23వ అధ్యాయం
ఆయన తన బోధకుని దగ్గర క్షమించడం నేర్చుకున్నాడు
1. పేతురు జీవితంలో భయంకరమైన క్షణం ఏదైవుంటుంది?
పేతురు, యేసు తన కళ్లలోకి సూటిగా చూసిన ఆ భయంకరమైన క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేడు. యేసు కళ్లలో ‘ఇలా చేశాడేంటి’ అనే నిరాశ పేతురుకు కనబడిందా? ఆ కళ్లు తనను నిందిస్తున్నట్టు ఆయనకు అనిపించిందా? ఏమో మనం ఖచ్చితంగా చెప్పలేం. ‘ప్రభువు తిరిగి పేతురువైపు చూశాడు’ అని మాత్రమే దేవుని వాక్యంలో ఉంది. (లూకా 22:61) కానీ ఆ ఒక్క చూపుతో, తానెంత పెద్ద పొరపాటు చేశాడో పేతురుకు అర్థమైంది. ఏ పనైతే తానెప్పటికీ చేయనని చెప్పుకున్నాడో, ఏ విషయం గురించైతే యేసు ముందే చెప్పాడో అదే తాను చేశానని పేతురు గ్రహించాడు. తానెంతో ప్రేమించే బోధకునికి నమ్మకద్రోహం చేశాడు. పేతురు జీవితంలో అంతకన్నా భయంకరమైన క్షణం మరొకటి లేదు.
2. పేతురు ఏ పాఠం నేర్చుకోవాల్సి ఉంది? ఆయన కథ నుండి మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు?
2 అయితే పరిస్థితి చేయిదాటిపోలేదు. పేతురు ఎంతో విశ్వాసం గల వ్యక్తి కాబట్టి, చేసిన పొరపాట్లను సరిదిద్దుకుని, క్షమాగుణానికి సంబంధించిన పాఠం నేర్చుకునే అవకాశం ఆయనకు ఇంకా ఉంది. యేసు బోధించిన గొప్ప పాఠాల్లో అదొకటి. మనలో ప్రతీ ఒక్కరం ఆ పాఠం నేర్చుకోవాలి. కాబట్టి, పేతురు ఆ పాఠాన్ని కష్టపడి ఎలా నేర్చుకున్నాడో ఇప్పుడు మనం చూద్దాం.
ఆయన నుండి మనమెంతో నేర్చుకోవచ్చు
3, 4. (ఎ) పేతురు యేసును ఏమి అడిగాడు? పేతురు ఏమి అనుకునివుంటాడు? (బి) ఆ రోజుల్లో ప్రబలంగా ఉన్న వైఖరి ప్రభావం పేతురు మీద కూడా పడిందని యేసు ఎలా చూపించాడు?
3 దాదాపు ఆరు నెలల క్రితం పేతురు తన సొంత పట్టణం కపెర్నహూములో యేసు దగ్గరకు వచ్చి ఇలా అడిగాడు: “ప్రభువా, నా సహోదరుడు నాయెడల తప్పిదము చేసినయెడల నేనెన్నిమారులు అతని క్షమింపవలెను? ఏడు మారులమట్టుకా?” పేతురు అలా అడుగుతూ, క్షమించే విషయంలో తానెంతో పెద్ద మనసు చూపిస్తున్నానని అనుకునివుంటాడు. ఎందుకంటే, ఆ రోజుల్లోని మత గురువులు మూడుసార్లు మాత్రమే క్షమించాలని బోధించేవాళ్లు! అయితే యేసు, “ఏడుమారులుమట్టుకే కాదు, డెబ్బది ఏళ్ల [“డెబ్భై ఏడు,” NW] మారులమట్టుకు” క్షమించాలని చెప్పాడు.—మత్త. 18:21, 22.
4 ఎదుటివ్యక్తి చేసిన తప్పుల్ని లెక్కబెట్టుకుంటూ కూర్చోమని యేసు ఇక్కడ చెబుతున్నాడా? లేదు. మరి, యేసు ఏ ఉద్దేశంతో అలా అన్నాడు? మనకు ఎదుటివ్యక్తి మీద ప్రేమ ఉంటే, అతణ్ణి ఇన్నిసార్లే క్షమిస్తామని గిరిగీసుకొని కూర్చోము అని యేసు చెప్పాలనుకున్నాడు. (1 కొరిం. 13:4, 5) ఆ రోజుల్లో లెక్కపెట్టుకుని క్షమించేవాళ్లు. క్షమించడానికి ఇష్టపడని అలాంటి కఠినమైన వైఖరినే పేతురు కూడా కనబరుస్తున్నాడని యేసు చూపించాడు. అయితే, దేవుని క్షమాగుణానికి అవధుల్లేవు.—1 యోహాను 1:7-9 చదవండి.
