కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు యేసు గురించి అంతా చెబుతుందా?

బైబిలు యేసు గురించి అంతా చెబుతుందా?

యేసు గొల్గొతాలో చనిపోయాడని బైబిలు చెప్తున్నది నిజం కాదా? ఆయన మగ్దలేనే మరియను పెళ్లి చేసుకున్నాడా, వాళ్లకు పిల్లలు కలిగారా? ఆయన జీవిత సుఖాలన్నిటినీ వదిలేసిన సన్యాసా? ఆయన బైబిలుకు విరుద్ధమైన సిద్ధాంతాలను బోధించాడా?

అలాంటి ఊహాగానాలు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయాయి. దీనికి కొంతవరకు, ప్రజాదరణ పొందిన సినిమాలు, నవలలు కూడా కారణం. అలాంటి కట్టుకథలే కాదు, యేసు గురించి సువార్తల్లో చేర్చని వాస్తవాలు ఉన్నాయని చెప్పుకునే, సా.శ. రెండు, మూడు శతాబ్దాల్లో రాయబడిన అప్రమాణిక పుస్తకాలను విశ్లేషిస్తూ ఎన్నో పుస్తకాలు, ఆర్టికల్స్‌ వస్తున్నాయి. అలాంటి వాదనలు నమ్మదగినవేనా? బైబిలు, యేసు గురించి అంతా చెప్తుందా, ఆయన గురించి అది చెప్తున్నది నిజమేనని నమ్మవచ్చా?

మూడు ప్రాథమిక విషయాలు పరిశీలిస్తే అలాంటి ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవచ్చు. మొదట మనం సువార్త వృత్తాంతాలను రాసిన వారి గురించిన ముఖ్యమైన విషయాలను, అలాగే వాటిని వారు ఎప్పుడు రాశారనే విషయాన్ని తెలుసుకోవడం అవసరం; రెండవదిగా, బైబిలు ప్రామాణిక పుస్తకాల పట్టికను ఎవరు, ఎలా నిర్ణయించారు అనేది తెలుసుకోవాలి; మూడవదిగా, అప్రమాణిక పుస్తకాల గురించిన కొన్ని వివరాలు, అలాగే వీటికీ బైబిలు ప్రామాణిక పుస్తకాలకూ మధ్య ఉన్న తేడా తెలుసుకోవాలి. a

క్రైస్తవ గ్రీకు లేఖనాలను ఎప్పుడు రాశారు, ఎవరు రాశారు?

మత్తయి సువార్త యేసు చనిపోయిన ఎనిమిదేళ్లకే అంటే దాదాపు సా.శ. 41లో రాయబడిందని కొన్ని గ్రంథాలు తెలియజేస్తున్నాయి. చాలామంది విద్వాంసులు అది కాస్త తర్వాతికాలంలో రాయబడిందని భావిస్తున్నారు. ఏదేమైనా క్రైస్తవ గ్రీకు లేఖనాల్లోని పుస్తకాలన్నీ సా.శ. మొదటి శతాబ్దంలోనే రాయబడ్డాయని చాలామంది ఒప్పుకుంటారు.

యేసు జీవించివున్నప్పుడు, మరణించినప్పుడు, పునరుత్థానం చేయబడినప్పుడు ప్రత్యక్షంగా చూసినవాళ్లు అప్పటికింకా బ్రతికేవున్నారు. వాళ్లు సువార్త వృత్తాంతాల్లో రాయబడినవి వాస్తవాలో కాదో చెప్పగలరు. అందులో రాసిన వివరాలు నిజం కాకపోతే వాళ్లు సులువుగా బయటపెట్టివుండేవాళ్లే. ప్రొఫెసర్‌ ఎఫ్‌. ఎఫ్‌. బ్రూస్‌ ఇలా చెప్తున్నాడు: “అపొస్తలులు ప్రకటిస్తున్నప్పుడు తమ శ్రోతలకు తెలిసిన విషయాలనే చెప్పేవారు కాబట్టి వాళ్లు ధైర్యంగా మాట్లాడారు; వాళ్లు ‘వీటికి మేము సాక్షులము,’ అని మాత్రమే కాదు అవి ‘మీకు కూడా తెలుసు’ అని చెప్పేవారు (అపొస్తలుల కార్యములు 2:22).”

