కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుడు ఇచ్చే విమోచన క్రయధనం అనే గిఫ్ట్‌ శాశ్వతంగా బ్రతికి ఉండే అవకాశాన్ని ఇస్తుంది. అదే అన్నిటికన్నా బెస్ట్‌ గిఫ్ట్‌

పత్రిక ముఖ్యాంశం | అన్నిటికన్నా బెస్ట్‌ గిఫ్ట్‌!!!

అన్నిటికన్నా బెస్ట్‌ గిఫ్ట్‌

అన్నిటికన్నా బెస్ట్‌ గిఫ్ట్‌

“ప్రతీ మంచి బహుమానం, ప్రతీ పరిపూర్ణ వరం పైనుండే వస్తాయి. ఆకాశ కాంతులకు మూలమైన తండ్రి నుండే అవి వస్తాయి.” (యాకోబు 1:17) ఆ వచనం మన పరలోక తండ్రి అయిన యెహోవా దేవుని ఉదారత గురించి చెప్తుంది. కానీ మనుషులకు ఆయన ఇచ్చిన ఎన్నో గిఫ్ట్‌లలో ఒకటి మిగతావాటికన్నా చాలా గొప్పది. అది ఏంటి? యేసు మాటలు యోహాను 3:16⁠లో ఇలా ఉన్నాయి: “దేవుడు లోకంలోని ప్రజల్ని ఎంతో ప్రేమించాడు, ఎంతగా అంటే వాళ్లకోసం తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చాడు. ఆయనమీద విశ్వాసం ఉంచే ఏ ఒక్కరూ నాశనం కాకుండా శాశ్వత జీవితం పొందాలని అలా చేశాడు.”

దేవుడు తన ఏకైక కుమారుడిని మనకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆ గిఫ్ట్‌ మనం అందుకోగల బహుమానాలన్నిటిలో చాలా గొప్పది. ఎందుకంటే అది పాపం, ముసలితనం, మరణం కింద బానిసలుగా ఉన్న మనకు విడుదల తెచ్చింది. (కీర్తన 51:5; యోహాను 8:34) మనం ఎంత ప్రయత్నించినా ఆ బానిసత్వం నుండి మనల్ని మనం విడిపించుకోలేము. కానీ ఆయనకున్న గొప్ప ప్రేమను బట్టి దేవుడు మనల్ని విడుదల చేయడానికి అవసరమైనది ఇచ్చాడు. తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును విమోచన క్రయధనంగా ఇవ్వడం ద్వారా యెహోవా దేవుడు విధేయులైన మనుషులకు శాశ్వతంగా జీవించే అవకాశాన్ని ఇచ్చాడు. కానీ అసలు విమోచన క్రయధనం అంటే ఏమిటి? అది ఎందుకు అవసరం? మనం దాని నుండి ఎలా ప్రయోజనం పొందవచ్చు?

విమోచన క్రయధనం అంటే ఏదైనా పోగొట్టుకున్న దాన్ని తిరిగి కొనుక్కోవడానికి లేదా బానిసత్వం నుండి విడిపించుకోవడానికి ఇచ్చే ధనం. మన మొదటి తల్లిదండ్రులైన ఆదాము హవ్వ ఏ పాపం లేకుండా సృష్టించబడ్డారు. వాళ్లూ, తర్వాత వాళ్లకు పుట్టే పిల్లలూ, భూమి మీద పరదైసులో ఎప్పటికీ బ్రతికి ఉండే అవకాశం ఉంది. (ఆదికాండము 1:26-28) కానీ వాళ్లు దేవునికి లోబడకూడదని నిర్ణయించుకుని అదంతా పోగొట్టుకున్నారు. అలా పాపులు అయ్యారు. దానివల్ల ఏమి జరిగింది? బైబిలు ఇలా చెప్తుంది: “ఒక మనిషి ద్వారా పాపం, పాపం ద్వారా మరణం లోకంలోకి ప్రవేశించాయి. అదే విధంగా, అందరూ పాపం చేశారు కాబట్టి మరణం అందరికీ వ్యాపించింది.” (రోమీయులు 5:12) ఆదాము తన పిల్లలకు ఏ లోపం లేని జీవితాన్ని వారసత్వంగా ఇచ్చే బదులు పాపాన్ని, దాని పర్యవసానంగా మరణాన్ని ఇచ్చాడు.

విమోచన క్రయధనం విషయానికొస్తే విమోచన క్రయధనంగా చెల్లించబడేది పోగొట్టుకున్న దానికి సమానంగా ఉండాలి. కావాలని దేవునికి లోబడకుండా ఉండడం ద్వారా ఆదాము పాపం చేశాడు. దాని ఫలితంగా ఏ లోపం లేని మనిషి ప్రాణం అంటే ఆదాము ప్రాణం పోయింది. అంతేకాకుండా బైబిలు ప్రకారం ఆదాముకు పుట్టే పిల్లలు కూడా పాపానికి మరణానికి బానిసలు అయ్యారు. అందుకే మరొక పరిపూర్ణమైన లోపం లేని ప్రాణాన్ని అంటే యేసు ప్రాణాన్ని చెల్లించాల్సి వచ్చింది. బానిసత్వం నుండి విడుదల కలిగించడానికి యేసు తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. (రోమీయులు 5:19; ఎఫెసీయులు 1:7) ఆదాము, హవ్వ పోగొట్టుకున్న మంచి జీవితాన్ని మనుషులు ఆనందించేలా ఈ విమోచన క్రయధనాన్ని దేవుడు ఎంతో ప్రేమతో ఇచ్చాడు. కాబట్టే మనుషులు భూమి మీద పరదైసులో శాశ్వతంగా జీవించి ఉంటారు.—ప్రకటన 21:3-5.

