వల్ల నష్టపోయిన సహోదరసహోదరీలకు వాళ్లు సహాయం చేశారు. ఆ తర్వాత, అంతర్జాతీయ నిర్మాణ పనిలో సహాయం చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు, కానీ వాళ్లకు ఆహ్వానం రాలేదు. హాన్స్ ఇలా అంటున్నాడు, “ఆ తర్వాత మేము సమావేశంలోని ఓ ప్రసంగంలో రాజైన దావీదు గురించి విన్నాం. అతను ఆలయ నిర్మాణం చేయాలనుకుంటాడు కానీ ఆ అవకాశం దొరకనప్పుడు తన లక్ష్యాన్ని మార్చుకున్నాడు. కాబట్టి దేవుని సేవలో మా లక్ష్యం కూడా మార్చుకోవడంలో తప్పులేదని అర్థంచేసుకోవడానికి ఆ ప్రసంగం సహాయం చేసింది.” (1 దిన. 17:1-4, 11, 12; 22:5-11) బ్రుక్ ఇలా చెప్తుంది, “మేము వేరే లక్ష్యం పెట్టుకోవాలని యెహోవా కోరుకున్నాడు.”
హాన్స్, బ్రుక్ల స్నేహితులు వేరే దేశంలో సేవ చేస్తున్నారు. వాళ్లకు ఎదురైన ఆసక్తికరమైన అనుభవాలు విన్న తర్వాత హాన్స్, బ్రుక్లు కూడా పయినీరు సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. వాళ్లు 2012లో ఘానాకు వెళ్లి నాలుగు నెలలపాటు సంజ్ఞా భాషా సంఘంలో సేవచేశారు. ఆ తర్వాత వాళ్లు అమెరికాకు తిరిగి వెళ్లాల్సి వచ్చినా, ఘానాలో వాళ్లు రుచి చూసిన అనుభవాలు రాజ్యానికి మొదటిస్థానం ఇవ్వాలనే తమ కోరికను బలపర్చాయి. ఆ తర్వాత నుండి వాళ్లు మైక్రొనేషియా దేశంలోని బ్రాంచి నిర్మాణ ప్రాజెక్టులో సహాయం చేశారు.
లక్ష్యాన్ని చేరుకోవడానికి వాళ్లు తీసుకున్న చర్యలు
అవసరం ఎక్కువున్న ప్రాంతాల్లో సేవచేయడానికి మీరెలా సిద్ధపడ్డారు? స్టెఫానీ ఇలా చెప్తోంది, “అవసరం ఎక్కువున్న ప్రాంతాల్లో సేవచేయడం గురించి కావలికోటలో వచ్చిన ఆర్టికల్స్‌ను నేను వెదికి, జాగ్రత్తగా చదివాను. అంతేకాదు వేరే దేశంలో సేవచేయాలనే నా కోరిక గురించి సంఘ పెద్దలతో, ప్రాంతీయ పర్యవేక్షకునితో అతని భార్యతో చెప్పాను. అన్నిటికన్నా ముఖ్యంగా నా లక్ష్యం గురించి యెహోవాకు పదేపదే ప్రార్థించాను.” a అవన్నీ చేస్తూనే ఆమె తనకున్న డబ్బును వృథా చేయకుండా వేరే దేశంలో సేవచేసేందుకు కూడబెట్టుకుంది.
హాన్స్ ఇలా చెప్తున్నాడు, “యెహోవా ఎటు నడిపిస్తే అటు వెళ్లాలనుకున్నాం, కాబట్టి నడిపింపు కోసం ఆయనకు ప్రార్థించాం.