అపొస్తలుడైన పౌలు అద్భుతాలు చేశాడు, ఒకసారి పునరుత్థానం కూడా చేశాడు. అలా చేయడం ద్వారా ఆయన తనకు, తాను రాసిన పత్రికలకు దేవుని ఆత్మ మద్ధతు ఉందని తిరుగులేని విధంగా చూపించాడు

క్రైస్తవ గ్రీకు లేఖనాలను ఎవరు రాశారు? రాసినవాళ్లలో యేసు 12 మంది అపొస్తలుల్లో కొంతమంది ఉన్నారు. వీళ్లతోపాటు యాకోబు, యూదా, బహుశా మార్కు వంటి ఇతర బైబిలు రచయితలు కూడా సా.శ. 33 పెంతెకొస్తు రోజున క్రైస్తవ సంఘం స్థాపించబడినప్పుడు ఉన్నారు. పౌలుతో సహా రచయితలందరూ యెరూషలేములోని అపొస్తలులు, పెద్దలతో కూడిన తొలి క్రైస్తవ సంఘానికి చెందిన మొట్టమొదటి పరిపాలక సభతో కలిసి పనిచేశారు.—అపొస్తలుల కార్యములు 15:2, 6, 12-14, 22; గలతీయులు 2:7-10.

యేసు తను మొదలుపెట్టిన ప్రకటనా, బోధనా పనిని కొనసాగించమని తన అనుచరులకు ఆజ్ఞ ఇచ్చాడు. (మత్తయి 28:19, 20) ‘మీ మాట వినేవారు నా మాట వింటారు’ అని కూడా ఆయన చెప్పాడు. (లూకా 10:16) అంతేకాదు, ఆ పనిని చేయడానికి కావల్సిన శక్తిని దేవుని పరిశుద్ధాత్మ లేదా చురుకైన శక్తి ఇస్తుందని ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి దేవుని పరిశుద్ధాత్మచేత ఆశీర్వదించబడినట్లు తమ పనులద్వారా స్పష్టంగా చూపించిన అపొస్తలులు లేదా వారి సన్నిహిత తోటిపనివారు రాసిన వాటిని తొలి క్రైస్తవులు అందుకున్నప్పుడు వాళ్లు సహజంగానే వాటిని అధికారిక పుస్తకాలుగా గుర్తించారు.

బైబిలు రాసిన కొంతమంది, తమ తోటి వాళ్లకు అలా రాసే అధికారముందని, వాళ్లు దేవుని ప్రేరణతోనే రాశారని ధృవీకరించారు. ఉదాహరణకు, అపొస్తలుడైన పేతురు పౌలు రాసిన పత్రికల గురించి మాట్లాడుతూ ‘తక్కిన లేఖనాల్లా’ అవి కూడా ప్రేరేపితమైనవేనని సూచించాడు. (2 పేతురు 3:15, 16) అపొస్తలులు, ఇతర క్రైస్తవ ప్రవక్తలు దేవునిచేత ప్రేరేపించబడ్డారని పౌలు కూడా రాశాడు.—ఎఫెసీయులు 3:5.

కాబట్టి సువార్త వృత్తాంతాలు నమ్మదగినవి, విశ్వసనీయమైనవి అనడానికి బలమైన ఆధారాలున్నాయి. అవి కేవలం కట్టుకథలో, కల్పిత గాథలో కాదు. అవి దేవుని పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడినవాళ్లు ప్రత్యక్షసాక్షులు చెప్పినదాని ఆధారంగా జరిగిన వాటిని జాగ్రత్తగా రాసిపెట్టిన వృత్తాంతాలు.

బైబిల్లోని గ్రీకు ప్రామాణిక పుస్తకాల పట్టికను ఎవరు నిర్ణయించారు?

క్రైస్తవ గ్రీకు లేఖనాల రచయితలు వాటిని రాసిన శతాబ్దాల తర్వాత, కాన్‌స్టెంటైన్‌ చక్రవర్తి ఆధ్వర్యంలో స్థాపించబడిన చర్చీ బైబిల్లోని గ్రీకు ప్రామాణిక పుస్తకాల పట్టికను నిర్ణయించిందని కొందరు రచయితలు చెబుతారు. అయితే వాస్తవాలు మరోలా చూపిస్తున్నాయి.

