దౌత్యం ప్రపంచ శాంతి తీసుకొస్తుందా?
బైబిలు ఉద్దేశం
దౌత్యం ప్రపంచ శాంతి తీసుకొస్తుందా?
యుద్ధాలన్నింటి అంతం చూడాలని మీరు కోరుకుంటున్నారా? జాతీయ, అంతర్జాతీయ పోరాటాలకు తప్పక ఏదోక దౌత్యసంబంధ పరిష్కారం ఉండే ఉండాలి. ప్రపంచ నాయకులు పరస్పరం సహకరించుకుంటే, యుద్ధాన్ని అంతం చేయవచ్చని చాలామంది భావిస్తున్నారు. అయితే దౌత్య వ్యవహారాల ఫలితాలనుబట్టి బహుశా మీరు నిరాశ చెంది ఉంటారు. అనేక శతాబ్దాలుగా దౌత్యవేత్తలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు, పరిష్కార విధానాలు రూపొందించారు, శిఖరాగ్రస్థాయిలో సదస్సులు నిర్వహించారు. అయితే చాలా తక్కువ వివాదాలకు మాత్రమే శాశ్వత పరిష్కారం లభించింది.
దౌత్యం గురించి, శాంతి గురించి బైబిలు చాలా విషయాలు చెబుతోంది. అది ఈ క్రింది ప్రశ్నలకు జవాబిస్తోంది: శాంతికొరకైన దౌత్య వ్యవహారాలను ప్రస్తుతం ఏవి అడ్డగిస్తున్నాయి? దౌత్యంలో క్రైస్తవులు భాగం వహించాలా? చివరకు నిజమైన శాంతి ఎలా సాధించబడుతుంది?
శాంతిని ఏది అడ్డగిస్తోంది?
వ్యక్తులు పరస్పరం కలుసుకోవడం శాంతికి దారితీస్తుందని అనేక బైబిలు వృత్తాంతాలు ఉదహరిస్తున్నాయి. ఉదాహరణకు, తన ఇంటివారిపై పగతీర్చుకోకుండా దావీదును ఆయన సైన్యాన్ని అబీగయీలు నేర్పుగా ఒప్పించింది. (1 సమూయేలు 25:18-35) యేసు ఒక ఉపమానంలో, తన దగ్గర తగిన బలంలేని ఒక రాజు సంధి చేసుకోవడానికి రాయబారులను పంపడం గురించి చెప్పాడు. (లూకా 14:31, 32) అవును, కొన్ని రకాల దౌత్యం పోరాటాలను పరిష్కరించగలదని బైబిలు అంగీకరిస్తోంది. అలాంటప్పుడు, శాంతి సదస్సులు తరచూ ఎందుకు పరిమిత విజయం మాత్రమే సాధిస్తున్నాయి?
మన కాలాలు కలవరపెట్టేవిగా ఉంటాయని బైబిలు ముందే ఖచ్చితంగా చెప్పింది. అపవాదియగు సాతాను దుష్ట ప్రభావం మూలంగా, మనుషులు ‘అతిద్వేషులుగా క్రూరులు సజ్జనద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులుగా’ ఉంటారు. (2 తిమోతి 3:3, 4; ప్రకటన 12:12) దానికితోడు, ప్రస్తుత విధానాంతం ‘యుద్ధాలతో యుద్ధసమాచారాలతో’ గుర్తించబడుతుందని యేసు ప్రవచించాడు. (మార్కు 13:7, 8) ఇవి అంతకంతకు ప్రబలమవుతున్నాయనే విషయాన్ని ఎవరు కాదనగలరు? పరిస్థితి అలా ఉంది కాబట్టి, దేశాల మధ్య శాంతి ప్రయత్నాలు తరచూ వ్యర్థమవుతున్నాయంటే అందులో ఆశ్చర్యమేమైనా ఉందా?
