సృష్టిలో అద్భుతాలు
మొసలి దవడ
జంతువులు దేన్నైనా కొరికినప్పుడు ఎంత బలంతో కొరుకుతాయో శాస్త్రజ్ఞులు కొలిచారు. ఇప్పుడున్న జంతువులన్నిటిలో మొసలి చాలా బలంగా కొరుకుతుందని కనుగొన్నారు. ఉదాహరణకు ఆస్ట్రేలియా దగ్గర ఉప్పునీటిలో ఉండే మొసల్లు సింహం, పులి కన్నా మూడు రెట్లు బలంగా కొరుకుతాయి. అయితే అంత బలంగా ఉండే మొసలి దవడకు మనిషి వేలు కన్నా స్పర్శ జ్ఞానం చాలా ఎక్కువ. మొసలి చర్మం చాలా మందంగా ఉన్నా, అదెలా సాధ్యం?
మొసలి దవడలో వేల జ్ఞానేంద్రియాలు ఉంటాయి. వాటి గురించి అధ్యయనం చేసిన డంకన్ లీచ్ ఇలా అంటున్నాడు: “ప్రతీ నాడి చివరలు పుర్రెలో ఉన్న ఒక రంధ్రం నుండి వస్తాయి.” దానివల్ల నాడులకు హాని జరగదు, దవడకు స్పర్శ జ్ఞానం కూడా వస్తుంది. దవడలో కొన్నిచోట్ల స్పర్శ జ్ఞానం ఎంత ఎక్కువ ఉంటుందంటే దాన్ని కొలవడం కూడా సాధ్యం కాదు. ఈ సామర్థ్యం వల్ల మొసలి నోటిలో ఉన్నది ఆహారమో, చెత్తో తెలుసుకుంటుంది. అంతేకాదు, తన పిల్లలను నోటిలో పెట్టుకుని వాటిని ఏ మాత్రం కొరకకుండా మరోచోటుకు తీసుకెళ్లడానికి ఈ స్పర్శ జ్ఞానమే సహాయం చేస్తుంది. మొసలి దవడకు బలంతో పాటు ఇంత ఎక్కువగా స్పర్శ జ్ఞానం ఉండడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది.
మీరేమంటారు? మొసలికి ఇంతబాగా పనిచేసే దవడ ఎలా వచ్చింది? సృష్టికర్త వల్ల కాదా? ◼ (g15-E 07)