5. మనం ఎప్పుడు క్షమాపణ గురించి ఎక్కువగా నేర్చుకుంటాం?
5 పేతురు యేసుతో వాదించలేదు. కానీ, యేసు నేర్పిన పాఠం నిజంగా ఆయన హృదయాన్ని చేరిందా? కొన్నిసార్లు మనకు క్షమాపణ ఎంత అవసరమో అర్థంచేసుకున్నప్పుడే దాని గురించి ఎక్కువగా నేర్చుకుంటాం. ఇప్పుడు మనం యేసు మరణానికి దారితీసిన సంఘటనలను పరిశీలిద్దాం. ఎంతో క్లిష్టమైన ఆ గడియల్లో, పేతురు తన బోధకుని క్షమాపణ అవసరమయ్యే ఎన్నో పొరపాట్లు చేశాడు.
చాలాసార్లు క్షమాపణ అవసరమైంది
6. యేసు తన అపొస్తలులకు వినయం గురించిన పాఠం నేర్పిస్తున్నప్పుడు పేతురు ఏమి అన్నాడు? అయినా యేసు ఆయనతో ఎలా వ్యవహరించాడు?
6 అది చాలా ప్రాముఖ్యమైన సాయంత్రం. యేసు భూమ్మీద జీవించిన చివరి రాత్రి అది. యేసు తన అపొస్తలులకు ఇంకా ఎన్నో నేర్పాల్సివుంది, వాటిలో ఒకటి వినయం. యేసు తనను తాను తగ్గించుకుని, సాధారణంగా సేవకుల్లో అందరికన్నా తక్కువవాళ్లు చేసే పని ఒకటి చేశాడు. ఆయన తన శిష్యుల పాదాలు కడిగి వాళ్లకు ఆదర్శాన్ని ఉంచాడు. పేతురు మొదట్లో, యేసు తన పాదాలు కడగడమేమిటి అన్నట్లు మాట్లాడాడు. తర్వాత, తన కాళ్లు కడుగవద్దన్నాడు. కానీ ఆ తర్వాత, తన కాళ్లు మాత్రమే కాదు చేతులు, తల కూడా కడగమని పట్టుబట్టాడు! దానికి యేసు విసుక్కోకుండా, ఆ పని చేయడం ఎందుకు అవసరమో, దాని అర్థమేమిటో ప్రశాంతంగా వివరించాడు.—యోహా. 13:1-17.
7, 8. (ఎ) పేతురు ఎలా యేసు సహనాన్ని మళ్లీ పరీక్షించాడు? (బి) కనికరాన్ని, క్షమాగుణాన్ని యేసు ఎలా చూపిస్తూ వచ్చాడు?
7 కాసేపటికే పేతురు యేసు సహనాన్ని మళ్లీ పరీక్షించాడు. పేతురు, ఇతర అపొస్తలులు తమలో ఎవరు గొప్ప అని వాదులాడుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు యేసు వాళ్లను దయతో సరిదిద్దాడు. అలాగే వాళ్లు చేసిన మంచి పనికి అంటే తనకు నమ్మకంగా ఉన్నందుకు వాళ్లను మెచ్చుకున్నాడు. అయితే వాళ్లంతా తనను వదిలిపెట్టి వెళ్లిపోతారని చెప్పాడు. దానికి పేతురు, చచ్చిపోవాల్సివచ్చినా యేసును వదిలివెళ్లనని చెప్పాడు. కానీ మరోలా జరుగుతుందని వివరిస్తూ, అదే రాత్రి కోడి రెండుసార్లు కూయక ముందే తానెవరో తెలియదని పేతురు మూడుసార్లు అంటాడని యేసు ప్రవచించాడు. పేతురు అలా జరగదని చెప్పడమే కాదు, మిగతా అపొస్తలులందరికన్నా నమ్మకస్థునిగా నిరూపించుకుంటానని గొప్పలుపోయాడు.—మత్త. 26:31-35; మార్కు 14:27-31; లూకా 22:24-28; యోహా. 13:36-38.
