కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ భాగస్వామిని కోల్పోయిన బాధను తట్టుకోవడం ఎలా?

మీ భాగస్వామిని కోల్పోయిన బాధను తట్టుకోవడం ఎలా?

ఓ భర్త, “తననువలె తన భార్యను ప్రేమింపవలెను” అని బైబిలు స్పష్టంగా చెబుతుంది. అలాగే భార్య కూడా “తన భర్తయందు భయము కలిగియుండునట్లు చూచుకొనవలెను.” వాళ్లిద్దరూ ‘ఏక శరీరముగా’ తమతమ పాత్రలను పోషించాలి. (ఎఫె. 5:33; ఆది. 2:23, 24) కాలం గడుస్తున్నకొద్దీ దంపతుల మధ్య ఉన్న అనుబంధం, ప్రేమ అంతకంతకూ ఎక్కువవుతాయి. పక్కపక్కన పెరిగే రెండు చెట్ల వేళ్లు పెనవేసుకున్నట్లే, అన్యోన్య దంపతుల భావాలు సమయం గడిచేకొద్దీ ప్రగాఢమై, సన్నిహితంగా పెనపేసుకుపోతాయి.

అయితే భార్యాభర్తల్లో ఒకరు చనిపోతే అప్పుడేంటి? వాళ్లిద్దరి మధ్య ఉన్న ఆ విడదీయరాని బంధం తెగిపోతుంది. ఇక బ్రతికివున్న భర్తకు లేదా భార్యకు మిగిలేది గుండెకోత, ఒంటరితనమే. కొన్నిసార్లయితే కోపం, తప్పుచేశాననే భావాలు కూడా వెంటాడతాయి. డానెల్లా అనే ఆవిడ తన 58 ఏళ్ల దాంపత్య జీవితంలో, భాగస్వాములను పోగొట్టుకున్న ఎంతోమందిని చూసింది. a అయితే తన భర్త చనిపోయిన తర్వాత ఆమె ఇలా అంది: ‘భాగస్వామి చనిపోతే కలిగే బాధేమిటో నాకు ఇదివరకు అర్థమయ్యేదికాదు. అది అనుభవిస్తే తప్ప తెలియదు.’

అంతులేని వ్యథ

భర్త లేదా భార్య చనిపోయినప్పుడు కలిగే ఒత్తిడి మిగతా ఒత్తిళ్ల కన్నా ఎంతో తీవ్రంగా ఉంటుందని కొంతమంది పరిశోధకులు అంటారు. అలాంటి దుఃఖంలో ఉన్న చాలామంది ఆ మాటలను ఒప్పుకుంటారు. మిల్లీ అనే మహిళ భర్త చాలా ఏళ్ల క్రితం చనిపోయాడు. భర్తలేని తన జీవితం గురించి వివరిస్తూ ఆవిడిలా అంది: “ఒక్కసారిగా నా కాళ్లుచేతులు పడిపోయినట్లు అనిపించింది.” 25 ఏళ్లు కాపురం చేసిన తన భర్త చనిపోయినప్పుడు అనుభవించిన మానసిక వ్యథను గుర్తుతెచ్చుకుంటూ ఆమె ఆ మాటలు చెప్పింది.

చనిపోయిన తమ భర్తల గురించి ఏళ్ల తరబడి బాధపడేవాళ్లు మరీ ఎక్కువగా దుఃఖిస్తున్నారని సూజన్‌ అనుకునేది. ఆ తర్వాత, 38 ఏళ్లు కాపురం చేసిన ఆమె భర్త చనిపోయాడు. ఆయన చనిపోయి 20 ఏళ్లు అవుతున్నా, “నేను ప్రతీరోజూ ఆయన్ని తలుచుకుంటాను” అని ఆమె అంటోంది. ఆయన లేడనే విషయం గుర్తొచ్చినప్పుడల్లా ఆమె కన్నీళ్లు ఆగవు.

