కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన భూమికి ఏమౌతుంది?

మంచినీరు

మంచినీరు

ఈ విశ్వంలో సమస్త జీవకోటికి నీరే ప్రాణాధారం; ఇంకా చెప్పాలంటే మంచినీరే ప్రాణాధారం. నిజానికి, ఊపిరి ఉన్న ప్రతీ జీవిలో ఎక్కువశాతం ఉండేది నీరే. సరస్సులు, నదులు, చిత్తడి నేలలు (నీటిశాతం ఎక్కువగా ఉండే నేలలు), భూగర్భ జలాలు ఇవన్నీ మనుషులకు, జంతువులకు తాగడానికి అవసరమయ్యే నీటిని; అలాగే మనం పంటలు పండించుకోవడానికి అవసరమయ్యే నీటిని అందిస్తాయి.

తాగునీటికి పొంచివున్న ముప్పు

మన భూమిపై ఎక్కువశాతం ఉన్నది నీరే. అయితే, “అందులో 0.5% నీరు మాత్రమే మంచినీరు” అని ప్రపంచ వాతావరణ సంస్థ చెప్పింది. ఏంటి ఇంత తక్కువా అని ఆశ్చర్యపోతున్నారా? కానీ భూమ్మీదున్న ప్రాణులన్నీ బ్రతకడానికి ఆ నీరు సరిపోతుంది. సమస్యేంటంటే, ఒకవైపు ఆ నీరు కలుషితమైపోతోంది; ఇంకోవైపు నీటి వాడకం ఎక్కువైపోవడం వల్ల, వాతావరణంలో మార్పులు రావడం వల్ల మంచినీరు దొరకడం కష్టమైపోతోంది. మరో 30 ఏళ్లలో, 500 కోట్ల ప్రజలకు మంచినీరే దొరకని పరిస్థితి రావచ్చని నిపుణుల అంచనా.

మన భూమి ఎప్పటికీ ఉండేలా చేయబడింది

భూమి ఎలా తయారు చేయబడిందంటే నీళ్లు లేని పరిస్థితి అసలు ఎప్పటికీ రాదు. దానికితోడు మట్టి, సముద్ర జీవులు, ఆఖరికి సూర్యకాంతి కూడా నీటి శుద్ధీకరణకు తోడ్పడతాయి. భూమి ఎప్పటికీ ఉండేలా చేయబడింది అనడానికి కొన్ని రుజువుల్ని గమనించండి.

  • నీటిలో ఉండే ఎన్నో రకాల మలినాల్ని తొలగించే అద్భుతమైన గుణం మట్టికి ఉందని పరిశోధనలు చెప్తున్నాయి. చిత్తడి నేలల్లో పెరిగే కొన్ని మొక్కలు నైట్రోజన్‌, ఫాస్ఫరస్‌, ఇతర హానికరమైన రసాయనాలను తొలగిస్తాయి అని అంటారు.

  • మనుషుల ప్రమేయం లేకపోయినా సహజ సిద్ధమైన కొన్ని వ్యర్థాల వల్ల నీరు కలుషితమౌతుంది. అయితే, ప్రకృతి సిద్ధమైన కొన్ని ప్రక్రియల ద్వారా ఆ నీరు శుద్ధి అవుతుందని సైంటిస్టులు గుర్తించారు. ఎలా అనుకుంటున్నారా? ముందుగా ఆ మలినాలు పారే నీటిలో కలిసి పల్చబడతాయి. ఆ తర్వాత, సూక్ష్మజీవులు వాటిని విచ్ఛిన్నం చేస్తాయి.

  • మంచినీటిలో పెరిగే నత్తగుల్లలు, ఆల్చిప్పలు నీటిలోని హానికరమైన రసాయనాలను కేవలం కొన్ని రోజుల్లోనే తొలగించేస్తాయి. అవి ఆ పనిని ఎంత బాగా చేస్తాయంటే, మనుషులు కనిపెట్టిన వాటర్‌ ప్యూరిఫైయర్లు కూడా వాటిముందు దేనికీ పనికిరావు.

  • ఒకసారి నీటిచక్రం గురించి ఆలోచించండి. నిరంతరం సాగే ఆ ప్రక్రియ వల్ల, అలాగే ప్రకృతి సిద్ధమైన ఇతర ప్రక్రియల వల్ల భూవాతావరణంలో నీరు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది.

సంరక్షణ చర్యలు

మన వాహనాలకు ఆయిల్‌ లీకేజి లేకుండా చూసుకోవడం, విషపదార్థాలను డ్రైనేజీలోకి వదలకపోవడం ద్వారా మంచినీరు కలుషితం కాకుండా కాపాడవచ్చు

అవకాశం దొరికిన ప్రతీసారి నీటిని ఆదా చేయమని నిపుణులు చెప్తున్నారు. నీటి కాలుష్యాన్ని తగ్గించాలంటే మన వాహనాలకు ఆయిల్‌ లీకేజి లేకుండా చూసుకోవాలని, వాడని మందుల్ని టాయిలెట్‌లో పారేయకూడదని, విషపదార్థాలను డ్రైనేజీలోకి వదలకూడదని కూడా సలహా ఇస్తున్నారు.

ఇంజనీర్లు ఉప్పునీటి నుండి ఉప్పును తొలగించడానికి అధునాతన పద్ధతుల్ని కనుగొన్నారు. సాధ్యమైనంత ఎక్కువమందికి మంచినీటిని అందుబాటులోకి తీసుకురావాలి అనేదే వాళ్ల లక్ష్యం.

చూస్తుంటే ఆ ప్రయత్నాలు సరిపోవని అనిపిస్తుంది! పైగా ఉప్పునీటి నుండి ఉప్పును తొలగించే ప్రక్రియకు చాలా డబ్బు, ఇంధనం, కరెంట్‌ లాంటి ఎన్నో వనరులు అవసరమౌతాయి; కాబట్టి ఆ పద్ధతి మీద కూడా పూర్తిగా ఆశలు పెట్టుకోలేం. మంచినీటి పొదుపుకు సంబంధించి, “ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలు రెండింతలు వేగవంతం అవ్వాలి” అని 2021లో వచ్చిన UN తాలూకు రిపోర్టు చెప్పింది.

ఒక తీపి కబురు—బైబిల్లో ఇలా ఉంది

“ఆయన [దేవుడు] నీటి బిందువుల్ని పైకి చేదుతాడు; అవి ఘనీభవించి వర్షంలా మారతాయి; మేఘాలు వాటిని కుమ్మరిస్తాయి; అవి మనుషుల మీద జల్లులా కురుస్తాయి.”—యోబు 36:27, 28.

భూమ్మీదున్న నీటిని కాపాడడానికి దేవుడు కొన్ని ప్రకృతి చక్రాలను ఏర్పాటు చేశాడు.—ప్రసంగి 1:7.

ఒకసారి ఆలోచించండి. మన సృష్టికర్త సహజ ప్రక్రియల ద్వారా మంచినీరు శుద్ధీకరణ జరిగేలా ఈ భూమిని తయారుచేశాడు. మనుషుల ప్రమేయం వల్ల ఆ ప్రక్రియలు దెబ్బతింటే, వాటిని బాగుచేసి మళ్లీ చక్కగా పనిచేసేలా మార్చే కోరిక, శక్తి సృష్టికర్తకు లేవంటారా? 15వ పేజీలో “మన భూమి ఎప్పటికీ ఉంటుందని దేవుడు మాటిచ్చాడు” అనే ఆర్టికల్‌ చూడండి.