మా ప్రణాళికను అమలులో పెట్టే తేదీని కూడా ప్రార్థనలో చెప్పేవాళ్లం.” ఆ దంపతులు నాలుగు బ్రాంచి కార్యాలయాలకు ఉత్తరాలు పంపారు. ఘానా బ్రాంచి కార్యాలయం, తమ ప్రాంతంలో సేవచేయడానికి రమ్మని ఆహ్వానించినప్పుడు, వాళ్లు అక్కడికి రెండు నెలలపాటు సేవచేయాలని వెళ్లారు. హాన్స్ ఇంకా ఇలా చెప్తున్నాడు, “మేము అక్కడున్న సహోదరసహోదరీలతో కలిసి పనిచేస్తూ ఎంత ఆనందించామంటే, అనుకున్న దానికంటే ఎక్కువకాలం అక్కడే ఉండిపోయాం.”కెనడాకు చెందిన జార్జ్, ఏడ్రీయ అనే దంపతులు తమ 30వ పడిలో ఉన్నారు. కేవలం మంచి ఉద్దేశాల్నే కాదు మంచి నిర్ణయాల్ని కూడా యెహోవా ఆశీర్వదిస్తాడని వాళ్లు గుర్తుపెట్టుకున్నారు. అందుకే వాళ్లు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి కావాల్సిన చర్యలు తీసుకున్నారు. అప్పటికే ఘానాలో సేవచేస్తున్న ఓ సహోదరితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నారు. కెనడా, ఘానా బ్రాంచి కార్యాలయాలను కూడా సంప్రదించారు. ఏడ్రీయ ఇలా చెప్తుంది, “మేము అంతకుముందుకన్నా మరింత సాదాసీదాగా జీవించడం కోసం కావాల్సిన చర్యలు తీసుకున్నాం.” అలాంటి నిర్ణయాలు తీసుకోవడంవల్ల వాళ్లు 2004లో ఘానాకు వెళ్లి సేవచేయగలిగారు.
సవాళ్లను అధిగమించడం
వేరే దేశం వెళ్లిన తర్వాత ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? మీరు వాటిని ఎలా అధిగమించారు? ఏమీకి మొట్టమొదట ఎదురైన సవాలు ఇంటి మీద బెంగ. “ఇక్కడంతా కొత్తగా అనిపించింది” అని ఏమీ చెప్తుంది. మరి ఆమెకు ఏమి సహాయం చేసింది? “మా ఇంట్లోవాళ్లు నాకు ఫోన్ చేసి ఇక్కడ నేను చేస్తున్న సేవనుబట్టి వాళ్లు ఎంత సంతోషిస్తున్నారో చెప్పినప్పుడు, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో మర్చిపోకుండా ఉండగలిగాను. ఆ తర్వాత మా ఇంట్లోవాళ్లతో వీడియో కాల్స్ చేసి మాట్లాడేదాన్ని. వాళ్లను చూస్తూ మాట్లాడడంవల్ల ఇంటికి దూరంగా ఉన్నట్లు అనిపించేది కాదు.” స్థానికంగా ఉన్న ఓ అనుభవంగల సహోదరితో స్నేహం చేయడంవల్ల ఆ ప్రాంతంలోని
వేర్వేరు పద్ధతుల గురించి ఎక్కువగా తెలుసుకోగలిగానని ఏమీ చెప్తుంది. “ఆమెతో ఏ విషయమైన చెప్పుకోవచ్చనేంత స్నేహం మా ఇద్దరి మధ్య ఏర్పడింది. అందుకే ప్రజలు ఫలానా విధంగా ఎందుకు మాట్లాడారో, ప్రవర్తించారో అర్థంకానప్పుడు ఆమె సహాయం అడిగేదాన్ని. ఆమె సహాయంతో ఏమి చేయాలో, ఏమి చేయకూడదో తెలుసుకోగలిగాను. దానివల్ల నా పరిచర్యను ఆనందించాను.”జార్జ్, ఏడ్రీయ మొదటిసారి ఘానాకు వెళ్లినప్పుడు, వాళ్లకు కాలం వెనక్కి వెళ్లినట్లు అనిపించిందని చెప్పారు. “బట్టలు ఉతకడానికి వాషింగ్మిషన్కు బదులు బకెట్లు ఉపయోగించాం. వంట చేయడానికి అంతకుముందు కన్నా పది రెట్లు ఎక్కువ సమయం పట్టినట్టు అనిపించేది. కానీ కష్టంగా అనిపించిన ఆ పరిస్థితులే కొన్నాళ్లకు కొత్త అనుభవాలుగా మారాయి” అని ఏడ్రీయ చెప్తుంది. బ్రుక్ ఏమంటుందంటే, “పయినీరు సేవలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, మేము సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవిస్తున్నాం. మాకు ఎదురైన మంచిమంచి అనుభవాలన్నీ ఎంతో విలువైన తీపి జ్ఞాపకాల్లా మిగిలాయి.”
