నెరవేరిన ప్రవచనాలు
డల్ఫీలో ఉన్న ఒరాకిల్ ద్వారా క్రీసస్ తప్పుదారిలో నడిపించబడి ఫలితంగా పారసీక రాజు చేతిలో ఓడిపోయాడని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. కానీ పారసీక రాజు గురించి బైబిల్లో ఉన్న ఒక గొప్ప ప్రవచనం మాత్రం పొల్లు కూడా పోకుండా నిజమైంది.
దాదాపు 200 సంవత్సరాలు ముందుగానే, అంటే ఆ రాజు పుట్టడానికి చాలాకాలం ముందే హెబ్రీ ప్రవక్తయైన యెషయా కోరెషు అనే పేరున్న అతను మహా నగరమైన బబులోనును ఓడిస్తాడని వివరంగా చెప్పాడు.
యెషయా 44:24, 27, 28: “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, . . . ‘నేనే నీ నదులను ఎండచేయుచున్నాను ఎండిపొమ్మని ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను; కోరెషుతో—నా మందకాపరీ, నా చిత్తమంతయు నెరవేర్చువాడా, అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో—నీవు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాదివేయబడుననియు నేను చెప్పుచున్నాను.’”
గ్రీకు చరిత్రకారుడు హెరొడోటస్ ప్రకారం, కోరెషు సైన్యం బబులోను నగరంలోకి ప్రవహిస్తున్న యూఫ్రటీసు నది నీళ్లను దారి మళ్లించారు. కోరెషు పథకం వల్ల సైన్యాలు నది ద్వారా పట్టణంలోకి ప్రవేశించాయి. పట్టణాన్ని పట్టుకున్న తర్వాత కోరెషు బబులోనులో బందీలుగా ఉన్న యూదులను విడుదల చేశాడు. వాళ్లు తిరిగి వెళ్లి 70 సంవత్సరాల క్రితం నాశనం చేయబడిన యెరూషలేమును కట్టుకునే అవకాశాన్ని కోరెషు వాళ్లకు ఇచ్చాడు.
యెషయా 45:1: “అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడిచేతిని పట్టుకొనియున్నాను నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని యెదుట వేయబడకుండ తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు.”
పట్టణ గోడలకున్న రెండు పెద్ద తలుపులు నిర్లక్ష్యంతో తెరిచి ఉండడం వల్ల పారసీకులు పట్టణంలోకి ప్రవేశించారు. కోరెషు ఏ పథకం వేస్తున్నాడో బబులోనీయులకు తెలిసి ఉంటే వాళ్లు నది వైపుకి తెరిచి ఉన్న తలుపుల్ని మూసేసి ఉండేవాళ్లు. కానీ ఆ పట్టణం రక్షణ లేనట్లుగా ఉంది.
ఈ గొప్ప ప్రవచనం బైబిల్లో తప్పిపోకుండా నిజమైన ఎన్నో ప్రవచనాల్లో ఒకటి మాత్రమే. a మనుషులు వాళ్ల ప్రవచనాలను వాళ్ల దేవుళ్ల నుండి వచ్చాయని చెప్పుకుంటారు. కానీ నిజానికి ఆ దేవుళ్లు అబద్ధ దేవుళ్లు. అలాంటి ప్రవచనాల్లా కాకుండా బైబిలు ప్రవచనాలు “ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయుచున్నాను పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను” అని చెప్తున్న దేవుని ద్వారా వచ్చాయి.—యెషయా 46:10.
నిజమైన దేవుడైన యెహోవా మాత్రమే, అలా ఖచ్చితంగా చెప్పగలడు. ఆ పేరుకు “తానే కర్త అవుతాడు” అని అర్థం. అది భవిష్యత్తులో జరిగే సంఘటనలను తెలుసుకుని వాటిని తన ఇష్టానికి తగ్గట్లుగా మలచగల దేవుని శక్తిని చూపిస్తుంది. ఆయన మాట ఇచ్చిన వాటన్నిటినీ ఖచ్చితంగా చేస్తాడని ఆ పేరు మనకు నమ్మకాన్ని కలిగిస్తుంది.
ఇప్పుడు నిజమౌతున్న ప్రవచనాలు
మన కాలం గురించి బైబిలు ప్రవచనాలు ఏమి చెప్తున్నాయో మీకు తెలుసుకోవాలని ఉందా? దాదాపు 2000 సంవత్సరాల క్రితం బైబిలు, “చివరి రోజుల్లో ప్రమాదకరమైన, కష్టమైన కాలాలు వస్తాయి” అని చెప్పింది. దేనికి చివరి రోజులు? భూమికి లేదా మనుషులకు కాదుగానీ, వేల సంవత్సరాలుగా మనుషుల్ని బాధపెడుతున్న గొడవలకు, దుర్మార్గానికి, బాధలకు చివరి రోజులు. ‘చివరి రోజుల్ని’ గుర్తు పట్టడానికి సహాయం చేసే కొన్ని ప్రవచనాలను ఇప్పుడు చూద్దాం.
2 తిమోతి 3:1-5: “చివరి రోజుల్లో. . . మనుషులు. . . స్వార్థపరులు, డబ్బును ప్రేమించేవాళ్లు, గొప్పలు చెప్పుకునేవాళ్లు, గర్విష్ఠులు, దైవదూషణ చేసేవాళ్లు, అమ్మానాన్నలకు లోబడనివాళ్లు, కృతజ్ఞత లేనివాళ్లు, నమ్మకంగా ఉండనివాళ్లు, మమకారం లేనివాళ్లు, మొండివాళ్లు, లేనిపోనివి కల్పించి చెప్పేవాళ్లు, ఆత్మనిగ్రహం లేనివాళ్లు, క్రూరులు, మంచిని ప్రేమించనివాళ్లు, నమ్మకద్రోహులు, మూర్ఖులు, గర్వంతో ఉబ్బిపోయేవాళ్లు, దేవుణ్ణి కాకుండా సుఖాల్ని ప్రేమించేవాళ్లు, పైకి దైవభక్తి ఉన్నట్టు కనిపించినా, దానికి తగ్గట్టు జీవించనివాళ్లు.”