అంతేకాకుండా ఈ వాస్తవం కూడా ఆలోచించండి: దౌత్యవేత్తలు యుద్ధాలను నిలువరించడానికి తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ, ప్రతీ ఒక్కరి ముఖ్యోద్దేశం తన స్వంత దేశోద్ధరణే. రాజకీయ దౌత్యంలో ఇదే అత్యంత ప్రాముఖ్యమైన విషయం. అలాంటి విషయాల్లో క్రైస్తవులు భాగం వహించాలా?
క్రైస్తవులు మరియు దౌత్యం
బైబిలు ఇలా సలహా ఇస్తోంది: “రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి.” (కీర్తన 146:3) అంటే ప్రపంచ దౌత్యవేత్తల ఉద్దేశాలెలావున్నా వారికి శాశ్వత పరిష్కార విధానాలు రూపొందించే శక్తి గానీ, సామర్థ్యం గానీ లేవని దానర్థం.
పొంతి పిలాతు ఎదుట న్యాయవిచారణకై నిలబడినప్పుడు యేసు ఇలా చెప్పాడు: “నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు; నా రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహసంబంధమైనది కాదు.” (యోహాను 18:36) శాంతి పథకాలు తరచూ జాతీయతత్వ ద్వేషంతో, రాజకీయ స్వార్థాలతో నిండుకుని ఉంటాయి. అందువల్ల, నిజ క్రైస్తవులు ఈ లోక పోరాటాలకు, దాని దౌత్య ప్రయత్నాలకు దూరంగా ఉంటారు.
అంటే క్రైస్తవులు లోక సమస్యలపట్ల ఉదాసీనంగా, ఆసక్తిలేని వారిగా ఉంటారని దానర్థమా? మానవాళి బాధలను వారు పట్టించుకోరా? అలా కానేకాదు. దానికి భిన్నంగా, తమ చుట్టూ జరుగుతున్న హేయకృత్యములను గురించి “మూల్గులిడుచు ప్రలాపించుచున్న” వ్యక్తులుగా దేవుని నిజ ఆరాధకులను బైబిలు వర్ణిస్తోంది. (యెహెజ్కేలు 9:4) దేవుడు తాను వాగ్దానం చేసినట్టుగానే శాంతి తీసుకువస్తాడని క్రైస్తవులు కేవలం ఆయనపై ఆధారపడతారు. శాంతి అంటే యుద్ధం లేకుండా ఉండడమే అని మీ ఉద్దేశమా? దేవుని రాజ్యం నిశ్చయంగా దానిని నెరవేరుస్తుంది. (కీర్తన 46:8, 9) అంతేకాదు, అది భూనివాసులందరికీ సంపూర్ణ భద్రతను, సంక్షేమాన్ని చేకూరుస్తుంది. (మీకా 4:3, 4; ప్రకటన 21:3, 4) అలాంటి ఉన్నతస్థాయి శాంతి దౌత్యం ద్వారా లేదా మానవ “శాంతి పరిరక్షక” సంస్థల ప్రయత్నాల ద్వారా ఎప్పటికీ సాధించబడదు.
శాంతి తీసుకురావడానికి మానవ దౌత్యాన్ని నమ్ముకోవడం కేవలం నిరాశకు దారితీస్తుందని బైబిలు ప్రవచనం, గత అనుభవం స్పష్టంగా సూచిస్తున్నాయి. శాంతికోసం యేసుక్రీస్తుపై నమ్మకముంచి దేవుని రాజ్యానికి మద్దతు ఇచ్చేవారు నిజ శాంతి కోసమైన తమ కోరిక నెరవేరడాన్ని చూస్తారు. అంతకంటే ఎక్కువగా వారు దాన్ని నిత్యం అనుభవిస్తారు.—కీర్తన 37:11, 29. (g04 1/8)
[13వ పేజీలోని బ్లర్బ్]
ప్రపంచ దౌత్యవేత్తల ఉద్దేశాలెలావున్నా వారికి శాశ్వత పరిష్కార విధానాలు రూపొందించే శక్తి గానీ, సామర్థ్యం గానీ లేవు
[12వ పేజీలోని చిత్రసౌజన్యం]
క్రింద: Photo by Stephen Chernin/Getty Images