89వ అధ్యాయం
యూదయకు వెళ్తూ పెరయలో బోధించాడు
-
వేరేవాళ్లు పాపం చేయడానికి కారణమవ్వడం చాలా పెద్ద తప్పు
-
క్షమించడం, విశ్వాసం చూపించడం
యేసు దక్షిణ దిశగా యెరూషలేము వైపు ప్రయాణిస్తూ, కొంతకాలంగా “యొర్దాను అవతల” ఉన్న పెరయ ప్రాంతంలో ప్రకటిస్తున్నాడు.—యోహాను 10:40.
యేసుతోపాటు శిష్యులు, “చాలామంది ప్రజలు” ప్రయాణిస్తున్నారు. వాళ్లలో పన్ను వసూలుచేసే వాళ్లు, పాపులు ఉన్నారు. (లూకా 14:25; 15:1) అంతేకాదు యేసు బోధల్ని, పనుల్ని తప్పుపట్టే పరిసయ్యులు, శాస్త్రులు కూడా వాళ్లలో ఉన్నారు. యేసు చెప్పిన తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన కుమారుడు, ధనవంతుడు-లాజరు ఉదాహరణల్ని వాళ్లు విన్నారు. కాబట్టి వాళ్లు ఆలోచించడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి.—లూకా 15:2; 16:14.
బహుశా వ్యతిరేకులు చేస్తున్న ఎగతాళిని, విమర్శల్ని దృష్టిలో పెట్టుకుని, యేసు అంతకుముందు గలిలయలో చెప్పిన కొన్ని విషయాల్ని తన శిష్యులకు మళ్లీ గుర్తుచేశాడు.
ఉదాహరణకు, యేసు ఇలా చెప్పాడు: “ఒక వ్యక్తిని పాపంలో పడేసేవి ఎప్పుడూ ఉంటాయి. కానీ ఎవరైతే ఒక మనిషిని పాపంలో పడేస్తారో అతనికి శ్రమ! . . . జాగ్రత్త! నీ సహోదరుడు పాపం చేస్తే అతన్ని గద్దించు; పశ్చాత్తాపపడితే క్షమించు. అతను రోజుకు ఏడుసార్లు నీ విషయంలో పాపం చేసినా, ఏడుసార్లు నీ దగ్గరికి వచ్చి, ‘నన్ను క్షమించు’ అని అడిగితే, నువ్వు అతన్ని క్షమించాలి.” (లూకా 17:1-4) ఆ చివరి మాట వినగానే, ఏడుసార్లు క్షమించాలా అని తాను అడిగిన ప్రశ్న పేతురుకు గుర్తొచ్చి ఉంటుంది.—మత్తయి 18:21.
యేసు చెప్పినట్లు చేయడం శిష్యులకు సాధ్యమేనా? “ఇంకా బలమైన విశ్వాసం కలిగివుండేలా మాకు సాయం చేయి” అని వాళ్లు యేసును అడిగినప్పుడు, ఆయన ఇలా మాటిచ్చాడు: “మీకు ఆవగింజంత విశ్వాసం ఉండి, ఈ కంబళి చెట్టుతో, ‘ఇక్కడి నుండి లేచి సముద్రంలో పడు!’ అని చెప్తే, అది లేచి సముద్రంలో పడుతుంది.” (లూకా 17:5, 6) అవును, విశ్వాసం కొంచెమైనా, అది చాలా గొప్పవాటిని సాధించగలదు.
ఒక వ్యక్తి వినయంగా ఉండడం, తన గురించి తాను సరైన ఆలోచన కలిగివుండడం ఎంత ప్రాముఖ్యమో చెప్తూ, యేసు తన అపొస్తలులతో ఇలా అన్నాడు: “మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉన్నాడనుకోండి. ఆ దాసుడు పొలం దున్ని లేదా మందను కాసి వస్తే యజమాని అతనితో, ‘వెంటనే వచ్చి ఇక్కడ భోజనానికి కూర్చో’ అని అంటాడా? లేదు. బదులుగా యజమాని అతనితో, ‘నువ్వు బట్టలు మార్చుకొని, నేను తినడానికి ఏదోకటి సిద్ధం చేయి. నేను తిని తాగే వరకు పక్కనే ఉండి సేవలు చేయి. తర్వాత నువ్వు తిని తాగుదువుగానీ’ అంటాడు. ఇచ్చిన పని చేసినందుకు యజమాని ఆ దాసునికి కృతజ్ఞతలు చెప్తాడా? చెప్పడు కదా. అలాగే, మీరు కూడా మీకు ఇచ్చిన పనులన్నీ చేసిన తర్వాత ఇలా అనండి: ‘మేము ఎందుకూ పనికిరాని దాసులం. మేము చేయాల్సిన వాటినే చేశాం.’”—లూకా 17:7-10.
