శుభ్రత గురించి అందరికీ తెలియని కాలంలోనే బైబిలు జాగ్రత్తలు చెప్పింది
దాదాపు 3500 సంవత్సరాల క్రితం, ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టడానికి ముందు, ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్లకు తెలిసిన భయంకరమైన రోగాలు ఏవీ వాళ్లకు రాకుండా కాపాడతానని దేవుడు చెప్పాడు. (ద్వితీయోపదేశకాండము 7:15) వ్యాధుల్ని అరికట్టడానికి సంబంధించిన, శుభ్రతకు సంబంధించిన స్పష్టమైన నిర్దేశాలు ఇవ్వడం ద్వారా దేవుడు వాళ్లను కాపాడాడు. ఉదాహరణకు:
వాళ్లకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో స్నానం చేయడం, బట్టలు ఉతుక్కోవడం వంటి నియమాలు ఉన్నాయి.—లేవీయకాండము 15:4-27.
మనుషుల మలం గురించి దేవుడు ఇలా చెప్పాడు: “పాళెము వెలుపల నీకు ఒకచోటు ఉండవలెను, ఆ బహిర్భూమికి నీవు వెళ్లవలెను. మరియు నీ ఆయుధములుగాక గసిక యొకటి నీ యొద్ద ఉండవలెను. నీవు బహిర్భూమికి వెళ్లునప్పుడు దానితో త్రవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలెను.”—ద్వితీయోపదేశకాండము 23:12, 13.
ఎవరికైనా అంటువ్యాధి సోకినట్టు అనిపిస్తే, మిగతా వాళ్లకు అది సోకకుండా వాళ్లను కొంతకాలం వరకు దూరంగా ఉంచేవాళ్లు. వ్యాధి తగ్గి వాళ్లు ‘పవిత్రులు’ అని నిర్ధారణ అయితే, తిరిగి వచ్చేటప్పుడు వాళ్లు తమ బట్టల్ని ఉతుక్కొని, స్నానం చేసి రావాలి.—లేవీయకాండము 14:8, 9.
శవాన్ని తాకిన వాళ్లు కూడా మిగతావాళ్లకు దూరంగా ఉండాలి.—లేవీయకాండము 5:2, 3; సంఖ్యాకాండము 19:16.
ఇశ్రాయేలీయులు పాటించిన నియమాలు, క్రిములు వ్యాపించకుండా శుభ్రంగా ఉండడానికి తీసుకునే నేటి వైద్యపరమైన జాగ్రత్తల్ని గుర్తుచేస్తాయి. నిజానికి ఆ కాలంలో వేరే వాళ్లెవ్వరికీ అంత అవగాహన లేదు.
ఆ రోజుల్లో మిగతా ప్రజలకు, శుభ్రతకు సంబంధించిన ఇలాంటి జ్ఞానం లేదు. ఉదాహరణకు:
చెత్తను వీధుల్లో పారేసేవాళ్లు. కలుషితమైన నీళ్లు, ఆహారం, ఇతరత్రా వ్యర్థాల వల్ల రోగాలు ఎక్కువగా వచ్చేవి, చాలామంది చిన్నపిల్లలు చనిపోయేవాళ్లు.
క్రిముల గురించి గానీ, రోగాల్ని కలిగించే సూక్ష్మజీవుల గురించి గానీ ప్రాచీనకాల వైద్యులకు అంతగా తెలీదు లేదా అసలేమీ తెలీదు. ఈజిప్టు దేశస్థులు బల్లి రక్తం, పెలికన్ పక్షి రెట్ట, చనిపోయిన చిట్టెలుకలు, మూత్రం, బూజు పట్టిన రొట్టెలు వంటివాటిని “మందులుగా” వాడేవాళ్లు. తరచూ మనుషుల, జంతువుల మలాన్ని కూడా వైద్యం కోసం ఉపయోగించేవాళ్లు.
కలుషితమైన నైలు నది నీళ్ల వల్ల, దాని కాలువల వల్ల పూర్వం ఈజిప్టు దేశస్థులు రోగాల్ని కలిగించే రకరకాల క్రిముల బారినపడ్డారు. అంతేకాదు, కలుషిత ఆహారం వల్ల వచ్చే డయేరియా (అతిసారం), ఇతరత్రా రోగాల వల్ల ఈజిప్టులో చాలామంది పసిపిల్లలు చనిపోయారు.
కానీ, దేవుని ధర్మశాస్త్రంలోని నియమాల్ని పాటించడం వల్ల ఇశ్రాయేలీయులు మిగతావాళ్ల కన్నా ఆరోగ్యంగా ఉన్నారు, ఎన్నో ప్రయోజనాలు పొందారు.