కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“ఆత్మయందు తీవ్రతగలవారై” ఉండండి

“ఆత్మయందు తీవ్రతగలవారై” ఉండండి

“ఆత్మయందు తీవ్రతగలవారై” ఉండండి

“ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రతగలవారై ప్రభువును [‘యెహోవాను,’ NW] సేవించుడి.”—రోమా. 12:11.

1. ఇశ్రాయేలీయులు జంతుబలులను, ఇతర అర్పణలను ఎందుకు అర్పించారు?

తన చిత్తానికి లోబడుతూ తన సేవకులు మనస్ఫూర్తిగా ప్రేమతో అర్పించే బలులను యెహోవా ఇష్టపడతాడు. పూర్వకాలాల్లో ఆయన వివిధ జంతుబలులను, ఇతర అర్పణలను ఆమోదించాడు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఇశ్రాయేలీయులు వాటిని పాపక్షమాపణ పొందడానికి, కృతజ్ఞత తెలియజేయడానికి అర్పించేవారు. క్రైస్తవ సంఘం ఏర్పడిన తర్వాత యెహోవా అలా ఆచారబద్ధంగా వస్తువులను, జంతువులను బలులుగా అర్పించమని కోరలేదు. అయితే, అపొస్తలుడైన పౌలు రోమాలోని క్రైస్తవులకు రాసిన పత్రికలోని 12వ అధ్యాయంలో మనం ఇప్పటికీ బలులు అర్పించాల్సిన అవసరముందని వివరించాడు. ఆయన ఎందుకు అలా అన్నాడో చూద్దాం.

సజీవయాగం

2. క్రైస్తవులముగా మనం ఎలాంటి జీవితాలను గడుపుతాం? దాని కోసం మనం ఏమి చేయాలి?

2రోమీయులకు 12:1, 2 చదవండి. పౌలు తన పత్రిక ప్రారంభంలో, అభిషిక్త క్రైస్తవులు యూదా మతం నుండి వచ్చినా, అన్యమతాల నుండి వచ్చినా వారు తమ క్రియలనుబట్టి కాక, విశ్వాసాన్నిబట్టి దేవుని ముందు నీతిమంతులుగా తీర్చబడతారని స్పష్టం చేశాడు. (రోమా. 1:16; 3:20-24) స్వయంత్యాగపూరితమైన జీవితాన్ని జీవించడం ద్వారా క్రైస్తవులు తమ కృతజ్ఞతను చూపించాలని పౌలు 12వ అధ్యాయంలో వివరించాడు. అందువల్లే, మనం మనసు మార్చుకోవాలి. అయితే, వారసత్వంగా వచ్చిన అపరిపూర్ణత వల్ల మనం ‘పాపమరణాల నియమంలోకి’ వచ్చాం. (రోమా. 8:2) అందుకే మనం మన ఆలోచనా తీరులో ఎన్నో మార్పులు చేసుకోవడం ద్వారా రూపాంతరం పొంది ‘మన చిత్తవృత్తియందు నూతనపరచబడాలి.’ (ఎఫె. 4:23) దేవుని సహాయం, ఆయన ఆత్మ సహాయం ఉంటేనే మనం పూర్తిగా మారగలుగుతాం. అలా మారడానికి మనం గట్టి కృషి కూడ చేయాలి. అంటే దిగజారిన నైతిక విలువలు, అశ్లీల వినోదం, వక్ర ఆలోచనా విధానం ఉన్న ‘ఈ లోక మర్యాదను అనుసరించకుండా’ ఉండేందుకు చేయగలిగినదంతా చేయాలి.—ఎఫె. 2:1-3.

3. మనం క్రైస్తవ కార్యకలాపాల్లో ఎందుకు పాల్గొంటాం?

