పాఠకుల ప్రశ్న
ఇశ్రాయేలీయులు నేరస్థులకు మరణశిక్ష విధించడానికి మ్రానుమీద వేలాడదీసేవాళ్లా?
పూర్వకాలంలో ఎన్నో దేశాల్లో, కొన్నిరకాల నేరాలకు పాల్పడినవాళ్లకు మరణశిక్ష విధించడానికి వాళ్లను మ్రాను మీద లేదా స్తంభం మీద వేలాడదీసేవాళ్లు. రోమీయులు అలాంటి నేరస్థులను మ్రానుమీద తాళ్లతో కట్టేవాళ్లు లేదా మేకులు కొట్టి వేలాడదీసేవాళ్లు. భరించలేని నొప్పికి, దాహానికి, ఆకలికి, గాలీదూళీ వంటి వాటన్నిటికీ బలై ఆ వ్యక్తి చివరకు ప్రాణాలు కోల్పోయేవాడు. నీచులైన నేరస్థులకు మాత్రమే విధించే ఈ శిక్షను రోమీయులు చాలా అవమానకరమైనదిగా పరిగణించేవాళ్లు.
ఈ విషయంలో ప్రాచీన ఇశ్రాయేలీయుల సంగతేంటి? ఇశ్రాయేలీయులు నేరస్థులకు మరణశిక్ష విధించడానికి మ్రానుమీద వేలాడదీసేవాళ్లా? మోషే ధర్మశాస్త్రం ఇలా చెప్పింది: “మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రానుమీద వ్రేలాడదీసినయెడల అతని శవము రాత్రివేళ ఆ మ్రానుమీద నిలువకూడదు . . . ఆ దినమున వానిని పాతిపెట్టవలెను.” (ద్వితీ. 21:22, 23) అంటే, హెబ్రీ లేఖనాలు రాయబడిన కాలాల్లో, మరణశిక్షకు పాత్రులైన వాళ్లను మొదట చంపి, ఆ తర్వాత మ్రానుమీద లేదా చెట్టుమీద వేలాడదీసేవాళ్లని స్పష్టమౌతోంది.
ఈ విషయం గురించి లేవీయకాండము 20:2లో ఇలా ఉంది: “ఇశ్రాయేలీయులలోనేగాని ఇశ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలోనేగాని యొకడు ఏమాత్రమును తన సంతానమును మోలెకుకు ఇచ్చినయెడల వానికి మరణశిక్ష విధింపవలెను; మీ దేశప్రజలు రాళ్లతో వాని కొట్టవలెను.” “పురుషునియందేమి స్త్రీయందేమి కర్ణపిశాచియైనను సోదెయైనను ఉండినయెడల వారికి” కూడా “మరణశిక్ష విధింపవలెను.” ఎలా? “రాళ్లతో కొట్టి.”—లేవీ. 20:27.
ద్వితీయోపదేశకాండము 22:23, 24లో ఇలా రాసివుంది: “కన్యకయైన చిన్నది ప్రధానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలిసికొని ఆమెతో శయనించినయెడల ఆ ఊరి గవినియొద్దకు వారిద్దరిని తీసికొనివచ్చి, ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకయున్నందున ఆమెను, తన పొరుగువాని భార్యను అవమానపరచినందున ఆ మనుష్యుని, రాళ్లతో చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును మీలో నుండి పరిహరించుదురు.” కాబట్టి, తొలి ఇశ్రాయేలీయుల్లో ఘోరాతిఘోరమైన నేరం చేసినవారికి విధించే ప్రధాన శిక్ష రాళ్లతో కొట్టి చంపడమే. a
హెబ్రీ లేఖనాలు రాయబడిన కాలాల్లో, మరణశిక్షకు పాత్రులైన వాళ్లను మొదట చంపి, ఆ తర్వాత మ్రానుమీద లేదా చెట్టుమీద వేలాడదీసేవాళ్లని స్పష్టమౌతోంది
“వ్రేలాడదీయబడినవాడు దేవునికి శాపగ్రస్తుడు” అని ద్వితీయోపదేశకాండము 21:23 చెబుతోంది. “దేవునికి శాపగ్రస్తుడు” అయిన దుష్టుని శవాన్ని మ్రాను మీద లేదా చెట్టు మీద బహిరంగంగా వేలాడదీసినప్పుడు ఇశ్రాయేలీయులకు అదో హెచ్చరికగా ఉండేది.
a ధర్మశాస్త్రం ప్రకారం ఓ నేరస్థుణ్ణి ముందుగా చంపి, ఆ తర్వాత అతని శవాన్ని మ్రానుకు వేలాడదీసేవాళ్లని చాలామంది విద్వాంసులు ఒప్పుకుంటారు. ఏదేమైనా మొదటి శతాబ్దం నాటికి, యూదులు కొంతమంది నేరస్థుల్ని సజీవంగానే మ్రానుకు వేలాడదీసేవాళ్లని, నేరస్థులు మ్రాను మీదే చనిపోయేవాళ్లని చెప్పడానికి కూడా రుజువులున్నాయి.