అధ్యయన ఆర్టికల్ 30
పాట 36 మన హృదయాల్ని కాపాడుకుందాం
ఇశ్రాయేలు రాజుల నుండి ముఖ్యమైన పాఠాలు
“మీరు నీతిమంతునికి, దుష్టునికి; దేవుణ్ణి సేవిస్తున్న వ్యక్తికి, సేవించని వ్యక్తికి మధ్య తేడాను మళ్లీ చూస్తారు.”—మలా. 3:18.
ముఖ్యాంశం
ఇశ్రాయేలు రాజుల్లో యెహోవా ఏం చూశాడో తెలుసుకుంటాం. దాన్నిబట్టి యెహోవా మనలో కూడా ఏం చూస్తాడో నేర్చుకుంటాం.
1-2. కొంతమంది ఇశ్రాయేలు రాజుల గురించి బైబిలు నిజాయితీగా ఏం చెప్తుంది?
బైబిల్లో 40 కన్నా ఎక్కువమంది ఇశ్రాయేలు రాజుల గురించి ఉంది. a అందులో కొంతమంది గురించి బైబిలు నిజాయితీగా చెప్తుంది. ఉదాహరణకు, మంచి రాజులు కూడా కొన్ని చెడ్డ పనులు చేశారు. మంచి రాజైన దావీదు గురించి చూడండి. యెహోవా ఆయన గురించి ఏం చెప్పాడంటే: “నా సేవకుడైన దావీదు . . . నా దృష్టికి ఏది మంచిదో అదే చేస్తూ, . . . తన నిండు హృదయంతో నన్ను అనుసరించాడు.” (1 రాజు. 14:8) కానీ, దావీదు పెళ్లయిన ఒక స్త్రీతో లైంగిక పాపం చేశాడు అలాగే, ఆమె భర్తను యుద్ధంలో చంపేలా కుట్ర పన్నాడు.—2 సమూ. 11:4, 14, 15.
2 మరోవైపు, చాలామంది చెడ్డ రాజులు కూడా కొన్ని మంచి పనులు చేశారు. రెహబామునే తీసుకోండి, ఆయన యెహోవా దృష్టిలో “చెడుగా ప్రవర్తించాడు.” (2 దిన. 12:14) కానీ, రెహబాము యెహోవా చెప్పినట్టు తన రాజ్యం నుండి ఇశ్రాయేలు పది గోత్రాల్ని విడిపోనిచ్చాడు. అలాగే నగరాల్ని పటిష్ఠం చేయడం వల్ల దేవుని ప్రజల్ని కాపాడాడు.—1 రాజు. 12:21-24; 2 దిన. 11:5-12.
3. మనకు ఏ ప్రశ్న రావచ్చు? ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?
3 అయితే, మనకొక ముఖ్యమైన ప్రశ్న రావచ్చు. అదేంటంటే, ఇశ్రాయేలు రాజులు మంచి పనులు చేశారు; చెడ్డ పనులు చేశారు, మరి వాళ్లు తనకు నమ్మకంగా ఉన్నారని యెహోవా దేని ఆధారంగా చెప్పాడు? ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకుంటే, యెహోవా మనలో ఏం చూస్తున్నాడో అర్థం చేసుకుంటాం. ఇశ్రాయేలు రాజుల్లో యెహోవా చూసిన మూడు విషయాల గురించి ఈ ఆర్టికల్‌లో చూస్తాం. అవేంటంటే వాళ్ల హృదయస్థితి, వాళ్ల పశ్చాత్తాపం, వాళ్లు సత్యారాధనకు అంటిపెట్టుకుని ఉండడం.
వాళ్లు నిండు హృదయంతో యెహోవాను ప్రేమించారు
4. మంచి రాజులకు, చెడ్డ రాజులకు ఉన్న ఒక తేడా ఏంటి?