భాగస్వామిని కోల్పోయినప్పుడు కలిగే బాధ తీవ్రంగా ఉంటుందని, చాలాకాలం ఉంటుందని బైబిలు ఒప్పుకుంటుంది. శారా చనిపోయినప్పుడు ఆమె భర్తయైన అబ్రాహాము, “శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి యేడ్చుటకును వచ్చెను.” (ఆది. 23:1, 2) పునరుత్థానంపై నమ్మకం ఉన్నా, తన ప్రియ భార్య చనిపోయినప్పుడు అబ్రాహాము తీవ్రంగా దుఃఖించాడు. (హెబ్రీ. 11:17-19) యాకోబు విషయానికొస్తే తన ప్రియమైన భార్య రాహేలు మరణించిన చాలా కాలానికిగానీ ఆమెను మర్చిపోలేకపోయాడు. ఆయన తన కొడుకులతో తన భార్య గురించి ఇష్టంగా మాట్లాడాడు.​—ఆది. 44:27; 48:7.

బైబిల్లోని ఆ ఉదాహరణల నుండి మనం ఏ పాఠం నేర్చుకోవాలి? తమ భాగస్వామి చనిపోయినప్పుడు భర్త లేదా భార్య చాలాకాలం పాటు బాధపడతారు. అయితే అలాంటి వాళ్ల కన్నీళ్లను, బాధను మనం బలహీనతలుగా చూడకూడదు గానీ, తమ సర్వస్వాన్ని కోల్పోయినట్లు భావించి వాళ్లు పడే ఆ బాధ సహజమేనని అర్థం చేసుకోవాలి. వాళ్లకు మన సానుభూతి, సహాయం చాలాకాలం వరకు అవసరం కావచ్చు.

ఏ రోజు గురించి ఆ రోజు

భర్తను లేదా భార్యను పోగొట్టుకున్నవాళ్ల జీవితం, పెళ్లికాక ముందున్న ఒంటరి జీవితంలా ఉండదు. ఎన్నో సంవత్సరాలుగా కాపురం చేస్తున్న భర్తకు తన భార్య బాధగా, చిరాకుగా ఉన్నప్పుడు ఆమెను ఎలా ఓదార్చాలో, ఆమె దిగులును ఎలా పోగొట్టాలో తెలుసు. ఆయన చనిపోతే, ఆమెను ప్రేమించే, ఆదరించే ఆ దిక్కు లేకుండా పోతుంది. అలాగే తన భర్త బాగోగులు ఎలా చూసుకోవాలో, ఆయనను ఎలా సంతోషపెట్టాలో ఏళ్లు గడుస్తుండగా భార్య నేర్చుకుంటుంది. కోమలమైన ఆమె చేతి స్పర్శకు, ఊరటనిచ్చే మాటలకు, ఆయనకేవి ఇష్టమో, ఏవి అవసరమో వంటి విషయాల్లో ఆమె చూపించే శ్రద్ధకు ఏవీ సాటిరావు. అలాంటి భార్య చనిపోయినప్పుడు భర్తకు జీవితం శూన్యంగా అనిపిస్తుంది. దాంతో తమ భాగస్వామిని కోల్పోయిన కొంతమందికి భవిష్యత్తు అంధకారంగా, భయంభయంగా అనిపిస్తుంది. అలాంటివాళ్లు ధైర్యంగా, మనశ్శాంతిగా ఉండేందుకు ఏ బైబిలు సూత్రం సహాయం చేయవచ్చు?

