లేవీయకాండం 19:1-37

  • పవిత్రత గురించిన వేర్వేరు నియమాలు (1-37)

    • సరైన విధంగా పంట కోయడం (9, 10)

    • చెవిటివాళ్ల మీద, గుడ్డివాళ్ల మీద శ్రద్ధ (14)

    • లేనిపోనివి కల్పించి చెప్పడం (16)

    • పగపెట్టుకోకూడదు (18)

    • ఇంద్రజాలం, చనిపోయినవాళ్లను సంప్రదించడం నిషేధం (26, 31)

    • పచ్చబొట్లు పొడిపించుకోకూడదు (28)

    • వృద్ధుల్ని గౌరవించాలి (32)

    • పరదేశులతో వ్యవహరించాల్సిన తీరు (33, 34)

19  యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు:  “ఇశ్రాయేలీయుల సమాజమంతటితో ఇలా చెప్పు: ‘మీరు పవిత్రులుగా ఉండాలి, ఎందుకంటే మీ దేవుడైన యెహోవానైన నేను పవిత్రుణ్ణి.+  “ ‘మీలో ప్రతీ ఒక్కరు మీ అమ్మానాన్నల్ని గౌరవించాలి;*+ మీరు నా విశ్రాంతి రోజుల్ని పాటించాలి.+ నేను మీ దేవుడైన యెహోవాను.  వ్యర్థమైన దేవుళ్ల వైపు తిరగకండి,+ మీ కోసం పోత* విగ్రహాలు చేసుకోకండి.+ నేను మీ దేవుడైన యెహోవాను.  “ ‘ఒకవేళ మీరు యెహోవాకు సమాధానబలి అర్పిస్తుంటే,+ ఆయన ఆమోదం పొందే విధంగా దాన్ని అర్పించాలి.+  మీరు ఆ బలిని అర్పించిన రోజున, ఆ తర్వాతి రోజున దాన్ని తినాలి. కానీ మూడో రోజు వరకు దానిలో ఏమైనా మిగిలితే, దాన్ని అగ్నితో కాల్చేయాలి.+  ఒకవేళ దానిలో ఏదైనా మూడో రోజున తింటే, అది అసహ్యకరమైనది, దాన్ని అర్పించిన వ్యక్తి దేవుని ఆమోదం పొందడు.  దాన్ని తినే వ్యక్తి తాను చేసిన తప్పుకు శిక్ష పొందుతాడు, ఎందుకంటే అతను యెహోవాకు చెందిన పవిత్రమైన దాన్ని అపవిత్రపర్చాడు, అతను తన ప్రజల్లో నుండి కొట్టివేయబడాలి.*  “ ‘మీరు మీ పంటను కోస్తున్నప్పుడు, మీ పొలాల్ని గట్టుదాకా కోయకూడదు, అంతేకాదు మీరు మీ పంటలో పరిగెను* ఏరుకోకూడదు.+ 10  మీ ద్రాక్షతోటలో మిగిలినవాటిని సమకూర్చుకోకూడదు, లేదా మీ ద్రాక్షతోటలో కిందపడిన ద్రాక్షల్ని ఏరుకోకూడదు. పేదవాళ్ల* కోసం, పరదేశుల కోసం వాటిని వదిలేయాలి. నేను మీ దేవుడైన యెహోవాను. 11  “ ‘మీరు దొంగతనం చేయకూడదు,+ మోసం చేయకూడదు,+ ఒకరితో ఒకరు మోసపూరితంగా వ్యవహరించకూడదు. 12  మీరు నా పేరున అబద్ధ ప్రమాణం చేయకూడదు;+ అలా చేసి, మీ దేవుని పేరును అపవిత్రపర్చకూడదు. నేను యెహోవాను. 13  మీరు సాటిమనిషిని దగా చేయకూడదు; దోచుకోకూడదు. కూలివానికి ఇవ్వాల్సిన జీతాన్ని రాత్రంతా, అంటే మరుసటి రోజు ఉదయం వరకు మీ దగ్గర ఉంచుకోకూడదు.