భాగం 3
ఒక కుటుంబం జలప్రళయాన్ని తప్పించుకుంది
దేవుడు ప్రపంచంలోవున్న చెడ్డవాళ్లనంతా నాశనం చేసి నోవహును, ఆయన కుటుంబాన్ని రక్షించాడు
భూమ్మీద జనాభా పెరుగుతున్నకొద్దీ పాపం, చెడుతనం కూడా పెరిగాయి. ఆ కాలంలోవున్న ఒకే ఒక ప్రవక్త హనోకు, దేవుడు దుష్టులను నాశనం చేస్తాడని హెచ్చరించాడు. అయినా, దుష్టత్వం ఇంకా ఎక్కువై పరిస్థితులు మరీ ఘోరంగా తయారయ్యాయి. కొంతమంది దేవదూతలు దేవునికి ఎదురుతిరిగి, పరలోకంలో తమ స్థానాలను విడిచిపెట్టి, మనుషుల రూపం దాల్చి దురాశతో స్త్రీలను పెళ్లిచేసుకున్నారు. సృష్టికి విరుద్ధమైన ఈ కలయికవల్ల అసాధారణ బలశూరుల తరం ఒకటి పుట్టింది. నెఫీలులు అనే పేరుగల వీళ్లు చాలా ఎత్తుగా బలంగా ఉండేవాళ్లు. వాళ్లు ప్రపంచంలో హింస, రక్తపాతాన్ని మరింత ఎక్కువ చేశారు. తను సృష్టించిన మనుషులు అలా చెడిపోవడం చూసి దేవుడు ఎంతో బాధపడ్డాడు.
హనోకు చనిపోయిన తర్వాత, కేవలం ఒకేఒక వ్యక్తి ఆయనంత నీతిమంతునిగా ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు నోవహు. ఆయన, ఆయన కుటుంబం దేవుని దృష్టిలో సరైనదే చేసేవాళ్లు. దేవుడు చెడ్డవాళ్లనంతా నాశనం చేయాలనుకున్నప్పుడు ఆయన నోవహును, భూమ్మీది జంతుజాలాన్ని రక్షించాలనుకున్నాడు. అందుకే రైలుపెట్టె ఆకారంలో ఉన్న ఒక పెద్ద ఓడను తయారు చేయమని దేవుడు నోవహుకు చెప్పాడు. నోవహును, ఆయన కుటుంబాన్ని అలాగే భూమ్మీదున్న వివిధ జాతుల జంతువులను భూవ్యాప్త జలప్రళయం నుండి రక్షించడానికి ఆ ఓడ తయారు చేయమన్నాడు. నోవహు దేవుడు చెప్పినట్టే చేశాడు. ఆ ఓడ తయారుచేయడానికి పట్టిన దాదాపు 40 లేక 50 సంవత్సరాల్లో నోవహు ‘నీతిని ప్రకటించాడు.’ (2 పేతురు 2:5) జలప్రళయం గురించి నోవహు హెచ్చరించినా ప్రజలు పట్టించుకోలేదు. దేవుడు చెప్పినప్పుడు నోవహు, ఆయన కుటుంబం జంతువులతోపాటు ఓడలోకి వెళ్లారు. తర్వాత దేవుడు ఆ ఓడ తలుపు మూసేశాడు. వర్షం మొదలైంది.
నలభై రోజులు, 40 రాత్రులు కుండపోతగా వర్షం పడి భూమంతా నీళ్లతో నిండిపోయింది. చెడ్డవాళ్లంతా చనిపోయారు. నెలలు గడిచాక నీటి మట్టం తగ్గి ఓడ ఒక పర్వతం పైన ఆగింది. వాళ్లు మొత్తం ఒక సంవత్సరంపాటు ఓడలోనే ఉండి సురక్షితంగా బయటకు వచ్చారు. తర్వాత నోవహు కృతజ్ఞతతో దేవునికి బలి అర్పించాడు. భూమ్మీదున్న సమస్త జీవరాశిని నాశనం చేయడానికి ఇక ఎప్పుడూ జలప్రళయం తీసుకురానని యెహోవా నోవహుకు అభయమిస్తూ దానికి గుర్తుగా వాళ్లకు ఆకాశంలో ఇంద్రధనుస్సును చూపించాడు.
జలప్రళయం తర్వాత దేవుడు మనుషులకు కొన్ని కొత్త ఆజ్ఞలు ఇచ్చాడు. వాళ్లు జంతు మాంసం తినొచ్చు గానీ రక్తాన్ని తినకూడదని చెప్పాడు. నోవహు సంతతి పిల్లలను కని భూమ్మీద విస్తరించాలని దేవుడు చెప్పాడు. కానీ, వాళ్లలో కొంతమంది ఆయన మాట వినలేదు. ప్రజలు ఏకమై నిమ్రోదు నాయకత్వాన బాబెలు నగరంలో ఓ పెద్ద గోపురాన్ని కట్టడం ఆరంభించారు, తర్వాత ఆ నగరానికి బబులోను అనే పేరు వచ్చింది. ఆ ప్రజలు, భూమంతా విస్తరించాలని దేవుడిచ్చిన ఆజ్ఞను ఉల్లంఘించి ఒక్కచోటే ఉండాలనుకున్నారు. కానీ, దేవుడు ఆ తిరుగుబాటుదారుల ఆలోచనను తిప్పికొట్టాడు. ఎలాగంటే, అప్పటివరకు ఒకే భాష మాట్లాడుతున్న వాళ్లని వేర్వేరు భాషలు మాట్లాడేలా చేశాడు. దాంతో ఒకరి మాట ఒకరికి అర్థంకాక పరిస్థితి గందరగోళంగా మారి గోపురం కట్టడం ఆపేశారు.