4 యెహోవాను సంతోషపెట్టిన రాజులు ఆయన్ని నిండు హృదయంతో సేవించారు. b మంచి రాజైన యెహోషాపాతు, ‘యెహోవాను నిండు హృదయంతో వెదికాడు.’ (2 దిన. 22:9) యోషీయా గురించి బైబిలు ఇలా చెప్తుంది: “నిండు హృదయంతో, . . . యెహోవా దగ్గరికి తిరిగొచ్చిన అతనిలాంటి రాజు అతనికి ముందు గానీ అతని తర్వాత గానీ ఎవ్వరూ లేరు.” (2 రాజు. 23:25) తన చివరి దశలో చెడ్డ పనులు చేసిన సొలొమోను సంగతేంటి? ఆయన “హృదయం . . . యెహోవా పట్ల సంపూర్ణంగా లేదు.” (1 రాజు. 11:4) అలాగే చెడ్డ రాజైన అబీయాము గురించి బైబిలు ఇలా చెప్తుంది: “అతని హృదయం తన దేవుడైన యెహోవా పట్ల సంపూర్ణంగా లేదు.”—1 రాజు. 15:3.
5. నిండు హృదయంతో యెహోవాను సేవించడం అంటే ఏంటో వివరించండి.
5 నిండు హృదయంతో యెహోవాను సేవించడం అంటే ఏంటి? ఒక వ్యక్తి యెహోవా సేవను, ఏదో చేయాలి కదా అన్నట్టు చేయడు గానీ, ప్రేమతో-భక్తితో చేస్తాడు. అంతేకాదు ఆ ప్రేమ, భక్తి జీవితాంతం ఉండేలా చూసుకుంటాడు.
6. నిండు హృదయంతో యెహోవాను సేవించాలంటే మనం ఏం చేయాలి? (సామెతలు 4:23; మత్తయి 5:29, 30)
6 మంచి రాజుల్లాగే మనం యెహోవాను నిండు హృదయంతో ఎలా సేవించవచ్చు? యెహోవా మీద ప్రేమను తగ్గించే వేటి జోలికి వెళ్లకుండా ఉండడం ద్వారా. ఉదాహరణకు, ఖాళీ సమయంలో మనం ఏం చూస్తున్నామో జాగ్రత్తగా గమనించుకోవాలి. అలాగే మంచి స్నేహితుల్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి, డబ్బే జీవితం అవ్వకుండా చూసుకోవాలి. యెహోవా మీద మన ప్రేమను ఏదైనా తగ్గిస్తుందని గమనిస్తే, వెంటనే చర్య తీసుకోవాలి.—సామెతలు 4:23; మత్తయి 5:29, 30 చదవండి.
7. యెహోవా మీద ప్రేమను తగ్గించే వాటికి మనం దూరంగా ఉండాలంటే ఏం చేయాలి?
7 నిండు హృదయంతో యెహోవాను సేవించకుండా చేసేవాటి నుండి మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మనం జాగ్రత్తగా లేకపోతే, ఆధ్యాత్మిక పనుల్లో బిజీగా ఉన్నాం కాబట్టి చెడ్డ విషయాలు మనమీద ప్రభావం చూపించవు అనుకోవచ్చు. కానీ అది పొరపాటు. ఉదాహరణకు, మండుతున్న ఎండలో నుండి ఇంటికి వచ్చినప్పుడు ఎ.సి. వేశాక తలుపులన్నీ తెరిచే పెడితే ఏమైనా ఉపయోగం ఉంటుందా? వేడి గాలంతా లోపలికి వస్తుంది. అదేవిధంగా, యెహోవాతో ఉన్న బంధాన్ని కాపాడుకోవడానికి మనం ఆధ్యాత్మిక ఆహారం తీసుకుంటే సరిపోదు. వేడి “గాలి” లాంటి ఈ లోక వైఖరి మన లోపలికి వెళ్లి, యెహోవా మీద ఉన్న ప్రేమను తగ్గించకుండా మన హృదయ తలుపును మూసేయాలి.—ఎఫె. 2:2.
వాళ్లు పశ్చాత్తాపం చూపించారు
8-9. రాజైన దావీదును, రాజైన హిజ్కియాను ప్రవక్తలు సరిదిద్దినప్పుడు వాళ్లెలా స్పందించారు? ( చిత్రం చూడండి.)
8 మనం ముందే చూసినట్టు, రాజైన దావీదు ఘోరమైన పాపం చేశాడు. అయితే నాతాను ప్రవక్త వచ్చి తనను సరిదిద్దినప్పుడు, దావీదు వినయంగా పశ్చాత్తాపపడ్డాడు. (2 సమూ. 12:13) 51వ కీర్తనలో మాటల్నిబట్టి, ఆయన ఎంత నిజాయితీగా పశ్చాత్తాపపడ్డాడో అర్థమౌతుంది. దావీదు నాతానును మెప్పించడానికో లేదా శిక్ష తప్పించుకోవడానికో బాధపడుతున్నట్టు నటించలేదు.—కీర్త. 51:3, 4, 17, పైవిలాసం.