ఉదాహరణకు, చర్చీ చరిత్ర ప్రొఫెసరైన ఒస్కార్‌ స్కార్సోనె ఏమి చెప్తున్నాడో గమనించండి: “ఏ పుస్తకాలను కొత్త నిబంధనలో చేర్చాలి, వేటిని చేర్చకూడదు అనేది ఏ చర్చి కౌన్సిల్‌గానీ లేదా ఎవరో ఒక వ్యక్తిగానీ ఎప్పుడూ నిర్ణయించలేదు . . . ఒక పుస్తకాన్ని ప్రామాణికమైనదిగా నిర్ణయించడానికి ఆధారాలు అందరికీ తెలిసినవి, ఎంతో అర్థవంతమైనవి: సా.శ. మొదటి శతాబ్దంలో అపొస్తలులు లేదా వారి తోటి పనివారు రాసినవిగా పరిగణించబడిన పుస్తకాలు నమ్మదగినవిగా ఎంచబడ్డాయి. ఆ తర్వాత రాయబడిన పుస్తకాలు, పత్రికలు లేదా ‘సువార్తలు’ అందులో చేర్చబడలేదు . . . ఈ ప్రక్రియ అంతా కాన్‌స్టెంటైన్‌కన్నా ఎంతోకాలం ముందే, ఆయన ఆధ్వర్యంలో చర్చి స్థాపించబడడానికి ఎంతోకాలం ముందే పూర్తయిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. కొత్త నిబంధనలోని పుస్తకాలుగా వేటిని దృష్టించాలి అనేదానిని, కాన్‌స్టెంటైన్‌ ఆధ్వర్యంలో స్థాపించబడిన చర్చీ కాదుగానీ తమ విశ్వాసం కోసం హింసించబడిన క్రైస్తవులు నిర్ణయించారు.”

క్రైస్తవ గ్రీకు లేఖనాలను అధ్యయనం చేసే సహాయ ప్రొఫెసర్‌ కెన్‌ బెర్డింగ్‌, బైబిల్లోని గ్రీకు ప్రామాణిక పుస్తకాల పట్టికలో ఏ పుస్తకాలు ఉండాలనేది ఎలా నిర్ణయించారో వివరిస్తూ ఇలా అన్నాడు: “బైబిలు ప్రామాణిక పుస్తకాల పట్టికలో ఏ పుస్తకాలు ఉండాలనేది చర్చి దాని ఇష్టానుసారంగా నిర్ణయించలేదు; అందుకే అధికారపూర్వకంగా దేవుని నుండి వచ్చిన వాక్యం అని క్రైస్తవులు ఎప్పుడూ పరిగణించిన పుస్తకాలనే చర్చి ఆమోదించిందని చెప్పడం సరైనదవుతుంది.”

అయితే, మొదటి శతాబ్దానికి చెందిన సామాన్య క్రైస్తవులే బైబిల్లోని గ్రీకు ప్రామాణిక పుస్తకాల పట్టికలో ఏమి ఉండాలో నిర్ణయించేశారా? ఈ విషయంలో, వారికన్నా ఎంతో ప్రాముఖ్యమైనది, ఎంతో శక్తివంతమైనది పనిచేసిందని బైబిలు చెప్తోంది.

క్రైస్తవ సంఘం పరిశుద్ధాత్మకు సంబంధించిన ‘నానావిధాలైన కృపావరములు’ పొందిందని బైబిలు చెబుతోంది. (1 కొరింథీయులు 12:4) అందువల్ల, పరిశుద్ధాత్మ సహాయంతో కొందరు క్రైస్తవులు నిజంగా దేవుని చేత ప్రేరేపించబడినవాటికీ ప్రేరేపించబడనివాటికీ మధ్య ఉన్న తేడాను తెలుసుకోగలిగారు. కాబట్టి నేటి క్రైస్తవులు, బైబిల్లో ఉన్న లేఖనాలు దేవుని ప్రేరేపణతో రాయబడినవిగా గుర్తించబడ్డాయనే నమ్మకంతో ఉండవచ్చు.

దీన్నిబట్టి, బైబిలు ప్రామాణిక పుస్తకాల పట్టిక పరిశుద్ధాత్మ నిర్దేశంతో ఆరంభంలోనే నిర్ణయించబడిందని స్పష్టంగా తెలుస్తోంది. బైబిలు పుస్తకాల ప్రామాణికత గురించి సా.శ. రెండవ శతాబ్దం ద్వితీయార్థంలో కొందరు రచయితలు మాట్లాడారు. అలా అని వాళ్లే బైబిల్లోని పుస్తకాల పట్టికను నిర్ణయించారని కాదు; పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడిన తన ప్రతినిధుల ద్వారా దేవుడు అప్పటికే అంగీకరించినవాటిని వాళ్లు కేవలం సమర్థించారు.

ఇప్పుడు బైబిలు ప్రామాణిక పుస్తకాల పట్టికగా ఆమోదించబడినదాన్ని సమర్థించే గట్టి రుజువులు ప్రాచీన రాతప్రతుల్లో కూడా ఉన్నాయి. మూల భాషలో రాయబడిన 5,000 కన్నా ఎక్కువ గ్రీకు లేఖనాల రాతప్రతులున్నాయి, వాటిలో కొన్ని 2వ, 3వ శతాబ్దాలకు చెందినవి కూడా ఉన్నాయి. ఈ రాతప్రతులనే సా.శ. ఆరంభ శతాబ్దాల్లో అధికారికమైనవిగా గుర్తించి నకలు రాసి, విరివిగా పంచిపెట్టారుగానీ అప్రమాణిక పుస్తకాలను కాదు.

