భాగం 20
యేసుక్రీస్తు చంపబడ్డాడు
యేసు ఒక కొత్త ఆచరణను మొదలు పెట్టాడు; ఆయన నమ్మిన వ్యక్తే ఆయనను అప్పగించాడు. ఆయన ఆ తర్వాత చంపబడ్డాడు
యేసు ప్రకటించి బోధించడం మొదలుపెట్టి మూడున్నర సంవత్సరాలు గడిచిపోయాయి. తాను త్వరలో చనిపోతానని యేసుకు అర్థమైంది. యూదా మతనాయకులు యేసును చంపడానికి పన్నాగాలు పన్నారు. కానీ, ప్రజలు ఆయనొక ప్రవక్త అనుకుంటున్నారు కాబట్టి ఆయనను చంపితే ప్రజలు అల్లరి రేపుతారేమోనని వాళ్లు భయపడ్డారు. ఈలోగా సాతాను, యేసు 12 మంది అపొస్తలుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదా నమ్మకద్రోహిగా మారేలా చేశాడు. యేసును అప్పగిస్తే 30 వెండి నాణేలు ఇస్తామని మతనాయకులు యూదాకు ఆశ చూపించారు.
తను చనిపోవడానికి ముందు రాత్రి యేసు పస్కా పండుగను ఆచరించడానికి తన అపొస్తలులతో కలిసి ఒకచోటికి వెళ్లాడు. యూదాను పంపేసిన తర్వాత, ఆయన ప్రభువురాత్రి భోజనం అనే ఒక కొత్త ఆచరణ మొదలుపెట్టాడు. ఆయన ఒక రొట్టె పట్టుకొని ప్రార్థించిన తర్వాత ఆ రొట్టెను మిగిలిన 11 మంది అపొస్తలులకు ఇస్తూ, “ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడి” అని అన్నాడు. ఆ తర్వాత ద్రాక్షరసం ఉన్న ఓ గిన్నె తీసుకొని ప్రార్థించి, “ఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన” అని చెప్పాడు.—లూకా 22:19, 20.
ఆ రాత్రి యేసు తన అపొస్తలులకు ఎన్నో విషయాలు చెప్పాడు. వాళ్లు ఒకరినొకరు నిస్వార్థంగా ప్రేమించాలి అని ఒక కొత్త ఆజ్ఞ ఇచ్చాడు. “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు” అని ఆయన చెప్పాడు. (యోహాను 13:34, 35) త్వరలో జరుగబోయే దుఃఖకరమైన సంఘటనల గురించి ఆందోళన పడొద్దని ధైర్యం చెప్పాడు. వాళ్ల కోసం ఆయన మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. వాళ్లంతా కలిసి స్తుతిగీతాలు పాడి గెత్సేమనే తోటకు వెళ్లారు.
అక్కడ యేసు మోకాళ్లూని దేవునికి తీవ్రంగా ప్రార్థించాడు. కొద్దిసేపటికే సైనికులు, యాజకులు, ఇంకొందరు ఆయనను బంధించడానికి వచ్చారు. యూదా యేసు దగ్గరకు వచ్చి ఆయనను ముద్దుపెట్టుకొని, ఆయనే యేసు అని వాళ్లకు చూపించాడు. సైనికులు యేసును బంధించినప్పుడు అపొస్తలులు అక్కడి నుండి పారిపోయారు.
యేసును యూదుల మహాసభ ముందు హాజరుపర్చినప్పుడు, ఆయన తనే దేవుని కుమారుడినని చెప్పాడు. ఆయన దేవదూషణ చేస్తున్నాడు కాబట్టి మరణ శిక్షకు పాత్రుడని మహాసభ నిర్ధారించింది. ఆ తర్వాత ఆయనను రోమా అధికారియైన పొంతి పిలాతు దగ్గరకు తీసుకెళ్లారు. యేసు ఏ నేరం చేయలేదని పిలాతుకు అనిపించినా, ఆయనకు మరణ శిక్ష విధించాలని పట్టుబట్టిన గుంపుకు ఆయనను అప్పగించాడు.
రోమా సైనికులు యేసును గొల్గొతా అనే ప్రాంతానికి తీసుకెళ్లి ఆయన కాళ్లుచేతులకు మేకులు కొట్టి ఒక దూలానికి వేలాడదీశారు. ఒక్కసారిగా పట్టపగలే చీకటి కమ్ముకుంది. అదేరోజు మధ్యాహ్నం యేసు చనిపోయాడు. వెంటనే ఒక పెద్ద భూకంపం వచ్చింది. యేసు మృతదేహాన్ని కొండలో తొలిచిన గుహలో పెట్టారు. మరుసటి రోజు, యాజకులు ఆ గుహను మూసి సైనికుల్ని కాపలా పెట్టారు. యేసు ఆ సమాధిలోనే ఉన్నాడా? లేదు. అన్నిటికన్నా గొప్ప అద్భుతం ఒకటి జరిగింది.
—మత్తయి 26, 27 అధ్యాయాలు; మార్కు 14, 15 అధ్యాయాలు; లూకా 22, 23 అధ్యాయాలు; యోహాను 12 నుండి 19 అధ్యాయాలు.
a యేసు చనిపోవడం ఎందుకంత ప్రాముఖ్యమో తెలుసుకోవడానికి బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 5వ అధ్యాయం చూడండి.