కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కృతజ్ఞత ఎందుకు చూపించాలి?

కృతజ్ఞత ఎందుకు చూపించాలి?

కృతజ్ఞత ఎందుకు చూపించాలి?

“ప్రియమైన రాకెల్‌కు,

నిన్ను చూసి నేనెంతో ప్రోత్సాహాన్ని పొందాను, నీకు నా కృతజ్ఞతలు. నీకు తెలియదుగానీ, ప్రోత్సాహకరమైన నీ వ్యక్తిత్వం, దయాపూర్వకమైన నీ మాటలు నన్నెంతో ఉత్తేజపరిచాయి.’’—జెన్నిఫర్‌.

ఎవరైనా ఎప్పుడైనా మీరూహించని విధంగా మీకు కృతజ్ఞతలు తెలియజేశారా? అలా తెలియజేసివుంటే, అది మీ మనసును ఉత్తేజపర్చి ఉంటుందనడంలో సందేహం లేదు. ఎంతైనా, ఇతరులు మనల్ని విలువైనవారిగా ఎంచాలని, మనల్ని మెచ్చుకోవాలని కోరుకోవడం సహజమే.—మత్తయి 25:19-23.

కృతజ్ఞతను వ్యక్తం చేయడంవల్ల, అలా వ్యక్తం చేసిన​వారికి, దాన్ని స్వీకరించినవారికి మధ్య సన్నిహితబంధం ఏర్పడు​తుంది. అంతేగాక, కృతజ్ఞత చూపించే వ్యక్తి, ఇతరుల మంచి పనులను మెచ్చుకోవడంలో ఎన్నడూ విఫలం కాని యేసుక్రీస్తు అడుగుజాడలను అనుసరిస్తున్నట్లే.—మార్కు 14:3-9; లూకా 21:1-4.

విచారకరంగా, కృతజ్ఞతను మాటల్లోగానీ, వ్రాతపూర్వకంగాగానీ వ్యక్తం చేయడం అంతకంతకూ తగ్గిపోతున్నట్లు అనిపిస్తోంది. “అంత్యదినములలో” మనుష్యులు ‘కృతజ్ఞత​లేనివారిగా’ తయారవుతారని బైబిలు హెచ్చరించింది. (2 తిమోతి 3:1, 2) మనం జాగ్రత్తగా ఉండకపోతే, నేడు అంతటా కనిపిస్తున్న కృతజ్ఞతారాహిత్యం మనలోని కృతజ్ఞతాభావాలను అణచివేసే ప్రమాదముంది.

కృతజ్ఞత ఎలా చూపించాలో తమ పిల్లలకు తెలియ​జేయడానికి తల్లిదండ్రులు ఏ ఆచరణాత్మక చర్యలు తీసుకోవచ్చు? మనం ఎవరికి మన కృతజ్ఞతను తెలియజేయాలి? మనచుట్టూ ఉన్నవారు కృతజ్ఞత చూపించకపోయినా, మనమెందుకు కృతజ్ఞత కలిగివుండాలి?

కుటుంబంలో కృతజ్ఞత చూపించడం

తల్లిదండ్రులు తమ పిల్లలను పోషించడానికి ఎంతో కష్టపడు​తుంటారు. అయితే, కొన్నిసార్లు తమ ప్రయత్నాలు విలువైనవిగా పరిగణించబడడం లేదని తల్లిదండ్రులు భావిం​చ​వచ్చు. ఈ పరిస్థితిని సరిదిద్దడానికి వారేమి చేయవచ్చు? దానికి మూడు విషయాలు ప్రాముఖ్యం.

(1) మాదిరి. మంచి మాదిరి ఉంచడం ద్వారా పిల్లలకు చక్కగా బోధించవచ్చు. ప్రాచీన ఇశ్రాయేలులో కష్టించి పనిచేసే తల్లి గురించి బైబిలు ఇలా చెబుతోంది, “ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు.” ఈ పిల్లలు కృతజ్ఞతను వ్యక్తం చేయడాన్ని ఎక్కడ నేర్చుకున్నారు? తర్వాతి వచనం మనకు కొంత ఆధారాన్నిస్తుంది. అదిలా చెబుతోంది, “ఆమె పెనిమిటి ఆమెను పొగడును.” (సామెతలు 31:28, 29) ఒకరిపట్ల ఒకరు కృతజ్ఞత వ్యక్తం చేసుకునే తల్లిదండ్రులు, అలా కృతజ్ఞతను వ్యక్తంచేయడం దాన్ని పొందేవారికి ఆనందాన్నిస్తుందనీ, కుటుంబ బంధాలను మెరుగుపరుస్తుందనీ, పరిణతి చెందడానికి అదొక సూచన అనీ తమ పిల్లలకు చూపిస్తారు.

