పత్రిక ముఖ్యాంశం
జీవితంలో డబ్బుకున్న స్థానం ఏంటి?
“ఈ ప్రపంచమంతా డబ్బు చుట్టూ తిరుగుతుంది” అని చాలామంది అంటారు. ఆ మాటల్లో నిజం లేకపోలేదు. ఎందుకంటే ఆహారం, బట్టలు, అద్దె ఇల్లు, సొంత ఇల్లు ఈ రోజుల్లో ఏది కావాలన్నా అన్నీ డబ్బులిస్తేనే వస్తాయి. “సమాజంలో ఉండడానికి డబ్బు చాలాచాలా అవసరం, ఇప్పుడున్న డబ్బంతా ఇక చెల్లదు, డబ్బుతో పనిలేకుండా అమ్మకాలు, కొనుగోలు చేయాలి అంటే ఒక నెలలోనే అంతా గందరగోళమైపోయి యుద్ధాలు మొదలవుతాయి” అని ఒక ఆర్థిక పత్రిక సంపాదకుడు రాశాడు.
నిజమే డబ్బుతో అన్నీ కొనలేము. నార్వే దేశానికి చెందిన ఆర్నా గార్బోర్గ్ అనే కవి ఇలా అన్నాడు: డబ్బుతో “ఆహారం కొనగలం కాని ఆకలిని కాదు, మందులు కొనగలం కాని ఆరోగ్యాన్ని కాదు, మెత్తటి పరుపులు కొనగలం కాని నిద్రను కాదు. ఎంతో తెలుసుకుంటాం కాని తెలివిని కొనలేం. డబ్బుతో తలుకుబెళుకులు వస్తాయి కానీ అందం రాదు, ఆస్తి వస్తుంది కాని ఆప్యాయత రాదు, సరదాలు తీరతాయి కానీ సంతోషం రాదు, పరిచయస్థులుంటారు కాని స్నేహితులుండరు, పనివాళ్లు ఉంటారు కాని నమ్మకం ఉండదు.”
ఒక మనిషి డబ్బుకు ఎంత విలువివ్వాలో అంతే విలువిచ్చి, డబ్బు జీవించడానికి అవసరం కానీ డబ్బే జీవితం కాదు అని అర్థం చేసుకున్నప్పుడు చాలా సంతృప్తిగా ఉంటాడు. “ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి . . . నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి” అని చెప్తూ దేవుడు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండమంటున్నాడు.—1 తిమోతి 6:10.
ధనాపేక్ష లేదా డబ్బు మీద ఆశ ఉంటేనే ప్రమాదం కాని డబ్బు ఉంటే కాదు. డబ్బే లోకమనుకుంటే మనం స్నేహితులకు, కుటుంబ సభ్యులకు దూరమవుతాం. ఈ ఉదాహరణలు చూడండి.
a “నాకు తెలిసినంతవరకు నా స్నేహితుడు సుమన్ చాలా మంచివాడు, నిజాయితీపరుడు. అతను నా కారు కొనుక్కునేవరకు మా ఇద్దరి మధ్య ఏ సమస్యా రాలేదు. ఆ కారులో లోపాలున్నాయని నాకు తెలీదు. అయినా ‘ఎలా ఉన్నా కొనుక్కుంటాను’ అని రాసి మరీ కొన్నాడు. మూడు నెలల తర్వాత కారు పాడైపోయింది. నేను మోసం చేశానని, అతని డబ్బులు తిరిగి ఇచ్చేయాలని కోపంగా పట్టుబట్టాడు. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నచ్చ చెప్పాలని చూశాను కానీ చాలా కఠినంగా మట్లాడాడు. డబ్బు విషయంలో గొడవలు వచ్చే సరికి ఇప్పుడతను నాకు తెలిసిన సుమన్ కాదు.”