సంతృప్తినిచ్చే పరిచర్య
ఇలాంటి రాజ్యసేవ చేయమని ఇతరుల్ని ఎందుకు ప్రోత్సహిస్తారు? “కొంతమంది సత్యం తెలుసుకోవాలని ఎంత ఆతురతతో ఉంటారంటే వాళ్లు ప్రతీరోజు బైబిలు గురించి నేర్చుకోవాలని కోరుకుంటారు. అలాంటి ప్రజలున్న ప్రాంతాల్లో సేవచేయడం చాలా ఆనందాన్నిస్తుంది. అవసరం ఎక్కువున్న ప్రాంతానికి వెళ్లి సేవచేయాలని నేను తీసుకున్న నిర్ణయం ఎంతో శ్రేష్ఠమైనది” అని స్టెఫానీ చెప్తుంది. 2014లో ఆమె ఏరన్ అనే సహోదరుణ్ణి పెళ్లి చేసుకుంది, ఇప్పుడు వాళ్లిద్దరూ ఘానా బ్రాంచి కార్యాలయంలో సేవచేస్తున్నారు.
జర్మనీలో పయినీరుగా సేవచేస్తున్న క్రిస్టీన్ అనే సహోదరి తన 30వ పడిలో ఉంది. ఆమె ఇలా చెప్తుంది, “అది ఓ మంచి అనుభవం.” ఘానాకు రాకముందు క్రిస్టీన్ బొలీవియాలో సేవచేసింది. ఆమె ఇంకా ఇలా చెప్తుంది, “ఇంటికి దూరంగా ఉన్నాను కాబట్టి సహాయం కోసం నేను ఎప్పుడూ యెహోవా మీదే ఆధారపడేదాన్ని. ముందెప్పటికన్నా ఆయన ఇప్పుడు నాకు నిజమైన వ్యక్తిగా అనిపిస్తున్నాడు. యెహోవా ప్రజల మధ్య ఉండే అద్భుతమైన ఐక్యతను నేను కళ్లారా చూస్తున్నాను. ఈ సేవ నా జీవితాన్ని మెరుగుపర్చింది.” క్రిస్టీన్ ఈ మధ్యే గిడీయన్ అనే సహోదరుణ్ణి పెళ్లి చేసుకుంది, వాళ్లిద్దరూ ఘానాలో తమ సేవను కొనసాగిస్తున్నారు.
బైబిలు విద్యార్థులు ప్రగతి సాధించేందుకు వాళ్లు ఎలా సహాయం చేశారో ఫిలిప్, ఐడలు చెప్తున్నారు, “మాకు 15 కన్నా ఎక్కువ బైబిలు స్టడీలు ఉండేవి. కానీ మేము వాటిని 10కి తగ్గించుకున్నాం అందువల్ల మా బైబిలు విద్యార్థులకు ప్రతీ విషయాన్ని మరింత వివరంగా బోధించగలిగాం.” మరి ఆ విద్యార్థులు ప్రయోజనం పొందారా? ఫిలిప్ ఇలా చెప్తున్నాడు, “నేను మైఖేల్ అనే ఓ యువకునితో బైబిలు స్టడీ చేశాను. అతను ప్రతీరోజు బైబిలు స్టడీ తీసుకునేవాడు, చక్కగా సిద్ధపడేవాడు కూడా. అందుకే బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని మేం ఒక్క నెలలోనే పూర్తిచేశాం. ఆ తర్వాత మైఖేల్ బాప్తిస్మం తీసుకొనని ప్రచారకుడు అయ్యాడు. అతను ప్రీచింగ్‌కు వచ్చిన మొదటిరోజు, ‘బైబిలు స్టడీలు చేయడానికి నాకు సహాయం చేస్తారా?’ అని నన్ను అడిగాడు. నేను ఆశ్చర్యపోయాను. అతను అప్పటికే మూడు బైబిలు స్టడీలు మొదలుపెట్టాడనీ, వాటిని చేయడానికి సహాయం కావాలనీ అడిగాడు.” బైబిలు స్టడీ ఇంకా తీసుకుంటున్నవాళ్లే ఇతరులకు స్టడీ చేస్తున్నారంటే, బోధకుల అవసరం ఎంతుందో ఊహించండి!