+ 14  “ ‘చెవిటివాణ్ణి శపించకూడదు, గుడ్డివాని దారికి అడ్డంగా ఏదీ పెట్టకూడదు,+ నువ్వు నీ దేవునికి భయపడుతూ ఉండాలి.+ నేను యెహోవాను. 15  “ ‘మీరు అన్యాయపు తీర్పు తీర్చకూడదు. పేదవాళ్ల విషయంలో పక్షపాతం చూపించకూడదు లేదా ధనవంతుల మీద అభిమానం చూపించకూడదు.+ సాటిమనిషికి న్యాయంగా తీర్పు తీర్చాలి. 16  “ ‘నీ ప్రజల మధ్య లేనిపోనివి కల్పించి చెప్తూ ఇంటింటికీ తిరగకూడదు.+ సాటిమనిషి ప్రాణాన్ని తీయడానికి ప్రయత్నించకూడదు.*+ నేను యెహోవాను. 17  “ ‘నీ హృదయంలో నీ సహోదరుణ్ణి ద్వేషించకూడదు.+ సాటిమనిషి పాపం చేస్తే నువ్వు తప్పకుండా అతన్ని గద్దించాలి,+ లేదంటే ఆ పాపంలో నీకూ పాలు ఉంటుంది. 18  “ ‘ప్రతీకారం తీర్చుకోకూడదు,+ నీ ప్రజల మీద పగపెట్టుకోకూడదు; నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు సాటిమనిషిని ప్రేమించాలి.+ నేను యెహోవాను. 19  “ ‘నేను ఇచ్చే ఈ శాసనాల్ని కూడా మీరు పాటించాలి: రెండు రకాల సాధు జంతువుల్ని సంకరం చేయకూడదు; నీ పొలంలో రెండు రకాల విత్తనాల్ని విత్తకూడదు;+ రెండు రకాల దారాలతో నేసిన వస్త్రాన్ని నువ్వు వేసుకోకూడదు.+ 20  “ ‘వేరే వ్యక్తి కోసం నిర్ణయించబడి, ఇంకా వెల ఇచ్చి విడిపించబడని లేదా విడుదల పొందని సేవకురాలితో ఒక పురుషుడు లైంగిక సంబంధం పెట్టుకుంటే, శిక్ష విధించాలి. అయితే వాళ్లను చంపకూడదు, ఎందుకంటే ఆమె ఇంకా విడుదల పొందలేదు. 21  ఆ పురుషుడు అపరాధ పరిహారార్థ బలిగా ఒక పొట్టేలును తీసుకొని ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర యెహోవా ముందుకు రావాలి. 22  యాజకుడు అతను తెచ్చిన అపరాధ పరిహారార్థ బలి పొట్టేలును తీసుకొని అతని పాపాన్ని బట్టి యెహోవా ముందు అతని కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు, అప్పుడు అతను పాపక్షమాపణ పొందుతాడు. 23  “ ‘నేను మీకు ఇచ్చే దేశంలోకి మీరు వచ్చినప్పుడు, మీరు ఆహారం కోసం ఏదైనా చెట్టును నాటితే, దాని ఫలాల్ని మీరు అశుద్ధమైనవిగా, నిషిద్ధమైనవిగా పరిగణించాలి. మూడు సంవత్సరాల వరకు అవి నిషిద్ధమైనవిగా ఉంటాయి. మీరు వాటిని తినకూడదు. 24  కానీ నాలుగో సంవత్సరంలో దాని ఫలాలన్నీ పవిత్రమైనవిగా ఉంటాయి, వాటిని మీరు సంతోషంగా యెహోవాకు అర్పిస్తారు. 25  ఆ తర్వాత ఐదో సంవత్సరంలో మీరు దాని ఫలాల్ని తినొచ్చు, అవి మీ పంటలో భాగమౌతాయి. నేను మీ దేవుడైన యెహోవాను. 