4 | బైబిల్లో ఉన్న ఉపయోగపడే సలహాలు
బైబిల్లో ఇలా ఉంది: ‘లేఖనాలన్నీ ప్రయోజనకరంగా ఉంటాయి.’—2 తిమోతి 3:16.
అంటే . . .
బైబిలు వైద్య పుస్తకం కాకపోయినా, అందులో మనకు ఉపయోగపడే చక్కని సలహాలు ఉన్నాయి. మానసిక సమస్యలతో బాధపడుతున్న వాళ్లకు అవి బాగా ఉపయోగపడతాయి. అలాంటి కొన్ని సలహాలు చూడండి.
దానివల్ల ఉపయోగం
“ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు వైద్యుడు అవసరం లేదు, రోగులకే అవసరం.”—మత్తయి 9:12.
కొన్నిసార్లు ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరమని బైబిలు కూడా చెప్తుంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న చాలామంది వాళ్లకున్న సమస్య గురించి నిపుణుల ద్వారా తెలుసుకున్నారు; ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నారు. దానివల్ల ఆరోగ్యం మెరుగుపడింది.
‘వ్యాయామం ప్రయోజనకరం.’—1 తిమోతి 4:8, అధస్సూచి.
ఆరోగ్యకరమైన అలవాట్ల కోసం సమయాన్ని, శక్తిని ఉపయోగిస్తే మీ మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాంటి కొన్ని అలవాట్లు ఏంటంటే: ప్రతీరోజు ఎక్సర్సైజ్ చేయడం, ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని తినడం, కంటి నిండా నిద్రపోవడం.
“సంతోష హృదయం మంచి ఔషధం, నలిగిన మనస్సు ఒంట్లో శక్తినంతా లాగేస్తుంది.”—సామెతలు 17:22.
బైబిల్లో ఉన్న ప్రోత్సాహాన్నిచ్చే మాటలు చదవడం వల్ల, చేరుకోగలిగే లక్ష్యాలు పెట్టుకోవడం వల్ల సంతోషంగా ఉంటాం. పాజిటివ్‌గా ఆలోచిస్తే, ముందుముందు పరిస్థితులు మంచిగా మారతాయని నమ్మితే మానసిక సమస్యల్ని తట్టుకోవడం ఈజీ అవుతుంది.
“అణకువ గలవాళ్ల దగ్గర తెలివి ఉంటుంది.”—అన్ని పనులు మీ అంతట మీరే చేసుకోలేనప్పుడు వేరేవాళ్ల సహాయం తీసుకోండి. మీకు సహాయం చేయాలని స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఉన్నా ఎలా సహాయం చేయాలో వాళ్లకు అర్థం కాకపోవచ్చు. కాబట్టి మీకేం సహాయం కావాలో మీరే అడగండి. అలాగని మరీ ఎక్కువ ఆశించకండి, వాళ్లు చేస్తున్న దానికి కృతజ్ఞత చూపించండి.
మానసిక సమస్యలు ఉన్న కొంతమందికి బైబిలు సలహాలు ఉపయోగపడ్డాయి
“నేను ఇంతకుముందులా లేనని అనిపించి డాక్టర్ని కలిశాను, నాకు ఏమైందో ఆమె చెప్పింది. డాక్టరును కలవడం వల్ల నాకున్న సమస్య ఏంటో, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే నా పరిస్థితి మెరుగౌతుందో తెలుసుకున్నాను.”—నిఖిలా, a బైపోలార్ డిజార్డర్‌తో పోరాడుతోంది.
“రోజూ ఉదయం నా భార్యతో కలిసి బైబిలు చదివేవాడిని. అప్పుడు రోజంతా చాలా మంచిగా, ఉత్సాహంగా అనిపించేది. ఇక నా వల్ల కాదు అనిపించిన చాలా సందర్భాల్లో, ఆ రోజు చదివిన ఏదో ఒక లేఖనం నాలో ధైర్యాన్ని నింపేది.”—పీటర్, డిప్రెషన్‌తో పోరాడుతున్నాడు.
“నా సమస్య గురించి ఎవరికైనా చెప్పాలంటే సిగ్గుగా అనిపించేది. కానీ నా క్లోజ్ ఫ్రెండ్ ఒకరు, నాకెలా అనిపిస్తుందో చెప్పినప్పుడు శ్రద్ధగా వింది; నా పరిస్థితిని అర్థం చేసుకుంది. నేను మామూలు అవ్వడానికి, ఒంటరిదాన్ని కాదని అర్థం చేసుకోవడానికి తను నాకు సహాయం చేసింది.”—జెన్ని, ఈటింగ్ డిజార్డర్ అనే మానసిక సమస్యతో బాధపడుతోంది.
“24 గంటలూ పనిచేయడమే కాకుండా, సరిపడా రెస్ట్ కూడా తీసుకోవాలని అర్థం చేసుకోవడానికి బైబిలు నాకు సహాయం చేసింది. నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మానసిక సమస్యల్ని తట్టుకోవడానికి అందులో ఉన్న సలహాలు ఉపయోగపడ్డాయి.”—తిమోతి, OCDతో బాధపడుతున్నాడు.
a పేర్లు మార్చాం.