కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ద్వేషమే లేని కాలాన్ని త్వరలో చూస్తాం!

ద్వేషమే లేని కాలాన్ని త్వరలో చూస్తాం!

మనసులో నుండి ద్వేషాన్ని మనం తీసేసుకున్నా, అవతలి వాళ్లు అలా తీసేసుకోలేకపోవచ్చు. వాళ్ల ఆలోచనల్ని, ప్రవర్తనను మార్చడం మన చేతుల్లో లేదు. అలాంటివాళ్ల వల్ల ఎంతోమంది అమాయకులు ఇప్పటికీ బాధలుపడుతూనే ఉన్నారు. మరి ఈ ద్వేషాన్ని ఎవరూ ఆపలేరా? ఈ సమస్యకు ఎవరూ శాశ్వత పరిష్కారాన్ని చూపించలేరా?

యెహోవా దేవుడు మాత్రమే చూపించగలడు! నేడు లోకంలో ఉన్న ద్వేషాన్ని ఆయన మాత్రమే పూర్తిగా తీసేయగలడు. దేవుడు అలా చేస్తాడని బైబిలు కూడా మాటిస్తోంది.—సామెతలు 20:22.

ద్వేషానికి కారణమైన ప్రతీదాన్ని దేవుడు లేకుండా చేస్తాడు

  1. 1. దేవుడు దుష్టుడైన సాతానును నాశనం చేస్తాడు. సాతాను అనే చెడ్డదూత దేవునికి ఎదురుతిరిగాడని ముందు పేజీల్లో చూశాం. నేడు లోకంలో ఉన్న ద్వేషానికి మూలకారణం అతనే. దేవుడు సాతానును, అలాగే ద్వేషాన్ని విషంలా చిమ్ముతున్న మనుషులందర్నీ త్వరలో నాశనం చేస్తాడు.—కీర్తన 37:38; రోమీయులు 16:20.

  2. 2. దేవుడు సాతాను కింద ఉన్నవాళ్లను నాశనం చేస్తాడు. ఈ ప్రపంచంలో ఉన్న చెడ్డవాళ్లందర్నీ దేవుడు సమూలంగా నాశనం చేస్తాడు. ప్రజల మధ్య ద్వేషాన్ని నూరిపోస్తున్న అవినీతిపరులైన రాజకీయ నాయకులు, మతనాయకులు కూడా అప్పుడు నాశనమౌతారు. అంతేకాదు, అత్యాశకు పోయి ప్రజల డబ్బును దోచుకుంటున్న వ్యాపార వ్యవస్థను కూడా దేవుడు నేలమట్టం చేస్తాడు.—2 పేతురు 3:13.

  3. 3. దేవుడు మనలో ఉన్న బలహీనతల్ని సరిచేస్తాడు. మనుషులందరూ స్వతహాగా చెడు వైపే మొగ్గు చూపుతారని, వాళ్ల ఆలోచనలు, భావాలు, పనులు సాధారణంగా చెడ్డగానే ఉంటాయని బైబిలు చెప్తుంది. (రోమీయులు 5:12) కక్ష పెంచుకోవడం, దాన్ని బయటికి చూపించడం కూడా ఆ చెడు లక్షణాల్లో ఒకటి. అలాంటి బలహీనతల నుండి బయటపడడానికి దేవుడు సహాయం చేస్తాడు. ద్వేషానికి కారణమైన చెడు లక్షణాలను మనలో నుండి తీసేయడం ద్వారా ఆయన ద్వేషాన్ని శాశ్వతంగా లేకుండా చేస్తాడు.—యెషయా 54:13.

ద్వేషం లేని ప్రపంచం చూస్తామని బైబిలు మాటిస్తోంది

  1. 1. అప్పుడు ఎవ్వరికీ అన్యాయం జరగదు. పరలోకంలో స్థాపించబడిన దేవుని ప్రభుత్వం త్వరలో ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. (దానియేలు 2:44) ఆ పరిపాలనలో ఎవ్వరికీ, ఎప్పటికీ అన్యాయం జరగదు. వివక్ష, జాతి విభేదాలు ఉండవు. ఇప్పుడు అన్యాయానికి గురౌతున్న ప్రజలందరికీ దేవుడు న్యాయం జరిగేలా చేస్తాడు.—లూకా 18:7.

  2. 2. అప్పుడు అందరూ శాంతిని అనుభవిస్తారు. దాడులు, యుద్ధాలు అనేవే జరగవు. (కీర్తన 46:9) ఎటుచూసినా శాంతిని ప్రేమించే మనుషులే కనిపిస్తారు. కాబట్టి ప్రపంచంలో ఎవ్వరూ భయపడుతూ జీవించరు.—కీర్తన 72:7.

  3. 3. అప్పుడు అందరూ కలకాలం సంతోషంగా జీవిస్తారు. ఇరుగుపొరుగు వాళ్లందరూ కల్మషంలేని ప్రేమ చూపించుకుంటారు. (మత్తయి 22:39) ఎవ్వరి ముఖంలో బాధ కనిపించదు. గతం తాలూకా చేదు జ్ఞాపకాలు మనల్ని వెంటాడవు. (యెషయా 65:17) ద్వేషం ఉండదు కాబట్టి మనుషులందరూ “ఎంతో శాంతిని అనుభవిస్తూ చాలా సంతోషంగా ఉంటారు.”—కీర్తన 37:11.

ఇవన్నీ త్వరగా జరిగితే బాగుండు అనుకుంటున్నారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఎంతోమంది సంతోషంగా జీవిస్తున్నారు. ఎలాగో తెలుసా? బైబిల్లో ఉన్న సలహాలను పాటిస్తూ మనసులో ఉన్న ద్వేషాన్ని వాళ్లు తీసేసుకోవడం నేర్చుకున్నారు. (కీర్తన 37:8) ప్రపంచంలో లక్షల సంఖ్యలో ఉన్న యెహోవాసాక్షులు వాళ్లు ఏ దేశంలో ఉన్నా, వాళ్ల సంస్కృతులు-పరిస్థితులు ఏవైనా, అందరూ ఒకే కుటుంబంలా ప్రేమగా కలిసి ఉంటున్నారు.—యెషయా 2:2-4.

మీకు ఇష్టమైతే యెహోవాసాక్షులు అన్యాయాన్ని ఎలా తట్టుకుంటున్నారో మీకు తెలియజేస్తారు. వివక్షను, మనసులో ఉన్న ఎలాంటి ద్వేషాన్నైనా తీసేసుకొని దాని స్థానంలో ప్రేమను నింపుకోవడానికి వాళ్లు చెప్పే విషయాలు సహాయం చేస్తాయి. కృతజ్ఞత లేనివాళ్లతో, మిమ్మల్ని ద్వేషించే వాళ్లతో సైతం దయగా ఎలా ప్రవర్తించవచ్చో కూడా వాళ్లు మీకు చెప్తారు. ఈ విషయాలన్నీ తెలుసుకోవడం వల్ల మీ సంతోషం రెట్టింపు అవుతుంది, ఇతరులతో మీ సంబంధం కూడా మెరుగౌతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా, దేవుని ప్రభుత్వం వచ్చినప్పుడు ద్వేషమేలేని పరిస్థితుల్లో జీవించాలంటే మీరు ఏం చేయాలో మీకు తెలుస్తుంది.—కీర్తన 37:29.