కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు—తైవాన్‌లో

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు—తైవాన్‌లో

ప్రస్తుతం 30వ పడిలో ఉన్న చూంగ్‌ క్యూంగ్‌, జూలీ దంపతులు దాదాపు ఐదేళ్ల క్రితం వరకూ ఆస్ట్రేలియాలోని సిడ్నీలో క్రమపయినీర్లుగా సేవచేశారు. “మేము పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేసుకుంటూ సౌకర్యవంతంగా జీవించేవాళ్లం. పైగా మేము నివసించిన ప్రాంతంలో వాతావరణం చాలా బాగుంటుంది, మా జీవితం సాఫీగా సాగింది. మా బంధుమిత్రులు కూడా చుట్టుపక్కలే ఉండేవాళ్లు” అని చూంగ్‌ క్యూంగ్‌ అంటున్నాడు. అయినా జీవితంలో ఏదో వెలితి ఉన్నట్లు వాళ్లకు అనిపించేది. ఎందుకు? ఎందుకంటే యెహోవా సేవను ఎక్కువగా చేయడానికి తమ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాళ్లకు తెలుసు, కానీ అవసరమైన మార్పులు చేసుకోవడానికి వాళ్లు వెనకాడారు.

అయితే, 2009⁠లో ఒక సమావేశంలో విన్న ఓ ప్రసంగం వాళ్ల హృదయాల్ని కదిలించింది. ఆ ప్రసంగీకుడు, పరిచర్యను విస్తృతం చేసుకునే అవకాశం ఉన్నవాళ్లను ఉద్దేశిస్తూ మాట్లాడాడు. ఆయనిలా అన్నాడు, “ఈ విషయం గురించి ఆలోచించండి: ఒక కారు కదులుతున్నప్పుడే డ్రైవరు దాన్ని కుడికిగానీ ఎడమకుగానీ తిప్పగలడు. అలాగే, మనం కూడా కదులుతున్నప్పుడే అంటే మన లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేస్తున్నప్పుడే, మన పరిచర్యను విస్తృతం చేసుకునేలా యేసు నిర్దేశించగలడు.” a ఆ ప్రసంగీకుడు తమకే చెబుతున్నట్లు ఆ దంపతులకు అనిపించింది. అదే సమావేశంలో, తైవాన్‌లో మిషనరీలుగా సేవచేస్తున్న ఓ జంటను ఇంటర్వ్యూ చేశారు. వాళ్లు పరిచర్యలో పొందుతున్న సంతోషం గురించి వివరిస్తూ, ఇంకా అక్కడ ప్రచారకుల అవసరం ఎక్కువగా ఉందని నొక్కిచెప్పారు. వాళ్లు కూడా తమకే చెబుతున్నట్లు చూంగ్‌ క్యూంగ్‌, జూలీలకు మళ్లీ అనిపించింది.

జూలీ ఏమంటుందంటే, “ఆ సమావేశం తర్వాత, యెహోవాకు ప్రార్థించి తైవాన్‌కు వెళ్లడానికి కావాల్సిన ధైర్యం ఇవ్వమని అడిగాం. అయినా మాకు భయంగానే ఉంది. లోతైన స్విమ్మింగ్‌ పూల్‌లోకి మొదటిసారి దూకుతున్నట్లుగా మాకు అనిపించింది.” అయితే, వాళ్లు అలా “దూకడానికి” ప్రసంగి 11:4 సహాయం చేసింది. “గాలిని గురుతుపట్టువాడు [“చూస్తుండేవాడు,” NW] విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు” అని ఆ వచనం చెబుతుంది. “మేము ‘చూడడం, కనిపెట్టడం’ మానేసి, ‘విత్తడం, కోయడం’ మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాం” అని చూంగ్‌ క్యూంగ్‌ అంటున్నాడు. వాళ్లు ప్రార్థించారు, మళ్లీమళ్లీ ప్రార్థించారు. మిషనరీల జీవిత కథలు చదివారు, తైవాన్‌కు వెళ్లి సేవచేస్తున్న వాళ్లతో ఈ-మెయిల్స్‌ ద్వారా చాలాసార్లు మాట్లాడారు. చివరికి వాళ్లకున్న కార్లను, వస్తువులను అమ్మేసి మూడు నెలల తర్వాత తైవాన్‌కు వచ్చేశారు.