మీ భాగస్వామిని కోల్పోయిన బాధను ఏ రోజుకు ఆ రోజు సహించడానికి దేవుడు మీకు సహాయం చేస్తాడు

“రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును.” (మత్త. 6:34) యేసు వస్తుపరమైన అవసరాల గురించి ఆ మాటలు చెప్పినా, అవి తమ భాగస్వామిని కోల్పోయిన చాలామందికి బాధను దిగమింగుకునేలా సహాయం చేశాయి. తన భార్యను పోగొట్టుకున్న కొన్ని నెలల తర్వాత ఛార్లెస్‌ అనే ఆయన ఇలా రాశాడు: “నా మోనీక్‌ను కోల్పోయాననే బాధ నన్నింకా వేధిస్తూనే ఉంది, కొన్నిసార్లైతే అది మరీ ఎక్కువగా ఉంటుంది. అయితే, అలాంటి బాధ సహజమేనని, సమయం గడిచేకొద్దీ అది మెల్లమెల్లగా తగ్గుతుందని నేను అర్థంచేసుకున్నాను.”

అయితే, ‘గడిచే ఆ సమయాన్ని’ ఛార్లెస్‌ ఓపిగ్గా భరించాల్సి వచ్చింది. మరి ఆయనేమి చేశాడు? ఆయనిలా అన్నాడు: “యెహోవా సహాయంతో నేను ఏ రోజు బాధ గురించి ఆ రోజు ఆలోచించడం నేర్చుకున్నాను.” ఆయన శోక సముద్రంలో మునిగిపోలేదు. ఆయన బాధ రాత్రికి రాత్రే మటుమాయమైపోలేదు, అలాగని చెప్పి ఆయన దుఃఖంలో కూరుకుపోలేదు. ఒకవేళ మీరు భాగస్వామిని కోల్పోతే ఏ రోజు బాధ గురించి ఆ రోజు ఆలోచించండి. రేపటిరోజు ఎలాంటి ఆనందాన్ని, ఊరటను తీసుకొస్తుందో మీకు తెలియదు.

మనుషులు చనిపోవడం యెహోవా ఆది సంకల్పంలో భాగం కాదు. బదులుగా అది ‘అపవాది క్రియలలో’ ఒక భాగం. (1 యోహా. 3:8; రోమా. 6:23) చాలామందిని తన చెప్పుచేతల్లో ఉంచుకోవడానికీ, వాళ్లకు ఏ నిరీక్షణా లేకుండా చేయడానికీ సాతాను మరణాన్ని, దానివల్ల వచ్చే భయాన్ని ఉపయోగిస్తున్నాడు. (హెబ్రీ. 2:14, 15) తమ జీవితంలో ఎప్పటికీ, చివరికి దేవుని నూతనలోకంలో కూడా నిజమైన సంతోషాన్ని, సంతృప్తిని పొందలేమని బాధపడుతూ ప్రజలు నైరాశ్యంలో కూరుకుంటే సాతాను ఎంతో సంతోషిస్తాడు. అలా, భాగస్వామిని కోల్పోయినప్పుడు ప్రజలుపడే వేదన ఆదాము పాపం వల్ల, సాతాను తంత్రాల వల్ల వచ్చింది. (రోమా. 5:12) సాతాను నిర్దాక్షిణ్యంగా వాడే ఆయుధమైన మరణాన్ని యెహోవా నామరూపాల్లేకుండా చేసి అతను కలిగించిన నష్టాన్ని భర్తీ చేస్తాడు. సాతాను ఉపయోగించే భయమనే బంధకాల నుండి అప్పుడు బయటపడే వాళ్లలో తమ భాగస్వాములను కోల్పోయిన మీరూ, మీలాంటి ఎంతోమంది ఉంటారు.

ఈ భూమ్మీద పునరుత్థానం అయ్యే వాళ్ల విషయానికొస్తే, మానవ సంబంధాల్లో తప్పకుండా ఎన్నో మార్పులు వస్తాయి. తల్లిదండ్రులు, తాతముత్తాతలు మళ్లీ బతికి తమ పిల్లలతో, మనవళ్లతో పాటు పరిపూర్ణతకు ఎదగడాన్ని ఊహించండి. వృద్ధాప్యపు ఛాయలు మటుమాయమైపోతాయి. యౌవనులు తమ తాతముత్తాతలను ఇప్పుడు చూస్తున్న విధానానికి, అప్పుడు చూసే విధానానికి చాలా తేడా ఉంటుంది. ఇలాంటి మార్పులవల్ల కుటుంబ జీవనం ఎంతో మెరుగౌతుంది.