స్టీఫెన్‌ అనే ఒక తండ్రి ఇలా చెబుతున్నాడు, “భోజనం సిద్ధంచేసినందుకు నా భార్యకు కృతజ్ఞతలు చెప్పడం ద్వారా మా పిల్లలకు మాదిరినుంచడానికి ప్రయత్నించాను.” దాని ఫలితమేమిటి? “మా కూతరులిద్దరూ ఈ విషయాన్ని గమనించారు, కృతజ్ఞత చూపించవలసిన అవసరాన్ని మరింతగా గ్రహించడానికి అది వారికి సహాయపడింది” అని స్టీఫెన్‌ చెబుతున్నాడు. మీరు వివాహితులైతే, దైనందిన జీవితంలోని మామూలు పనులు చేసినందుకు మీరు మీ భాగస్వామికి కృతజ్ఞతలు చెప్తారా? మీ పిల్లలు తాము చేయవలసిన పనులే చేసినా మీరు వారికి కృతజ్ఞతలు చెప్తారా?

(2) శిక్షణ. కృతజ్ఞతాభావాలు పువ్వుల్లాంటివి. మంచి ఫలితాలు కావాలంటే, వాటితో ఎంతో కోమలంగా వ్యవహరించాలి. కృతజ్ఞతాభావాన్ని పెంపొందించుకుని దాన్ని వ్యక్తంచేయడానికి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలా సహాయం చేయవచ్చు? “నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును” అని వ్రాసినప్పుడు జ్ఞానియైన సొలొమోను రాజు ఒక కీలకాంశాన్ని నొక్కిచెప్పాడు.​—సామెతలు 15:28.

తల్లిదండ్రులారా, మీ పిల్లలకు ఎవరైనా ఏదైనా బహుమాన​మిస్తే, అలా ఇవ్వడానికి అవతలివారు చేసిన ప్రయత్నం గురించి, చూపించిన ఉదారత గురించి ఆలోచించేలా మీరు వారికి శిక్షణనివ్వగలరా? ఈ విధంగా ఆలోచించడం, వారి హృదయాల్లో కృతజ్ఞతాభావం పెంపొందడానికి దోహదపడుతుంది. ముగ్గురు పిల్లలను పెంచి పెద్దచేసిన మారియా ఇలా అంటోంది, “ఎవరైనా ఏదైనా బహుమానమిస్తే, అలా ఇవ్వడంలో ఏమి ఇమిడివుందో మీ పిల్లలకు వివరించడానికి ఎంతో సమయం అవసరం. ఆ బహుమానం ఇచ్చినవారు మీ గురించి ఎంతో ఆలోచించారనీ, వారికి మీపట్ల శ్రద్ధవుందని చూపించాలనుకున్నారు కాబట్టే ఆ బహుమానం ఇచ్చారనీ వివరించవలసివుంటుంది. అయితే ఆ ప్రయత్నానికి తగిన ఫలితం ఉంటుందని నేను భావిస్తున్నాను.” అలాంటి సంభాషణలు, పిల్లలు ఏవైనా బహుమానాలు అందుకున్నప్పుడు ఏమి చెప్పాలనేదే కాక, ఎందుకు చెప్పాలనేది కూడా నేర్చుకునేందుకు వారికి సహాయం చేస్తాయి.

పిల్లలు తమకు లభించే మంచివాటన్నిటికీ తాము అర్హులమనీ, అవి తమకు చెందవలసినవేననీ భావించకుండా ఉండేందుకు జ్ఞానవంతులైన తల్లిదండ్రులు తమ పిల్లలకు సహాయం చేస్తారు. * దాసులతో వ్యవహరించడానికి సంబంధించి సామెతలు 29:21లో ఇవ్వబడిన ఈ హెచ్చరిక పిల్లలకు కూడా అంతే శక్తివంతంగా అన్వయిస్తుంది, “ఒకడు తన దాసుని చిన్నప్పటినుండి గారాబముగా పెంచినయెడల తుదిని వాడు కుమారుడుగా ఎంచబడును” లేక నూతనలోక అనువాదము చెబుతున్నట్లుగా, “చివరికి వాడు కృతజ్ఞతలేనివాడిగా తయా​రవుతాడు.”

కృతజ్ఞత చూపించడానికి మరీ చిన్నపిల్లలకు ఎలా సహాయం చేయవచ్చు? ముగ్గురు పిల్లల తల్లియైన లిండా ఇలా చెబుతోంది, “కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము వ్రాసే కార్డుల మీద మా పిల్లలు ఏదైనా బొమ్మ వేయడం ద్వారా లేదా తమ పేర్లు వ్రాయడం ద్వారా తమ కృతజ్ఞతను తెలియజేసేలా నేను, నా భర్తా వారిని ప్రోత్సహించేవాళ్ళం.” వారు వేసిన బొమ్మ ఏమంత అందంగా లేకపోయినా, వారి చేతివ్రాత ఏమంత సరిగా లేకపోయినా, ఈ పని చేయడం ద్వారా వారు నేర్చుకునే పాఠం మాత్రం చాలా గొప్పది.