ఇలాంటి ప్రవర్తన ఇప్పుడున్న ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుందని మీరు ఒప్పుకుంటారా? మనచుట్టూ, వాళ్లను వాళ్లు ప్రేమించుకునే ప్రజలు, డబ్బుని ప్రేమించేవాళ్లు, గర్వంతో ప్రవర్తించేవాళ్లు ఉన్నారని మీరు గమనించారా? ప్రజలు ఎక్కువగా వాళ్లు అనుకున్నదే జరగాలనే విధంగా, వేరేవాళ్ల మాటలను ఒప్పుకోని మొండివాళ్లుగా ఉండడాన్ని మీరు చూస్తున్నారా? ఖచ్చితంగా ఎక్కడ చూసినా తల్లిదండ్రులకు ఎదురుతిరిగే పిల్లలు, దేవునికన్నా సొంత సుఖాల్ని ఎక్కువగా ప్రేమించేవాళ్లు ఉన్నారని మీరు చూస్తున్నారు. పరిస్థితులు కూడా రోజురోజుకు భయంకరంగా తయారౌతున్నాయి.
మత్తయి 24:6, 7: “మీరు యుద్ధాల గురించి, యుద్ధ వార్తల గురించి వింటారు. . . . ఒక దేశం మీద మరో దేశం, ఒక రాజ్యం మీద మరో రాజ్యం దాడిచేస్తాయి.”
కొన్ని అంచనాల ప్రకారం 1914 నుండి యుద్ధాల్లో, సాయుధ పోరాటాల్లో మరణించిన వాళ్ల సంఖ్య పది కోట్లకన్నా ఎక్కువ ఉంది. ఆ సంఖ్య చాలా దేశాల జనాభాకన్నా ఎంతో ఎక్కువ. ఇంత భారీ గణాంకాల వెనక ఉన్న కన్నీళ్లను, దుఃఖాన్ని, బాధను ఒకసారి ఊహించండి. దేశాలు ఈ విషయాన్ని పట్టించుకుని యుద్ధాన్ని ఆపేయాలని ఆలోచిస్తున్నాయా?
మత్తయి 24:7: “ఆహారకొరతలు . . . వస్తాయి.”
వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇలా చెప్పింది: “మనమందరం తినగలిగినంత ఆహారాన్ని పండిస్తున్న ఈ ప్రపంచంలో 81 కోట్ల, 5 లక్షలమంది ప్రజలు అంటే తొమ్మిదిమందిలో ఒక్కరు ప్రతిరోజు రాత్రి ఇంకా ఖాళీ కడుపుతోనే పడుకుంటున్నారు. అంతకన్నా ఎక్కువగా ప్రతి ముగ్గురిలో ఒక్కరు కుపోషణ వల్ల బాధపడుతున్నారు.” ప్రతి సంవత్సరం 30 లక్షలమంది పిల్లలు ఆకలితో చనిపోతున్నారని అంచనా వేయబడింది.
లూకా 21:11: “తీవ్రమైన భూకంపాలు వస్తాయి.”
ప్రతి సంవత్సరం, మనుషులు తెలుసుకోగలిగినంత పెద్ద భూకంపాలు దాదాపు 50,000 వరకు వస్తున్నాయి. దాదాపు 100 భూకంపాలు పెద్ద ఎత్తున బిల్డింగ్‌లకు హాని కలిగిస్తున్నాయి. ఇంకా ప్రతి సంవత్సరం చాలా భయంకరమైన భూకంపం ఒకటైనా వస్తుంది. ఒక అంచనా ప్రకారం 1975వ సంవత్సరం నుండి 2000 వరకు భూకంపాలు 4,71,000 మంది ప్రాణాలు తీసుకున్నాయి.
మత్తయి 24:14: “అన్ని దేశాల ప్రజలకు సాక్ష్యంగా ఉండేలా, రాజ్యం గురించిన మంచివార్త భూమంతటా ప్రకటించబడుతుంది. ఆ తర్వాత అంతం వస్తుంది.”
దాదాపు 80 లక్షలపైన ఉన్న యెహోవాసాక్షులు, దేవుని ప్రభుత్వం గురించిన మంచివార్తను భూమి అంతటా దాదాపు 240 దేశాల్లో ప్రకటిస్తూ, సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. పెరుగుతున్న పట్టణాల్లో, మారుమూల గ్రామాల్లో, అడవుల్లో, కొండలపైన వాళ్లు మంచివార్తను చాటుతున్నారు. దేవుని సంతృప్తి మేరకు ఈ పని జరిగినప్పుడు “అంతం వస్తుంది” అని ఈ ప్రవచనం చెప్తుంది. దాని అర్థం ఏంటి? మనుషుల పరిపాలన ముగిసిపోయి కొత్త పరిపాలనకు అంటే దేవుని రాజ్య పరిపాలనకు నాంది పలుకుతుంది. దేవుని రాజ్యంలో ఏ వాగ్దానాలు నెరవేరుతాయి. ఇంకా చదివి తెలుసుకోండి.
a “నమ్మదగిన ప్రవచనానికి నిశ్శబ్దమైన సాక్ష్యం” అనే ఆర్టికల్ చూడండి.