ఏదేమైనప్పటికీ, బైబిలు పుస్తకాల్లో ఉన్న రుజువులే దాని ప్రామాణికతకు అత్యంత ముఖ్యమైన ఆధారం. బైబిల్లోని గ్రీకు ప్రామాణిక పుస్తకాల పట్టికలోని పుస్తకాలు మిగతా బైబిలంతటిలో ఉన్న ‘హితవాక్యప్రమాణంతో’ పొందిక కలిగి ఉన్నాయి. (2 తిమోతి 1:13) ఆ లేఖనాలు యెహోవాను ప్రేమించమని, ఆరాధించమని, సేవించమని నేర్పిస్తున్నాయి. అలాగే మూఢనమ్మకాలను, దయ్యాలతో సంబంధాన్ని, సృష్టిని ఆరాధించడాన్ని ఖండిస్తున్నాయి. అవి చరిత్రపరంగా ఖచ్చితంగా ఉన్నాయి, వాటిలో నిజమైన ప్రవచనాలున్నాయి. తోటి మానవులను ప్రేమించమని అవి ప్రోత్సహిస్తాయి. క్రైస్తవ గ్రీకు లేఖనాల్లోని పుస్తకాలకు ఇలాంటి ప్రత్యేక లక్షణాలున్నాయి. అప్రమాణిక పుస్తకాల్లో కూడా ఈ విషయాలన్నీ ఉన్నాయా?

ప్రామాణిక పుస్తకాలకు, అప్రమాణిక పుస్తకాలకు తేడా ఏమిటి?

ప్రామాణిక పుస్తకాలకు, అప్రమాణిక పుస్తకాలకు మధ్య చాలా తేడా ఉంది. ఈ అప్రమాణిక పుస్తకాలు రెండవ శతాబ్దం మధ్యభాగంలో అంటే ప్రామాణిక పుస్తకాలు రాయబడిన ఎంతోకాలం తర్వాత రాయబడ్డాయి. ఇవి యేసు గురించి, క్రైస్తవత్వం గురించి బైబిలు చెబుతున్నదానికి విరుద్ధంగా బోధిస్తున్నాయి.

ఉదాహరణకు, అప్రమాణిక పుస్తకాల్లో ఒకటైన తోమా సువార్త, యేసు ఎన్నో వింత మాటలు పలికినట్లు చెబుతోంది. మచ్చుకు ఒకటేమిటంటే, పరలోక రాజ్యంలోకి ప్రవేశించగలిగేలా మరియను పురుషునిలా మారుస్తానని ఆయన చెప్పినట్లు బోధిస్తోంది. చిన్నప్పుడు యేసుకు చెడు స్వభావం ఉండేదనీ, ఆయన కావాలనే మరో పిల్లవాడి చావుకు కారణమయ్యాడనీ తోమా రాసిన బాలయేసు సువార్త వివరిస్తోంది. పౌలు కార్యములు, పేతురు కార్యములు అనే అప్రమాణిక పుస్తకాలు, లైంగిక సంబంధాలకు పూర్తిగా దూరంగా ఉండాలని చెప్పడమేకాదు, స్త్రీలు తమ భర్తల నుండి విడిపోవాలని అపొస్తలులు చెప్పినట్లు వివరిస్తున్నాయి. శిష్యులు ఒక సందర్భంలో భోజనం గురించి దేవునికి ప్రార్థించడం చూసి యేసు ఎగతాళిగా నవ్వాడని యూదా సువార్త చెప్తోంది. ఇవన్నీ ప్రామాణికమైన బైబిలు పుస్తకాల్లో ఉన్న విషయాలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.—మార్కు 14:22; 1 కొరింథీయులు 7:3-5; గలతీయులు 3:28; హెబ్రీయులు 7:26.

ఎన్నో అప్రమాణిక పుస్తకాల్లో అతీంద్రియ జ్ఞానవాదుల నమ్మకాలున్నాయి. సృష్టికర్తయిన యెహోవా మంచి దేవుడు కాదని వాళ్లు నమ్మేవాళ్లు. పునరుత్థానం నిజంగా జరగదని, మన చుట్టూ ఉన్నవన్నీ చెడ్డవేనని, వివాహాన్నీ పునరుత్పత్తినీ మొదలుపెట్టింది సాతానని కూడా వాళ్లు నమ్మేవారు.