తరుణ్:శాలిని: “శ్రావణి నా ఒక్కగానొక్క చెల్లి. మా ఇద్దరికీ ఎప్పుడూ గొడవలు రాలేదు, కాబట్టి డబ్బు విషయాల్లో కూడా గొడవలు రావు అనుకున్నా. కానీ అలా జరగలేదు. మా అమ్మానాన్న చనిపోయాక మాకు కొంత ఆస్తి వచ్చింది. మేమిద్దరం సమానంగా పంచుకోవాలని వాళ్లు కోరుకున్నారు. కానీ మా చెల్లి వాళ్ల మాటను కాదని తనకు ఎక్కువ భాగం ఇవ్వాలని పట్టుబట్టింది. నేను అమ్మానాన్న చెప్పినట్లు చేయాలనుకున్నా కాబట్టి నా మీద గట్టిగా అరుస్తూ బెదిరించింది. ఇప్పటికీ నా మీద చాలా కోపంగా ఉంది.”
డబ్బు, తప్పు అభిప్రాయాలు
అన్నీ డబ్బు పరంగానే ఆలోచిస్తే అందరినీ విమర్శించే స్థితికి వస్తాము. ఎలా అంటే, బాగా డబ్బున్నతను డబ్బులేని వాళ్లను చూసి కష్టపడడం చేతకాని బద్దకస్థులు అనుకోవచ్చు. డబ్బులేనతను డబ్బున్నవాళ్లను చూసి వాళ్లకు డబ్బు పిచ్చి, దురాశ అనుకోవచ్చు. శిల్ప అనే అమ్మాయిది చాలా ఆస్తి ఉన్న కుటుంబం. ఆమె గురించి కూడా అలానే అనుకున్నారు, ఆమె ఇలా చెప్తుంది:
డబ్బు విషయంలో దేవుడు మంచి సలహాలు ఇచ్చాడు. అవి ఎప్పటికీ ఉపయోగపడతాయి
“మా నాన్న కట్టలు కట్టలు డబ్బులు సంపాదిస్తాడని అందరూ అనుకునేవాళ్లు. ‘నీకేమ్మా మీ నాన్నని అడిగితే చాలు ఇచ్చేస్తారు. లేదా మేము మీ అంత గొప్పవాళ్లం కాదు, మీకులా మంచిమంచి కార్లు మాకుండవు’ అని చాలాసార్లు అన్నారు. అలా మాట్లాడొద్దు, నాకు చాలా బాధేస్తుందని నా ఫ్రెండ్స్‌కు చెప్పాను. అందరూ నన్ను డబ్బున్న అమ్మాయి అని కాదుగానీ, అందరికీ సహాయం చేసే అమ్మాయి అనుకోవాలని నా కోరిక.”
దేవుడు ఏమి చెప్తున్నాడు
దేవుడు డబ్బు మంచిది కాదనడం లేదు, డబ్బున్నవాళ్లను గానీ ఎక్కువ డబ్బున్నవాళ్లను గానీ విమర్శించడం లేదు. ఎంత డబ్బు ఉంది అని కాదు, ఉన్న డబ్బును ఎలా చూస్తున్నాం, ఎంత డబ్బు సంపాదించాలనుకుంటున్నాం అనే విషయంలోనే జాగ్రత్తపడాలి. డబ్బు విషయంలో దేవుడు మంచి సలహాలు ఇచ్చాడు. అవి ఎప్పటికీ ఉపయోగపడతాయి. కొన్ని ఇప్పుడు గమనించండి.
దేవుని సలహా: “ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము.”—సామెతలు 23:4.
డబ్బు సంపాదన కోసం పరిగెత్తేవాళ్లకు “మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. శారీరక సమస్యలు అంటే గొంతు నొప్పి, నడుము నొప్పి, తలనొప్పి లాంటివి కూడా వస్తాయి. మద్యం ఎక్కువగా తాగడం, మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం కూడా జరగవచ్చు. ఆర్థికంగా విజయం సాధించాలని పరుగులు తీస్తే చివరికి మిగిలేది నిరాశ నిస్పృహే” అని ద నార్సిసిసమ్ ఎపిడెమిక్ అనే పుస్తకంలో ఉంది.