3 అంతేకాక, “ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి” తెలుసుకునేందుకు మనం మన ఆలోచనా సామర్థ్యాలను ఉపయోగించాలని పౌలు ప్రోత్సహిస్తున్నాడు. మనమెందుకు ప్రతీరోజు బైబిలును చదివి, దాన్ని ధ్యానిస్తాం? మనమెందుకు ప్రార్థిస్తాం? కూటాలకు హాజరౌతూ, ప్రకటనా పనిలో ఎందుకు పాల్గొంటాం? పెద్దలు ప్రోత్సహిస్తున్నందుకే అలా చేస్తున్నామా? నిజమే, పెద్దలు మనకు ఇచ్చే ఉపదేశానికి రుణపడివున్నాం. అయితే దేవుని పట్ల మనకున్న ప్రగాఢమైన ప్రేమను చూపించేలా ఆయన ఆత్మ మనల్ని ప్రేరేపిస్తుంది కాబట్టి, మనం వాటన్నిటినీ చేస్తాం. అంతేకాక, అలాంటి కార్యకలాపాల్లో పాల్గొంటే దేవుడు ఇష్టపడతాడని మనం పరీక్షించి తెలుసుకున్నాం. (జెక. 4:6; ఎఫె. 5:10) నిజక్రైస్తవులముగా జీవించడం వల్ల మనం దేవుడు ఇష్టపడేవిధంగా జీవించగలుగుతాం అని తెలుసుకుని ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని సొంతం చేసుకుంటాం.

వేర్వేరు కృపావరాలు

4, 5. పెద్దలు తమ కృపావరాలను ఎలా ఉపయోగించాలి?

4రోమీయులకు 12:6-8, 11 చదవండి. “మన కనుగ్రహింపబడిన కృపచొప్పున వెవ్వేరు కృపావరములు కలిగినవారమై యున్నాము” అని పౌలు చెప్పాడు. ఆ కృపావరాల్లో కొన్నింటిని పౌలు ప్రస్తావించాడు. వాటిలో హెచ్చరించడం, పైవిచారణ చేయడం వంటివి ప్రాముఖ్యంగా పెద్దలకు సంబంధించినవి. వారు పైవిచారణా పనిని ‘జాగ్రత్తగా’ చేయాలని ఆయన ఉద్భోదించాడు.

5 పైవిచారణకర్తలు బోధకులుగా సేవచేస్తున్నప్పుడు, “పరిచర్య” చేస్తున్నప్పుడు కూడ అంతే జాగ్రత్తగా ఉండాలని పౌలు చెప్పాడు. పౌలు ఆ మాటలన్న సందర్భాన్ని చూస్తే “పరిచర్య” అనే మాట సంఘంలో లేదా “ఒక్క శరీరములో” నిర్వహించే సేవను సూచిస్తున్నట్లు అనిపిస్తోంది. (రోమా. 12:4, 5) ఆ పరిచర్య, అపొస్తలుల కార్యములు 6:4లో ప్రస్తావించబడిన పరిచర్యలాంటిదే. అక్కడ అపొస్తలులు, “మేము ప్రార్థనయందును వాక్యపరిచర్య యందును ఎడతెగక యుందుము” అని చెప్పారు. ఆ పరిచర్యలో ఏమి చేయాల్సివుంటుంది? పెద్దలు తమ కృపావరాలను సంఘాన్ని బలపర్చడానికి ఉపయోగిస్తారు. వారు సంఘానికి దేవుని వాక్యం నుండి నిర్దేశాన్ని, ఉపదేశాన్ని జాగ్రత్తగా ఇచ్చినప్పుడు ఈ “పరిచర్య” చేస్తున్నామని చూపిస్తారు. ప్రార్థనాపూర్వకంగా బైబిలును అధ్యయనం చేయడం ద్వారా, పరిశోధన చేయడం ద్వారా, బోధించడం ద్వారా, కాపరి పనిచేయడం ద్వారా వారలా చేయవచ్చు. పైవిచారణకర్తలు తమ కృపావరాలను జాగ్రత్తగా ఉపయోగిస్తూ, ‘సంతోషంగా’ మందను చూసుకోవాలి.—రోమా. 12:6-8; 1 పేతు. 5:1-3.

6. ఈ ఆర్టికల్‌ ముఖ్యవచనం అయిన రోమీయులకు 12:11లో ఇవ్వబడిన ఉపదేశాన్ని మనం ఎలా అనుసరించవచ్చు?

