ముఖపత్ర అంశం | ఎందుకు మంచివాళ్లకు ఈ కష్టాలు?
చెడును దేవుడు ఏమి చేయబోతున్నాడు?
అపవాదియైన సాతాను తీసుకొచ్చిన బాధలను యెహోవా, ఆయన కుమారుడు యేసుక్రీస్తు ఏమి చేయబోతున్నారో బైబిలు స్పష్టంగా ఇలా చెబుతుంది: “అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు [యేసు] ప్రత్యక్షమాయెను.” (1 యోహాను 3:8) దురాశ, ద్వేషం, చెడుపనుల వంటివాటి మీద అపవాది నిర్మించిన ఈ వ్యవస్థ నాశనం అవుతుంది. “ఈ లోకాధికారి” సాతాను “బయటకు త్రోసివేయబడును” అని యేసు మాటిచ్చాడు. (యోహాను 12:31) సాతాను ప్రభావం ఇక ఉండదు కాబట్టి భూమంతటా నీతి, శాంతి విలసిల్లుతాయి.—2 పేతురు 3:13.
చెడు పనులు చేస్తూ మారడానికి ఇష్టపడనివాళ్లకు ఏమౌతుంది? బైబిలు సూటిగా ఇలా చెబుతుంది: “యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపములేనివారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు దేశములో నుండకుండ నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలోనుండి పెరికివేయబడుదురు.” (సామెతలు 2:21, 22) చెడు ప్రజల ప్రభావం ఇక ఉండదు. అలాంటి ప్రశాంతమైన వాతావరణంలో విధేయులైన మనుషులు వారసత్వంగా వచ్చిన పాపం నుండి క్రమక్రమంగా విడుదల పొందుతారు.—రోమీయులు 6:17, 18; 8:20, 21.
కొత్తలోకంలో చెడుతనం ఉండదంటే, దేవుడు మనుషులకు ఇచ్చిన స్వేచ్ఛను తీసేసి, వాళ్లను రోబోల్లా చేస్తాడని దానర్థమా? కాదు. విధేయులైన మనుషులకు తన మార్గాల గురించి బోధిస్తూ హానికరమైన ఆలోచనల నుండి, పనుల నుండి బయటపడడానికి సహాయం చేస్తాడు.
బాధలకు కారణం అయ్యే ప్రతీదాన్ని దేవుడు తీసేస్తాడు
అనుకోని సంఘటనల విషయంలో దేవుడు ఏమి చేస్తాడు? త్వరలోనే తన రాజ్యం లేదా ప్రభుత్వం ఈ లోకాన్ని పరిపాలిస్తుందని ఆయన మాటిచ్చాడు. దేవుడు తన రాజ్యానికి రాజుగా యేసుక్రీస్తును నియమించాడు, ఆయనకు రోగులను బాగుచేసే శక్తి ఉంది. (మత్తయి 14:14) ప్రకృతిని నియంత్రించే శక్తి కూడా యేసుకు ఉంది. (మార్కు 4:35-41) అనుకోకుండా జరిగే సంఘటనల వల్ల ఇక ఎవరూ బాధపడరు. (ప్రసంగి 9:11) క్రీస్తు పరిపాలనలో ఎలాంటి విపత్తులూ రావు.—సామెతలు 1:33.
అలాంటి వాటివల్ల ఇప్పటివరకు చనిపోయిన కోట్లాది అమాయక ప్రజల విషయం ఏమిటి? యేసు తన స్నేహితుడైన లాజరును తిరిగి బ్రతికించే ముందు ఇలా అన్నాడు: “పునరుత్థానమును జీవమును నేనే.” (యోహాను 11:25) అవును, యేసుకు పునరుత్థానం చేసే శక్తి ఉంది, అంటే ఆయన చనిపోయిన వాళ్లను బ్రతికించగలడు!
మంచివాళ్లకు ఏమాత్రం చెడు జరగని లోకంలో జీవించాలని మీరు ఇష్టపడుతున్నారా? అయితే, బైబిలు అధ్యయనం చేస్తూ నిజమైన దేవుని గురించీ ఆయన సంకల్పాల గురించీ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మీ ప్రాంతంలో ఉన్న యెహోవాసాక్షులు ఈ విషయంలో మీకు సంతోషంగా సహాయం చేస్తారు. వీలైతే వాళ్లను కలవమని లేదా ఈ పత్రిక ప్రచురణకర్తలకు ఉత్తరం రాయమని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాం. ▪ (w14-E 07/01)