విమోచన క్రయధనం తెచ్చే ప్రయోజనాల్ని బట్టి, అది తీసుకొచ్చే శాశ్వత జీవితాన్ని బట్టి దేవుడు ఇచ్చిన విమోచన క్రయధనం అన్నిటికన్నా బెస్ట్‌ గిఫ్ట్‌ అని చెప్పవచ్చు. మనం ఇంతకుముందు ఆర్టికల్‌లో చూసినట్లు గిఫ్ట్‌లకు విలువ తీసుకొచ్చే విషయాలన్నీ ఈ గిఫ్ట్‌లో పూర్తిగా ఉన్నాయి. వాటిని తెలుసుకున్నప్పుడు ఈ గిఫ్ట్‌ ఎంత పరిపూర్ణ వరమో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ విషయాలను పరిశీలిద్దాం.

మన కోరిక తీరుస్తుంది. మనుషులుగా మనకు బ్రతికి ఉండాలనే కోరిక చాలా బలంగా ఉంటుంది. (ప్రసంగి 3:11) మనం మన సొంతగా ఆ కోరికను నెరవేర్చుకోలేక పోయినప్పటికీ విమోచన క్రయధనం ద్వారా మనం ఆ కోరికను నెరవేర్చుకోవచ్చు. బైబిలు ఇలా చెప్తుంది: “పాపంవల్ల వచ్చే జీతం మరణం, కానీ దేవుడు ఇచ్చే బహుమానం మన ప్రభువైన క్రీస్తుయేసు ద్వారా శాశ్వత జీవితం.”—రోమీయులు 6:23.

మన అవసరాన్ని తీరుస్తుంది. మనుషులెవ్వరూ విమోచన క్రయధనాన్ని ఇవ్వలేరు. బైబిలు ఇలా చెప్తుంది: “వారి ప్రాణవిమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికిని తీరక అట్లుండవలసినదే.” (కీర్తన 49:9) కాబట్టి మనం పాపమరణాల బానిసత్వం నుండి విడుదల అవ్వాలంటే మనకు దేవుడిచ్చే సహాయం ఎంతో అవసరం. “క్రీస్తుయేసు చెల్లించిన విమోచన క్రయధనం వల్ల కలిగిన విడుదల ద్వారా” దేవుడు సరిగ్గా మనకు ఏది అవసరమో అదే ఇచ్చాడు.—రోమీయులు 3:23, 24.

సరైన సమయంలో ఇవ్వబడింది. బైబిలు ఇలా చెప్తుంది: “మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే క్రీస్తు మనకోసం చనిపోయాడు.” (రోమీయులు 5:8) “మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే” ఇవ్వబడింది కాబట్టి విమోచన క్రయధనం దేవునికి మనమీదున్న ప్రేమ చాలా ఎక్కువనే భరోసాను ఇస్తుంది. ఇంకా మనం పాపం వలన వచ్చే పర్యవసానాలను అనుభవించాల్సి వచ్చినప్పటికీ భవిష్యత్తు కోసం మనం సంతోషంగా ఎదురుచూడవచ్చు.

మంచి నిస్వార్థమైన ఉద్దేశాన్ని తెలియజేసింది. దేవుడు తన కుమారున్ని విమోచన క్రయధనంగా ఇచ్చేలా నడిపించింది ఏంటో బైబిలు చెప్తుంది: “దేవుడు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించి మనమీద తనకున్న ప్రేమను వెల్లడిచేశాడు. మనం ఆ కుమారుని ద్వారా జీవం సంపాదించుకునేలా దేవుడు ఆయన్ని పంపించాడు. . . . మనం దేవుణ్ణి ప్రేమించినందుకు కాదు, ఆయనే మనల్ని ప్రేమించాడు కాబట్టి అలా చేశాడు.”—1 యోహాను 4:9, 10.

అన్నిటికన్నా బెస్ట్‌ గిఫ్ట్‌కి మీరు ఎంతో విలువ ఇస్తున్నారని ఎలా చూపించవచ్చు? యోహాను 3:16⁠లో యేసు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకోండి. ఆయన మీద “విశ్వాసం ఉంచే” వాళ్లు మాత్రమే రక్షింబడతారు అని అక్కడ ఉంది. విశ్వాసం అంటే, బైబిలు ప్రకారం “మనం ఎదురుచూసేవి తప్పక జరుగుతాయని బలంగా నమ్మడమే.” (హెబ్రీయులు 11:1) ఆ నమ్మకం మనకు ఉండాలంటే సరైన జ్ఞానం ఉండాలి. అందుకే మేము మీకు చేసే విన్నపం ఏంటంటే, ఈ పరిపూర్ణ వరాన్ని ఇచ్చే యెహోవా దేవుని గురించి తెలుసుకోవడానికి సమయం తీసుకోండి. అంతేకాదు యేసు విమోచన క్రయధనం ద్వారా మనకు వచ్చే శాశ్వత జీవితాన్ని పొందాలంటే ఏమి చేయాలో తెలుసుకోండి.

వీటన్నిటి గురించి మీరు www.mt1130.comలో ఆన్‌లైన్‌లో ఉన్న లేఖనాధార సమాచారాన్ని పరిశీలించడం ద్వారా తెలుసుకోవచ్చు. యెహోవాసాక్షులు మీకు సంతోషంగా సహాయం చేస్తారు. మీరు గిఫ్ట్స్‌ అన్నిటిలో గొప్పదైన గిఫ్ట్‌ గురించి తెలుసుకుంటుండగా మీరు కూడా ఇలా చెప్పేలా ప్రోత్సహించబడతారు: “మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు.”—రోమీయులు 7:25.