8 పేతురు విషయంలో యేసు సహనం కోల్పోయాడా? నిజానికి, ఆ క్లిష్ట సమయమంతట్లో యేసు అపరిపూర్ణులైన తన అపొస్తలుల్లో మంచిని చూడడానికే ప్రయత్నించాడు. పేతురు తనను వదిలిపెట్టి వెళ్లిపోతాడని యేసుకు తెలుసు. అయినా ఆయనిలా అన్నాడు: “నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని; నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుము.” (లూకా 22:32) అలా, పేతురు తన తప్పుదిద్దుకొని విశ్వాసంతో మళ్లీ దేవుని సేవ చేస్తాడనే నమ్మకాన్ని యేసు వ్యక్తం చేశాడు. యేసు ఎంత కనికరాన్ని, క్షమాగుణాన్ని చూపించాడో కదా!
9, 10. (ఎ) గెత్సేమనే తోటలో యేసు పేతురును ఎందుకు సరిదిద్దాల్సివచ్చింది? (బి) పేతురు చేసిన పొరపాట్లు మనకు ఏమి గుర్తుచేస్తాయి?
9 తర్వాత గెత్సేమనే తోటలో యేసు పేతురును ఒకటికన్నా ఎక్కువసార్లు సరిదిద్దాల్సివచ్చింది. యేసు తాను ప్రార్థన చేస్తున్నప్పుడు నిద్రపోకుండా మెలకువగా ఉండమని యాకోబు, యోహానులతోపాటు పేతురుకు కూడా చెప్పాడు. మానసికంగా ఎంతో కృంగిపోయిన యేసుకు మద్దతు అవసరమైంది. అలాంటి పరిస్థితుల్లో పేతురు, మిగతావాళ్లు మళ్లీమళ్లీ నిద్రలోకి జారుకున్నారు. యేసు వాళ్ల పరిస్థితిని అర్థంచేసుకుని, వాళ్లను క్షమిస్తూ “ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము” అన్నాడు.—మార్కు 14:32-41.
10 కొద్దిసేపటికే ఒక పెద్ద గుంపు కాగడాలు, కత్తులు, కర్రలతో అక్కడకు వచ్చింది. అది జాగ్రత్తగా, తెలివిగా వ్యవహరించాల్సిన సమయం. అయినా పేతురు వెనుకా ముందూ ఆలోచించకుండా, కత్తితీసి ప్రధానయాజకుని దాసుడైన మల్కు అనే వ్యక్తి తలమీద కొట్టి, అతని చెవి తెగనరికాడు. యేసు ప్రశాంతంగా పేతురును సరిదిద్దాడు, గాయపడిన వ్యక్తిని బాగుచేసి అహింసా సూత్రాన్ని వివరించాడు. ఈ సూత్రాన్నే ఆయన అనుచరులు నేటికీ పాటిస్తున్నారు. (మత్త. 26:47-55; లూకా 22:47-51; యోహా. 18:10, 11) పేతురు అప్పటికే తన బోధకుని క్షమాపణ అవసరమయ్యే ఎన్నో పొరపాట్లు చేశాడు. మనందరం తరచూ పాపం చేస్తామని పేతురు ఉదాహరణ గుర్తుచేస్తుంది. (యాకోబు 3:2 చదవండి.) ప్రతీరోజు దేవుని క్షమాపణ అవసరం రానివాళ్లు మనలో ఎవరున్నారు? అయితే, పేతురు ఆ రాత్రి ఇంకా ఘోరమైన పొరపాట్లు చేశాడు.
పేతురు చేసిన ఘోరమైన పొరపాటు
11, 12. (ఎ) యేసును బంధించిన తర్వాత పేతురు ఎంతో ధైర్యం చూపించాడని ఎలా చెప్పవచ్చు? (బి) తాను చెప్పింది చేయడంలో పేతురు ఎలా విఫలమయ్యాడు?
11 వాళ్లు వెదికేది తన కోసమే అయితే తన అపొస్తలులను వెళ్లనివ్వమని యేసు అక్కడున్న గుంపుతో చెప్పాడు. ఆ గుంపు యేసును బంధించినప్పుడు పేతురు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత పేతురు, తోటి అపొస్తలులు అక్కడినుండి పరారయ్యారు.