ప్రకటించడంలోని ఆనందాన్ని కనుగొంది

విదేశాల నుండి వచ్చిన 100 కన్నా ఎక్కువమంది సహోదరసహోదరీలు, తైవాన్‌లో రాజ్యప్రచారకుల అవసరం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ప్రస్తుతం సేవచేస్తున్నారు. ఆస్ట్రేలియా, బ్రిటన్‌, కెనడా, ఫ్రాన్స్‌, జపాన్‌, కొరియా, స్పెయిన్‌, అమెరికా నుండి వచ్చిన 21-73 మధ్య వయసువాళ్లు అక్కడ సేవచేస్తున్నారు. వాళ్లలో 50 కన్నా ఎక్కువమంది ఒంటరి సహోదరీలే. వేరే దేశంలో పరిచర్య చేయడానికి ఈ ఉత్సాహవంతులైన సహోదరసహోదరీలకు ఏది సహాయం చేసింది? ఇప్పుడు చూద్దాం.

లారా

కెనడా నుండి వచ్చిన లారా అనే ఒంటరి సహోదరి పశ్చిమ తైవాన్‌లో పయినీరుగా సేవ చేస్తోంది. కానీ సుమారు పదేళ్ల క్రితందాకా ప్రకటనా పనంటే ఆమెకు అస్సలు ఇష్టముండేది కాదు. పరిచర్యకు ఏదో వెళ్లానంటే వెళ్లేదాన్ని కానీ ఇష్టంతో వెళ్లేదాన్ని కాదని ఆమె చెబుతుంది. ఆ తర్వాత, కెనడాలోని ఆమె స్నేహితులు ఒక నెలరోజులు మెక్సికోలో పరిచర్య చేయడానికి తమతో రమ్మని ఆహ్వానించారు. “పరిచర్యలో అంతెక్కువ సమయం గడపడం అదే మొదటిసారి, పరిచర్య అద్భుతంగా సాగడం చూసి ఆశ్చర్యపోయాను” అని ఆమె గుర్తుచేసుకుంది.

ఆ చక్కని అనుభవంవల్ల, లారా కెనడాలోని వేరే భాషా సంఘానికి వెళ్లడం గురించి ఆలోచించసాగింది. ఆమె చైనీస్‌ భాషా కోర్సులో చేరింది, చైనీస్‌ గుంపుతో కలిసి సేవ చేసింది. అంతేకాక, తైవాన్‌కు వెళ్లాలనే లక్ష్యం పెట్టుకుంది, చివరికి 2008 సెప్టెంబరులో ఆ లక్ష్యాన్ని చేరుకుంది. “కొత్త పరిసరాలకు అలవాటు పడడానికి దాదాపు ఓ సంవత్సరం పట్టింది. మళ్లీ ఇప్పుడు కెనడాకు వెళ్లాలనుకోవట్లేదు” అని లారా అంటోంది. ప్రకటనా పని గురించి ఆమె ఏమనుకుంటోంది? “ఇప్పుడు నేను పరిచర్యను ఆనందంగా చేస్తున్నాను. బైబిలు విద్యార్థులు యెహోవా గురించి తెలుసుకుని జీవితంలో మార్పులు చేసుకోవడం చూసినప్పుడు వచ్చే సంతృప్తిని మరేదీ ఇవ్వలేదు. తైవాన్‌లో సేవచేయడం వల్ల ఆ సంతోషాన్ని ఎన్నోసార్లు సొంతం చేసుకున్నాను” అని ఆమె అంటోంది.

భాష సరిగ్గా రానప్పుడు

బ్రైయాన్‌, మషెల్‌

అమెరికాకు చెందిన బ్రైయన్‌, మషెల్‌ దంపతులు సుమారు ఎనిమిదేళ్ల క్రితం అమెరికా నుండి తైవాన్‌కు వెళ్లి సేవచేయడం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్లు 30వ పడిలో ఉన్నారు. మొదట్లో, తమ ప్రకటనా పని అంత సంతృప్తిగా లేదని వాళ్లకు అనిపించింది. అయితే ఓ అనుభవజ్ఞుడైన మిషనరీ వాళ్లకిలా చెప్పాడు, “మీరు ఎవరికైనా కేవలం ఓ కరపత్రాన్ని ఇవ్వగలిగినా, ఆ వ్యక్తి యెహోవా గురించిన సందేశం అందుకోవడం అదే మొదటిసారి కావచ్చనే విషయం గుర్తుంచుకోండి. కాబట్టి పరిచర్యలో మీకు ఇప్పటికే ఓ ప్రాముఖ్యమైన వంతు ఉన్నట్లే!” ఆ ప్రోత్సాహకరమైన మాటలు పరిచర్యలో కొనసాగేలా బ్రైయన్‌, మషెల్‌లకు ఎంతో సహాయం చేశాయి. మరో సహోదరుడు వాళ్లకిలా చెప్పాడు, “రోజురోజుకీ మీ చైనీస్‌ భాష ఎంత మెరుగవుతుందని కాకుండా, ఓ సమావేశం నుండి మరో సమావేశానికి ఎంత మెరుగవుతుందో చూసుకోండి. అప్పుడు మీరు నిరుత్సాహపడరు.” వాళ్లు నిజంగానే ప్రగతి సాధించారు, ప్రస్తుతం పయినీరు సేవను సమర్థవంతంగా చేయగలుగుతున్నారు.

