కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఏదెను తోట గురించి మీరు ఎందుకు తెలుసుకోవాలి?

ఏదెను తోట గురించి మీరు ఎందుకు తెలుసుకోవాలి?

ఏదెను తోట గురించి మీరు ఎందుకు తెలుసుకోవాలి?

ఏదెను విషయంలో కొంతమంది పండితులు చెప్పే ఒక అభ్యంతరం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. వాళ్లు, బైబిల్లోని మిగతా పుస్తకాలు దానికి మద్దతు ఇవ్వట్లేదని అంటారు. ఉదాహరణకు, రెలీజియస్‌ స్టడీస్‌ ప్రొఫెసర్‌ అయిన పాల్‌ మోరిస్‌ ఇలా రాస్తున్నాడు: “ఏదెను కథ గురించి బైబిలు ఇంకెక్కడా నేరుగా ప్రస్తావించట్లేదు.” మిగతా పండితులు ఆయన మాటలతో ఏకీభవించవచ్చు, కానీ వాస్తవాలు దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి.

ఏదెను తోట, ఆదాము, హవ్వ, సర్పం గురించి బైబిలు చాలాసార్లు ప్రస్తావించింది. * అయితే ఇతరులు చేసే మరో పెద్ద తప్పుతో పోలిస్తే, ఆ కొంతమంది పండితులు చేసిన తప్పు చాలా చిన్నది. ఆదికాండంలోని ఏదెను తోట కథనాన్ని సందేహించడం ద్వారా మత నాయకులు, బైబిలు విమర్శకులు నిజానికి మొత్తం బైబిలు మీదే సందేహాలు పుట్టిస్తున్నారు. అదెలా?

ఏదెనులో ఏం జరిగిందో అర్థం చేసుకుంటేనే మనం బైబిల్లోని మిగతా విషయాల్ని అర్థం చేసుకోగలం. ఉదాహరణకు, మనుషులకు వచ్చే అతి ముఖ్యమైన, లోతైన ప్రశ్నలకు జవాబిచ్చేలా బైబిలు రూపొందించబడింది. తరచూ ఆ ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబుకు ఏదెను తోటలో జరిగిన సంఘటనలతో సంబంధం ఉంటుంది. కొన్ని ఉదాహరణలు చూడండి.

మనం ఎందుకు వృద్ధులమై చనిపోతున్నాం? ఆదాముహవ్వలు యెహోవాకు లోబడి ఉంటే, వాళ్లు శాశ్వతంగా జీవిస్తారు. అలా లోబడకుండా ఉన్నప్పుడు మాత్రమే చనిపోతారు. వాళ్లు ఎదురుతిరిగిన రోజు నుండి చావుకు దగ్గరయ్యారు. (ఆదికాండం 2:16, 17; 3:19) వాళ్లు పరిపూర్ణతను పోగొట్టుకున్నారు, తమ పిల్లలకు పాపాన్ని, అపరిపూర్ణతను మాత్రమే వారసత్వంగా ఇవ్వగలిగారు. బైబిలు దాన్ని ఇలా వివరిస్తుంది: “ఒక మనిషి ద్వారా పాపం, పాపం ద్వారా మరణం లోకంలోకి ప్రవేశించాయి. ​అదేవిధంగా, అందరూ పాపం చేశారు కాబట్టి మరణం అందరికీ వ్యాపించింది.”​—రోమీయులు 5:12.

దేవుడు చెడుతనాన్ని ఎందుకు తీసేయట్లేదు? ఏదెను తోటలో సాతాను దేవుణ్ణి అబద్ధాలకోరు అని అంటూ, ఆయన మనుషులకు మంచి దక్కకుండా చేస్తున్నాడని నింద వేశాడు. (ఆదికాండం 3:3-5) అలా అతను యెహోవా పరిపాలనా విధానం సరైనదేనా అనే ప్రశ్న లేవదీశాడు. ఆదాముహవ్వలు సాతానుతో చేతులు కలిపారు. అలా వాళ్లు యెహోవా సర్వాధిపత్యాన్ని తిరస్కరించారు. ఒకరకంగా వాళ్లు ఏది మంచో, ఏది చెడో మనుషులే స్వయంగా నిర్ణయించుకోగలరని అన్నారు. యెహోవా పరిపూర్ణ న్యాయం, తెలివి గల దేవుడు కాబట్టి, ఆ ప్రశ్నకు సరైన జవాబు ఇవ్వాలంటే ఒకేఒక్క మార్గం ఉందని ఆయనకు తెలుసు. అదేంటంటే, మనుషులకు కావాల్సినంత సమయం ఇచ్చి వాళ్లనే సొంతగా పరిపాలన చేసికోనివ్వాలి. ఇప్పుడున్న చెడుతనానికి అదే కారణమం, సాతాను కూడా ఇంకో కారణం. ఇదంతా ఒక పెద్ద సత్యాన్ని రుజువుచేసింది. అదేంటంటే, దేవుని సహాయం లేకుండా మనుషులు తమనుతాము చక్కగా పరిపాలించుకోలేరు.​—యిర్మీయా 10:23.