6 అంతేకాక, పౌలు, ‘ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రతగలవారై యెహోవాను సేవించుడి’ అని కూడ అన్నాడు. పరిచర్యలో మన ఉత్సాహం తగ్గిపోయినట్లు మనం గుర్తిస్తే, మనం అధ్యయన అలవాట్లలో మార్పులో చేసుకొని, మరింత తీవ్రంగా, మరింత తరచుగా యెహోవా ఆత్మ కోసం ప్రార్థించాలి. అలా ప్రార్థించడం వల్ల నులివెచ్చని స్వభావాన్ని మార్చుకొని నూతనోత్సాహంతో పరిచర్యలో పాల్గొనగలుగుతాం. (లూకా 11:9, 13; ప్రక. 2:4; 3:14, 15, 19) తొలి క్రైస్తవులు “దేవుని గొప్పకార్యముల” గురించి మాట్లాడేలా పరిశుద్ధాత్మ వారిలో బలాన్ని నింపింది. (అపొ. 2:4, 11) అదే విధంగా, పరిచర్యలో ఉత్సాహంగా పాల్గొనేలా, ‘ఆత్మయందు తీవ్రతగలవారై’ ఉండేలా అది మనల్ని ప్రేరేపించగలదు.

వినయం, అణకువ

7. మనం వినయంతో, అణకువతో ఎందుకు సేవచేయాలి?

7రోమీయులకు 12:3, 16 చదవండి. దేవుని ‘కృపవల్లే’ మనకు వరాలు అనుగ్రహించబడ్డాయి. పౌలు మరో చోట, “మా సామర్థ్యము దేవునివలననే కలిగియున్నది” అని అన్నాడు. (2 కొరిం. 3:5) కాబట్టి, మనం గొప్పలకు పోకూడదు. పరిచర్యలో మనం సాధించే ఫలితాలు దేవుని ఆశీర్వాదాన్నిబట్టే కానీ మన సొంత సామర్థ్యాన్నిబట్టి కాదు అని వినయంతో గుర్తించాలి. (1 కొరిం. 3:6, 7) అందుకే పౌలు ఇలా చెప్పాడు: ‘తన్ను తాను ఎంచుకొనతగిన దానికంటె ఎక్కువగా ఎంచుకొనవద్దని మీలోనున్న ప్రతి వానికీ చెప్పుచున్నాను.’ నిజమే, మనకు ఆత్మగౌరవం ఉండాలి, మనం పరిచర్యలో ఆనందాన్ని, సంతృప్తిని పొందాలి. అయితే, మనకు అణకువ ఉంటే లేదా మన పరిమితులేంటో మనకు తెలిస్తే వితండవాదం చేయము. బదులుగా, ‘స్వస్థబుద్ధిగలవారముగా’ ఆలోచిస్తాం.

8. ‘మనకు మనమే బుద్ధిమంతులమని’ అనుకోకుండా ఉండాలంటే ఏమి చేయాలి?

8 ‘వృద్ధి కలుగజేయువాడు దేవుడే’ కాబట్టి, మనం సాధించినవాటి గురించి గొప్పలు చెప్పుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. (1 కొరిం. 3:7) దేవుడు సంఘంలో ప్రతీ ఒక్కరికీ కొంత ‘పరిమాణంలో విశ్వాసాన్ని’ ఇచ్చాడని పౌలు చెప్పాడు. ఇతరులకన్నా మనం గొప్పవాళ్లం అని అనుకునే బదులు దేవుడు ఇచ్చిన విశ్వాసాన్నిబట్టి వారు సాధిస్తున్నవాటిని మనం గుర్తించాలి. “ఒకనితో నొకడు మనస్సుకలిసి యుండుడి” అని కూడ పౌలు చెప్పాడు. అంటే మన విషయంలో మనం ఎలా భావిస్తామో ఇతరుల విషయంలోనూ అలాగే భావించమని పౌలు చెప్పాడు. అపొస్తలుడైన పౌలు తాను రాసిన మరో పత్రికలో, “కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుడి” అని చెప్పాడు. (ఫిలి. 2:3) మన సహోదర సహోదరీల్లో ప్రతీ ఒక్కరూ మనకన్నా ఏదో విధంగా గొప్పవారని గుర్తించాలంటే నిజమైన వినయాన్ని చూపించాలి, గట్టి కృషి చేయాలి. వినయం ఉంటే ‘మనకు మనమే బుద్ధిమంతులమని’ అనుకోం. విశేష బాధ్యతల వల్ల మనలో కొందరమే అందరి దృష్టిలో పడినప్పటికీ, “తగ్గువాటిని” అంటే ఇతరులు గమనించని చిన్న పనులను చేయడంలో అందరమూ ఎంతో ఆనందాన్ని పొందుతాం.—1 పేతు. 5:5.