వేరే భాష నేర్చుకోవాలనే తపన కలగాలంటే మీరు ఏమి చేయవచ్చు? వీలైతే, మీరు సేవ చేయాలనుకుంటున్న దేశాన్ని సందర్శించండి. అక్కడి కూటాలకు వెళ్లండి, సహోదరసహోదరీలను కలవండి, వాళ్లతో కలిసి పరిచర్య చేయండి. “రాజ్య సందేశానికి చాలామంది చక్కగా స్పందించడం గమనించాక, సహోదరసహోదరీల ప్రేమానురాగాలు చవిచూశాక, ఇబ్బందులు ఉన్నప్పటికీ వేరే దేశంలో సేవ చేయాలనే తపన మీలో కలుగుతుంది” అని బ్రైయన్‌ అంటున్నాడు.

ఉద్యోగం సంగతేంటి?

క్రిస్టన్‌, మషెల్‌

తైవాన్‌లో, అవసరం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో పయినీరు సేవచేస్తున్న చాలామంది ఖర్చుల కోసం ఇంగ్లీషు నేర్పిస్తున్నారు. క్రిస్టన్‌, మషెల్‌ దంపతులు చేపలు అమ్ముతున్నారు. క్రిస్టన్‌ ఇలా వివరిస్తున్నాడు, “నేను ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి పని చేయలేదు, కానీ ఈ పని చేయడంవల్లే ఇక్కడ ఉండగలుగుతున్నాను.” కాలం గడుస్తుండగా, క్రిస్టన్‌కు కొంతమంది క్రమంగా వచ్చే కస్టమర్లు దొరికారు. అలా ఆయనా, ఆయన భార్యా తమను తాము పోషించుకోగలుగుతున్నారు, అంతేకాదు వాళ్లు చేయాల్సిన అతి ప్రాముఖ్యమైన పనికోసం అంటే మనుషుల్ని పట్టే పయినీరు సేవకోసం కావాల్సినంత సమయం దొరుకుతుంది.

సంతోషంగా సేవ చేయండి

అమెరికాకు చెందిన విల్యమ్‌, జెన్నిఫర్‌ దంపతులు సుమారు ఏడేళ్ల క్రితం తైవాన్‌కు వచ్చారు. “భాష నేర్చుకోవడం, పయినీరు సేవచేయడం, సంఘాన్ని చూసుకోవడం, కుటుంబ పోషణ కోసం తగినంత సంపాదించడం వంటివాటివల్ల కొన్నిసార్లు బాగా అలసిపోతుంటాం” అని విల్యమ్‌ అంటున్నాడు. వాళ్లు ఆ పనులను చక్కగా చేస్తూ, సంతోషంగా ఉండడానికి ఏది సహాయం చేసింది? వాళ్లు చేరుకోగల లక్ష్యాలను పెట్టుకున్నారు. ఉదాహరణకు, చైనీస్‌ భాషను ఇంత సమయంలోనే నేర్చేసుకోవాలని వాళ్లు లక్ష్యం పెట్టుకోలేదు, అందుకే నేర్చుకోవడం ఆలస్యమైనప్పుడు అతిగా నిరుత్సాహపడలేదు.

విల్యమ్‌, జెన్నిఫర్‌

ఒకానొక ఆధ్యాత్మిక లక్ష్యం పెట్టుకున్నాక, దాన్ని సాధించడానికి మనం చేసే ప్రతీ పనిని ఆస్వాదించాలని ఒక ప్రయాణ పర్యవేక్షకుడు ఓసారి తనతో చెప్పిన మాటల్ని విల్యమ్‌ గుర్తు చేసుకుంటున్నాడు. ఆ సలహాను పాటించడం వల్ల తానూ తన భార్యా పరిస్థితులకు తగ్గట్టుగా మారామని, అక్కడున్న బాధ్యతగల సహోదరుల సలహాలు పాటించామని, పనులు చేసే విధానాన్ని మార్చుకున్నామని విల్యమ్‌ అంటున్నాడు. అందువల్ల ఆ కొత్త ప్రాంతంలో ఫలవంతంగా పరిచర్య చేయగలుగుతున్నామని కూడా చెబుతున్నాడు. ఆయనింకా ఏమంటున్నాడంటే, “మేము సేవచేస్తున్న ద్వీపంలోని ప్రకృతి అందాలను చూడడానికి తప్పకుండా కొంత సమయం కేటాయించేలా కూడా ఆ మాటలు మాకు సహాయం చేశాయి.”

