9వ పాఠం
కూటాలకు చక్కగా సిద్ధపడాలంటే ఏం చేయాలి?
మీరు యెహోవాసాక్షులతో కలిసి బైబిలు అధ్యయనం చేస్తుంటే, బహుశా మీరు ప్రతీసారి ఆ సమాచారాన్ని ముందే చదువుతుండవచ్చు. సంఘ కూటాలకు కూడా అలాగే సిద్ధపడితే వాటి నుండి పూర్తి ప్రయోజనం పొందుతారు. అలా సిద్ధపడడం అలవాటు చేసుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి.
ఎప్పుడు, ఎక్కడ సిద్ధపడాలో నిర్ణయించుకోండి. మీరు ఏ సమయంలో ఏకాగ్రతతో చదవగలరు? ఉదయాన్నే పనులు మొదలుపెట్టే ముందా? లేక రాత్రి పిల్లలు పడుకున్న తర్వాతా? మీకు ఎక్కువసేపు చదవడం వీలుకాకపోయినా, ఎంతసేపు చదవగలరో ఆలోచించుకుని వేరే పనులు అడ్డురాకుండా చూసుకోండి. ప్రశాంతంగా ఉండే స్థలాన్ని ఎంచుకోండి. రేడియో, టీవీ, సెల్‌ఫోన్ వంటివి ఆపేయండి. చదివే ముందు ప్రార్థన చేసుకుంటే, మీ ఆందోళనల్ని మర్చిపోయి దేవుని వాక్యం మీద మనసు పెట్టగలుగుతారు.—ఫిలిప్పీయులు 4:6, 7.
అండర్‌లైన్ చేసుకోండి, జవాబు చెప్పడానికి సిద్ధపడండి. ముందు సమాచారాన్ని మొత్తంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆర్టికల్ లేదా అధ్యాయం శీర్షిక (హెడింగ్) గురించి ఆలోచించండి, దానికీ ఉపశీర్షికలకూ (సబ్‌హెడింగ్స్‌కీ) మధ్య సంబంధం అర్థం చేసుకోండి. చిత్రాలు, ముఖ్యాంశాల్ని నొక్కిచెప్పే పునఃసమీక్ష ప్రశ్నలు పరిశీలించండి. తర్వాత ఒక్కో పేరా చదివి, ప్రశ్నకు జవాబు గుర్తించండి. లేఖనాల్ని బైబిల్లో తీసి చదువుతూ, వాటికీ సమాచారానికీ మధ్య ఉన్న సంబంధం గురించి ఆలోచించండి. (అపొస్తలుల కార్యాలు 17:11) ప్రశ్నకు జవాబు ఎక్కడుందో గుర్తించిన తర్వాత, కూటాల్లో తేలిగ్గా జవాబు చెప్పేలా ముఖ్యమైన పదాల కింద లేదా వాక్యాల కింద గీతలు పెట్టుకోండి. మీరు కూటానికి వెళ్లినప్పుడు జవాబు చెప్పాలనిపిస్తే, చెయ్యి పైకెత్తి మీ సొంత మాటల్లో క్లుప్తంగా చెప్పండి.
ప్రతీవారం కూటాల్లో చర్చించే రకరకాల అంశాల గురించి పరిశీలించడం వల్ల, బైబిలు జ్ఞానమనే మీ “ఖజానాలో” కొత్తకొత్త విషయాలు చేరతాయి.—మత్తయి 13:51, 52.
-
మీరు కూటాలకు సిద్ధపడడం ఎలా అలవాటు చేసుకోవచ్చు?
-
మీరు కూటాల్లో జవాబు చెప్పడానికి ఎలా సిద్ధపడవచ్చు?