అపవాది నిజంగా ఒక వ్యక్తా?
మా పాఠకుల ప్రశ్న
అపవాది నిజంగా ఒక వ్యక్తా?
అవును, అపవాది అయిన సాతాను నిజంగా ఒక వ్యక్తే అని బైబిలు బోధిస్తోంది. అయితే బైబిలు విమర్శకులు దాన్ని కొట్టిపారేస్తారు. మనుషుల్లోని చెడు ఆలోచనే సాతాను అని వారంటారు.
సాతాను గురించి ఇలా రకరకాల అభిప్రాయాలు ఉండడం చూసి మనం తికమకపడాలా? అవసరం లేదు. ఉదాహరణకు, ఒక నేరస్థుడు తను దొరికిపోకుండా ఉండడానికి, గుట్టు చప్పుడు కాకుండా చట్ట వ్యతిరేక పనులు కొనసాగించడానికి నేరం చేసిన చోట తన వేలిముద్రలు దొరకకుండా జాగ్రత్తపడతాడు. అలాగే, నేరాలు చేయడంలో ఆరితేరిన సాతాను కూడా ప్రజలు నైతికంగా దిగజారిపోయేలా చేస్తూ చాటుగా తన పనిని కొనసాగిస్తాడు. మానవుల్లో ఇంత దుష్టత్వం ఉండడానికి కారణం సాతానేనని యేసు స్పష్టంగా చెప్పాడు. సాతానును ఆయన “ఈ లోకాధికారి” అని అన్నాడు.—యోహాను 12:31.
అపవాది ఎక్కడ నుండి వచ్చాడు? మొదట పరలోకంలో పరిపూర్ణ ఆత్మప్రాణిగా సృష్టించబడినా ఆ తర్వాత తిరుగుబాటు చేసిన ఈ దూత, మానవులు దేవుణ్ణి ఆరాధించే బదులు తనను ఆరాధించాలనే కోరిక పెంచుకొని అపవాది అయ్యాడు. భూమ్మీద యేసుకు, సాతానుకు మధ్య జరిగిన సంభాషణ గురించి బైబిలు తెలియజేస్తోంది. ఆ సంభాషణలో అపవాది తనకున్న స్వార్థపూరిత కోరికను బయటపెట్టాడు. ‘సాగిలపడి తనకు నమస్కారం చేసేలా’ యేసును ప్రలోభపెట్టడానికి సాతాను ప్రయత్నించాడు.—మత్తయి 4:8, 9.
అదేవిధంగా, యోబు గ్రంథంలో రాయబడినట్లుగా, దేవునితో మాట్లాడుతున్నప్పుడు సాతాను తన దురుద్దేశాలను బయటపెట్టాడు. మానవులు దేవుణ్ణి విడిచిపెట్టేలా చేయడానికి అతను ఎంతకైనా తెగిస్తాడు.—యోబు 1:13-19; 2:7, 8.
ఈ విషయం గురించి ఒకసారి ఆలోచించండి: సాతాను యెహోవా దేవునితో, యేసుక్రీస్తుతో మాట్లాడాడు కదా, మరి అలాంటప్పుడు అతను కేవలం ఇతరుల మనసుల్లో ఉండే దుష్టస్వభావం మాత్రమే ఎలా అవుతాడు? దేవునిలో గానీ, ఆయన కుమారునిలో గానీ దుష్టత్వమనేదే లేదు. కాబట్టి సాతాను ఒక నిజమైన వ్యక్తి. ఈ ఆత్మప్రాణికి యెహోవా మీద, యేసు మీద ఏమాత్రం గౌరవం లేదు.
మానవుల కార్యకలాపాలు భ్రష్టుపట్టుకుపోవడం, అపవాది ఒక నిజమైన వ్యక్తి అని రుజువుచేస్తోంది. ప్రపంచంలోని దేశాలు తమ దగ్గరున్న మిగులు ఆహార పదార్థాలు కుళ్లిపోడానికైనా విడిచిపెడతారుగానీ ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు మాత్రం ఇవ్వరు. దేశాలు ఒకదాన్నొకటి సర్వనాశనం చేసుకోవడానికి ఆయుధాల్ని పోగుచేసుకుంటున్నాయి, భూవాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా, స్వనాశనానికి నడిపించే అలాంటి ద్వేషపూరితమైన ప్రవర్తనకు అసలు కారకుడెవరో చాలామందికి తెలీదు. ఎందువల్ల?
సాతాను ‘అవిశ్వాసులైనవారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేస్తున్నాడు’ అని బైబిలు చెబుతోంది. (2 కొరింథీయులు 4:4) మానవుల్ని తప్పుదారి పట్టించడానికి సాతాను ఓ అదృశ్య వ్యవస్థను ఉపయోగిస్తున్నాడు. వాడు ‘దయ్యములకు అధిపతి.’ (మత్తయి 12:24) తెర వెనుక ఉండి నేరాలు చేయిస్తూ ఒక నేర సామ్రాజ్యాన్ని నడిపించే నేరస్థుడు తన కోసం పనిచేసే వారందరికీ తనెవరో తెలీనివ్వడు. అలాగే, సాతాను కూడా తన దుష్టదూతల వ్యవస్థను ఉపయోగించి మానవులను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. వాళ్లలో చాలామందికి ఈ విషయం తెలీదు.
బైబిలు అపవాదిని, అతని వ్యవస్థను బట్టబయలు చేస్తున్నందుకు మనమెంత కృతజ్ఞులమో కదా! బైబిలు అలా వివరిస్తున్నందువల్లే అపవాది ప్రభావాన్ని ఎదిరించే చర్యలు తీసుకునే అవకాశం మనకుంది. ‘దేవునికి లోబడివుండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీయొద్ద నుండి పారిపోతాడు’ అని బైబిలు మనకు ప్రబోధిస్తోంది.—యాకోబు 4:7. (w09-E 10/01)