కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“కింగ్స్‌లీ చేయగలిగాడంటే నేనూ చేయగలను!”

“కింగ్స్‌లీ చేయగలిగాడంటే నేనూ చేయగలను!”

తన భుజాన్ని ఓ సహోదరుడు తట్టగానే కింగ్స్‌లీ చదవడం మొదలుపెట్టాడు. ఆ రోజు దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో, ఆయన మొదటిసారి బైబిల్‌ రీడింగ్‌ చేస్తున్నాడు. ప్రతీ పదాన్ని జాగ్రత్తగా పలుకుతూ, ఒక్క పొల్లు కూడా పోకుండా చదువుతున్నాడు. కానీ చదివేటప్పుడు ఆయన బైబిలు చూడట్లేదు. ఎందుకని?

శ్రీలంకకు చెందిన కింగ్స్‌లీకి చూపులేదు, సరిగ్గా వినిపించదు కూడా, ఎక్కడికి వెళ్లాలన్నా చక్రాల కుర్చీలోనే వెళ్లాలి. అలాంటి వ్యక్తి యెహోవా గురించి నేర్చుకుని, దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఎలా రీడింగ్‌ చేయగలిగాడో తెలుసుకోవాలని ఉందా?

నేను కింగ్స్‌లీని మొదటిసారి కలిసినప్పుడు, సత్యంపట్ల ఆయనకున్న ఆసక్తిని చూసి ఆశ్చర్యపోయాను. గతంలో కొంతమంది సాక్షులు ఆయనతో స్టడీ చేశారు. ఆయన దగ్గర బ్రెయిలీలో ఉన్న నిత్యజీవమునకు నడుపు సత్యము అనే పుస్తకం బాగా పాతదైపోయింది. a నేను ఆయన్ని, ‘మళ్లీ స్టడీ తీసుకుంటారా’ అని అడిగినప్పుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. కానీ మా ముందు రెండు సవాళ్లున్నాయి.

మొదటిది, ఆయన వృద్ధులూ వికలాంగులూ ఉండే ఆశ్రమంలో ఉంటున్నాడు. అక్కడంతా గోలగా ఉండడంవల్ల, ఆయనకు సరిగ్గా వినిపించకపోవడంవల్ల నేను గట్టిగా మాట్లాడాల్సి వచ్చేది. దాంతో, మేము స్టడీలో చర్చించుకునే విషయాలు ఆశ్రమంలోని వాళ్లందరికీ వినబడేవి.

రెండో సమస్య ఏంటంటే, కింగ్స్‌లీ స్టడీలో ఎక్కువ సమాచారాన్ని చదవలేడు, ఏవైనా కొత్త విషయాలు చర్చిస్తే వాటిలో కొన్నిమాత్రమే అర్థం చేసుకోగలిగేవాడు. అయితే, స్టడీ నుండి ఎక్కువ ప్రయోజనం పొందడం కోసం కింగ్స్‌లీ చాలా కష్టపడేవాడు. స్టడీ చేయబోయే పాఠాన్ని ముందుగానే చాలాసార్లు చదివేవాడు, తన బ్రెయిలీ బైబిల్లో లేఖనాలు తీసి చూసేవాడు. ఆ తర్వాత ప్రశ్నలకు జవాబులను తన మనసులోనే సిద్ధపడేవాడు. ఈ పద్ధతి బాగా పనిచేసింది. స్టడీ జరిగేటప్పుడు ఆయన ఒక కార్పెట్‌ మీద కూర్చుని, నేలను చరుస్తూ, నేర్చుకుంటున్న విషయాల్ని పెద్ద గొంతుతో ఉత్సాహంగా చెప్పేవాడు. కొంతకాలానికే, మేము స్టడీ కోసం వారానికి రెండుసార్లు కలుసుకోవడం మొదలుపెట్టాం. ప్రతీసారి రెండు గంటలపాటు స్టడీ జరిగేది.