26  “ ‘రక్తం కలిసిన దేన్నీ మీరు తినకూడదు.+ “ ‘మీరు శకునాలు చూడకూడదు, ఇంద్రజాలం చేయకూడదు.+ 27  “ ‘మీ తలకు ఇరుపక్కల ఉన్న వెంట్రుకల్ని గీసుకోకూడదు, మీ గడ్డం పక్కలను వికారంగా కత్తిరించుకోకూడదు. 28  “ ‘చనిపోయిన వ్యక్తి* కోసం మీ శరీరాన్ని కోసుకోకూడదు; మీ శరీరం మీద పచ్చబొట్లు పొడిపించుకోకూడదు. నేను యెహోవాను. 29  “ ‘నీ కూతుర్ని వేశ్యను చేసి ఆమెను అవమానపర్చకూడదు. లేదంటే దేశం వ్యభిచారంతో, దిగజారిన నైతిక విలువలతో నిండిపోతుంది.+ 30  “ ‘మీరు నా విశ్రాంతి రోజుల్ని పాటించాలి, నా పవిత్రమైన స్థలం విషయంలో భయభక్తులు చూపించాలి. నేను యెహోవాను. 31  “ ‘చనిపోయినవాళ్లతో మాట్లాడేవాళ్ల దగ్గరికి వెళ్లకండి,+ భవిష్యత్తు చెప్పేవాళ్లను సంప్రదించకండి.+ అలాచేస్తే, వాటివల్ల మీరు అపవిత్రులౌతారు. నేను మీ దేవుడైన యెహోవాను. 32  “ ‘నెరసిన వెంట్రుకలున్న వ్యక్తి ముందు లేచి నిలబడాలి,+ వృద్ధుల్ని గౌరవించాలి,+ నీ దేవునికి భయపడి నడుచుకోవాలి.+ నేను యెహోవాను. 33  “ ‘మీ దేశంలో నివసించే పరదేశిని బాధపెట్టకూడదు. 34  మీతోపాటు మీ మధ్య నివసించే పరదేశిని మీలో ఒకడిగా పరిగణించాలి; నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు అతన్ని ప్రేమించాలి, ఎందుకంటే ఐగుప్తు దేశంలో మీరు పరదేశులుగా జీవించారు.+ నేను మీ దేవుడైన యెహోవాను. 35  “ ‘మీరు పొడవును గానీ బరువును గానీ పరిమాణాన్ని గానీ కొలిచేటప్పుడు తప్పుడు కొలమానాలు ఉపయోగించకూడదు.+ 36  మీరు ఖచ్చితమైన త్రాసును, ఖచ్చితమైన తూకంరాళ్లను, ఖచ్చితమైన ఘనపదార్థాల కొలతను,* ఖచ్చితమైన ద్రవ కొలతను* ఉపయోగించాలి.+ నేను మీ దేవుడైన యెహోవాను, మిమ్మల్ని ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చింది నేనే. 37  కాబట్టి మీరు నా శాసనాలన్నిటినీ, నా న్యాయనిర్ణయాలన్నిటినీ పాటించాలి, వాటిని అనుసరిస్తూ జీవించాలి.+ నేను యెహోవాను.’ ”

అధస్సూచీలు

అక్ష., “భయపడాలి.”
లేదా “లోహపు.”
లేదా “చంపబడాలి.”
లేదా “మిగిలినవాటిని.”
లేదా “కష్టాల్లో ఉన్నవాళ్ల.”
లేదా “సాటిమనిషి ప్రాణం అపాయంలో ఉన్నప్పుడు చూస్తూ నిలబడకూడదు” అయ్యుంటుంది.
లేదా “ప్రాణి.” పదకోశం చూడండి.
అక్ష., “ఖచ్చితమైన ఈఫా.” అనుబంధం B14 చూడండి.
అక్ష., “ఖచ్చితమైన హిన్‌.” అనుబంధం B14 చూడండి.