97వ అధ్యాయం
ద్రాక్షతోటలో పనిచేయడానికి వచ్చినవాళ్ల ఉదాహరణ
-
“చివర్లో” వచ్చిన పనివాళ్లు మొదటివాళ్లు అవుతారు
పెరయలో యేసు కాసేపటి క్రితమే ఇలా చెప్పాడు: “ముందున్న చాలామంది వెనక్కి వెళ్తారు, వెనక ఉన్న చాలామంది ముందుకు వస్తారు.” (మత్తయి 19:30) ఆయన ఆ విషయాన్ని నొక్కిచెప్పడానికి ద్రాక్షతోటలో పనిచేయడానికి వచ్చినవాళ్ల ఉదాహరణ చెప్పాడు:
“పరలోక రాజ్యం, తన ద్రాక్షతోటలో పనివాళ్లను కూలికి పెట్టుకోవడానికి తెల్లవారుజామునే బయల్దేరిన ద్రాక్షతోట యజమానిలా ఉంది. అతను రోజుకు ఒక దేనారం ఇస్తానని చెప్పి పనివాళ్లను తన ద్రాక్షతోటలోకి పంపించాడు. ఉదయం దాదాపు 9 గంటలకు అతను మళ్లీ బయటికి వెళ్లినప్పుడు, పని దొరకక సంతలో నిలబడివున్న కొంతమందిని చూసి వాళ్లతో, ‘మీరు కూడా నా ద్రాక్షతోటలోకి వెళ్లండి, మీకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తాను’ అని చెప్పాడు. దాంతో వాళ్లు వెళ్లారు. అతను మధ్యాహ్నం దాదాపు 12 గంటలకు అలాగే దాదాపు 3 గంటలకు మళ్లీ బయటికి వెళ్లి అలాగే చేశాడు. చివరికి సాయంత్రం దాదాపు 5 గంటలకు కూడా అతను బయటికి వెళ్లి, అక్కడ ఖాళీగా నిలబడివున్న కొంతమందిని చూసి, ‘మీరు పనిచేయకుండా రోజంతా ఎందుకు ఇక్కడ నిలబడివున్నారు?’ అని అడిగాడు. అందుకు వాళ్లు, ‘మమ్మల్ని ఎవరూ పనిలో పెట్టుకోలేదు’ అని చెప్పారు; అప్పుడు అతను, ‘మీరు కూడా నా ద్రాక్షతోటలోకి వెళ్లండి’ అన్నాడు.”—మత్తయి 20:1-7.
“పరలోక రాజ్యం,” “ద్రాక్షతోట యజమాని” అనే మాటలు విన్నప్పుడు, ఆ ఉదాహరణలోని యజమాని యెహోవాయే అని ప్రజలు అర్థం చేసుకొనివుంటారు. ఎందుకంటే, ద్రాక్షతోట ఇశ్రాయేలు ప్రజలు అని, యజమాని యెహోవా అని లేఖనాలు చెప్తున్నాయి. (కీర్తన 80:8, 9; యెషయా 5:3, 4) ధర్మశాస్త్ర ఒప్పందం కింద ఉన్నవాళ్లు ద్రాక్షతోట పనివాళ్లతో పోల్చబడ్డారు. అయితే, యేసు గతంలో ఉన్న ఇశ్రాయేలీయుల గురించి కాదు గానీ, తన కాలంలో ఉన్న ఒక పరిస్థితి గురించి చెప్తున్నాడు.
ఎల్లప్పుడూ దేవుని సేవలో ఉండడం మతనాయకుల, పరిసయ్యుల బాధ్యత. కాబట్టి వాళ్లు, ఆ ఉదాహరణలో రోజంతా పనిచేసి పూర్తి జీతాన్ని అంటే ఒక దేనారాన్ని పొందే పనివాళ్లలా ఉన్నారు.
యాజకులు, మతనాయకులు సామాన్య యూదుల్ని దేవుని ద్రాక్షతోటలో కొన్ని గంటలు మాత్రమే పనిచేస్తున్న వాళ్లలా, అంటే దేవుణ్ణి తక్కువగా సేవిస్తున్న వాళ్లలా చూసేవాళ్లు. ఆ సామాన్య యూదులు, యేసు చెప్పిన ఉదాహరణలో ఉదయం దాదాపు 9 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, 3 గంటలకు, సాయంత్రం 5 గంటలకు ద్రాక్షతోటలో పనిచేయడానికి వచ్చినవాళ్లలా ఉన్నారు.