12 పారిపోతున్న పేతురు, యోహానులు ఒకదగ్గర ఆగారు. వాళ్లు ఆగింది మాజీ ప్రధానయాజకుడైన అన్న ఇంటికి దగ్గర్లో కావచ్చు. విచారణ కోసం యేసును ముందు అన్న ఇంటికే తీసుకెళ్లారు. యేసును అక్కడినుండి తీసుకువెళ్తున్నప్పుడు పేతురు, యోహానులు కాస్త ‘దూరంలో ఉంటూ’ ఆయన వెనకాలే వెళ్లారు. (మత్త. 26:58; యోహా. 18:12, 13) పేతురు పిరికివాడు కాదు. అసలు అలా వెళ్లాలంటేనే ఎంతో ధైర్యం కావాలి. ఆ గుంపు దగ్గర ఆయుధాలున్నాయి, అదీగాక అప్పటికే పేతురు వాళ్లలో ఒకరిని గాయపర్చాడు. అయితే, తన బోధకుని కోసం చనిపోవడానికి కూడా సిద్ధమని చెప్పుకున్న పేతురు, తాను చెప్పుకున్నంత విశ్వసనీయ ప్రేమను ఇక్కడ చూపించలేదు.—మార్కు 14:31.
13. క్రీస్తు అడుగుజాడల్లో సరిగ్గా నడవడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ఏమిటి?
13 చాలామంది నేడు పేతురులాగే కాస్త ‘దూరంలో ఉంటూ’ అంటే ఎవరికంటా పడకుండా క్రీస్తు అడుగుజాడల్లో నడవాలనుకుంటారు. కానీ, క్రీస్తు అడుగుజాడల్లో సరిగ్గా నడవాలంటే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అన్ని విషయాల్లో ఆయనను ఆదర్శంగా తీసుకుంటూ ఆయనకు వీలైనంత సన్నిహితంగా ఉండాలని అదే పేతురు ఆ తర్వాతి కాలంలో రాశాడు.—1 పేతురు 2:21 చదవండి.
14. యేసును విచారిస్తున్న సమయంలో పేతురు ఏమి చేశాడు?
14 పేతురు ఎవ్వరికీ అనుమానం రాకుండా ధనవంతుడు, బాగా పలుకుబడి ఉన్న ప్రధానయాజకుడైన కయప ఇంటికి చేరుకున్నాడు. యెరూషలేములో ఉన్న పెద్దపెద్ద భవనాల్లో అదొకటి. సాధారణంగా అలాంటి ఇళ్లకు పెద్ద ప్రహరి గోడ, దానికి ఓ ముఖద్వారం ఉండేది. లోపలికి వెళ్తే మధ్యలో ప్రాంగణం, దాని చుట్టూ గదులు ఉండేవి. పేతురు ద్వారం వరకు వెళ్లాడు కానీ లోపలికి వెళ్లడానికి అనుమతి దొరకలేదు. యోహానుకు ప్రధానయాజకుడు తెలుసు కాబట్టి ఆయన అప్పటికే లోపల ఉన్నాడు. యోహాను బయటికొచ్చి, ద్వారపాలకురాలితో మాట్లాడి పేతురును లోపలికి తీసుకువెళ్లాడు. పేతురు యోహానుతో లేడని తెలుస్తోంది. ఆయన తన బోధకుని పక్షాన నిలబడడానికి లోపలికి వెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు. ఆయన ఆవరణంలోనే ఉండిపోయాడు, అక్కడ కొంతమంది దాసులు, బంట్రౌతులు చలికాచుకుంటూ యేసుమీద అబద్ధసాక్ష్యం చెప్పేవాళ్లు లోపలికి, బయటకు వెళ్లడం గమనిస్తున్నారు.—మార్కు 14:54-59; యోహా. 18:15, 16, 18.
15, 16. యేసు ఎవరో తనకు తెలియదని పేతురు మూడుసార్లు అబద్ధమాడతాడని యేసు చెప్పిన ప్రవచనం ఎలా నెరవేరిందో వివరించండి.