ఘానాలో అవసరం ఎక్కువుందని ఏమీ వెంటనే ఎలా గ్రహించిందో చెప్తూ ఇలా అంటోంది, “ఘానాకు వచ్చిన కొన్ని రోజులకే, మేం ఒక చిన్న పల్లెలో ప్రీచింగ్ చేస్తూ బధిరుల కోసం వెదికాం. ఆ ఒక్క పల్లెలోనే మొత్తం ఎనిమిదిమంది బధిరులు కనిపించారు.” కొంతకాలానికి ఏమీ ఎరిక్ అనే సహోదరుణ్ణి పెళ్లిచేసుకుంది, ఇప్పుడు వాళ్లిద్దరూ ప్రత్యేక పయినీర్లుగా సేవచేస్తున్నారు. వాళ్లిద్దరూ సంజ్ఞా భాషా సంఘంలో సేవచేస్తూ ఆ దేశంలో ఉన్న 300 కన్నా ఎక్కువమంది బధిరులైన ప్రచారకులకు, ఆసక్తిపరులకు సహాయం చేస్తున్నారు. ఘానాలో సేవచేయడంవల్ల మిషనరీలు అవ్వడం అంటే ఏంటో జార్జ్, ఏడ్రీయలు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. 126వ గిలియడ్ పాఠశాలకు హాజరవ్వమని ఆహ్వానం వచ్చినప్పుడు వాళ్లు చాలా సంతోషించారు. ప్రస్తుతం వాళ్లు మొజాంబిక్ దేశంలో మిషనరీలుగా సేవచేస్తున్నారు.
ప్రేమే వాళ్లను ప్రోత్సహించింది
వేరే దేశాల నుండి ఎంతోమంది వచ్చి స్థానిక సహోదరసహోదరీలకు కోతపనిలో సహాయం చేయడం చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. (యోహా. 4:35) ఘానాలో ప్రతీవారం సగటున 120 మంది బాప్తిస్మం తీసుకుంటున్నారు. ఘానాకు వచ్చిన 17 మంది ప్రచారకులతో సహా, భూవ్యాప్తంగా ఉన్న రాజ్య ప్రచారకులందరూ యెహోవా మీద తమకున్న ప్రేమ వల్లే “తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు.” వాళ్లందరూ రాజ్యప్రచారకుల అవసరం ఎక్కువున్న ప్రాంతాల్లో సేవచేస్తున్నారు. ఇష్టంగా ముందుకొచ్చే అలాంటి ప్రచారకుల్ని చూసి యెహోవా ఖచ్చితంగా సంతోషిస్తాడు.—కీర్త. 110:3; సామె. 27:11.
a ఉదాహరణకు, “రాజ్య ప్రచారకుల అవసరత ఎక్కువగా ఉన్నచోట మీరు సేవచేయగలరా?” “మాసిదోనియకు వచ్చి సహాయం చేస్తారా?” వంటి ఆర్టికల్స్‌ని చూడండి.—కావలికోట, ఏప్రిల్ 15; డిసెంబరు 15, 2009.