ఆనాటి జ్ఞాపకాలు
“ఎంతో కోతపని జరగాల్సి ఉంది”
అది 1923. సౌ పావ్లో నగరంలోని డ్రామా అండ్ మ్యూజిక్ కన్సర్వేటరీలోని హాలు ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది! స్థిరంగా మాట్లాడుతున్న జార్జ్ యంగ్ స్వరం మీకు వినబడుతోందా? ఆయన ఒక్కో వాక్యం పలుకుతుండగా, వాటిని పోర్చుగీస్ భాషలోకి అనువదిస్తున్నారు. అక్కడున్న 585 మంది శ్రద్ధగా వింటున్నారు! పోర్చుగీస్ భాషలో బైబిలు వచనాలను తెర మీద చూపిస్తున్నారు. ఇప్పుడు జీవిస్తున్న లక్షలాదిమంది ఇంకెన్నడూ మరణించరు! చిన్న పుస్తకాన్ని ఇంగ్లీషు, జర్మన్, ఇటాలియన్ భాషలతో పాటు పోర్చుగీస్ భాషలో కూడా ఒక వంద కాపీలను పంచిపెట్టడం ఆ ప్రసంగానికి అద్భుత ముగింపునిచ్చింది. ఆ ప్రసంగం ప్రేక్షకులకు బాగా నచ్చింది. దాని గురించిన వార్త వ్యాప్తి చెందడంతో, రెండు వారాల తర్వాత మరో ప్రసంగం కోసం హాలంతా ప్రేక్షకులతో నిండిపోయింది. కానీ వీటన్నిటికీ పునాది ఎలా పడింది?
శారా బెలోన ఫెర్గసన్ అనే మహిళ కుటుంబం 1867లో, అమెరికా నుండి బ్రెజిల్‌కు వచ్చి స్థిరపడింది. ఆమె తమ్ముడు అమెరికా నుండి బ్రెజిల్‌కు తీసుకొచ్చిన కొన్ని ప్రచురణలను ఆమె 1899లో చదివింది. దాంతో తాను సత్యం కనుగొన్నానని గ్రహించింది. ఆసక్తిగా చదివే అలవాటున్న ఆమె ఇంగ్లీషు భాషలోని కావలికోట సంచికల కోసం చందా కట్టింది. వాటిలోని బైబిలు సందేశానికి ముగ్ధురాలై, సహోదరుడు సి. టి. రస్సెల్‌కు ఉత్తరం రాసింది, “ఎంత దూరంలోని వాళ్లనైనా చేరుకోవచ్చని చెప్పడానికి సజీవ సాక్ష్యం” తానేనని ఆ ఉత్తరంలో వివరించింది.
బైబిలు సందేశాన్ని ఇతరులతో పంచుకోవడానికి శారా చేయగలిగినదంతా చేసింది, కానీ తనకూ తన ఇంట్లోని వాళ్లకూ అదేవిధంగా బ్రెజిల్‌లోని మంచివాళ్లకు మరింత సహాయం ఎవరు అందిస్తారని ఆమె తరచూ అనుకునేది. అయితే పోర్చుగీస్ భాషలోని, మృతులు ఎక్కడ ఉన్నారు? కరపత్రాలను వేలసంఖ్యలో తీసుకుని ఒకరు సౌ పావ్లోకు వస్తున్నారని 1912లో బ్రూక్లిన్ బెతెల్ ఆమెకు తెలియజేసింది. త్వరలోనే పరలోకం వెళ్తామని చాలామంది బైబిలు విద్యార్థులు అనుకోవడం తనకెప్పుడూ ఆశ్చర్యం కలిగించేదని ఆమె 1915లో చెప్పింది. తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఆమె ఇలా రాసింది, “మరి బ్రెజిల్, దక్షిణ అమెరికాల సంగతేంటి? . . . భూమ్మీద దక్షిణ అమెరికా ఎంత పెద్ద భాగమో ఆలోచిస్తే, ఎంతో కోతపని జరగాల్సి
ఉందని ఇట్టే అర్థమౌతుంది.” అవును, నిజంగానే ఎంతో కోతపని జరగాల్సి ఉంది!