9 రాజైన హిజ్కియా కూడా యెహోవా ముందు ఘోరమైన పాపం చేశాడు. బైబిలు ఇలా చెప్తుంది: “అతని హృదయం గర్వించింది; దానివల్ల అతని మీదికి, యూదా, యెరూషలేము మీదికి దేవుని కోపం వచ్చింది.” (2 దిన. 32:25) హిజ్కియా ఎందుకు గర్వం చూపించాడు? బహుశా తనకున్న ఆస్తిని, అష్షూరీయులపై ఆయన సాధించిన విజయాన్ని, తన జబ్బు అద్భుతరీతిలో బాగవ్వడాన్ని చూసుకొని తానే గొప్ప అనుకొని ఉంటాడు. ఆ గర్వం వల్లే తన ఆస్తినంతా బబులోనీయులకు చూపించుకుని ఉంటాడు. అప్పుడు యెషయా ప్రవక్త ఆయన్ని సరిదిద్దాడు. (2 రాజు. 20:12-18) దావీదులాగే హిజ్కియా వినయంగా పశ్చాత్తాపపడ్డాడు. (2 దిన. 32:26) చివరికి, తన “దృష్టిలో సరైనది చేస్తూ” వచ్చిన నమ్మకమైన రాజుగా యెహోవా ఆయన్ని చూశాడు.—2 రాజు. 18:3.
10. రాజైన అమజ్యా దిద్దుబాటుకు ఎలా స్పందించాడు?
10 వాళ్లకు భిన్నంగా రాజైన అమజ్యా యెహోవా దృష్టిలో సరైనది చేస్తూ ఉన్నాడు. “కానీ సంపూర్ణ హృదయంతో చేయలేదు.” (2 దిన. 25:2) ఆయన ఎక్కడ తప్పు చేశాడు? యెహోవా ఎదోమీయులను ఓడించడానికి సహాయం చేసిన తర్వాత కూడా, అమజ్యా ఎదోమీయుల దేవుళ్లను ఆరాధించాడు. c ఆ తర్వాత యెహోవా ప్రవక్త ఆయన్ని సరిదిద్దినా తలబిరుసుతో లెక్కచేయలేదు.—2 దిన. 25:14-16.
11. రెండో కొరింథీయులు 7:9, 11 ప్రకారం, యెహోవా మనల్ని క్షమించాలంటే ఏం చేయాలి? (చిత్రాలు కూడా చూడండి.)
11 ఈ ఉదాహరణల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? మనం చేసిన పాపాలకు పశ్చాత్తాపపడాలి, అలాగే చేసిన తప్పును మళ్లీ చేయకుండా ఉండడానికి గట్టిగా కృషి చేయాలి. సంఘపెద్దలు మనకు ఏదైనా సలహా ఇస్తే, ఆఖరికి అంత ముఖ్యం కాదనిపించే విషయాలకు కూడా సలహా ఇస్తే, అప్పుడేంటి? యెహోవా గానీ, సంఘపెద్దలు గానీ మనల్ని ద్వేషిస్తున్నారని దానర్థం కాదు. ఇశ్రాయేలులోని మంచి రాజులకు కూడా సలహా, దిద్దుబాటు అవసరం అయ్యాయి. (హెబ్రీ. 12:6) మనకు ఏదైనా దిద్దుబాటు వస్తే దాన్ని (1) వినయంగా తీసుకోవాలి, (2) అవసరమైన మార్పులు చేసుకోవాలి, (3) నిండు హృదయంతో యెహోవా సేవ చేస్తూ ఉండాలి. మన తప్పులకు పశ్చాత్తాపం చూపిస్తే యెహోవా క్షమిస్తాడు.—2 కొరింథీయులు 7:9, 11 చదవండి.
వాళ్లు సత్యారాధనను అంటిపెట్టుకుని ఉన్నారు
12. నమ్మకమైన రాజులు ఎలా వేరుగా ఉన్నారు?