అయితే పునరుత్థానమయ్యే వాళ్ల గురించి మనకు ఎన్నో ప్రశ్నలు తలెత్తవచ్చు. ఉదాహరణకు, ఒకరి కంటే ఎక్కువ భాగస్వాములను మరణంలో పోగొట్టుకున్నవాళ్ల సంగతేంటి? తన మొదటి భర్తను, తర్వాత రెండవ భర్తను అలా చివరికి ఏడుగురు భర్తలను మరణంలో కోల్పోయిన ఒక స్త్రీ గురించి సద్దూకయ్యులు ఓ ప్రశ్న వేశారు. (లూకా 20:27-33) పునరుత్థానం తర్వాత వాళ్ల మధ్య ఎలాంటి సంబంధం ఉంటుంది? మనకైతే తెలియదు, తెలియని అలాంటివాటి గురించి ఊహాగానాలు చేయాల్సిన లేదా చింతించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం చేయాల్సిన పని దేవుని మీద నమ్మకం ఉంచడమే. ఒక్క విషయం మాత్రం ఖచ్చితం, యెహోవా భవిష్యత్తులో చేయబోయే ప్రతీదీ చాలా శ్రేష్ఠంగా, ఎదురుచూసే విధంగా ఉంటుందే గానీ భయపడే విధంగా అస్సలు ఉండదు.

పునరుత్థాన నిరీక్షణ నిజమైన ఓదార్పునిస్తుంది

బైబిలు స్పష్టంగా చెబుతున్న బోధల్లో, చనిపోయిన వాళ్లు మళ్లీ బ్రతుకుతారనే బోధ ఒకటి. గతంలో పునరుత్థానమైన వాళ్లకు సంబంధించిన బైబిలు వృత్తాంతాలు, ‘సమాధులలో నున్నవారందరు [యేసు] శబ్దము విని బయటికి వచ్చెదరు’ అనే వాగ్దానం తప్పకుండా నెరవేరుతుందనే భరోసా ఇస్తాయి. (యోహా. 5:28, 29) అప్పుడు ప్రజలు తమవాళ్లను మళ్లీ సజీవంగా కలుసుకుని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అవుతారు. తిరిగి బతికినవాళ్లు పొందే సంతోషాన్ని మనం కనీసం ఊహించనైనా ఊహించలేము.

చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతికి వస్తుండగా, ముందెన్నడూ చూడని సంభ్రమాశ్చర్యంతో భూమి నిండిపోతుంది. చనిపోయిన వందలకోట్ల మంది పునరుత్థానమై తిరిగి మనతోపాటు జీవిస్తారు. (మార్కు 5:39-42; ప్రక. 20:13) భవిష్యత్తులో జరగనున్న ఆ అద్భుతం గురించి ధ్యానిస్తుంటే, తమ ప్రియమైన వాళ్లను మరణంలో కోల్పోయిన వాళ్లందరూ ఓదార్పు పొందుతారు.

చనిపోయిన వాళ్లందరూ తిరిగి లేచినప్పుడు ఇక బాధపడడానికి ఎవరికైనా ఏ కారణమైనా ఉంటుందా? ఏమాత్రం ఉండదని బైబిలు చెబుతుంది. “మరెన్నడును ఉండకుండ మరణమును [యెహోవా] మ్రింగివేయును” అని యెషయా 25:8 చెబుతుంది. మరణంతో పాటు, అది తీసుకొచ్చే బాధలను కూడా ఆయన పూర్తిగా తీసేస్తాడు, అందుకే ఆ వచనం ఇంకా ఇలా అంటోంది: “ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్పబిందువులను తుడిచివేయును.” మీ జీవిత భాగస్వామి మరణం వల్ల మీరిప్పుడు పడుతున్న బాధ పునరుత్థానం తర్వాత మీకు కనీసం గుర్తుకైనా రాదు.