సుమారు 1920లో, న్యూయార్క్ వచ్చిన ఎనిమిది మంది బ్రెజిల్ యువ నావికులు, తమ యుద్ధనౌకకు మరమ్మతులు జరుగుతుండగా, అక్కడ కొన్ని సంఘ కూటాలకు హాజరయ్యారు. వాళ్లు రీయో డే జనేరోకు తిరిగివెళ్తూ, తాము కొత్తగా నేర్చుకున్న బైబిలు విషయాలను ఇతరులతో పంచుకున్నారు. ఎంతోకాలం గడవక ముందే, 1923లో జార్జ్ యంగ్ అనే పిల్గ్రిమ్ లేదా ప్రయాణ పర్యవేక్షకుడు రీయో డే జనేరోకు వచ్చాడు. అక్కడ ఆయన ఆసక్తిగల వాళ్లను కనుగొన్నాడు. ఆయన ఎన్నో ప్రచురణలను పోర్చుగీస్ భాషలోకి అనువదించే ఏర్పాట్లు కూడా చేశాడు. ఆ తర్వాత ఆయన సౌ పావ్లోకు వచ్చాడు, అప్పట్లో ఆ నగర జనాభా సుమారు 6,00,000. ఆరంభంలో చూసినట్లుగా, అక్కడే ఆయన ప్రసంగాన్ని ఇచ్చి “లక్షలాదిమంది” అనే చిన్న పుస్తకాలను పంచిపెట్టాడు. ఆయనిలా చెప్పాడు, “నేను ఒక్కణ్ణే ఉండడంతో, వార్తాపత్రికల ద్వారానే ప్రసంగం గురించి ప్రచారం చేసుకోవాల్సి వచ్చింది. బ్రెజిల్లో I.B.S.A. పేరుతో ప్రచారం కల్పించిన మొట్టమొదటి బహిరంగ ప్రసంగాలు అవే.” a
డిసెంబరు 15, 1923 కావలికోట (ఇంగ్లీషు) సంచికలో, బ్రెజిల్‌కు సంబంధించిన ఓ నివేదిక ఇలా చెప్పింది, “అక్కడ జూన్ 1న పని మొదలవ్వడం, అప్పట్లో ప్రచురణలేవీ అందుబాటులో లేకపోవడం వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుంటే, ప్రభువు ఆ పనిని ఎంతగా ఆశీర్వదించాడో అర్థమౌతుంది.” సహోదరుడు జార్జ్ యంగ్ ఇచ్చిన రెండు ప్రసంగాలతో కలిపి, జూన్ 1 నుండి సెప్టెంబరు 30 వరకు సౌ పావ్లోలో ఏర్పాటు చేసిన 21 బహిరంగ ప్రసంగాలకు 3,600 మంది హాజరయ్యారని కూడా ఆ నివేదిక చెబుతుంది. రీయో డే జనేరోలో రాజ్య సందేశం క్రమక్రమంగా విస్తరించింది. కొన్ని నెలల కాలంలోనే పోర్చుగీస్ భాషలో 7,000 కన్నా ఎక్కువ ప్రచురణలను ప్రజలకు అందించారు! అంతేకాక, నవంబరు-డిసెంబరు, 1923 సంచికతో కావలికోట పోర్చుగీస్ భాషలో కూడా వెలువడడం మొదలైంది.
సహోదరుడు జార్జ్ యంగ్, శారా బెలోనను కలిశాడు. ఆ సందర్భం గురించి కావలికోట (ఇంగ్లీషు) ఇలా నివేదించింది, “ఆ సహోదరి ఇంట్లోని హాల్లోకి వచ్చింది, కాసేపటివరకూ ఆమె నోటి నుండి మాటరాలేదు. సహోదరుడు యంగ్ చేతిని పట్టుకుని, ఆయన్నే చూస్తూ ఆశ్చర్యంతో, ‘నేను చూస్తుంది నిజంగా పిల్గ్రిమ్నేనా?’” అంది. కొంతకాలానికే ఆమె, ఆమె నలుగురు పిల్లలు బాప్తిస్మం పొందారు. నిజానికి బాప్తిస్మం పొందడం కోసం ఆమె 25 ఏళ్లు వేచిచూసింది. ఆగస్టు 1, 1924 కావలికోట (ఇంగ్లీషు) సంచిక ప్రస్తావించినట్లు బ్రెజిల్లో 50 మంది బాప్తిస్మం పొందారు, వాళ్లలో చాలామంది రీయో డే జనేరోలోనే పొందారు.
ఆ సంఘటనలు జరిగి దాదాపు 90 ఏళ్లు గడిచాయి, “మరి బ్రెజిల్, దక్షిణ అమెరికాల సంగతేంటి?” అని ఇప్పుడు ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం బ్రెజిల్లో 7,60,000 కన్నా ఎక్కువమంది యెహోవాసాక్షులు ఉత్సాహంగా సువార్త ప్రకటిస్తున్నారు. దక్షిణ అమెరికాలో ఇప్పుడు పోర్చుగీస్, స్పానిష్ భాషలతోపాటు మరెన్నో స్థానిక భాషల్లో రాజ్య సందేశం అందుతోంది. “ఎంతో కోతపని జరగాల్సి ఉంది” అని 1915లో శారా బెలోన ఫెర్గసన్ చెప్పిన మాట నూటికి నూరుపాళ్లు నిజం.—బ్రెజిల్లో నుండి సేకరించినవి.
a I.B.S.A. అంటే అంతర్జాతీయ బైబిలు విద్యార్థుల సమాఖ్య.