12 నమ్మకస్థులని యెహోవా పిలిచిన రాజులు సత్యారాధనను అంటిపెట్టుకుని ఉన్నారు. అలాగే ప్రజల్ని కూడా అదే చేయమని వాళ్లు ప్రోత్సహించారు. నిజమే, మనం చూసినట్టు ఆ రాజుల్లో కొన్ని లోపాలు ఉన్నాయి. కానీ వాళ్లు యెహోవాకు సంపూర్ణ భక్తిని చూపించారు అలాగే, దేశంలో విగ్రహారాధన తీసేయడానికి చాలా కష్టపడ్డారు. d
13. అహాబు చెడ్డ రాజని యెహోవాకు ఎందుకు అనిపించింది?
13 కొంతమంది రాజులు నమ్మకంగా లేరని యెహోవాకు ఎందుకు అనిపించింది? నిజమే, వాళ్లు కొన్ని మంచి పనులు కూడా చేశారు. ఉదాహరణకు, చెడ్డ రాజైన అహాబు తనవల్లే నాబోతు చనిపోయాడని తెలుసుకున్నప్పుడు కొంత వినయాన్ని చూపించాడు, బాధపడ్డాడు. (1 రాజు. 21:27-29) అంతేకాదు, ఆయన నగరాల్ని కట్టించాడు, ఇశ్రాయేలు కోసం యుద్ధాల్ని గెలిచాడు. (1 రాజు. 20:21, 29; 22:39) కానీ అహాబు తన భార్య మాట విని, అబద్ధారాధనను విపరీతంగా ప్రోత్సహించాడు. ఆ విషయంలో ఆయన అస్సలు పశ్చాత్తాపపడలేదు.—1 రాజు. 21:25, 26.
14. (ఎ) యెహోవా రాజైన రెహబామును చెడ్డ రాజుగా ఎందుకు చూశాడు? (బి) చాలామంది చెడ్డ రాజులు ఏం చేశారు?
14 ఇంకో చెడ్డ రాజైన రెహబాము గురించి చూడండి. మనం ముందు చూసినట్టు, ఆయన పరిపాలనలో కొంతవరకు మంచి చేశాడు. కానీ తన రాజరికం స్థిరపడ్డాక ఆయన యెహోవా ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి, అబద్ధ ఆరాధన వైపు తిరిగాడు. (2 దిన. 12:1) ఆ తర్వాత ఆయన సత్యారాధనకు, అబద్ధ ఆరాధనకు మధ్య కొట్టుమిట్టాడాడు. (1 రాజు. 14:21-24) సత్యారాధన నుండి తొలగిపోయిన వాళ్లలో అహాబు, రెహబాము కాకుండా ఇంకా చాలామంది రాజులు ఉన్నారు. నిజానికి, చాలామంది చెడ్డ రాజులు ఏదోవిధంగా అబద్ధ ఆరాధనకు మద్దతిచ్చినవాళ్లే. ఒక రాజు సత్యారాధనను అంటిపెట్టుకునే దాన్నిబట్టే యెహోవా అతన్ని మంచివాడిగా లేదా చెడ్డవాడిగా చూశాడు.
15. ఒక వ్యక్తి సత్యారాధనను అంటిపెట్టుకుని ఉండడం యెహోవాకు ఎందుకు ప్రాముఖ్యం?
15 రాజులు సత్యారాధనను అంటిపెట్టుకుని ఉండడం యెహోవాకు ఎందుకంత ప్రాముఖ్యం? ఎందుకంటే, ప్రజల్ని సత్యారాధనలో నడిపించే బాధ్యత రాజులకు ఉంది. అంతేకాదు, అబద్ధ ఆరాధన వేరే ఘోరమైన పాపాలకు, అన్యాయాలకు దారితీస్తుంది. (హోషే. 4:1, 2) దాంతోపాటు ఇశ్రాయేలు రాజులు అలాగే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి సమర్పించుకున్నవాళ్లు. కాబట్టి వాళ్లు అబద్ధ ఆరాధన చేస్తే, అది వ్యభిచారంతో సమానమని బైబిలు చెప్తుంది. (యిర్మీ. 3:8, 9) వ్యభిచారం చేసే వ్యక్తి తన జీవిత భాగస్వామి హృదయానికి మానని గాయం చేస్తాడు. అలాగే తనకు సమర్పించుకున్న వ్యక్తి అబద్ధ ఆరాధన చేస్తే, యెహోవాను విపరీతంగా బాధపెట్టినట్టు అవుతుంది. e—ద్వితీ. 4:23, 24.
16. యెహోవా దృష్టిలో చెడ్డవాళ్లకు, మంచివాళ్లకు మధ్యవున్న ముఖ్యమైన తేడా ఏంటి?