దేవుని సలహా: “ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి.”—సంతృప్తిగా ఉండేవాళ్లకు కూడా డబ్బు గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి చింత ఉంటుంది. కానీ వాళ్లు అతిగా కంగారు పడకుండా ఎంత అవసరమో అంతే ఆలోచిస్తారు. ఒకవేళ ఏదైనా ఆర్థిక నష్టం కలిగినా ఎక్కువ కృంగిపోరు. “దీనస్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును; ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండియుండుటకును ఆకలిగొనియుండుటకును, సమృద్ధి కలిగియుండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొనియున్నాను” అన్న అపొస్తలుడైన పౌలులా వాళ్లు ఉంటారు.—ఫిలిప్పీయులు 4:12.
దేవుని సలహా: “ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును.”—సామెతలు 11:28.
ఆర్థిక సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు తెచ్చి విడాకుల వరకు తీసుకెళ్తున్నాయని పరిశోధకులు అంటున్నారు. డబ్బు వల్ల చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. కొంతమంది డబ్బుకిచ్చే విలువ, వాళ్ల వివాహ జీవితానికి, ప్రాణానికి ఇవ్వరు. అయితే డబ్బుకు అతిగా విలువివ్వని వాళ్లు డబ్బునే నమ్ముకుని బ్రతకరు. యేసు అన్న ఈ మాటలను వాళ్లూ ఒప్పుకుంటారు: “జీవితానికి మూలాధారం అధిక సంపద కాదు.”—లూకా 12:15, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.
మీరు డబ్బుకు ఎంత విలువిస్తారు?
జాగ్రత్తగా, నిజాయితీగా మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటే డబ్బు విషయంలో మీకు మార్పులు అవసరమేమో తెలుస్తుంది. ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి.
-
త్వరగా, సులువుగా డబ్బు తెచ్చే స్కీములంటే నాకిష్టమా?
-
నా డబ్బుతో ఎవరికైనా సహాయం చేయాల్సివస్తే నాకు ఇబ్బందిగా ఉంటుందా?
-
డబ్బు గురించి, వాళ్లకున్న ఆస్తి గురించి ఎక్కువగా మాట్లాడే వాళ్లతో ఉండడం నాకు ఇష్టమా?
-
డబ్బు సంపాదించడానికి అబద్ధాలు చెప్తానా? నిజాయితీ లేని పనులు చేస్తుంటానా?
-
డబ్బు ఉంటేనే గౌరవం ఉన్నట్లు అనుకుంటానా?
-
నేనెప్పుడూ డబ్బు గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నానా?
-
డబ్బుకు నేనిచ్చే విలువ వల్ల నా ఆరోగ్యం, కుటుంబ జీవితం దెబ్బతింటున్నాయా?
మీకున్నవాటిని ఇతరులకు ఇస్తూ ఉదారతను అలవాటు చేసుకోండి
ఈ ప్రశ్నల్లో దేనికైనా మీ సమాధానం అవును అయితే ఆస్తిపాస్తుల మీద, డబ్బు మీద ఆశని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. డబ్బుకు, ఆస్తులకు ఎక్కువ విలువిచ్చే వాళ్లతో స్నేహం చేయకండి. ఆస్తిపాస్తుల కన్నా మంచి విలువలు కోరుకునే వాళ్లతో స్నేహం చేయండి.
మీ హృదయంలో డబ్బు మీద ఆశ ఎప్పుడూ రానివ్వకండి. డబ్బుకు ఏ స్థానమివ్వాలో అదే స్థానమివ్వండి. మీ స్నేహితులు, కుటుంబం, మానసిక-శారీరక ఆరోగ్యం తర్వాతే డబ్బు. అలా ఉంటే మీరు డబ్బుకు ఎంత విలువ ఇవ్వాలో అంతే విలువ ఇస్తున్నట్లు. ◼ (g15-E 09)
a ఈ ఆర్టికల్‌లో ఉన్నవి అసలు పేర్లు కావు.