విల్యమ్‌, జెన్నిఫర్‌లాగే అమెరికాకు చెందిన మెగన్‌ అనే ఒంటరి పయినీరు సహోదరి కూడా చైనీస్‌ భాషను అనర్గళంగా మాట్లాడాలనే తన లక్ష్యాన్ని చేరుకుంటూనే సంతోషంగా పరిచర్య చేస్తుంది. తైవాన్‌లో అతిపెద్ద ఓడరేవు అయిన కౌష్యుంగ్‌ ఓడరేవులో సేవచేస్తున్న ప్రచారకులతో కలిసి ఆ సహోదరి వారాంతాల్లో ప్రకటిస్తుంది. అది అద్భుతమైన క్షేత్రం. మెగన్‌ ఒక్కొక్క ఓడలోకి వెళ్లి అందులో ఉన్నవాళ్లకు సువార్త ప్రకటిస్తుంది. బంగ్లాదేశ్‌, ఇండియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌, థాయ్‌లాండ్‌, వనౌటు వంటి దేశాల నుండి వచ్చే జాలరులకు కూడా ప్రకటిస్తుంది. “జాలరులు రేవులో కొద్దిసేపే ఉంటారు కాబట్టి వెంటనే అక్కడికక్కడే బైబిలు అధ్యయనం మొదలుపెడతాం. వాళ్లందర్నీ కలవడానికి తరచూ నేను నలుగురైదుగురితో ఒకేసారి బైబిలు అధ్యయనం చేస్తాను.” మరైతే, ఆమె చైనీస్‌ భాష నేర్చుకోవడం ఎంత వరకు వచ్చింది? ఆమె ఇలా అంటోంది, “నేను త్వరగా నేర్చుకోగలిగివుంటే బాగుండు, కానీ ఓ సహోదరుడు చెప్పిన ఈ మాటల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను: ‘నీకు చేతనైనంత చేయి, మిగతాది యెహోవాకు వదిలేయి.’”

మెగన్‌

ఎక్కడ సేవ చేయవచ్చు?

కాతీ బ్రిటన్‌ నుండి వేరే దేశానికి వెళ్లడానికి ముందు, ఏ దేశమైతే ఒంటరి సహోదరీలకు సురక్షితంగా ఉంటుందో పరిశోధించింది. తన ఆందోళనలు ప్రార్థనలో యెహోవాకు చెప్పుకుంది, ఒంటరి సహోదరీలకు ఎలాంటి ప్రమాదాలు రావచ్చో కనుక్కోవడానికి వివిధ బ్రాంచి కార్యాలయాలకు ఉత్తరాలు రాసింది. వాటి జవాబులను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత తైవాన్‌ సరైన స్థలమని నిర్ణయించుకుంది.

కాతీ 2004⁠లో, తన 31వ ఏట తైవాన్‌కు వెళ్లింది. అక్కడ వీలైనంత నిరాడంబరంగా జీవిస్తున్న కాతీ ఇలా చెబుతుంది, “పళ్లు, కూరగాయలు తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతాయో సహోదరసహోదరీలను అడిగాను. వాళ్లు ఇచ్చిన మంచి సలహాల వల్ల నేను డబ్బును పొదుపుగా ఎక్కువకాలం వాడుకోగలిగాను.” నిరాడంబరంగా జీవించడానికి ఆమెకు ఏది సహాయం చేస్తుంది? కాతీ ఇలా అంటోంది, “నేను తినే మామూలు ఆహారంతో, వేసుకునే సాధారణ బట్టలతో సంతృప్తిపడేందుకు సహాయం చేయమని తరచూ యెహోవాకు ప్రార్థిస్తాను. నా అవసరాలేమిటో నేర్పిస్తూ, తృప్తిగా జీవించేందుకు సహాయంచేస్తూ యెహోవా నా ప్రార్థనలకు జవాబిస్తున్నాడని అనిపిస్తుంది. నా నిరాడంబర జీవితం నాకెంతో నచ్చింది, ఎందుకంటే దానివల్ల నేను ఆధ్యాత్మిక విషయాల మీద మనసు పెట్టగలుగుతున్నాను.”