16 మనం ఏం నేర్చుకోవచ్చు? నిజమే అబద్ధ ఆరాధనకు దూరంగా ఉండాలని మనం గట్టిగా నిర్ణయించుకోవాలి. అయితే అదొక్కటే సరిపోదు, మనం సత్యారాధనను కూడా అంటిపెట్టుకుని ఉండాలి, అలాగే అందులో చురుగ్గా ఉండాలి. ఒక వ్యక్తిని యెహోవా దృష్టిలో ఏది మంచి వ్యక్తిగా లేదా చెడ్డ వ్యక్తిగా చేస్తుందో మలాకీ ప్రవక్త స్పష్టంగా చెప్పాడు. ఆయనిలా రాశాడు: “మీరు నీతిమంతునికి, దుష్టునికి; దేవుణ్ణి సేవిస్తున్న వ్యక్తికి, సేవించని వ్యక్తికి మధ్య తేడాను మళ్లీ చూస్తారు.” (మలా. 3:18) కాబట్టి మన అపరిపూర్ణతను బట్టి గానీ, మనం చేసిన తప్పుల్ని బట్టి గానీ నిరుత్సాహపడి, యెహోవా సేవను ఆపేయకూడదు. ఎందుకంటే, యెహోవా సేవను ఆపేయడమే ఘోరమైన పాపం.
17. వివాహజతను మనం ఎందుకు జాగ్రత్తగా ఎంచుకోవాలి?
17 మీరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న సహోదరి గానీ, సహోదరుడు గానీ అయితే, మలాకీ చెప్పిన మాటల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఒక వ్యక్తికి మంచి లక్షణాలు ఉండవచ్చేమో గానీ అతను లేదా ఆమె దేవున్ని సేవించకపోతే, యెహోవా వాళ్లను నీతిమంతులుగా చూస్తాడా? (2 కొరిం. 6:14) ఒకవేళ మీరు వాళ్లను పెళ్లి చేసుకుంటే, యెహోవాను నమ్మకంగా సేవించడానికి వాళ్లు మీకు సహాయం చేయగలరా? ఉదాహరణకు, సొలొమోను యెహోవాను ఆరాధించని స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. బహుశా వాళ్లకు కొన్ని మంచి లక్షణాలు ఉండవచ్చు. కానీ వాళ్లు మెల్లిమెల్లిగా సొలొమోనును అబద్ధ ఆరాధన వైపు నడిపించారు.—1 రాజు. 11:1, 4.
18. తల్లిదండ్రులు పిల్లలకు ఏం నేర్పించాలి?
18 తల్లిదండ్రులారా, యెహోవాను మాత్రమే ఆరాధించాలనే కోరికను మీ పిల్లలో పెంచడానికి బైబిల్లో ఉన్న రాజుల ఉదాహరణ ఉపయోగించండి. ఒక రాజు సత్యారాధనను అంటిపెట్టుకున్నాడా లేదా అనే దాన్నిబట్టే, అతను మంచి రాజని గానీ, చెడ్డ రాజని గానీ యెహోవా చూస్తాడని పిల్లలు అర్థంచేసుకునేలా సహాయం చేయండి. బైబిలు చదవడం, మీటింగ్స్‌కి వెళ్లడం, ప్రీచింగ్ చేయడం జీవితంలో అన్నిటికన్నా ప్రాముఖ్యమని మీ మాటల్లో, పనుల్లో చూపించండి. (మత్త. 6:33) లేదంటే కేవలం మీరు యెహోవాసాక్షులుగా ఉన్నారు కాబట్టే వాళ్లు కూడా యెహోవాసాక్షులుగా ఉండాలని అనుకుంటారు. దానివల్ల వాళ్లు సత్యారాధనకు రెండో స్థానం ఇవ్వచ్చు లేదా పూర్తిగా సత్యాన్నే వదిలేయవచ్చు.
19. యెహోవా సేవ ఆపేసినవాళ్లు ఏ నమ్మకంతో ఉండవచ్చు? (“ మీరు యెహోవా దగ్గరకు తిరిగిరావచ్చు” అనే బాక్స్ చూడండి.)