(3) పట్టుదల. మనందరిలో పుట్టుకతోనే స్వార్థం ఉంటుంది, ఇది కృతజ్ఞతాభావాలను అణచివేయవచ్చు. (ఆదికాండము 8:21; మత్తయి 15:19) అయినప్పటికీ, దేవుని సేవకులను బైబిలిలా ప్రోత్సహిస్తోంది, ‘మీ చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై, దేవుని పోలికగా సృష్టింప​బడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను.’—ఎఫెసీయులు 4:23, 24.

అయితే, ‘నవీనస్వభావమును ధరించుకొనేందుకు’ అంటే, క్రొత్త వ్యక్తిత్వాన్ని అలవర్చుకునేందుకు పిల్లలకు సహాయం చేయడం అంత సులభమేమీ కాదని అనుభవజ్ఞులైన తల్లిదండ్రులకు తెలుసు. మొదట్లో ప్రస్తావించబడిన స్టీఫెన్‌ ఇలా అంటున్నాడు, “మా అమ్మాయిలు వాళ్ళంతట వాళ్ళే కృతజ్ఞతలు చెప్పేలా వాళ్లకు నేర్పించడానికి చాలా సమయం పడుతున్నట్లు అనిపించింది.” అయినా స్టీఫెన్‌, ఆయన భార్యా ఆశవదులుకోలేదు. స్టీఫెన్‌ ఇలా చెబుతున్నాడు, “ఎంతో పట్టుదలతో కృషిచేసిన తర్వాత మా అమ్మాయిలు కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇతరులపట్ల కృతజ్ఞత చూపించడాన్ని చూసి మేమెంతో గర్విస్తున్నాము.”

స్నేహితుల, పొరుగువాళ్ళ విషయమేమిటి?

కృతజ్ఞత లేకపోవడం మూలంగా కాదు గానీ మర్చిపోవడం మూలంగానే కొన్నిసార్లు మనం కృతజ్ఞతలు చెప్పకపోవచ్చు. అయితే మనం, కృతజ్ఞత కలిగివుండడం మాత్రమే కాదు, దానిని వ్యక్తం చేయడం కూడా నిజంగా అంత ప్రాముఖ్యమా? దీనికి సమాధానం కావాలంటే యేసు, కొందరు కుష్ఠరోగులు ఇమిడివున్న ఒక సంఘటనను పరిశీలించండి.

యెరూషలేముకు వెళ్తున్నప్పుడు యేసుకు పదిమంది కుష్ఠరోగులు ఎదురయ్యారు. బైబిలు ఇలా వివరిస్తోంది, “[వారు] యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు​వేసిరి. ఆయన వారిని చూచి—మీరు వెళ్లి, మిమ్మును యాజకులకు కనుపరచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్లుచుండగా, శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు, తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఆయన పాదములయొద్ద సాగిలపడెను; వాడు సమరయుడు.”—లూకా 17:11-16.

మిగతావారు కృతజ్ఞత వ్యక్తం చేయకపోవడాన్ని యేసు గమనించకుండా ఉన్నాడా? ఆ వృత్తాంతం ఇలా కొన​సాగుతోంది, “అందుకు యేసు—పదిమంది శుద్ధులైరి కారా; ఆ తొమ్మండుగురు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమ​పరచుటకు తిరిగి వచ్చినవాడెవడును అగపడలేదా? అని చెప్పెను.”—లూకా 17:17, 18.

మిగతా తొమ్మిదిమంది కుష్ఠరోగులు చెడ్డవాళ్ళు కాదు. అంతకుముందు వాళ్ళు యేసుపై విశ్వాసాన్ని బహిరంగంగా వ్యక్తం చేసి, యెరూషలేముకు ప్రయాణం చేసి వెళ్ళి యాజకులకు చూపించుకోమని ఆయన ఇచ్చిన ఆదేశాలను ఇష్టపూర్వకంగా పాటించారు. యేసు చేసిన దయాపూర్వక చర్యనుబట్టి వారిలో ఎంతో కృతజ్ఞతాభావం కలిగినప్పటికీ వారు దానిని వ్యక్తం చేయడంలో విఫలమయ్యారు. వారి ప్రవర్తన క్రీస్తును నిరాశపర్చింది. మన విషయమేమిటి? ఎవరైనా మనతో మంచిగా వ్యవహరించినప్పుడు మనం వెంటనే కృతజ్ఞతలు తెలియజేస్తామా, సముచితమైన చోట దాన్ని వ్రాతపూర్వకంగా తెలియజేస్తామా?