సంఘ ఐక్యత

9. పౌలు ఆత్మాభిషిక్త క్రైస్తవులను శరీరంలోని అవయవాలతో ఎందుకు పోల్చాడు?

9రోమీయులకు 12:4, 5, 9, 10 చదవండి. పౌలు అభిషిక్త క్రైస్తవులను శరీరంలోని వివిధ అవయవాలతో పోల్చాడు. వారు క్రీస్తు శిరస్సత్వంలో ఐక్యంగా సేవచేస్తున్నారని ఆయన చెప్పాడు. (కొలొ. 1:18) శరీరంలో ఎన్నో అవయవాలు ఉంటాయనీ, అవి వివిధ పనులు చేస్తుంటాయనీ ఆ అవయవాల్లాగే వారు ‘అనేకులైనా, క్రీస్తులో ఒక్క శరీరంగా ఉన్నారనీ’ పౌలు ఆత్మాభిషిక్త క్రైస్తవులకు గుర్తుచేశాడు. అదేవిధంగా, పౌలు ఎఫెసులోని అభిషిక్త క్రైస్తవులను ఇలా ప్రోత్సహించాడు: “ప్రేమ గలిగి . . . క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము. ఆయన శిరస్సయియున్నాడు, ఆయననుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి, తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలువలన గలిగిన బలముచేత అతుకబడి, ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసికొనుచున్నది.”—ఎఫె. 4:15, 16.

10. ‘వేరేగొర్రెలు’ ఎవరి అధికారాన్ని గుర్తించాలి?

10 ‘వేరేగొర్రెలు’ క్రీస్తు శరీరంలో భాగం కాకపోయినా, వారు పౌలు చెప్పిన ఆ పోలిక నుండి ఎంతో నేర్చుకోవచ్చు. (యోహా. 10:16) యెహోవా “సమస్తమును ఆయన [క్రీస్తు] పాదములక్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను” అని పౌలు చెప్పాడు. (ఎఫె. 1:22) యెహోవా ‘సమస్తంపై’ తన కుమారుణ్ణి శిరస్సుగా నియమించాడు. ఆ సమస్తంలో వేరేగొర్రెల్లోని వారు కూడ ఉన్నారు. క్రీస్తు ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునికి’ అప్పగించిన “యావదాస్తి”లో వారు కూడ ఉన్నారు. (మత్త. 24:45-47) అందుకే, భూమ్మీద నిరంతరం జీవించే అవకాశమున్నవారు క్రీస్తును తమ శిరస్సుగా గుర్తిస్తారు. వారు నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతికి, దాని పరిపాలక సభకు, సంఘంలో పైవిచారణకర్తలుగా నియమించబడినవారికి లోబడతారు. (హెబ్రీ. 13:7, 17) అలా చేయడం సంఘ ఐక్యతకు దోహదపడుతుంది.

11. మనం దేన్నిబట్టి ఐక్యంగా ఉంటాం? పౌలు ఈ విషయంలో ఇంకా ఏమని చెప్పాడు?

11 “పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ” బట్టే మన మధ్య అలాంటి ఐక్యత ఉంటుంది. (కొలొ. 3:14) పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆ విషయాన్ని నొక్కిచెప్పాడు. ఆయన ఆ అధ్యాయంలో మన ప్రేమ “నిష్కపటమైనదై” ఉండాలని, “సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై” ఉండాలని వివరించాడు. అలాంటి ప్రేమ చూపిస్తే ఒకరిపట్ల ఒకరికి గౌరవం ఉంటుంది. అంతేకాక, ‘ఘనతవిషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకోవాలి’ అని పౌలు చెప్పాడు. అయితే, ప్రేమకూ, సెంటిమెంటుకూ తేడావుంది. సంఘాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మనం చేయగలిగినదంతా చేయాలి. ప్రేమ గురించి ఉపదేశిస్తూ, “చెడ్డదాని నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని యుండుడి” అని కూడా పౌలు అన్నాడు.