నూతనలోకంలో యెహోవా చేయబోయే వాటిని ఏ మనిషి పూర్తిగా అర్థంచేసుకోలేడు. ఆయనిలా అంటున్నాడు: “ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి.” (యెష. 55:9) పునరుత్థానం జరుగుతుందని యేసు చెప్పిన మాటను నమ్మితే, మనం కూడా అబ్రాహాములాగే యెహోవా మీద నమ్మకం ఉంచుతున్నామని చూపిస్తాం. కాబట్టి క్రైస్తవులందరూ దేవుడు కోరేవాటిని ఇప్పుడే చేయడం చాలా ప్రాముఖ్యం. అలాచేస్తే పునరుత్థానమయ్యే ఇతరులతోపాటు నూతనలోకంలో జీవించడానికి మనం యోగ్యులమని తీర్పు పొందుతాం.​—లూకా 20:35.

నిరీక్షించడానికి కారణం

భవిష్యత్తు గురించి ఆలోచించి భయపడే బదులు నిరీక్షణతో ఉండండి. మనుష్యుల దృష్టిలో భవిష్యత్తు అంతా అంధకారంగా ఉంది. అయితే, మరింత మెరుగైన పరిస్థితులను యెహోవా వాగ్దానం చేస్తున్నాడు. మన అవసరాలన్నిటినీ, కోరికలన్నిటినీ యెహోవా ఎలా తీరుస్తాడో ఖచ్చితంగా తెలుసుకోవడం సాధ్యంకాకపోయినా ఆయనలా చేస్తాడనే విషయంలో మనకు సందేహం ఉండకూడదు. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “నిరీక్షింపబడునది కనబడునప్పుడు, నిరీక్షణతో పనియుండదు; తాను చూచుచున్న దానికొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడనిదానికొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దానికొరకు కనిపెట్టుదుము.” (రోమా. 8:24, 25) దేవుని వాగ్దానాలు నెరవేరుతాయనే బలమైన నిరీక్షణ మనకుంటే, భాగస్వామిని కోల్పోయిన బాధను ఓర్చుకోగలుగుతాం. ఓర్పు ఉంటే, యెహోవా మన “హృదయవాంఛలను తీర్చే” గొప్ప భవిష్యత్తును సొంతం చేసుకుంటాం. ఆయన తన “గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి” పరుస్తాడు.​—కీర్త. 37:4; 145:16; లూకా 21:19.

సంతోషకరమైన భవిష్యత్తు ఇస్తానన్న యెహోవా వాగ్దానంపై నమ్మకం ఉంచండి

యేసు మరణం సమీపించినప్పుడు ఆయన అపొస్తలులు ఎంతో కలతపడ్డారు. అప్పుడు యేసు ఈ మాటలతో వాళ్లను ఓదార్చాడు: “మీ హృదయమును కలవరపడనియ్యకుడి; దేవుని యందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి. . . . మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును.” (యోహా. 14:1-4, 18, 27) యేసు చెప్పిన ఆ మాటలు శతాబ్దాలుగా, అభిషిక్త అనుచరులు నిరీక్షించడానికి, సహించడానికి ఆధారంగా నిలిచాయి. అలాగే పునరుత్థానంలో తమ ఆత్మీయులను చూడాలని ఎంతగానో కోరుకుంటున్నవాళ్లు కూడా నిరాశానిస్పృహల్లో కూరుకుపోవడానికి ఏ కారణమూ లేదు. అలాంటివాళ్లను యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ఎన్నడూ విడిచిపెట్టరనే నిశ్చింతతో మీరు ఎల్లప్పుడూ ఉండవచ్చు!

a అసలు పేర్లు కావు.