మా పాఠకుల నుండి
మా పాఠకుల నుండి
వివక్ష “వివక్ష ఎప్పటికైనా అంతమవుతుందా?” అనే వరుస ఆర్టికల్లు ప్రచురించినందుకు ధన్యవాదాలు. (అక్టోబరు-డిసెంబరు, 2004) అవి చదువుతున్నప్పుడు, నాలో కూడా ఏ మూలో కాస్త వివక్ష ఉన్నట్లు అనిపించింది. అది నాకెంతో ఆశ్చర్యం కలిగించింది, ఎందుకంటే వివక్ష చూపించేవారిని చూస్తే నాకు తరచూ కోపం వస్తుంది. ఈ పత్రిక నాకు సహాయం చేస్తుందని నమ్ముతున్నాను.
ఎమ్. యు., అమెరికా
నేను నా స్వదేశానికి చాలా దూరంలో నివసిస్తున్నప్పటికీ, నేను వివక్షకు గురవుతున్నట్లు నాకు అనిపించడంలేదు. కానీ వివక్షకు గురవుతున్నవారి భావాలను అర్థం చేసుకోవడానికి ఈ ఆర్టికల్లు నాకు సహాయం చేశాయి. ఈ సమస్యను త్వరలోనే అంతం చేయబోతున్నందుకు మనం యెహోవాకు కృతజ్ఞులం.
టి. జి., నార్వే
వివక్ష సమస్య విషయంలో ప్రజలను మేల్కొల్పాలన్న మీ ఉద్దేశాన్ని నేను అభినందిస్తున్నాను. కానీ 8, 9 పేజీల్లో మీరు మీలోని భేదభావాలకు లొంగిపోయినట్లు అనిపిస్తోంది. అందులో మీరు గాయపడిన వ్యక్తికి ఆ దారిన వెళ్తున్న ఇద్దరు యూదులు సహాయం చేయడానికి ఇష్టపడలేదు అని వర్ణించారు. మీరు యూదులనే ఎందుకు ఎంపిక చేసుకున్నారు?
హెచ్. హెచ్., అమెరికా (g05 6/22)
“తేజరిల్లు!” ప్రతిస్పందన: పొరుగువాడైన సమరయుని కథ చెప్పింది యూదుడైన యేసు. ఆయన కాలంలో, చాలామంది యూదులకు సమరయులంటే వివక్ష భావం ఉండేది. అందుకే మరొక జాతికి చెందిన వ్యక్తి యూదులకు మంచి పొరుగువాడు కావచ్చు అని చెప్పడం ద్వారా, యేసు తన యూదా శ్రోతలకు ఎంతో విలువైన పాఠాన్ని బోధించాడు.
పెళ్ళికి ముందు లైంగిక సంబంధం “యువత ఇలా అడుగుతోంది . . . పెళ్ళికి ముందు లైంగిక సంబంధం పెట్టుకుంటే తప్పేమిటి?” అనే ఆర్టికల్ నాకు బలాన్నిచ్చే సహాయకంగా ఉంది. (అక్టోబరు-డిసెంబరు, 2004) ఈ ఆర్టికల్‌లో మీరు ఉటంకించిన యువతీయువకుల ఆలోచనలు, నాలో కలిగిన ఆలోచనల్లాగే ఉన్నాయి. ప్రత్యేకంగా యెహోవా యథార్థంగా ప్రవర్తించేవారికి ఏ మేలు చేయక మానడు అని కీర్తన 84:11 లో ఉన్న మాటలు నా మనసులో గాఢమైన ముద్ర వేశాయి.
టి. యు., జర్మనీ
ఒక యౌవనస్థురాలిగా నేను యెహోవా దృష్టిలో పవిత్రంగా ఉండాలని ఎల్లప్పుడూ నా శాయశక్తులా ప్రయత్నించాను, కానీ కొన్నిసార్లు అది చాలా కష్టం. ఈ ఆర్టికల్ నా నిర్ణయాన్ని మళ్ళీ దృఢపరచింది, అంతేగాక ఈ సాతాను లోకంలో నాకు ఒక్కదానికే ఇలాంటి ఒత్తిళ్ళు ఎదురుకావడం లేదని కూడా గుర్తుచేసింది. యౌవనస్థుల గురించి యెహోవా ఎంత శ్రద్ధ తీసుకుంటాడో తెలుసుకోవడం చాలా ప్రోత్సాహకరమైన విషయం.
ఎఫ్. బి., బోట్స్వానా (g05 5/22)
“యువత ఇలా అడుగుతోంది . . . పెళ్ళికి ముందే లైంగిక సంబంధాలను నేను ఎలా తప్పించుకోవచ్చు?” అనే ఆర్టికల్‌కు నా ధన్యవాదాలు. (ఆగస్టు 22, 2004) (ఆంగ్లం) ఒక టీచరుగా, కౌన్సిలర్‌గా నాకు ఈ ఆర్టికల్ చాలా ఆసక్తి కలిగించింది. ఒక క్లాసు చర్చలో, పెళ్ళికి ముందే లైంగిక సంబంధాల వల్ల ఎదురయ్యే సమస్యలకు గురికాకుండా చదువులో ప్రగతి సాధించడానికీ యెహోవా దృష్టిలో పరిశుద్ధంగా, యోగ్యులుగా ఉండడానికీ దోహదపడే అంశాలను విద్యార్థులకు నొక్కిచెప్పాను. చాలామంది విద్యార్థులు ఆసక్తి కనబరిచారు, బైబిలు గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ఇష్టపడ్డారు! తమ క్లాసుల్లోని విద్యార్థులతో మాట్లాడమని ఇప్పటికీ కొందరు టీచర్లు అడుగుతున్నారు. యువత అడిగే ప్రశ్నలు పుస్తకం నుండి వివిధ అంశాలను చర్చించడానికి నేను ప్రతీవారం నా తరగతి విద్యార్థులను కలుస్తాను.
బి. సి., మొజాంబిక్
నా వయసు 25 ఏండ్లు, నేను పవిత్రంగా ఉండేందుకు నా శాయశక్తులా కృషి చేశాను. గౌరవప్రదమైన వివాహబంధంలోకి ప్రవేశించాలనే నా నిర్ణయం ఇంతకుముందు కన్నా ఇప్పుడు మరింత దృఢపడింది. మీరు చేస్తున్న ఈ చక్కని పనిని ఇలాగే కొనసాగించండి.
ఎఫ్. కె., ఉగాండా (g05 6/8)