15 పేతురును లోపలికి వెళ్లనిచ్చిన ద్వారపాలకురాలు ఆ చలిమంట వెలుగులో ఆయన ముఖాన్ని స్పష్టంగా చూసింది, ఆయనను గుర్తుపట్టింది. ఆమె ఆయనతో ఇలా అంది: ‘నీవును గలిలయుడగు యేసుతోకూడ ఉంటివి గదా?’ ఊహించని విధంగా దొరికిపోయిన పేతురు, యేసు ఎవరో తనకు తెలియదనీ, అసలామె ఏం మాట్లాడుతుందో కూడా తనకు అర్థం కావడం లేదనీ బొంకాడు. ఎవరూ గుర్తుపట్టకూడదని ద్వారం దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు. కానీ అక్కడ మరొక అమ్మాయి కూడా ఆయనను గమనించి ఇలా అంది: “వీడును నజరేయుడగు యేసుతోకూడ ఉండెను.” దానికి ఆయన “ఆ మనుష్యుని నేనెరుగను” అంటూ ఒట్టుపెట్టుకున్నాడు. (మత్త. 26:69-72; మార్కు 14:66-68) ఇలా రెండోసారి అబద్ధం చెప్పిన తర్వాత కోడి కూయడం పేతురు వినివుంటాడు. కానీ చాలా గందరగోళంలో ఉండడంవల్ల, కొన్ని గంటల క్రితమే యేసు చెప్పిన ప్రవచనం పేతురుకు గుర్తురాలేదు.
16 అది జరిగిన కొంతసేపటి తర్వాత కూడా పేతురు ఎవరికంటా పడకుండా ఉండాలని తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ ఆవరణంలో నిల్చున్న కొంతమంది ఆయన దగ్గరకు వచ్చారు. వాళ్లలో పేతురు గాయపరచిన మల్కు అనే దాసుని బంధువు కూడా ఉన్నాడు. ఆయన పేతురుతో “నీవు తోటలో అతనితో కూడ ఉండగా నేను చూడలేదా?” అని అన్నాడు. వాళ్లు పొరబడుతున్నట్లు వాళ్లను ఎలాగైనా ఒప్పించాలని పేతురు అనుకున్నాడు. అందుకే ఆయన తను చెబుతున్నది అబద్ధమైతే తనకు కీడు జరగాలని శపించుకుంటూ ఒట్టుపెట్టుకున్నాడు. అలా పేతురు మూడవసారి అబద్ధమాడాడు. ఆయన అలా అన్నాడోలేదో కోడి కూసింది, ఆ రాత్రి పేతురుకు కోడి కూత వినిపించడం ఇది రెండవసారి.—యోహా. 18:26, 27; మార్కు 14:71, 72.
17, 18. (ఎ) తన బోధకుణ్ణి ఎంతగా మోసం చేశాడో గ్రహించినప్పుడు పేతురు ఎలా స్పందించాడు? (బి) పేతురు ఏమి అనుకునివుంటాడు?
17 యేసును అప్పుడే వసారాలోకి తీసుకొచ్చారు, అక్కడి నుండి ఆవరణం కనిపిస్తుంది. యేసు పేతురు కళ్లలోకి చూశాడని ఈ అధ్యాయం ఆరంభంలో మనం చెప్పుకున్న సంఘటన ఇదే. తాను తన బోధకుణ్ణి ఎంతగా మోసం చేశాడో పేతురుకు అప్పుడు అర్థమైంది. చేసిన తప్పుకు ఎంతో కుమిలిపోతూ పేతురు ఆవరణం బయటకు వెళ్లిపోయాడు. అస్తమిస్తున్న పూర్ణ చంద్రుని కాంతిలో వీధుల్లోకి వెళ్లాడు. కానీ ఆయన కళ్లల్లో నీళ్లు ఉబికివచ్చాయి. చుట్టుపక్కలంతా మసకగా అయిపోయింది. దుఃఖం పొంగుకొచ్చి కుమిలికుమిలి ఏడ్చాడు.—మార్కు 14:72; లూకా 22:61, 62.
18 తాను పెద్ద పొరపాటు చేశానని ఒక వ్యక్తి గ్రహిస్తే తనకు ఇక క్షమాపణే ఉండదనుకోవడం సహజం. పేతురు కూడా అలాగే అనుకునివుంటాడు. కానీ అది నిజమా?
పేతురు క్షమించరాని తప్పు చేశాడా?
19. పేతురు తాను చేసిన పొరపాటు గురించి ఏమి అనుకునివుంటాడు? అయినా ఆయన నిరాశతో డీలా పడిపోలేదని ఎలా చెప్పవచ్చు?