ఆతిథ్యాన్ని ఇవ్వండి

12. ఆతిథ్యం చూపించే విషయంలో మాసిదోనియలోని క్రైస్తవుల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

12రోమీయులకు 12:13 చదవండి. సహోదరుల పట్ల మనకు ప్రేమవుంటే మన సామర్థ్యాన్నిబట్టి ‘పరిశుద్ధుల అవసరంలో పాలుపంచుకుంటాం.’ మనం పేదవారమైనా, ఉన్నదాంట్లో మనం ఇతరులకు పంచవచ్చు. మాసిదోనియ క్రైస్తవుల గురించి పౌలు ఇలా రాశాడు: “వారు బహు శ్రమవలన పరీక్షింపబడగా, అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను, [యూదయలోని] పరిశుద్ధులకొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములోను, మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యముకంటె ఎక్కువగాను తమంతట తామే యిచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను.” (2 కొరిం. 8:2-4) మాసిదోనియలోని క్రైస్తవులు ఎంతో పేదవారైనా, ఉదారంగా ఇచ్చారు. అవసరంలోవున్న సహోదరులతో తమకు ఉన్నదాన్ని పంచుకోవడం గొప్ప అవకాశంగా భావించారు.

13. ‘శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వండి’ అనే పదబంధానికున్న అర్థమేమిటి?

13 ‘శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వండి’ అనే పదబంధం చొరవతీసుకోవడం అనే అర్థంవచ్చే గ్రీకు మాట నుండి వచ్చింది. ద న్యూ జెరూసలేం బైబిల్‌ ఆ మాటను, “ఆతిథ్యం ఇచ్చే అవకాశాల కోసం చూడండి” అని అనువదించింది. కొన్నిసార్లు ఎవరినైనా భోజనానికి పిలిచి ఆతిథ్యాన్ని ఇవ్వవచ్చు. ప్రేమతో అలా ఆతిథ్యమివ్వడం అభినందించదగిన విషయమే. అయితే మనం చొరవ తీసుకుంటే ఆతిథ్యమివ్వడానికి ఇంకా ఎన్నో మార్గాలు ఉన్నాయని గుర్తిస్తాం. మన ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు బాగాలేనందువల్ల ఇతరులను భోజనానికి పిలవలేకపోవచ్చు. అలాంటప్పుడు ఓ కప్పు టీ, కాఫీ లాంటివి ఇవ్వడం ద్వారా కూడ ఆతిథ్యం చూపించవచ్చు.

14. (ఎ) “ఆతిథ్యం” అని అనువదించబడిన గ్రీకు పదంలో ఏ మూల పదాలు ఉన్నాయి? (బి) వేరే ప్రాంతం నుండి వచ్చినవారి పట్ల మనం పరిచర్యలో ఎలా శ్రద్ధ చూపించవచ్చు?

14 ఆతిథ్యానికీ మన ఆలోచనా తీరుకూ మధ్య సంబంధముంది. “ఆతిథ్యం” అని అనువదించిబడిన గ్రీకు పదంలో రెండు మూల పదాలున్నాయి. ఆ మూలపదాలకు “ప్రేమ,” “అపరిచితుడు” అనే అర్థాలున్నాయి. అపరిచితుల విషయంలో, వేరే ప్రాంతాల నుండి వచ్చినవారి విషయంలో మీ వైఖరి ఏమిటి? వేరే ప్రాంతం నుండి వచ్చినవారికి సువార్త ప్రకటించేందుకు కొత్త భాష నేర్చుకోవడానికి కృషిచేయడం ద్వారా కూడ మనం ఆతిథ్యాన్ని చూపించవచ్చు. మనలో చాలామందిమి మరో భాషను నేర్చుకునే స్థితిలో లేమనుకోండి. అయినా, అన్ని దేశాల ప్రజలకు సువార్త అనే చిన్న పుస్తకాన్ని మనమందరం సద్వినియోగం చేసుకుంటే వేరే భాష మాట్లాడేవారికి సహాయం చేయగలుగుతాం. దానిలో బైబిలు సందేశం ఎన్నో భాషల్లో ఉంది. మీరు పరిచర్యలో దాన్ని ఉపయోగించి మంచి ఫలితాలు సాధించారా?

తదనుభూతి

15. రోమీయులకు 12:15, 16ఎ వచనాల్లో ఉన్న విషయాన్ని యేసు ఎలా చేసి చూపించాడు?