19 యెహోవా సేవ ఆపేసిన వ్యక్తి, ఇంకెప్పుడూ తిరిగి ఆయనకు స్నేహితుడు అవ్వలేడా? అతను పశ్చాత్తాపం చూపించి, తిరిగి యెహోవా దగ్గరకు రావచ్చు. అలా రావాలంటే, అతను వినయం చూపించాలి, సంఘపెద్దల సహాయం తీసుకోవాలి. (యాకో. 5:14) తిరిగి యెహోవాతో స్నేహం చేయడానికి అతను ఏం చేసినా తక్కువే!
20. నమ్మకమైన రాజుల్లా ఉంటే యెహోవా మనల్ని ఎలా చూస్తాడు?
20 ఇశ్రాయేలీయుల రాజుల నుండి మనమేం నేర్చుకున్నాం? నమ్మకమైన రాజుల్లా, మనం నిండు హృదయంతో యెహోవా సేవ చేద్దాం, మన తప్పుల నుండి పాఠాలు నేర్చుకుందాం, పశ్చాత్తాపపడదాం, అవసరమైన మార్పులు చేసుకుందాం. ఒకేఒక్క సత్యదేవుడైన యెహోవాను అంటిపెట్టుకుని, ఆయన్ని మాత్రమే ఆరాధించడం ప్రాముఖ్యమని గుర్తుపెట్టుకుందాం. ఒకవేళ మీరు యెహోవాను అంటిపెట్టుకుని ఉంటే, తన దృష్టిలో సరైనది చేసే వ్యక్తులుగా ఆయన మిమ్మల్ని చూస్తాడు.
పాట 45 నా హృదయ ధ్యానం
a ఈ ఆర్టికల్‌లో “ఇశ్రాయేలు రాజులు” అంటున్నప్పుడు యెహోవా ప్రజల్ని పరిపాలించిన రాజులందర్నీ సూచిస్తుంది. అంటే వాళ్లు యూదా రెండు రాజ్యాల్ని పరిపాలించినా, లేదా ఇశ్రాయేలు పది గోత్రాల్ని పరిపాలించినా, లేదా మొత్తం 12 గోత్రాల్ని పరిపాలించినా, వాళ్లందర్నీ సూచిస్తుంది.
b పదాల వివరణ: బైబిల్లో “హృదయం” అనే మాట తరచూ ఒక వ్యక్తి పూర్తి అంతరంగ స్వభావాన్ని అంటే అతని కోరికల్ని, ఆలోచనల్ని, మనస్తత్వాన్ని, వైఖరిని, సామర్థ్యాల్ని, ఉద్దేశాల్ని, లక్ష్యాల్ని సూచిస్తుంది.
c అప్పట్లో, అన్యులైన రాజులు తాము జయించిన దేశాల దేవుళ్లను ఆరాధించడం ఒక ఆనవాయితీ అని తెలుస్తుంది.
d రాజైన ఆసా ఘోరమైన పాపాలు చేశాడు. (2 దిన. 16:7, 10) అయినా, బైబిలు ఆయన గురించి మంచిగానే మాట్లాడుతుంది. నిజమే, మొదట్లో ఆయన దిద్దుబాటుకు సరిగా స్పందించలేదు కానీ బహుశా ఆ తర్వాత పశ్చాత్తాపపడి ఉంటాడు. ఏదేమైనా, ఆయన చేసిన తప్పుల కన్నా ఆయన మంచి గుణాలే ఎక్కువ. ఆసా యెహోవాను మాత్రమే ఆరాధించాడు, తన రాజ్యంలో విగ్రహారాధన లేకుండా చేయడానికి కష్టపడ్డాడు అనేది గమనించాల్సిన విషయం.—1 రాజు. 15:11-13; 2 దిన. 14:2-5.
e గమనించాల్సిన విషయం ఏంటంటే, ధర్మశాస్త్రంలో మొదటి రెండు ఆజ్ఞలు యెహోవాను తప్ప వేరే ఎవ్వర్నీ లేదా దేన్నీ ఆరాధించకూడదని చెప్తున్నాయి.—నిర్గ. 20:1-6.
f చిత్రాల వివరణ: మందు తాగే విషయంలో ఓ యౌవన సంఘపెద్ద ఒక బ్రదర్‌కి సలహా ఇస్తున్నాడు. ఆ బ్రదర్ వినయంగా ఆ సలహా తీసుకొని, అవసరమైన మార్పులు చేసుకొని, నమ్మకంగా యెహోవా సేవ చేస్తూ ఉన్నాడు.