19 తెల్లవారుతుండగా ఒక్కో సంఘటన జరుగుతున్నప్పుడు పేతురు ఎంత గుండెకోత అనుభవించి ఉంటాడో మనం ఊహించడం కష్టం. తర్వాత ఆ రోజు యేసు ఎన్నో గంటలపాటు హింస అనుభవించి చనిపోయినప్పుడు, పేతురు తనను తాను ఎంతో నిందించుకునివుంటాడు. అప్పటికే బాధపడుతున్న తన బోధకుణ్ణి, ఆయన మానవ జీవితంలోని చివరి రోజున ఇంకా బాధపెట్టానని గుర్తొచ్చిన ప్రతీసారి పేతురు మనసు ముక్కలైపోయుంటుంది. పేతురు అంత బాధలోవున్నా, నిరాశతో డీలా పడిపోలేదు. ఆ విషయం మనకెలా తెలుసంటే, ఆ సంఘటన జరిగి ఎన్నో రోజులు కాకముందే పేతురు తన ఆధ్యాత్మిక సహోదరులతో కలిసి ఉన్నట్లు బైబిలు చెబుతోంది. (లూకా 24:33) విషాదకరమైన ఆ రాత్రి తాము ప్రవర్తించిన తీరుకు అపొస్తలులందరూ ఎంతో సిగ్గుపడివుంటారు, ఆ తర్వాత ఒకరినొకరు ఓదార్చుకునివుంటారు.
20. పేతురు తన జీవితంలో తీసుకున్న ఓ అత్యుత్తమ నిర్ణయం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
20 చెప్పాలంటే, పేతురు తన జీవితంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాల్లో అదొకటి. దేవుని సేవకుల్లో ఎవరైనా తప్పు చేస్తే అతను ఎంత పెద్ద తప్పు చేశాడనే దానికన్నా, ఆ తప్పు దిద్దుకోవాలని అతను ఎంత ఎక్కువగా కోరుకుంటున్నాడనేదే ముఖ్యం. (సామెతలు 24:16 చదవండి.) అంత కృంగిపోయినా పేతురు తన సహోదరులను కలుసుకుని తనకు నిజమైన విశ్వాసం ఉందని చూపించాడు. పశ్చాత్తాపంతో మనసు విరిగిపోయినప్పుడు ఎవరితోనూ కలవాలనిపించదు, కానీ అది ప్రమాదకరం. (సామె. 18:1) అలాంటి సమయంలో మన తోటి విశ్వాసులకు దగ్గరగా ఉంటూ దేవుణ్ణి సేవించడానికి అవసరమైన శక్తిని సంపాదించుకోవడమే తెలివైన పని.—హెబ్రీ. 10:24, 25.
21. పేతురు తన ఆధ్యాత్మిక సహోదరులతో ఉండడం వల్ల ఏ వార్త తెలుసుకోగలిగాడు?
21 పేతురు తన ఆధ్యాత్మిక సహోదరులతో ఉన్నాడు కాబట్టే, యేసు శరీరం సమాధిలో లేదనే ఆందోళనకరమైన వార్త తెలుసుకోగలిగాడు. యేసును పెట్టి, రాయితో మూసేసి ముద్రవేసిన సమాధి దగ్గరకు పేతురు, యోహానులు పరుగుపరుగున వెళ్లారు. బహుశా వాళ్లిద్దరిలో చిన్నవాడైన యోహాను అక్కడికి ముందుగా చేరుకున్నాడు. సమాధి రాయి దొర్లించివుండడం చూసి ఆయన తటపటాయించాడు. అయితే పేతురు పరుగెత్తుకుంటూ రావడం వల్ల రొప్పుతున్నా నేరుగా లోపలికి వెళ్లాడు. సమాధి ఖాళీగా ఉంది!—యోహా. 20:3-9.
22. పేతురు మనసులోని బాధ, అనుమానం పటాపంచలైపోవడానికి కారణం ఏమిటి?
22 యేసు పునరుత్థానం అయ్యాడని పేతురు నమ్మాడా? మొదట్లో నమ్మలేదు, దేవదూతలు కనిపించి యేసు పునరుత్థానమైనట్లు తమకు చెప్పారని విశ్వాసులైన స్త్రీలు చెప్పినా ఆయన నమ్మలేదు. (లూకా 23:55–24:11) కానీ రాత్రి అయ్యేసరికి పేతురు మనసులోని బాధ, అనుమానం పటాపంచలైపోయాయి. యేసు మళ్లీ సజీవంగా ఉన్నాడు, ఇప్పుడాయన శక్తిమంతమైన ఆత్మప్రాణి! ఆయన తన అపొస్తలులందరికీ కనిపించాడు. అయితే అంతకన్నా ముందు ఆయన మరొకరికి కనిపించాడు. “ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడెను” అని అపొస్తలులు ఆ రోజు మాట్లాడుకున్నారు. (లూకా 24:34) “ఆయన కేఫాకును, తరువాత పండ్రెండుగురికిని కనబడిన” ఆ ప్రత్యేకమైన రోజు గురించి అపొస్తలుడైన పౌలు కూడా రాశాడు. (1 కొరిం. 15:5) కేఫా, సీమోను అనే పేర్లు కూడా పేతురుకు ఉండేవి. యేసు ఆ రోజు పేతురును ఒంటరిగా కలిశాడని తెలుస్తోంది.