కాతీ

కాతీ జీవితం కేవలం నిరాడంబరంగానే కాదు ఉత్తేజకరంగా కూడా ఉంది. ఎందుకో ఆమె మాటల్లోనే వినండి, “ఎక్కువమంది ప్రజలు సువార్తకు స్పందిస్తున్న ప్రాంతంలో నేను ప్రకటించగలుగుతున్నాను. అదే నిజమైన సంతోషం!” ఆమె తైవాన్‌కు వచ్చి ఒక నగరంలో పయినీరు సేవ మొదలుపెట్టినప్పుడు అక్కడ రెండు చైనీస్‌ భాషా సంఘాలు ఉండేవి, కానీ ఇప్పుడు ఏడు సంఘాలు ఉన్నాయి. “అలాంటి అద్భుతమైన అభివృద్ధిని కళ్లారా చూడడం, కోత పనిలో నేనూ పాల్గొనడం వంటివి నా జీవితాన్ని ప్రతిరోజూ ఉత్తేజంతో నింపుతున్నాయి” అని కాతీ అంటోంది.

“చివరికి నేను కూడా వాళ్లకు ఉపయోగపడ్డాను!”

ఈ ఆర్టికల్‌ ఆరంభంలో మనం చూసిన చూంగ్‌ క్యూంగ్‌, జూలీలు ప్రస్తుతం ఎలా ఉన్నారు? తనకు చైనీస్‌ భాష పెద్దగా రాదు కాబట్టి తనవల్ల సంఘానికి అంతగా ఉపయోగం ఉండదని చూంగ్‌ క్యూంగ్‌కు మొదట్లో అనిపించింది. కానీ స్థానిక సహోదరుల అభిప్రాయం మరోలా ఉంది. చూంగ్‌ క్యూంగ్‌ ఇలా అంటున్నాడు, “మా సంఘం రెండు సంఘాలుగా వృద్ధి చెందినప్పుడు, పరిచర్య సేవకునిగా నాకు ఎన్నో అదనపు బాధ్యతల్ని ఇచ్చారు. అవసరం ఎక్కువున్న ప్రాంతంలో నేను సేవ చేస్తున్నానని ఆ క్షణంలో నిజంగా అనిపించింది.” ఆయన చిరునవ్వుతో ఇంకా ఏమి చెబుతున్నాడంటే, “అవసరం ఎంత ఎక్కువ ఉందంటే, చివరికి నేను కూడా వాళ్లకు ఉపయోగపడ్డాను!” ప్రస్తుతం ఆయన సంఘపెద్దగా సేవచేస్తున్నాడు. జూలీ కూడా ఇలా అంటుంది, “మాకు ముందెప్పుడూ లేనంతగా ఏదో సాధించామనే సంతృప్తి, సంతోషం ఇప్పుడున్నాయి. మేము ఇక్కడ సహాయం చేయడానికి వచ్చాం, కానీ ఈ ఉత్తేజకరమైన అనుభవాన్ని బట్టి మేమే సహాయం పొందామనిపిస్తుంది. ఇక్కడ సేవచేసే అవకాశం మాకు ఇచ్చినందుకు యెహోవాకు కృతజ్ఞతలు!”

చాలా దేశాల్లో, ఆధ్యాత్మిక కోతపని చేయడానికి ఎంతోమంది పనివాళ్ల అవసరం ఇంకా ఉంది. మీరు స్కూల్‌ లేదా కాలేజ్‌ విద్యను పూర్తిచేసుకొని, జీవితంలో ఏమి చేయాలో ఆలోచిస్తున్నారా? మీరు ఒంటరిగా ఉన్నారా? యెహోవా సంస్థకు మరింతగా ఉపయోగపడాలని కోరుకుంటున్నారా? మీ కుటుంబానికి ఓ గొప్ప ఆధ్యాత్మిక స్వాస్థ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నారా? మీరు రిటైర్‌ అయ్యి, మీ జీవితంలో సంపాదించుకున్న విలువైన అనుభవాన్ని ఇతరులతో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే, రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువున్న ప్రాంతాల్లో సేవచేస్తూ మీ పరిచర్యను విస్తృతం చేసుకోవాలని నిర్ణయించుకుంటే మీకోసం గొప్ప ఆశీర్వాదాలు వేచివుంటాయనే భరోసాతో ఉండవచ్చు.

a దేవుని రాజ్యం గురించి ‘సమగ్ర సాక్ష్యమివ్వండి’ (ఇంగ్లీషు) పుస్తకం, 16వ అధ్యాయంలో 5-6 పేరాలు చూడండి.