ఎన్నో అప్రమాణిక పుస్తకాలు బైబిల్లోని వ్యక్తులు రాసినట్లుగా వాళ్ల పేర్లతో ఉన్నప్పటికీ నిజానికి రాసింది వాళ్లు కాదు. ఎవరైనా కుట్రపన్ని ఈ పుస్తకాలను బైబిల్లో నుండి తొలగించేశారా? అప్రమాణిక పుస్తకాల అధ్యయనంలో ప్రావీణ్యుడైన ఎం.ఆర్‌. జేమ్స్‌ ఇలా అంటున్నాడు: “మరెవరో వాటిని కొత్త నిబంధనలోనుండి తీసివేసే అవకాశమే లేదు, అవి కొత్త నిబంధనలోనివి కాదని వాటికవే చూపించుకున్నాయి.”

మతభ్రష్టత్వం రాబోతుందని బైబిలు రచయితలు హెచ్చరించారు

మత భ్రష్టత్వం క్రైస్తవ సంఘాన్ని కలుషితం చేయబోతుందని చెప్పే ఎన్నో హెచ్చరికలు ప్రామాణిక పుస్తకాల్లో ఉన్నాయి. నిజానికి, ఈ మత భ్రష్టత్వం మొదటి శతాబ్దంలోనే ప్రారంభమైనా అపొస్తలులు అది విస్తరించకుండా అడ్డుకున్నారు. (అపొస్తలుల కార్యములు 20:30; 2 థెస్సలొనీకయులు 2:2, 3, 6, 7; 1 తిమోతి 4:1-3; 2 పేతురు 2:1; 1 యోహాను 2:18, 19; 4:1-3) అలాంటి హెచ్చరికలు, అపొస్తలులు మరణించిన తర్వాత పుట్టుకొచ్చిన పుస్తకాల గురించి ముందే చెప్పాయి. ఆ పుస్తకాలు యేసు బోధలకు విరుద్ధంగా ఉన్నాయి.

కొంతమంది విద్వాంసులు, చరిత్రకారులు ఈ పుస్తకాలు పురాతనమైనవి కాబట్టి వాటిని గౌరవించాలని అనుకుంటారనే మాట నిజమే. కానీ ఈ విషయాన్ని ఆలోచించండి: ఈ రోజుల్లో ముద్రించబడిన నమ్మకూడని విషయాలున్న కాగితాలను, అంటే పుకార్లు ప్రచురించే కొన్ని పత్రికల నుండి లేదా తీవ్ర మత నమ్మకాలున్న గుంపులకు చెందిన ప్రచురణల నుండి సేకరించిన విషయాలున్న కాగితాలను విద్వాంసులు ఎవరైనా జాగ్రత్తగా చుట్టి చర్చి క్రింద ఉండే గదిలో దాచిపెట్టారు అనుకుందాం. కాలం గడవడం వల్ల ఆ రాతలు నిజాలైపోతాయా, నమ్మదగినవైపోతాయా? 1,700 సంవత్సరాల తర్వాత, ఆ కాగితాలు చాలాపాతవి కాబట్టి వాటిలోని అబద్ధాలు, అర్థంపర్థంలేని రాతలు నిజాలైపోతాయా?

ఎట్టిపరిస్థితుల్లోను నిజాలైపోవు! యేసు మగ్దలేనే మరియను పెళ్లి చేసుకున్నాడనే ఆరోపణలు, అప్రమాణిక పుస్తకాలు చెబుతున్న విడ్డూరమైన ఇతర వ్యాఖ్యలు కూడా అలాంటివే. మన దగ్గర నమ్మదగిన పుస్తకాలు ఉన్నప్పుడు, అలాంటి అప్రమాణిక పుస్తకాలను ఎందుకు నమ్మాలి? దేవుడు తన కుమారుని గురించి మనం తెలుసుకోవాలనుకున్న విషయాలన్నీ బైబిల్లో ఉన్నాయి. దాన్ని మనం తప్పకుండా నమ్మవచ్చు. (w10-E  04/01)

a దేవునిచేత ప్రేరేపించబడినవని చెప్పడానికి తగినంత రుజువున్న బైబిలు పుస్తకాల మొత్తాన్ని “బైబిలు ప్రామాణిక పుస్తకాల పట్టిక” అంటారు. ప్రామాణికమైనవిగా గుర్తించబడిన పుస్తకాలు 66 ఉన్నాయి. అవి చాలా ప్రాముఖ్యమైనవి, దేవుని వాక్యంలో నుండి తొలగించకూడనివి.