కీర్తనలు 96:1-13
96 యెహోవాకు ఒక కొత్త పాట పాడండి.+
భూమ్మీదున్న సమస్త ప్రజలారా, యెహోవాకు పాట పాడండి!+
2 యెహోవాకు పాట పాడండి; ఆయన పేరును స్తుతించండి.
ప్రతీరోజు ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి.+
3 దేశాల మధ్య ఆయన మహిమను,దేశదేశాల ప్రజలందరి మధ్య ఆయన అద్భుతమైన పనుల్ని చాటించండి.+
4 యెహోవా గొప్పవాడు, అత్యంత స్తుతిపాత్రుడు.
దేవుళ్లందరి కంటే పూజనీయుడు.*
5 దేశదేశాల ప్రజలు పూజించే దేవుళ్లందరూ వ్యర్థమైన దేవుళ్లు,+కానీ యెహోవా ఆకాశాన్ని తయారుచేసిన దేవుడు.+
6 ఘనతా వైభవాలు ఆయన సన్నిధిలో ఉన్నాయి;+బల సౌందర్యాలు ఆయన పవిత్రమైన స్థలంలో ఉన్నాయి.+
7 దేశదేశాల కుటుంబాల్లారా, యెహోవాకు తగిన ఘనత ఆయనకు ఇవ్వండి;యెహోవా మహిమను బట్టి, బలాన్ని బట్టి ఆయనకు తగిన ఘనత ఇవ్వండి.+
8 యెహోవా పేరుకు తగిన మహిమ ఆయనకు చెల్లించండి;+కానుక తీసుకొని ఆయన ప్రాంగణాల్లోకి రండి.
9 పవిత్రమైన బట్టలు వేసుకుని* యెహోవాకు వంగి నమస్కారం చేయండి;*భూమ్మీదున్న సమస్త ప్రజలారా, ఆయన ముందు వణకండి!
10 దేశాల మధ్య ఇలా చాటించండి: “యెహోవా రాజయ్యాడు!+
భూమి* స్థిరంగా స్థాపించబడింది, దాన్ని కదిలించలేరు.*
దేశదేశాల ప్రజలకు ఆయన న్యాయంగా తీర్పు తీరుస్తాడు.”*+
11 ఆకాశం సంతోషించాలి, భూమి ఆనందించాలి;సముద్రం, దానిలో ఉన్నవన్నీ సంతోషంతో ఘోషించాలి;
12 పొలాలు, వాటిలో ఉన్నవన్నీ ఉల్లసించాలి.+
అడవిలో ఉన్న చెట్లన్నీ సంతోషంతో కేకలు వేయాలి,+
13 అవి యెహోవా ముందు సంతోషంతో కేకలు వేయాలి, ఎందుకంటే ఆయన వస్తున్నాడు;*భూమికి తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు.
ఆయన నీతితో భూలోకానికి,*తన నమ్మకత్వంతో+ దేశదేశాల ప్రజలకు తీర్పు తీరుస్తాడు.+
అధస్సూచీలు
^ లేదా “సంభ్రమాశ్చర్యాలు పుట్టించేవాడు.”
^ లేదా “ఆయన పవిత్రతకు ఉన్న వైభవాన్ని బట్టి” అయ్యుంటుంది.
^ లేదా “ఆరాధించండి.”
^ లేదా “పండే భూమి.”
^ లేదా “అది ఊగిసలాడదు.”
^ లేదా “పక్షాన న్యాయంగా వాదిస్తాడు.”
^ లేదా “వచ్చేశాడు.”
^ లేదా “పండే భూమికి.”