కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దుఃఖంలో మునిగిపోయిన పిల్లలు

దుఃఖంలో మునిగిపోయిన పిల్లలు

మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయి మీరు బాధపడుతున్నారా? అయితే, మీరు ఆ బాధను ఎలా తట్టుకోవచ్చు? ఈ పరిస్థితుల్లో ముగ్గురు యువతీయువకులకు బైబిలు ఎలా సహాయం చేసిందో పరిశీలించండి.

డామీ అనుభవం:

డామీ

మొదట్లో, మామూలు తలనొప్పిలానే అనిపించింది. కానీ మా నాన్నకు నొప్పి బాగా ఎక్కువైనప్పుడు, అమ్మ అంబులెన్స్‌కి ఫోన్‌ చేసింది. వైద్య సిబ్బంది నాన్నను తీసుకెళ్లడం నాకు ఇంకా గుర్తుంది. మా నాన్నను ప్రాణాలతో చూడడం ఇదే చివరిసారి అనుకోలేదు. మూడు రోజుల తర్వాత నాన్న రక్తనాళంలో వాపు వల్ల చనిపోయారు. నాకు అప్పుడు కేవలం 6 సంవత్సరాలే.

మా నాన్న నా వల్లే చనిపోయారని నన్ను నేను చాలా సంవత్సరాలు నిందించుకున్నాను. హాస్పిటల్‌ వాళ్లు మా నాన్నను తీసుకెళ్తున్న క్షణాలను మళ్లీమళ్లీ గుర్తుచేసుకుని, ‘నేను ఎందుకు అలా నిలబడి పోయాను? ఎందుకు ఏమి చేయలేదు?’ అని ఆలోచించుకునేదాన్ని. ఆరోగ్య సమస్యలు ఉన్న పెద్దవాళ్లను చూసినప్పుడు ‘వాళ్లు ఎందుకు బ్రతికి ఉన్నారు, మా నాన్న ఎందుకు లేరు?’ అని బాగా ఆలోచిస్తాను. మెల్లమెల్లగా, మా అమ్మ నా మనసులో ఉన్న వాటన్నిటి గురించి మాట్లాడడానికి నాకు సహాయం చేసింది. నేను ఒక యెహోవాసాక్షిని, కాబట్టి సంఘం వాళ్లు మాకు ఎంతో సహాయం చేశారు.

విషాదం జరిగిన వెంటనే ఏడ్చి, బాధపడి దాని నుండి బయట పడవచ్చని కొంతమంది అనుకుంటారు. కానీ నా విషయంలో అలా జరగలేదు. నాకు టీనేజ్‌ వచ్చే వరకు నేను నిజంగా బాధపడలేదు.

అమ్మనుగాని నాన్ననుగాని పోగొట్టుకున్న యువతీయువకులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, “మీకు ఎలా అనిపిస్తుందో ఎవరో ఒకరితో చెప్పండి. మీరు ఎంత త్వరగా మీ హృదయంలో ఉన్న భావాలను బయట పెడితే అది మీ ఆరోగ్యానికి అంత మంచిది.”

నా జీవితంలో మైలురాళ్లను దాటుతున్నప్పుడు మా నాన్న నా ప్రక్కన లేకపోవడం కష్టంగానే అనిపిస్తుంది. కానీ బైబిల్లో ప్రకటన 21:4 లో దేవుడు ఇచ్చిన ఒక మాట నాకు ఓదార్పును ఇచ్చింది, అక్కడ, త్వరలోనే “కళ్లలో నుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును ఆయన తుడిచేస్తాడు. మరణం ఇక ఉండదు, దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ ఇక ఉండవు” అని ఉంది.

డెరిక్‌ అనుభవం:

చేపలు పట్టడం, కొండలకు వెళ్లి అక్కడ కొన్నిరోజులు ఉండడం, మా నాన్నతో నాకున్న తీపి జ్ఞాపకాలు. ఆయనకు కొండలు అంటే చాలా ఇష్టం.

డెరిక్‌

మా నాన్న కొంతకాలం పాటు గుండె జబ్బుతో బాధపడ్డారు. నేను బాగా చిన్నగా ఉన్నప్పుడు ఆయనను చూడడానికి ఒకట్రెండు సార్లు హాస్పిటల్‌కు వెళ్లడం నాకు గుర్తు. కానీ ఆయన ఆరోగ్యం ఎంత పాడైపోయిందో నాకు అర్థం కాలేదు. నాకు 9 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన గుండె జబ్బుతో చనిపోయారు.

ఆయన చనిపోయినప్పుడు నేను చాలాచాలా ఏడ్చాను. ఊపిరి ఆడనట్లు ఉండేది, ఎవ్వరితో మాట్లాడాలని అనిపించేది కాదు. నా జీవితంలో ఎప్పుడూ నాకు ఇంత బాధ కలగలేదు, ఏమీ చేయాలని అనిపించలేదు. నేనున్న చర్చి యూత్‌ గ్రూప్‌ వాళ్లు, మొదట్లో నా మీద శ్రద్ధ చూపించారు, కానీ కొన్ని రోజులకే అది తగ్గిపోయింది. కొంతమంది నాతో ఇలా అనేవాళ్లు, “మీ నాన్న సమయం వచ్చింది” లేదా “దేవుడు మీ నాన్నను పిలిచాడు” లేదా “ఇప్పుడు ఆయన పరలోకంలో ఉన్నాడు.” ఆ సమాధానాలు నాకు ఎప్పుడూ నిజమైన సంతృప్తిని ఇవ్వలేదు, ఈ విషయాల గురించి బైబిలు నిజంగా ఏమి చెప్తుందో నాకు ఏమీ తెలీదు.