దేవుడు భూమిని ఎందుకు తయారుచేశాడు? దేవుడు భూమంతా ఎంత అందంగా ఉండాలని కోరుకున్నాడో ఏదెను తోటను చూస్తే తెలుస్తుంది. ఆయన ఆదాముహవ్వలకు వాళ్ల పిల్లలతో భూమిని నింపమని, “దాన్ని లోబర్చుకోండి” అని చెప్పాడు. వాళ్లు అలాచేస్తే భూమంతా పొందికగా, అందంగా తయారౌతుంది. (ఆదికాండం 1:28) కాబట్టి భూమంతా అందమైన తోటలా అవ్వాలని, దానిమీద పరిపూర్ణులైన ఆదాముహవ్వల పిల్లలు ఐక్యంగా జీవించాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడు ఆ ఉద్దేశాన్ని ఎలా నెరవేరుస్తాడనే దాని గురించే బైబిలు ముఖ్యంగా చెప్తుంది.

యేసుక్రీస్తు ఎందుకు భూమ్మీదకు వచ్చాడు? ఏదెను తోటలో జరిగిన తిరుగుబాటు వల్ల ఆదాముహవ్వలతో పాటు వాళ్ల పిల్లలందరూ చనిపోతున్నారు. అయితే దేవుడు ప్రేమతో వాళ్లకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నాడు. అందుకే విమోచన క్రయధనం చెల్లించడానికి ఆయన తన కుమారుడిని భూమ్మీదికి పంపించాడు. (మత్తయి 20:28) అంటే ఏమిటి? బైబిలు యేసును “చివరి ఆదాము” అని పిలుస్తుంది; ఎందుకంటే, ఆదాము చేయలేకపోయిన దాన్ని ఆయన చేసి చూపించాడు. యేసు యెహోవాకు లోబడి ఉండడం ద్వారా పరిపూర్ణతను కాపాడుకున్నాడు. తర్వాత ఆయన తన ప్రాణాన్ని విమోచన క్రయధన బలిగా అర్పించాడు. అలా నమ్మకమైన మనుషులందరూ పాపక్షమాపణ పొందడానికి ఆయన మార్గం తెరిచాడు; దానివల్ల ఆదాముహవ్వలు ఏదెను తోటలో పాపం చేయకముందు అనుభవించిన జీవితాన్ని వాళ్లు పొందగలరు. (1 కొరింథీయులు 15:22, 45; యోహాను 3:16) ఆ విధంగా యేసు, భూమంతా ఏదెను తోటలా మారాలనే యెహోవా ఉద్దేశం నెరవేరుతుందని హామీ ఇచ్చాడు. *

దేవుని ఉద్దేశం అస్పష్టంగా ఏమీ లేదు, అది అర్థం చేసుకోలేని ఒక మత బోధ కాదు. బదులుగా అదొక వాస్తవం. ఏదెను తోట ఒకప్పుడు నిజంగా భూమ్మీద ఉండేది, దానిలో నిజమైన జంతువులు, మనుషులు ఉండేవాళ్లు. అంతేకాదు, భవిష్యత్తు గురించి దేవుడు చేసిన వాగ్దానం ఖచ్చితంగా నిజమౌతుంది, అది త్వరలోనే జరుగుతుంది. ఆ భవిష్యత్తులో మీరు ఉంటారా? అది చాలావరకు మీమీదే ఆధారపడి ఉంటుంది. ఒకప్పుడు చెడ్డగా జీవించిన వాళ్లతో సహా, వీలైనంత ఎక్కువమంది ఆ భవిష్యత్తును సొంతం చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు.​—1 తిమోతి 2:3, 4.