మీటింగ్స్‌కి రావడం, వాటిలో పాల్గొనడం

కింగ్స్‌లీ, పాల్‌

మీటింగ్స్‌కి రావాలని కింగ్స్‌లీ ఎంతో ఆరాటపడేవాడు. కానీ అది అంత తేలిక కాదు. ఆయన్ను రాజ్యమందిరానికి తీసుకెళ్లడం కోసం చక్రాల కుర్చీలో, కారులో కూర్చోబెట్టడానికీ దించడానికీ ఎవరోఒకరి సహాయం అవసరమయ్యేది. సంఘంలో చాలామంది వంతులవారీగా ఆయనకు సహాయం చేసేవాళ్లు, నిజానికి సహోదరులు దాన్ని గొప్ప అవకాశంగా భావించేవాళ్లు. కూటాలు జరిగేటప్పుడు కింగ్స్‌లీ సౌండ్‌బాక్సు పక్కనే కూర్చుని శ్రద్ధగా వినేవాడు, వ్యాఖ్యానాలు కూడా ఇచ్చేవాడు!

కొంతకాలం స్టడీ తీసుకున్న తర్వాత ఆయన దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో చేరాడు. తన నియామకానికి ఇంకా రెండు వారాలు ఉందనగా నేను ఆయన్ను, ‘బైబిలు రీడింగ్‌ ప్రాక్టీసు చేస్తున్నారా’ అని అడిగాను. దానికి ఆయనెంతో ధీమాగా, “అవును బ్రదర్‌, సుమారు 30 సార్లు ప్రాక్టీసు చేశాను” అని చెప్పాడు. ఆయన చేస్తున్న కృషిని మెచ్చుకుని, ఒకసారి చదవమని అడిగాను. ఆయన తన బ్రెయిలీ బైబిలు తెరచి, లేఖనాలను చదవడం మొదలుపెట్టాడు. ఆయన చదవడం అయితే చదువుతున్నాడు కానీ లేఖనాలపై తన వ్రేళ్లను ఎప్పటిలా కదపడంలేదని నేను గమనించాను. అంటే, ఆయన చదవాల్సిన లేఖనాలన్నిటినీ కంఠస్థం చేసేశాడు!

అది చూసి నా కన్నీళ్లు ఆగలేదు, నా కళ్లను నేను నమ్మలేకపోయాను. కేవలం 30 సార్లే చదివి లేఖనాలన్నీ అంతబాగా ఎలా గుర్తుపెట్టుకున్నారని కింగ్స్‌లీని అడిగాను. దానికి ఆయన, “రోజుకు 30 సార్లు చదివాను” అని చెప్పాడు. దాదాపు ఓ నెలపాటు, ఆయన అలవాటుగా తన కార్పెట్‌ మీద కూర్చుని ఆ లేఖనాలన్నీ కంఠస్థం వచ్చేదాకా పదేపదే చదువుతూనే ఉన్నాడు.

కింగ్స్‌లీ బైబిల్‌ రీడింగ్‌ చేయాల్సిన రోజు రానేవచ్చింది. ఆయన చదవడం అయిపోగానే రాజ్యమందిరమంతా చప్పట్లతో మారుమ్రోగిపోయింది. ఆయన పట్టుదల చూసి చాలామంది సహోదరసహోదరీలు ఆనందంతో కంటతడి పెట్టుకున్నారు. పాఠశాలలో విద్యార్థి ప్రసంగాలు ఇవ్వడానికి భయపడే ఒక ప్రచారకురాలు, కింగ్స్‌లీని చూశాక మళ్లీ వాటిని చేయడానికి ముందుకొచ్చింది. కారణమేంటని అడిగినప్పుడు, “కింగ్స్‌లీ చేయగలిగాడంటే నేనూ చేయగలను!” అని ఆమె చెప్పింది.

మూడు సంవత్సరాలపాటు బైబిలు స్టడీ చేశాక కింగ్స్‌లీ యెహోవాకు సమర్పించుకుని, 2008 సెప్టెంబరు 6న బాప్తిస్మం తీసుకున్నాడు. 2014, మే 13న చనిపోయేదాకా యెహోవాకు యథార్థంగా ఉన్న కింగ్స్‌లీ, తాను భూపరదైసులో పూర్తి బలంతో, ఆరోగ్యంతో తన సేవను కొనసాగిస్తానని నమ్మాడు. (యెష. 35:5, 6)—పాల్‌మెక్‌ మానెస్‌ చెప్పినది.

a ఆ పుస్తకాన్ని 1995⁠లో ప్రచురించారు, కానీ ఇప్పుడు ప్రింట్‌ చేయడం లేదు.