‘ప్రేమ అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు’ అని బైబిలు చెబుతోంది. (1 కొరింథీయులు 13:5) కాబట్టి, కృతజ్ఞతాభావాన్ని యథార్థంగా వ్యక్తం చేయడంద్వారా మనకు మంచి మర్యాద ఉందని చూపించడమే కాదు, వారిపట్ల మనకు ప్రేమ ఉందని కూడా చూపిస్తాం. కుష్ఠరోగుల వృత్తాంతం మనకు బోధిస్తున్నట్లుగా, క్రీస్తును సంతోషపర్చాలనుకునేవారు అందరి​పట్ల, అంటే దేశం, జాతి, మతం అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరిపట్ల ప్రేమ, కృతజ్ఞత చూపించాలి.

‘నాకు సహాయం చేసిన పొరుగువారికి, తోటి పనివారికి, తోటి విద్యార్థికి, ఆసుపత్రి సిబ్బందికి, దుకాణదారునికి లేదా మరెవరికైనా చివరిసారిగా నేనెప్పుడు కృతజ్ఞతలు చెప్పాను’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు గత ఒకటి రెండు రోజుల్లో ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పారో లేక వ్రాతపూర్వకంగా తెలియజేశారో చూసుకునేందుకు ఆ విషయాన్ని ఎక్కడైనా ఎందుకు వ్రాసిపెట్టుకోకూడదు? అలా వ్రాసిపెట్టుకోవడం, కృతజ్ఞతను వ్యక్తం చేయడంలో మీరు ఎక్కడ ప్రగతి సాధించాలో గ్రహించేందుకు మీకు సహాయం చేస్తుంది.

అందరికన్నా ఎక్కువగా మనం కృతజ్ఞతలు చెల్లించవలసింది యెహోవా దేవునికే. మనకు, “శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును” అనుగ్రహించేది ఆయనే. (యాకోబు 1:17) దేవుడు మీకు అనుగ్రహించిన వాటి కోసం మీరు చివరిసారిగా ఎప్పుడు ఆయనకు హృదయ​పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు?—1 థెస్సలొనీకయులు 5:17, 18.

ఇతరులు కృతజ్ఞత చూపించకపోయినప్పటికీ మనమెందుకు చూపించాలి?

మనం ఇతరులకు ఏదైనా సహాయం చేసినప్పుడు వాళ్ళు మనకు కృతజ్ఞత చూపించకపోవచ్చు. ఇతరులు కృతజ్ఞత చూపించకపోయినప్పటికీ మనమెందుకు కృతజ్ఞత చూపించాలి? కేవలం ఒక్క కారణాన్ని పరిశీలించండి.

కృతజ్ఞత చూపించనివారికి మనం మేలు చేస్తే మనం ఉదార స్వభావంగల మన సృష్టికర్తయైన యెహోవా దేవుణ్ణి అనుకరిస్తాం. యెహోవా చూపించే ప్రేమకు చాలామంది కృతజ్ఞత చూపించనంతమాత్రాన ఆయన వారికి మంచి చేయడం మానడు. (రోమీయులు 5:8; 1 యోహాను 4:9, 10) ఆయన “చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింప​జేసి, నీతిమంతులమీదను, అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.” కృతజ్ఞతలేని లోకంలో జీవిస్తున్నప్పటికీ మనం కృతజ్ఞత చూపించడానికి కృషిచేస్తే, మనం ‘పరలోకమందున్న మన తండ్రికి కుమారులమని’ నిరూపించుకుంటాము.—మత్తయి 5:44, 45. (w 08 8/1)

[అధస్సూచి]

^ పేరా 14 చాలామంది తల్లిదండ్రులు యెహోవాసాక్షులు ప్రచురించిన గొప్ప బోధకుడి నుండి నేర్చుకోండి (ఆంగ్లం) అనే పుస్తకాన్ని తమ పిల్లలతో కలిసి చదివి, దానిని వారితో చర్చించారు. “కృతజ్ఞతలు చెప్పాలని మీరు గుర్తుపెట్టుకుంటారా?” అనేది ఆ పుస్తకంలోని 18వ అధ్యాయాంశం.

[23వ పేజీలోని బ్లర్బ్‌]

గత ఒకటి రెండు రోజుల్లో మీరు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పారో చూసుకోవడానికి దానిని వ్రాసిపెట్టుకోండి

[23వ పేజీలోని చిత్రం]

కృతజ్ఞతను వ్యక్తం చేయడంలో మీ పిల్లలకు మాదిరినుంచండి

[23వ పేజీలోని చిత్రం]

కృతజ్ఞతను వ్యక్తం చేయడానికి చిన్నపిల్లలకు కూడా శిక్షణనివ్వవచ్చు