యేసు చనిపోవడానికి కాస్త ముందు ఒక దొంగతో మాట్లాడాడు. అతను నేరస్తుడు, తనకు మరణశిక్ష తగినదే అని అతనికి తెలుసు. కానీ అతను ఓదార్పు కోసం అంటే నిరీక్షణ కోసం యేసువైపు చూశాడు. మరి యేసు ఏమని జవాబిచ్చాడు? “నువ్వు నాతోపాటు పరదైసులో ఉంటావు” అని యేసు అన్నాడు. (లూకా 23:43) ఒకప్పుడు నేరస్తుడిగా ఉన్న వ్యక్తి కూడా మళ్లీ బ్రతికి ఏదెనులాంటి తోటలో శాశ్వతంగా జీవించాలని యేసు కోరుకున్నాడంటే, మీరు కూడా అలాంటి దీవెనలే పొందాలని యేసు ఖచ్చితంగా కోరుకుంటాడు! ఆయన తండ్రి కూడా అలాగే కోరుకుంటాడు! మీ కోరిక కూడా అదే అయితే, ఏదెను తోటను చేసిన దేవుని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి వీలైనంతగా కృషి చేయండి.

[అధస్సూచీలు]

^ యేసు విమోచన క్రయధన బలి గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి, యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకంలోని 5వ అధ్యాయం చూడండి.

[బాక్సు/చిత్రం]

బైబిల్లోని అతి ముఖ్యమైన ప్రవచనం

“నేను నీకూ [సర్పానికీ] స్త్రీకీ, నీ సంతానానికీ ఆమె సంతానానికీ మధ్య శత్రుత్వం పెడతాను. ఆయన నీ తలను చితగ్గొడతాడు, నువ్వు ఆయన మడిమె మీద కొడతావు.”—ఆదికాండం 3:15.

అది బైబిల్లోని మొదటి ప్రవచనం, దేవుడు దాన్ని ఏదెనులో చెప్పాడు. అందులో ఉన్న స్త్రీ, ఆమె సంతానం, సర్పం, దాని సంతానం ఎవరు? వాళ్ల మధ్య ఎలాంటి “శత్రుత్వం” ఉంటుంది?

సర్పం

అపవాదియైన సాతాను.​—ప్రకటన 12:9.

స్త్రీ

పరలోక ప్రాణులు ఉన్న యెహోవా సంస్థ. (గలతీయులు 4:26, 27) యెషయా ఆ “స్త్రీ” గురించి రాశాడు, ఆమె ఒక ఆధ్యాత్మిక జనాన్ని కంటుందని ప్రవచించాడు.​—యెషయా 54:1; 66:8.

సర్ప సంతానం

సాతాను ఇష్టాన్ని చేయాలని ఎంపిక చేసుకునే వాళ్లు.​—యోహాను 8:44.

స్త్రీ సంతానం

అందులో ప్రథమ భాగం, యెహోవా సంస్థ పరలోక భాగం నుండి వచ్చిన యేసుక్రీస్తు. ఆ ‘సంతానంలో’ క్రీస్తుతో పాటు పరలోకంలో పరిపాలించే ఆయన ఆధ్యాత్మిక సహోదరులు కూడా ఉన్నారు. ఆ అభిషిక్త క్రైస్తవులు “దేవుని ఇశ్రాయేలు” అనే ఆధ్యాత్మిక జనంగా రూపొందుతారు.​—గలతీయులు 3:16, 29; 6:16; ఆదికాండం 22:18.

మడిమె మీద కొట్టడం

మెస్సీయకు ఒక బాధాకరమైన దెబ్బ తగులుతుంది, కానీ అది మానిపోయే దెబ్బ. యేసు భూమ్మీద ఉన్నప్పుడు సాతాను ఆయన్ని చంపించగలిగాడు. కానీ దేవుడు యేసును మళ్లీ బ్రతికించాడు.

తల మీద కొట్టడం

సాతానుకు చావుదెబ్బ. యేసు సాతానును శాశ్వతంగా ఉనికిలో లేకుండా చేస్తాడు. అంతకన్నా ముందు, ఏదెను తోటలో సాతాను మొదలుపెట్టిన చెడు వల్ల వచ్చిన పర్యవసానాల్ని యేసు పూర్తిగా తీసేస్తాడు.​—1 యోహాను 3:8; ప్రకటన 20:10.

బైబిలు ముఖ్యాంశం గురించి క్లుప్తంగా తెలుసుకోవడానికి, యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది అనే బ్రోషురు చూడండి.

[చిత్రం]

ఆదాముహవ్వలు పాపం చేయడం వల్ల ఘోరమైన పర్యవసానాలు అనుభవించారు