తర్వాత, మా అమ్మ యెహోవాసాక్షుల దగ్గర బైబిలు నేర్చుకోవడం మొదలుపెట్టింది, కొంతకాలానికి నేను, మా అన్న కూడా నేర్చుకోవడం మొదలుపెట్టాం. చనిపోయిన వాళ్ల పరిస్థితి గురించి, దేవుడు ఏర్పాటు చేసిన పునరుత్థాన నిరీక్షణ గురించి నేర్చుకున్నాం. అది మాకు ఎంతో ఓదార్పును ఇచ్చింది. (యోహాను 5:28, 29) నాకు బాగా సహాయం చేసిన వచనం యెషయా 41:9, 10, అక్కడ దేవుడు ఇలా అంటున్నాడు: “నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను.” యెహోవా నాతో పాటు ఉన్నాడు అనే విషయం దుఃఖిస్తున్న సమయంలో నాకు ఎంతో ఓదార్పు ఇచ్చింది, ఇప్పటికీ ఇస్తుంది.

జీనీ అనుభవం:

జీనీ

నాకు 7 సంవత్సరాలు ఉన్నప్పుడు మా అమ్మ క్యాన్సర్‌తో చనిపోయింది. ఆ రోజంతా ఎలా గడిచిందో అర్థం కాలేదు. నాకు గుర్తు ఆమె ఇంట్లో చనిపోయింది, అమ్మమ్మ తాతయ్యలు కూడా ఇంట్లోనే ఉన్నారు. అందరూ ఏమి మాట్లాడకుండా ఉండిపోయారు. ఆరోజు సాయంత్రం గుడ్డు వేపుడు తిన్నాం. నెమ్మదిగా నా జీవితం మొత్తం తలక్రిందులైపోతున్నట్లు అనిపించింది.

ఆ సమయం నుండి చాలా సంవత్సరాల వరకు నేను నా చెల్లి కోసమైనా ధైర్యంగా ఉండాలని అనుకున్నాను. అందుకు నేను నా భావాలన్నిటిని అణచుకున్నాను. ఇప్పటికీ మనసులో ఉన్న దుఃఖాన్ని ఎక్కువగా బయట పడనివ్వను. అది ఆరోగ్యానికి మంచిది కాదు.

దగ్గర్లో ఉన్న యెహోవాసాక్షుల సంఘం చూపించిన ప్రేమ, మద్దతు నాకు గుర్తుంది. మేము అప్పుడే కూటాలకు వెళ్లడం మొదలుపెట్టినా, ఎన్నో సంవత్సరాల నుండి మా కుటుంబానికి తెలిసినవాళ్లలా తోటి విశ్వాసులు మాకు తోడుగా ఉన్నారు. ఒక సంవత్సరం పాటు మా నాన్న సాయంత్రం వంట వండినట్లు నాకు గుర్తులేదు, ఎందుకంటే ప్రతిరోజు ఎవరో ఒకరు ఖచ్చితంగా మాకు భోజనం తీసుకొచ్చేవాళ్లు.

కీర్తన 25:16, 17 నాకు ఎప్పుడూ గుర్తుంటుంది. అక్కడ ఆ కీర్తన రాసిన అతను దేవుణ్ణి ఇలా వేడుకుంటున్నాడు: “నేను ఏకాకిని, బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయవేదనలు అతివిస్తారములు ఇక్కట్టులోనుండి నన్ను విడిపింపుము.” బాధలో ఉన్నప్పుడు మనం ఒంటరి వాళ్లు కాదనే విషయం తెలుసుకోవడం నాకు ఓదార్పుని ఇస్తుంది. దేవుడు మీకోసం ఉన్నాడు. బైబిలు ఇచ్చే సహాయంతో నేను జీవితంలో ముందుకు వెళ్లగలిగాను, మంచి విషయాల మీద అంటే బైబిల్లో ఉన్న ఓదార్పునిచ్చే పునరుత్థాన నిరీక్షణ మీద దృష్టి పెట్టగలిగాను. నేను మా అమ్మను తిరిగి చూస్తానని, పరదైసు భూమ్మీద ఆమెకు మరింత దగ్గర అవుతాననే నిరీక్షణ నాకు ఉంది.—2 పేతురు 3:13.

దుఃఖిస్తున్న వాళ్లకు మరింత ఓదార్పు ఎలా దొరుకుతుందో మీకు తెలుసుకోవాలని ఉందా? “మీ ప్రియమైన వారెవరైనా చనిపోతే . . . ” అనే ప్రచురణను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోండి. దానికోసం www.mt1130.com/te వెబ్‌సైట్‌లో ప్రచురణలు కింద పుస్తకాలు & బ్రోషుర్‌లు చూడండి.