మతనాయకులు, యేసును అనుసరిస్తున్న ప్రజల్ని “శపించబడిన” వాళ్లుగా చూసేవాళ్లు. (యోహాను 7:49) ఆ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా చేపలు పట్టే పని, కూలి పని చేస్తూ ఉన్నారు. అయితే, సా.శ. 29 శరదృతువులో “ద్రాక్షతోట యజమాని” యేసును పంపించి, క్రీస్తు శిష్యులుగా దేవుని కోసం పనిచేయమని దీనులైన ఆ ప్రజల్ని ఆహ్వానించాడు. ఆ విధంగా వాళ్లు యేసు చెప్పిన ఉదాహరణలో, “చివర్లో” అంటే సాయంత్రం 5 గంటలకు వచ్చిన పనివాళ్లలా ఉన్నారు.
ఆ రోజు సాయంత్రం ఏం జరిగిందో చెప్తూ, యేసు ఉదాహరణను ఇలా ముగించాడు: “సాయంత్రం అయినప్పుడు ద్రాక్షతోట యజమాని తన గృహనిర్వాహకుడితో, ‘పనివాళ్లను పిలిచి, చివర్లో వచ్చినవాళ్లతో మొదలుపెట్టి, మొదట వచ్చినవాళ్ల వరకు అందరికీ వాళ్లవాళ్ల కూలి ఇవ్వు’ అని చెప్పాడు. సాయంత్రం 5 గంటలకు పనికి కుదిరినవాళ్లు వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో దేనారం ఇచ్చారు. కాబట్టి రోజంతా పనిచేసినవాళ్లు తమకు ఎక్కువ కూలి వస్తుందని అనుకున్నారు. కానీ వాళ్లకు కూడా ఒక్క దేనారమే ఇచ్చారు. వాళ్లు అది తీసుకుని ద్రాక్షతోట యజమాని మీద సణగడం మొదలుపెట్టి, ‘చివర్లో వచ్చిన వీళ్లు ఒక్క గంటే పనిచేశారు; అయినా రోజంతా ఎండలో కష్టపడి పనిచేసిన మాకు, వాళ్లకు ఒకే కూలి ఇచ్చావు!’ అన్నారు. కానీ ఆ యజమాని వాళ్లలో ఒకరితో ఇలా అన్నాడు: ‘స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే. నువ్వు నా దగ్గర ఒక దేనారానికి ఒప్పుకున్నావు కదా? నీ కూలి తీసుకుని వెళ్లు. చివర్లో వచ్చిన వీళ్లకు కూడా, నీకు ఇచ్చినంతే ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. నా డబ్బుతో నాకు నచ్చినట్టు చేసే హక్కు నాకు లేదా? నేను మంచివాడిగా ఉన్నందుకు నీకు ఈర్ష్యగా ఉందా?’ అలా, ముందున్నవాళ్లు వెనక్కి వెళ్తారు, వెనకున్నవాళ్లు ముందుకు వస్తారు.”—మత్తయి 20:8-16.
ఉదాహరణలోని ఆ చివరి మాటలకు శిష్యులు ఆశ్చర్యపోయి ఉంటారు. “ముందున్న” వాళ్లమని అనుకుంటున్న
యూదా మతనాయకులు ఎలా “వెనక్కి వెళ్తారు”? యేసు శిష్యులు ఎలా “ముందుకు వస్తారు”?పరిసయ్యుల దృష్టిలో, ఇతరుల దృష్టిలో “వెనకున్న” యేసు శిష్యులు, పూర్తి జీతం పొందేవాళ్లలో ముందుంటారు. యేసు చనిపోయిన తర్వాత, దేవుడు సహజ ఇశ్రాయేలును వదిలేసి “దేవుని ఇశ్రాయేలు” అనే కొత్త జనాన్ని ఎంచుకుంటాడు. (గలతీయులు 6:16; మత్తయి 23:38) పవిత్రశక్తితో బాప్తిస్మం తీసుకోవడం గురించి చెప్పినప్పుడు, బాప్తిస్మమిచ్చే యోహాను ఆ కొత్త జనాన్ని ఉద్దేశించే మాట్లాడాడు. “వెనకున్న” వాళ్లు, ఆ బాప్తిస్మం తీసుకునేవాళ్లలో మొదటివాళ్లు అవుతారు. అంతేకాదు, యేసు గురించి ‘భూమంతటా సాక్ష్యమిచ్చే’ అవకాశాన్ని పొందేవాళ్లలో కూడా మొదటివాళ్లు అవుతారు. (అపొస్తలుల కార్యాలు 1:5, 8; మత్తయి 3:11) జరగబోయే ఆ గొప్ప మార్పును అర్థం చేసుకున్న శిష్యులు, “వెనక్కి” వెళ్లే మతనాయకుల నుండి తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని ఎదురుచూడవచ్చు.