తన బోధకుని క్షమాపణ అవసరమైన ఎన్నో పొరపాట్లను పేతురు చేశాడు, ప్రతీరోజు క్షమాపణ అవసరం రానివాళ్లు మనలో ఎవరున్నారు?
23. నేడు, పాపం చేసిన క్రైస్తవులెవరైనా, పేతురు విషయాన్ని ఎందుకు గుర్తుంచుకోవాలి?
23 యేసు, పేతురు కలుసుకున్న ఆ ప్రత్యేకమైన సందర్భంలో ఏమి జరిగిందో బైబిలు చెప్పడం లేదు. అది వాళ్లిద్దరికే తెలుసు. కానీ, పేతురు తన ప్రియమైన ప్రభువును సజీవునిగా చూడగలిగినందుకు, ఆయనకు తన బాధ చెప్పుకుని క్షమాపణ అడిగే అవకాశం దొరికినందుకు ఎంత ఉప్పొంగిపోయివుంటాడో మనం ఊహించుకోవచ్చు. అప్పుడు పేతురు అన్నిటికన్నా ఎక్కువగా కోరుకున్నది క్షమాపణే. యేసు ఆయనను క్షమించాడు, అదీ ఎంతో ఎక్కువగా క్షమించాడు, అందులో సందేహం లేదు. నేడు, పాపం చేసిన క్రైస్తవులెవరైనా, పేతురుకు క్షమాపణ దొరికిందని గుర్తుంచుకోవాలి. దేవుడు క్షమించలేనంత ఘోరమైన పాపం చేసేశామని మనం ఎప్పుడూ అనుకోకూడదు. ఎందుకంటే, యెహోవా “బహుగా క్షమించే” దేవుడు. అలాగే యేసు కూడా తన తండ్రిని నూటికి నూరుపాళ్లు ప్రతిబింబిస్తాడు.—యెష. 55:7.
క్షమాపణకు అదనపు రుజువు
24, 25. (ఎ) గలిలయ సముద్రంలో రాత్రిపూట పేతురు చేపలు పట్టడం గురించి వివరించండి. (బి) మరుసటి రోజు ఉదయం యేసు చేసిన అద్భుతానికి పేతురు ఎలా స్పందించాడు?
24 యేసు తన అపొస్తలులను గలిలయకు వెళ్లమని చెప్పాడు, అక్కడ వాళ్లు ఆయనను మళ్లీ కలుసుకున్నారు. వాళ్లు అక్కడకు చేరుకున్నప్పుడు, పేతురు గలిలయ సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్లాలనుకున్నాడు. ఆయనతోపాటు ఇంకొంతమంది కూడా వెళ్లారు. పేతురు ఒకప్పుడు తన జీవితంలో అధిక భాగం ఏ సరస్సు దగ్గరైతే గడిపాడో అక్కడికే మళ్లీ వచ్చాడు. పడవ చేసే కిర్రుకిర్రుమనే శబ్దం, అలల తాకిడి, ఆయన చేతుల్లో ఉన్న వలల గరుకుదనం ఇవన్నీ ఆయనకు సుపరిచితమైనవే కాబట్టి ఆయనకెంతో హాయిగా అనిపించివుంటుంది. అయితే, ఆ రాత్రంతా వాళ్లకు ఒక్క చేప కూడా దొరకలేదు.—మత్త. 26:32; యోహా. 21:1-3.
25 తెల్లవారుజామున ఒక వ్యక్తి ఒడ్డు నుండి జాలరులను పిలిచి, పడవకు మరోవైపు వల వేయమని చెప్పాడు. వాళ్లు అలా చేసినప్పుడు వలలో 153 చేపలు చిక్కాయి! అలా చెప్పిన వ్యక్తి ఎవరో పేతురుకు అర్థమైంది. ఆయన పడవ నుండి దూకి, ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. ఒడ్డున నిప్పులమీద తాను కాల్చిన చేపల్ని యేసు తన నమ్మకమైన స్నేహితులకు తినడానికి ఇచ్చాడు. ఇప్పుడు ఆయన పేతురుతో మాట్లాడడం మొదలుపెట్టాడు.—యోహా. 21:4-14.