15రోమీయులకు 12:15, 16ఎ చదవండి. పౌలు అక్కడ తదనుభూతి చూపించాలని క్రైస్తవులకు ఉపదేశించాడు. మనం ఇతరుల భావాలను అర్థంచేసుకొని వారి సుఖదుఃఖాల్లో కూడ పాలుపంచుకోవాలి. మనం ఆత్మలో తీవ్రతగలవారమైతే వారి ఆనందంలో పాలుపంచుకుంటున్నట్లు లేదా బాధలో ఉన్నప్పుడు కనికరాన్ని చూపిస్తున్నట్లు స్పష్టమౌతుంది. 70మంది శిష్యులు సువార్త ప్రకటనా పని నుండి సంతోషంతో తిరిగివచ్చి తాము పొందిన మంచి ఫలితాల గురించి చెప్పినప్పుడు యేసు ‘పరిశుద్ధాత్మలో ఎంతో ఆనందించాడు.’ (లూకా 10:17-21) వారి ఆనందంలో ఆయన పాలుపంచుకున్నాడు. అంతేకాక, తన స్నేహితుడైన లాజరు మరణించినప్పుడు ఆయన ‘ఏడుస్తున్నవారితో ఏడ్చాడు.’—యోహా. 11:32-35.

16. మనం తోటి సహోదర సహోదరీల సుఖదుఃఖాల్లో ఎలా పాలుపంచుకోవచ్చు? ప్రాముఖ్యంగా ఎవరు అలా చేయాలి?

16 తదనుభూతి చూపించే విషయంలో యేసు చేసినట్లే చేయాలనుకుంటాం. తోటి క్రైస్తవుడు ఆనందిస్తే ఆయన లేదా ఆమె ఆనందంలో పాలుపంచుకోవాలనుకుంటాం. అలాగే, వారి దుఃఖంలో, బాధలో కూడ పాలుపంచుకోవాలి. మనోవేదనను అనుభవిస్తున్న తోటి సహోదర సహోదరీలు చెప్పేది మనం సమయం తీసుకొని సానుభూతితో వింటే వారికి ఎంతో ఉపశమనం తీసుకురాగలుగుతాం. కొన్నిసార్లు మన హృదయం ఎంతగా ద్రవించిపోవచ్చంటే కన్నీళ్లతో వారి బాధలో పాలుపంచుకుంటాం. (1 పేతు. 1:22) ప్రాముఖ్యంగా పెద్దలు తదనుభూతి చూపించే విషయంలో పౌలు ఇచ్చిన ఉపదేశాన్ని పాటించాలి.

17. రోమీయులు 12వ అధ్యాయంలో మనం ఇప్పటివరకు ఏమి నేర్చుకున్నాం? తర్వాతి ఆర్టికల్‌లో ఏమి తెలుసుకుంటాం?

17 మనం ఇప్పటివరకు రోమీయులు 12వ అధ్యాయంలోని కొన్ని వచనాలను పరిశీలించాం. మన జీవితంలోనే కాక, మన సహోదరులతో వ్యవహరిస్తున్నప్పుడు కూడ ఎలా ప్రవర్తించాలో మనం ఆ వచనాల్లో చూశాం. తర్వాతి ఆర్టికల్‌లో ఈ అధ్యాయంలోని మిగతా వచనాలను పరిశీలిస్తాం. వ్యతిరేకులు, హింసించేవారితోపాటు బయటివారి విషయంలో మనకు ఎలాంటి అభిప్రాయం ఉండాలి, వారితో ఎలా వ్యవహరించాలి వంటి వాటిని దానిలో తెలుసుకుంటాం.

పునఃసమీక్ష

• మనం ‘ఆత్మయందు తీవ్రతగలవారమై’ ఉన్నామని ఎలా చూపిస్తాం?

• మనం వినయంతో, అణకువతో దేవునికి ఎందుకు సేవచేయాలి?

• తోటి విశ్వాసుల పట్ల తదనుభూతిని, కనికరాన్ని ఏయే విధాలుగా చూపించవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[4వ పేజీలోని చిత్రాలు]

ఈ క్రైస్తవ కార్యకలాపాల్లో మనం ఎందుకు పాల్గొంటాం?

[6వ పేజీలోని చిత్రం]

వేరే భాష మాట్లాడేవారు రాజ్యం గురించి తెలుసుకునేలా

మనలో ప్రతీ ఒక్కరం ఎలా సహాయం చేయవచ్చు?