అవును, దేవుని పనులకు మొదటిస్థానం ఇవ్వడం చాలా ప్రాముఖ్యమని దేవుని సేవకులందరూ అర్థం చేసుకోవాలి. అంతేకాదు, దేవుని కుటుంబ సభ్యులుగా ఉంటూ ఆయన్ని ఆరాధించడం ఎంత గొప్ప అవకాశమో ప్రతీఒక్కరు గుర్తుంచుకోవాలి.
బహుశా ఈ విషయాలు చెప్పిన కాసేపటికే, మార్త మరియలు పంపిన ఒక వ్యక్తి యేసు దగ్గరికి వచ్చాడు. మార్త, మరియ లాజరుకు సహోదరీలు. వాళ్లు యూదయలోని బేతనియలో ఉంటారు. వాళ్లు పంపిన వ్యక్తి యేసుతో ఇలా చెప్పాడు: “ప్రభువా, ఇదిగో! నువ్వు ప్రేమించే అతనికి జబ్బు చేసింది.”—యోహాను 11:1-3.
తన స్నేహితుడైన లాజరు తీవ్రంగా జబ్బుపడ్డాడని తెలిసినప్పుడు యేసు బాధతో కృంగిపోలేదు. బదులుగా ఆయన ఇలా అన్నాడు: “ఈ జబ్బు అతను చనిపోవడానికి రాలేదు, కానీ దేవుని మహిమ కోసం వచ్చింది. దాని ద్వారా దేవుని కుమారుడు మహిమపర్చబడడానికి వచ్చింది.” యేసు ఆ ప్రాంతంలోనే రెండు రోజులు ఉన్న తర్వాత తన శిష్యులతో, “మనం మళ్లీ యూదయకు వెళ్దాం” అన్నాడు. శిష్యులు ఆయనతో, “రబ్బీ, ఈమధ్యే యూదయవాళ్లు నిన్ను రాళ్లతో కొట్టాలని చూశారు. నువ్వు మళ్లీ అక్కడికి వెళ్తావా?” అని అడ్డుచెప్పారు.—యోహాను 11:4, 7, 8.
అప్పుడు యేసు ఇలా అన్నాడు: “పగలు 12 గంటలు ఉన్నాయి కదా? ఎవరైనా పగటిపూట నడిస్తే, వాళ్లు ఈ లోకపు వెలుగును చూస్తారు కాబట్టి దేనివల్లా తడబడరు. కానీ ఎవరైనా రాత్రిపూట నడిస్తే, అతనిలో వెలుగు లేదు కాబట్టి అతను తడబడతాడు.” (యోహాను 11:9, 10) పరిచర్య కోసం యెహోవా తనకు ఇచ్చిన సమయం గురించి యేసు మాట్లాడుతుండవచ్చు. అది అయిపోయేలోగా, ఉన్న కొద్ది సమయాన్నే యేసు పూర్తిగా ఉపయోగించుకోవాలి.
యేసు ఇంకా ఇలా అన్నాడు: “మన స్నేహితుడు లాజరు నిద్రపోతున్నాడు, అతన్ని లేపడానికి వెళ్తున్నాను.” లాజరు విశ్రాంతి తీసుకుంటున్నాడనీ, నిద్రపోతే బాగౌతాడనీ అనుకున్న శిష్యులు ఇలా అన్నారు: “ప్రభువా, అతను నిద్రపోతుంటే బాగౌతాడు.” అప్పుడు యేసు వాళ్లతో స్పష్టంగా ఇలా చెప్పాడు: “లాజరు చనిపోయాడు . . . మనం అతని దగ్గరికి వెళ్దాం పదండి.”—యోహాను 11:11-15.
యూదయలో యేసుకు ప్రాణాపాయం ఉండొచ్చని తెలిసినా, తోమా ఆయనకు అండగా ఉండాలనుకున్నాడు. అందుకే అతను తోటి శిష్యులతో ఇలా అన్నాడు: “మనం కూడా వెళ్దాం, ఆయనతో పాటు చనిపోదాం.”—యోహాను 11:16.