26, 27. (ఎ) యేసు పేతురుకు ఏ అవకాశాన్ని మూడుసార్లు ఇచ్చాడు? (బి) పేతురును పూర్తిగా క్షమించానని యేసు ఎలా చూపించాడు?
26 బహుశా వాళ్లు పట్టిన విస్తారమైన చేపలను చూపిస్తూ యేసు పేతురును ఇలా అడిగాడు: “వీరికంటె [“వీటికంటే,” NW] నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా?” పేతురు యేసుకన్నా చేపల వ్యాపారాన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాడా? పేతురు ఎలాగైతే మూడుసార్లు తన ప్రభువు తెలియదని చెప్పాడో, అలాగే మూడుసార్లు తన స్నేహితుల ముందు తన ప్రభువును ప్రేమిస్తున్నానని చెప్పుకునే అవకాశాన్ని యేసు ఆయనకు ఇచ్చాడు. అప్పుడు యేసు, ఆ ప్రేమను చేతల్లో ఎలా చూపించాలో ఆయనకు వివరించాడు. పేతురు పవిత్ర సేవకు అన్నిటికన్నా ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి, క్రీస్తు గొర్రెలను అంటే ఆయన నమ్మకమైన అనుచరులను పోషించాలి, బలపర్చాలి, వాళ్ల గురించి శ్రద్ధ తీసుకోవాలి.—లూకా 22:32; యోహా. 21:15-17.
27 అలా యేసు తన దృష్టిలో, యెహోవా దృష్టిలో పేతురు ఇంకా విలువైనవాడేనని స్పష్టం చేశాడు. క్రీస్తు నిర్దేశం కింద సంఘంలో పేతురు ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. పేతురును పూర్తిగా క్షమించానని యేసు ఎంతో స్పష్టంగా చూపించాడు! యేసు చూపించిన దయ పేతురు హృదయాన్ని కదిలించింది, తన తప్పు తెలుసుకోవడానికి ఆయనకు దోహదపడింది.
28. ఏ భావంలో సీమోను తన పేరును సార్థకం చేసుకున్నాడు?
28 పేతురు తన నియామకాన్ని ఎన్నో ఏళ్లపాటు నమ్మకంగా నెరవేర్చాడు. యేసు చనిపోయే ముందురోజు ఆజ్ఞాపించినట్లు ఆయన తన సహోదరులను బలపర్చాడు. పేతురు దయగా, ఓపిగ్గా క్రీస్తు అనుచరుల గురించి శ్రద్ధ తీసుకున్నాడు, వాళ్లను పోషించాడు. సంఘానికి ప్రయోజనం కలిగేలా స్థిరమైన, బలమైన ప్రభావం చూపించడం ద్వారా, నమ్మదగిన వ్యక్తిగా ఉండడం ద్వారా పేతురు (రాతిబండ) అని యేసు తనకు పెట్టిన పేరును సీమోను సార్థకం చేసుకున్నాడు. దానికి నిదర్శనం పేతురు ప్రేమతో రాసిన రెండు పత్రికలే. బైబిల్లో ఉన్న ఆ పత్రికలు అమూల్యమైనవి. క్షమాపణ గురించి యేసు నుండి నేర్చుకున్న పాఠాన్ని పేతురు ఎన్నడూ మర్చిపోలేదని ఆ పత్రికలు కూడా చూపిస్తున్నాయి.—1 పేతురు 3:8, 9; 4:8 చదవండి.
29. పేతురులా విశ్వాసాన్ని, యేసులా కనికరాన్ని మనం ఏయే రకాలుగా చూపించవచ్చు?
29 మనం కూడా ఆ పాఠం నేర్చుకుందాం. మనం చేసే ఎన్నో తప్పులకు ప్రతీరోజు దేవుణ్ణి క్షమాపణలు అడుగుతున్నామా? ఆ తర్వాత, యెహోవా మనల్ని క్షమించాడని, ఆ క్షమాపణ మనల్ని శుద్ధిచేస్తుందని నమ్ముతున్నామా? మనం కూడా మనచుట్టూ ఉన్నవాళ్లను క్షమిస్తున్నామా? అలాచేస్తే, మనం పేతురులా విశ్వాసాన్ని, ఆయన బోధకునిలా కనికరాన్ని చూపిస్తాం.